“ముద్దు గుమ్మ” పునర్ముద్రణ

పునర్ముద్రణ అవుతున్న నా “ముద్దు గుమ్మ” పద్య కావ్యం ముఖ చిత్రం – వెనుక పత్రం –

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

అయస్కాంత క్షేత్రం

అయస్కాంత క్షేత్రం
—————————

– డా. ఆచార్య ఫణీంద్ర
——————————–

25 ఏళ్ళ సాన్నిహిత్యంలో మహాకవి డా. సి. నారాయణ రెడ్డి గారితో కొన్ని వందల సార్లు కలిసి ఉంటాను. నిర్వాహకులు చాలా సందర్భాలలో ఛాయాచిత్రాలు తీసారు గాని, కొన్ని మాత్రమే నేను అందుకోగలిగాను. ఆ కొన్నింటిలో ఇప్పుడు నా అందుబాటులో ఉన్నవి కొన్ని … ఆ ఛాయాచిత్రాలు చూస్తూ ఉంటే, ఎన్నెన్ని స్మృతులో మదిలో కదులుతూ, మెదులుతూ కుదుపుతున్నాయి.
ముఖ్యంగా ..  నా తొలి గ్రంథం “ముకుంద శతకం”, ఆ పైన కార్గిల్ యుద్ధంపై నేను వ్రాసిన “విజయ విక్రాంతి” గ్రంథం – ఆ మహాకవి పీఠికతో అలంకరించబడడమే గాక ఆయన కర కమలాలతో ఆవిష్కరింపబడడంతో నా జీవితం ధన్యమయింది.   నా “వాక్యం రసాత్మకం”, “మాస్కో స్మృతులు” గ్రంథాలు ఇచ్చిన రెండు సందర్భాలలో పోస్టులో నాకు ఆయన పంపిన అభినందన లేఖలు నన్ను నిలువెల్ల పులకింపజేసాయి. నా కలం పేరులోని “ఆచార్య” శబ్దాన్ని ఆక్షేపిస్తూ – “నీకు పి.హెచ్.డి. ఉందా? ఆచార్య అని ఎలా పెట్టుకొంటావు?” అని ఆ మహానుభావుడు అనకపోతే .. మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడనైన నేను తెలుగులో ఎం.ఏ., పి.హెచ్.డి. చేసే వాణ్ణే కాదేమో! ఆ తరువాత ఆయన రాజ్యసభ సభ్యునిగా మా “అణుఇంధన సంస్థ”కు విచ్చేసినపుడు, మా సంస్థ అధిపతితో – “మా ఫణీంద్ర మీ సైంటిఫిక్ ఫీల్డ్ వాడైనా, మా తెలుగులో పి.హెచ్.డి. చేసాడు .. చాలా ప్రతిభావంతుడైన యువకవి” అని చెప్పడం ఎప్పటికీ మరచిపోలేను. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు, ఆచార్య మలయవాసిని గారు, ఆచార్య ఎస్వీ. రామారావు గారు వంటి మహామహులతో బాటు నేనూ వ్యాసాలు వ్రాసిన ఒక సంచికను ఆవిష్కరిస్తూ – “మా ఫణీంద్ర ఛందో వైవిధ్యంపై ఈ సంచికకే మకుటాయమానమైన వ్యాసాన్ని వ్రాసాడు” అని ప్రశంసించడం ఒక మరువలేని మధుర ఘట్టం.  ఎన్నో కవిసమ్మేళనాలలో నాకు సత్కారం చేస్తూనో లేక సభ నుండి వెళుతూనో .. “పద్యాలు బాగున్నాయి” అని ఆయన అన్న మాటలు .. ఇంకా నా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఎన్నో సభలు నేను నిర్వహిస్తున్నప్పుడు .. ప్రాసంగికుల ఉపన్యాసాలు సాగదీతగా సాగుతున్నప్పుడు నన్ను దగ్గరగా పిలిచి సభను గాడిలో పెట్టుమని ఇచ్చిన సూచనలు, మందలింపులు ఇప్పటికీ నా శరీరాన్ని పరిభ్రమిస్తున్నాయి. సిరిసిల్లలో ఆయన కౌమార దశలో ఉన్నప్పుడు గురువుగా సంభావించిన “శ్రీమాన్ ఆచి నరసింహాచార్యులు” స్వయాన నా మాతామహులు అని నేను తొలి నాళ్ళలో చెప్పినప్పుడు .. “అందుకే గదా నీపై శిష్య వాత్సల్యాన్ని వర్షిస్తున్నది” అనడం నా ఎదలో నాటుకొన్న తీయని మొలక. మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా వ్యాఖ్యాన సహితంగా, ఆవేశ భరితంగా నేను చేసిన “మహాప్రస్థానం” సంపూర్ణ కావ్యగానం వింటూ పలుమార్లు ఆయన కనుబొమ్మలు ఎగరేయడం .. నా కనులలో ఎప్పుడూ దృశ్య మాలికలై వ్రేలాడుతూనే ఉంటాయి. “దివాకర్ల వేంకటావధాని” స్మారక పురస్కారం నాకు ప్రదానం చేసిన సభలో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ ఆయన – “దివాకర్ల వారు పుట్టింది ఆషాఢ పూర్ణిమ నాడే .. నేను పుట్టిందీ ఆషాఢ పూర్ణిమ నాడే!” అని చెప్పాక, “నేను పుట్టింది కూడా ఆషాఢ పూర్ణిమ నాడే!” అని నేను అనగానే .. ఒకింత ఆశ్చర్యంగా చూస్తూ “నువ్వు పుట్టిందీ ఆషాఢ పూర్ణిమ నాడేనా?” అని ఆయన చిలికిన చిరునవ్వు నా హృదయంలో శాశ్వతంగా ప్రతిష్ఠించబడి పోయింది.

