“విలీనమా? విమోచనమా? విద్రోహమా?” – నా అభిప్రాయం! – డా. ఆచార్య ఫణీంద్ర

ఈ రోజు సెప్టెంబర్ 17 ..

1948 లో ఇదే రోజు నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ స్వాతంత్ర్యం పొందిన రోజు.
అయితే … “అది విలీనమా?
విమోచనమా? లేక విద్రోహమా?” అన్నది గత అరవయ్యేళ్ళుగా ప్రతి సంవత్సరం చర్చ జరుగుతున్నా … ఆ చర్చ ఫలితం తేలకుండానే కాలం గడచిపోవడం .. మరుసటి సంవత్సరం మళ్ళీ అదే చర్చ జరుగడం సర్వ సాధారణమై పోయింది.
కారణం … అది వివిధ పార్టీల దృక్పథం, వారి వారి అనుకూలుర ఆలోచనా విధానం నిష్పాక్షికంగా లేకపోవడమే!

 1. మితవాద కమ్యూనిస్టులు ఇది విమోచనం అంటారు.
 2. అతివాద కమ్యూనిస్టులు ఇది విద్రోహం అంటారు.
 3. హిందూ మతవాదులు ఇది విమోచనం అంటారు.
 4. ముస్లీం మతవాదులు ఇది విద్రోహం అంటారు.
 5. లౌకికవాదులు ఇది విలీనం అంటారు.

మొదటి నాలుగు సమూహాలలో ఆ యా భావజాలాల వారే ఉంటారు. లౌకిక వాదులలో హిందువులు, ముస్లిములు, కమ్యూనిస్టులు అందరూ ఉంటారు. అందరి పట్ల సమభావన కలిగి ఉండడమే వారికి ప్రాతిపదిక. కాబట్టి వారి భావనయే ప్రామాణికమని నా భావన.

కానీ .. నేను దీనిని సమర్థిస్తే కాంగ్రెస్ వాదిననో .. లేక ప్రస్తుత టి.ఆర్.ఎస్. వాదిననో ముద్రవేయకండి.

ఈ వాదాలన్నీ కాసేపు ప్రక్కన పెట్టండి. అసలు ఒక రాజ్యం మరొక రాజ్యంలో కలిసిపోయినప్పుడు అది విలీనమో, విమోచనమో, విద్రోహమో .. ఎట్లా నిర్ణయించగలం?

కొన్ని ఉదాహరణలు చెప్పుతాను .. చూడండి … అప్పుడు మీరే – అది విలీనమా, విమోచనమా, విద్రోహమా … నిర్ణయించగలుగుతారు.

ఒకటి ..
ఒక రాజ్యంలో ఒక రాజు పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అప్పుడు మరొక పెద్ద రాజ్యం సామ్రాజ్య విస్తరణ కొరకో లేక మరొక కారణంతోనో దండెత్తి ఆక్రమించుకొంటే .. అది ‘విద్రోహం’ అవుతుంది.
ఈ భావనతోనే .. అతి కొద్దిమంది ముస్లిం మతవాదులు దీనిని ‘విద్రోహం’ అంటారు.
కొంతమంది అతివాద కమ్యూనిస్టులు కూడ ఇది విద్రోహం అనే వారున్నారు. వారి భావన ప్రకారం .. సాయుధ పోరాటం ద్వారా కమ్యూనిస్టులు నిజాం మరియు రజాకార్ల నుండి విముక్తి సాధించి, ప్రత్యేక కమ్యూనిస్ట్ దేశం ఏర్పర్చాలనుకొంటే .. మధ్యలో భారత సైన్యం వచ్చి ఆక్రమించుకోవడం ‘విద్రోహం’. అట్లాంటి వారు కొందరు ఆ రోజుల్లో రష్యాకి వెళ్ళి స్టాలిన్ ను సహాయం చేయుమని అర్థించారని కూడ వినికిడి.

ఏమైనా .. అత్యధిక తెలంగాణ ప్రజలు భారత్ లో కలిసిపోవాలని కోరుకొన్నారు గానీ .. నిజాం రాజ్యంలో కొనసాగాలని గానీ, ప్రత్యేక కమ్యూనిస్ట్ దేశంగా ఏర్పడాలని గానీ కోరుకోలేదు కదా! కాబట్టి .. ఇది ఎట్టి పరిస్థితులలో విద్రోహం కానేరదు. కాబట్టే .. ఈ వాదం కొన్నాళ్ళుగా కాస్త బలహీనపడి … కేవలం “విలీనమా? విమోచనమా?” అన్న చర్చ మాత్రమే బలంగా వినిపిస్తున్నది.

రెండు …
ఇక ‘విమోచనం’ అంటే ఏమిటి? .. పరిశీలిద్దాం.
ఒక రాజ్యంలో ప్రజలు నానా కష్టాలను పడుతున్నారు. ఆ రాజు పట్ల అత్యధిక ప్రజలు విముఖంగా ఉన్నారు. కొందరు ప్రజా సేవకులు, దేశ భక్తులు ఆ రాజును గద్దె దింపడానికి ప్రాణ త్యాగానికి సిద్ధమై పోరాడుతున్నారు. ఆ రాజు ఆ వీరులందరినీ కర్కషంగా అణచివేస్తున్నాడు. అప్పుడు ఆ రాజ్యంలోని తిరుగుబాటు దండో .. లేక ఆ రాజ్య ప్రజలకు సహాయం చేయగోరి పొరుగున ఉన్న బలమైన రాజ్యం యొక్క సైన్యమో .. యుద్ధం చేస్తూ .. ఒక్కొక్క నగరాన్ని ఆక్రమిస్తూ … సంపూర్ణంగా ఆక్రమించుకొని, ఆ రాజును సంహరించడమో .. లేక రాజకీయ బందీ చేసి, అధికారికంగా ఆ రాజ్య ప్రజలకు విముక్తిని కలిగించిన విషయం ప్రకటిస్తే .. అది కచ్చితంగా ‘విమోచనమే’ అవుతుంది. ఆ రోజుల్లో కొంతవరకు ఇదే జరుగబోతుందని అందరూ ఊహించారు. ఇప్పటికీ కొంత మంది ఇదే జరిగిందని ఊహిస్తూ, వాదిస్తున్నారు. కాని ఇది పాక్షిక సత్యమే .. చివరలో నిజాం రాజు ఓటమి తప్పదని గ్రహించి, ప్రజాభీష్టానికి తల ఒగ్గి తీసుకొన్న నిర్ణయం .. దానిని ‘విమోచనం’ కాకుండా ‘విలీనం’ గా మార్చివేసింది. పైగా .. యుద్ధ విరమణానంతరం ఆ రాజ్యం స్వతంత్ర దేశంగా ఉంటే .. అది ‘విమోచనం’ అయ్యేది. కాని తెలంగాణ ప్రజలు మొదటి నుండి భారత సామ్రాజ్యంలో ‘విలీనం’ కావాలనే కోరుకొన్నారు. కాబట్టి ఇది ఎంత మాత్రం ‘విమోచనం’ కానేరదు. ‘విలీనమే’!
అది ఎట్లాగో ఇంకా వివరంగా పరిశీలిద్దాం.

మూడు …
తెలంగాణ ప్రజలు భారత స్వాతంత్ర్య సాధన అవకాశాలను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఇతర గణ రాజ్యాల ప్రజల లాగే ..ఇక్కడి ప్రజలకు కూడ భారత దేశం స్వాతంత్ర్యాన్ని సాధిస్తే .. అందులో తాము కూడ ‘విలీనం’ కావాలని కోరిక అంకురించింది. ఆ భావనలు ప్రజల నుండి వ్యక్తం కావడం ప్రారంభమవగానే నిజాం రాజు కఠినాత్ముడుగా మారి, ప్రజాకాంక్షను అణచివేయడానికి పూనుకొన్నాడు. అంతకు ముందు ఆ రాజు ఆ ప్రజలను మరీ గొప్పగా కాకపోయినా, బాగానే చూసుకొన్నాడు. ప్రజల కొరకు అనేక ఆధునిక వసతులను సమకూర్చాడు. ప్రజల విద్యావసరాలకై ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. ఉస్మానియా ఆసుపత్రితోబాటు అనేక ప్రభుత్వ వైద్యాలయాలను నిర్మించాడు. త్రాగు నీటి అవసరాల కోసం గండిపేట్ నీటి ప్రాజెక్టును కట్టించాడు. బ్రిటిష్ వారికి దీటుగా ఇక్కడ కూడ ప్రజా రవాణా అవసరాల కోసం రైల్వే మార్గాలను, బస్సు ప్రయాణ సౌకర్యాలను ఏర్పరిచాడు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం హైకోర్టును (అది నిజాం రాజ్యపు సుప్రీంకోర్టు) అందుబాటులోకి తెచ్చాడు. అనేక హిందూ దేవాలయాలకు ఆర్థిక సహాయం చేసాడు. తన దృష్టికి వచ్చిన ప్రతిభావంతులయిన పేద విద్యార్థులకు ఇంగ్లండ్ వెళ్ళి ఉన్నత విద్యలు చదివేందుకు ఆర్థిక సాయం చేసాడు. ఇంకా .. చాల .. చాల చేసాడు. అందుకు నిజాం రాజు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు కావడం కూడ దోహదం చేసింది. కాబట్టి 1930 .. 1935 వరకు ప్రజలు మరీ సంతోషంగా ఉన్నారని చెప్పలేక పోయినా (మధ్యలో జమీందారుల దోపిడి, అరాచకం కొంత ఉండింది కదా!), నిజాం రాజు పట్ల అసంతృప్తిగా లేరు. కాబట్టి అది ఆనాటికి ‘విమోచనం’ అన్న పదానికి ఎంత మాత్రం తావీయదు. కానీ … ఆ తరువాత అత్యధిక తెలంగాణ ప్రజలు తామూ భారతీయులుగా జీవించాలన్న ఆకాంక్షతో ‘విలీనం’ పై మొగ్గు చూపారు. రాను రాను అది మరింత బలపడుతూ వచ్చింది. తాను ఇంత చేస్తున్నా .. ప్రజలలో వస్తున్న మార్పును నిజాం రాజు తట్టుకోలేక పోయాడు. అక్కడే మొదలయింది అసలు కథ!

