“పక్క రాష్ట్రాల తల్లంటే నీ తల్లికి పడదు. అలాంటి నీకు జాతీయ గీతం పాడే హక్కెక్కడిది?”

నిజమే! ఆ చిత్రంలో తెలంగాణ ప్రస్తావనే లేదు. “తెలంగాణ కావాలా? వద్దా?“ అన్న డైలాగ్ తప్ప తెలంగాణ ఉద్యమాన్ని గురించి ఎక్కడా కమిట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. కుటిలత్వంతో “ఆ ఉద్యమాన్ని గురించి పరోక్షంగా స్ఫురింపజేయడమే తప్ప, నేరుగా చెప్పలేదే?“ అని తప్పించుకొందామని అనుకొన్నారు. సరే! ఒప్పుకొన్నా.

మరి ఆ చిత్రంలో చెప్పిన ఉద్యమం పేరేమిటి? – “తెలుగు ఉద్యమం“. ఆ డైలాగేమిటి? “పక్క రాష్ట్రాల తల్లంటే నీ తల్లికి పడదు. అలాంటి నీకు జాతీయ గీతం పాడే హక్కెక్కడిది?”!
అంటే … ఆ డైరెక్టర్ విమర్శిస్తున్నది – తమిళ తల్లితో పడక ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరిన ‘పొట్టి శ్రీరాములు‘ గారినా? ’తెలుగు తల్లి‘ని ‘తెలుగు సంస్కృతి‘ని పవిత్రంగా భావించిన నాటి ‘ప్రకాశం పంతులు‘ వంటి తొలి తరం నాయకులనా? ‘విశ్వనాథ సత్యనారాయణ‘గారి వంటి కవులనా? లేక ‘తెలుగు తల్లి‘ కి విగ్రహ రూపం కల్పించి, ఆ భావనను విశ్వ వ్యాప్తం చేసాడని మనం గర్వంగా చెప్పుకొనే మలితరం నాయకుడు ‘ఎన్.టి.ఆర్’ గారినా? లేక తమిళుల నుండి వేరుపడి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన నాటి మహనీయులను ఈనాటి ‘రాజ్ ఠాక్రే’ను ఒకే గాటిన కట్టినట్టా? దీనికి ఆ దర్శకుడు ఏం సమాధానం చెప్పుతాడు? ఇతర రాష్ట్రాల వారిని తమ రాష్ట్రం నుండి వెళ్ళగొట్టాలనే రాజ్ ఠాక్రే అభిప్రాయం ఎంత తప్పో, ఇతర రాష్ట్రం వాడు వచ్చి, ఆ రాష్ట్ర రాజధానిని ‘ఉచ్చ పోయిస్తా‘ననడం అంతకన్న ఘోరమైన నేరం. ఇలాంటి చిత్రాలు రూపొందించే దర్శకునికి ఏ మాత్రం సామాజిక బాధ్యత ఉందో తెలియడం లేదా?

ఈ మాత్రం ఇంగిత జ్జానం లేకుండా,తెలంగాణ వాదులు ఏ నిరసన తెలిపినా దానికి గుడ్డిగా వ్యతిరేకంగా మాటాడే కొందరు సీమాంధ్ర నాయకుల ( కొందరు బ్లాగర్లు సైతం) బుర్రలు మోకాళ్ళలో ఉన్నట్టా? అరికాళ్ళలో ఉన్నట్టా? పైగా ఈ చిత్రంలో సందేశం ఉందని వీళ్ళు వాగుతుంటే – తెలుగు భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని, తెలుగు తల్లిని ఆరాధించే నాలాంటి తెలంగాణ కవుల గుండెలు మండిపోతున్నాయి.

నేను ఇదివరకే కొన్ని పోస్టుల్లో ప్రశ్నించాను. తెలంగాణ తల్లిని గౌరవిస్తే, తెలుగు తల్లిని ద్వేషించినట్టా? తెలుగు తల్లిని ఆరాధిస్తే భారత మాతను ద్వేషించినట్టా? … అని. అప్పుడు అంతా సమాధానం చెప్పకుండా తప్పుకొన్నారు. ఇప్పుడదే అంశం తెర పైకి వచ్చింది. మరి సీమాంధ్ర తెలుగు కవులు స్పందించరే? సరే! చిత్రంలో తెలంగాణ గూర్చి ఏమన లేదు. అయితే తెలుగు తల్లి గురించి అవాకులు చెవాకులు పేలవచ్చా?

తెలుగు తల్లికి పిచ్చి వాదనల మసి పూసినా తెలుగు వారు నోరు మూసుకోవడం .. పైగా సందేశం అని చంకలు గుద్దుకోవడం – కన్న తల్లికి చేస్తున్న ద్రోహం.

– డా. ఆచార్య ఫణీంద్ర

“వెండి కొండ కూతురు బంగారు కొండ”

మొన్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, మా ఆవిడ కోరికపై నేను రచించి ఇచ్చిన భక్తి గీతం –

– డా. ఆచార్య ఫణీంద్ర

పార్వతీ సుత! వందనం!
ప్రథమ పూజిత! వందనం!
ప్రమధ నాయక! వందనం!
వర వినాయక! వందనం! ||పార్వతీ||

మూషికముపై తిరుగు
గజముఖ స్వామివొ!
విషకంఠ ధరునకు
అమృతంపు పట్టివొ!
వెండి కొండ కూతురు
బంగారు కొండవొ!
బంగారు కొండవో!! ||పార్వతీ||

వెన్నెల రేనికి
వెరపు కలిగించితివి –
షడాననునికి
సద్బుద్ధి నిడితివి –
ప్రమధ గణముల పాలి
అధినేత వైతివి –
అధినేత వైతివి – ||పార్వతీ||

విఘ్నముల బాపెడి
వేలుపువు నీవే!
విద్యలనొసంగెడి
వేలుపువు నీవే!
విజయముల చేకూర్చు
వేలుపువు నీవే!
వేలుపువు నీవే!! ||పార్వతీ||

అరిగి మా తెలుగిండ్ల,
అందుకో తొలిపూజ –
భుజియించి కుడుముల,
తొలగించు డుముల –

వర్షించి నీ కరుణ,

తీర్చు కామితముల –
తీర్చు కామితముల – ||పార్వతీ||

        —***—