నారాయణ రెడ్డి గారి స్మృతి ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం. ఆ క్షేత్రంలో చిన్న ఇనుప ముక్కలా గిలగిలా కొట్టుకోవడం తప్ప బయటపడే శక్తి నాకు లేదు.

మొత్తము తెలుగు జాతియే మూగ బోయె!

ఎవరి పేరు జగతి నెవరు విన్నను చాలు
కనులు గర్వమ్ముతో కదలుచుండు –
ఎవరి వాగ్విభవ మ్మొకింత కన్నను చాలు
పులకించి కర్ణముల్ పురులు విప్పు –
ఎవరి కైతల రాణి ఇంపు సొంపుల గాంచి
రస రమ్య హృదయాలు ’ఖుసి’ని బొందు –
ఎవరి ప్రఖ్యాతి ఖండేతరంబుల గూడ
మోడ్చినట్టి కరాల మ్రొక్కు లందు –

ఎవరిచే కృతు లావిష్కరింప గోరు –
ఎవరి కాతిథ్య మిడ సభ లిచ్చగించు –
ఆ సుకవి విరాట్టు “సి.నా.రె.” అస్తమించె!
మొత్తము తెలుగు జాతియే మూగ బోయె!

(మహాకవి డా. సి. నారాయణ రెడ్డి గారి మృతికి అశ్రు నివాళిగా …)
– డా. ఆచార్య ఫణీంద్ర

“మా తెలంగాణకు క్షీరాభిషేకం”

మా తెలంగాణకు క్షీరాభిషేకం (గీతం)
————————————————–
రచన : “కవి దిగ్గజ”

               డా. ఆచార్య ఫణీంద్ర
——————————————————

మా తెలంగాణకు క్షీరాభిషేకం!
మము గన్నమాతకు మా నమోవాకం!!
మనసులో మమత – మాటలో మధువు –
మోములో చిరునగవు నొలికించు మా యమ్మ –
|| మా తెలంగాణకు ||

గోదావరి నీ కొంగు బంగారం –
కృష్ణా నది నీకు కంఠ హారం –
తుంగభద్ర నీ తుంటి వడ్డాణం –
మంజీర నీ పాద స్వర్ణ మంజీరం!
|| మా తెలంగాణకు ||

రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు,
గోపన్న గొంతులో కొలువైన రాగాలు,
పాల్కుర్కి సోమన జాను తెనుగందాలు,
పోతన్న కవన మందార మకరందాలు,
రుద్రమ్మ భుజశక్తి, దమ్మక్క హరిభక్తి,
మాదన్న ధీయుక్తి, రుద్ర దేవుని కీర్తి
మా కర్ణ పేయముగ నీ మహిమలను చాట –
ఈ గీతులను పాడుతాం! నీ దీవెనలు వేడుతాం!!
జై తెలంగాణ!
జై తెలంగాణ!!
జై తెలంగాణ!!!
|| మా తెలంగాణకు ||

(తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో …)