మొత్తము తెలుగు జాతియే మూగ బోయె!

ఎవరి పేరు జగతి నెవరు విన్నను చాలు
కనులు గర్వమ్ముతో కదలుచుండు –
ఎవరి వాగ్విభవ మ్మొకింత కన్నను చాలు
పులకించి కర్ణముల్ పురులు విప్పు –
ఎవరి కైతల రాణి ఇంపు సొంపుల గాంచి
రస రమ్య హృదయాలు ’ఖుసి’ని బొందు –
ఎవరి ప్రఖ్యాతి ఖండేతరంబుల గూడ
మోడ్చినట్టి కరాల మ్రొక్కు లందు –

ఎవరిచే కృతు లావిష్కరింప గోరు –
ఎవరి కాతిథ్య మిడ సభ లిచ్చగించు –
ఆ సుకవి విరాట్టు “సి.నా.రె.” అస్తమించె!
మొత్తము తెలుగు జాతియే మూగ బోయె!

(మహాకవి డా. సి. నారాయణ రెడ్డి గారి మృతికి అశ్రు నివాళిగా …)
– డా. ఆచార్య ఫణీంద్ర

“మా తెలంగాణకు క్షీరాభిషేకం”

మా తెలంగాణకు క్షీరాభిషేకం (గీతం)
————————————————–
రచన : “కవి దిగ్గజ”

               డా. ఆచార్య ఫణీంద్ర
——————————————————

మా తెలంగాణకు క్షీరాభిషేకం!
మము గన్నమాతకు మా నమోవాకం!!
మనసులో మమత – మాటలో మధువు –
మోములో చిరునగవు నొలికించు మా యమ్మ –
|| మా తెలంగాణకు ||

గోదావరి నీ కొంగు బంగారం –
కృష్ణా నది నీకు కంఠ హారం –
తుంగభద్ర నీ తుంటి వడ్డాణం –
మంజీర నీ పాద స్వర్ణ మంజీరం!
|| మా తెలంగాణకు ||

రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు,
గోపన్న గొంతులో కొలువైన రాగాలు,
పాల్కుర్కి సోమన జాను తెనుగందాలు,
పోతన్న కవన మందార మకరందాలు,
రుద్రమ్మ భుజశక్తి, దమ్మక్క హరిభక్తి,
మాదన్న ధీయుక్తి, రుద్ర దేవుని కీర్తి
మా కర్ణ పేయముగ నీ మహిమలను చాట –
ఈ గీతులను పాడుతాం! నీ దీవెనలు వేడుతాం!!
జై తెలంగాణ!
జై తెలంగాణ!!
జై తెలంగాణ!!!
|| మా తెలంగాణకు ||

(తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో …)

ఉస్మానియా … వందనం!

“పి.హెచ్.డి. పట్టా”ను ప్రసాదించి,
ఈ “ఆచార్య ఫణీంద్ర” కవిని
“డా. ఆచార్య ఫణీంద్ర” కవిగా నిలబెట్టిన
“ఉస్మానియా విశ్వవిద్యాలయా”నికి
“వంద యేళ్ళ పండుగ” సందర్భంగా
వందనం!
– డా. ఆచార్య ఫణీంద్ర

“దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత” శ్రీ కె. విశ్వనాథ్ గారి సమక్షంలో …

“దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత”, కళా తపస్వి శ్రీ కె. విశ్వనాథ్ గారి సమక్షంలో .. మరొక “దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత” కీ.శే. డా. అక్కినేని నాగేశ్వరరావు గారి చేత హైదరాబాదులో “రవీంద్రభారతి” వేదికపై సత్కారం పొందుతున్న ఒక మధుర స్మృతి …
– డా. ఆచార్య ఫణీంద్ర

“ఆంధ్రజ్యోతి” దినపత్రికలో నా ఇంటర్వ్యూ

ఇటీవల కరీంనగర్ సభకు వెళ్ళినపుడు, “ఆంధ్రజ్యోతి” దినపత్రిక వారు నాతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు ఆ మరుసటి దినం పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆ వివరాలు మీ కోసం ..‌.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

“ఏక వాక్య కవితా శిల్పి” బిరుద ప్రదానం

  • 1 ఏప్రిల్ 2017 నాడు కరీంనగర్ లో “శరత్ సాహితీ కళా స్రవంతి” నిర్వహించిన సభలో నేను ముఖ్య అతిథిగా పాల్గొని, శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ కవి రచించిన “ప్రేమ స్వరాలు” (ఏక వాక్య కవితల) గ్రంథాన్ని ఆవిష్కరించాను. ఈ సందర్భంగా నాకు “ఏక వాక్య కవితా శిల్పి” బిరుద ప్రదానం  చేసారు.
  • – డా. ఆచార్య ఫణీంద్ర

 

వసంతోత్సవం

4 ఏప్రిల్ 2017 నాడు హైదరాబాదు,”త్యాగరాయ గానసభ” మినీహాల్లో “వసంతోత్సవం” వేడుకలలో నేను …
– డా. ఆచార్య ఫణీంద్ర

Previous Older Entries Next Newer Entries