తెలంగాణ ప్రజల ‘విలీనం’ ఆకాంక్ష తన రాజ్యాధికారానికే ముప్పు అని గ్రహించగానే నిజాం రాజు పూర్తి నిరంకుశునిగా మారాడు. విలీనం ఆకాంక్షతో గళమెత్తిన కవులను, నాయకులను కఠిన కారాగార శిక్షకు గురి చేసాడు. కఠినమైన ఆంక్షలతో ప్రజల గొంతులను నొక్కే ప్రయత్నం చేసాడు. ముస్లిం రాజ్యాన్ని కాపాడుకోవాలనుకొనే ముస్లిం మత అతివాదులయిన రజాకార్లనే ప్రైవేట్ సేనలను ప్రోత్సహించాడు. వారి అరాచకాలకు హద్దు అదుపు లేకుండా కొనసాగనిచ్చాడు. అప్పుడు హిందువులంతా తిరుగబడసాగారు. మరొక వైపు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం, జమీందార్ల దారుణాలపై తిరుగబడ్డ రైతాంగ పోరాటాలు విజృంభించాయి. తన అదుపు తప్పుతుందన్న భయంతో .. నిజాం రాజు హత్యాకాండలకు వెనుకాడలేదు. ఎక్కడ చూసినా అశాంతి .. అల్లకల్లోలం … తెలంగాణ ప్రజలకు ‘విలీనం’ కన్న ముందు ‘విమోచనం’ ప్రధానమయ్యింది. మరొక ప్రక్క తెలంగాణలోని ముస్లిం అతివాదులు, రజాకారులు క్రొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ సాయాన్ని అర్థించారు.
ఆ సమయంలో అప్పుడే స్వాతంత్ర్యం సాధించిన భారత దేశం కూడ పరిస్థితులను గమనించక తప్పని పరిస్థితి ఏర్పడింది. భారత ఉపప్రధాని సర్దార్ పటేల్ నిజాం రాజ్యంపై సైనిక చర్యకు పూనుకొన్నారు. “ఆపరేషన్ పోలో” పేరిట భారత సైనికులు నిజాం రాజ్యంపై దండెత్తారు. నిజాం రాజ్యం సైనికులు, రజాకార్లు సమ ఉజ్జీగా ప్రతిఘటించలేక పోయారు. భారత సైనికులు నిజాం రాజ్యంలోని ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ముందుకు దూసుకు వస్తున్నారు. అదే కొనసాగి సంపూర్ణ విజయం సాధించి, నిజాం రాజును భారత సైనికులు బంధించి ఉంటే … అది ‘విమోచనం’గా భావించ గలిగి ఉండేవాళ్ళం. కాని అక్కడే నిజాం రాజు పరిస్థితులను అర్థం చేసుకొని ఒక ‘ట్విస్ట్’ ఇచ్చాడు. ప్రజాభీష్టాన్ని అంగీకరించి తన రాజ్యాన్ని భారతదేశంలో ‘విలీనం’ చేస్తున్నట్టుగా ‘దక్కనీ రేడియో’ ద్వారా ప్రకటించాడు. యుద్ధం విరమించబడింది. భారత సేనలను తరువాత స్వేచ్ఛగా నిజాం ప్రభుత్వం లోనికి స్వాగతించింది. భారత సేనలకు సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ వద్ద తెలంగాణ ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఇక విమోచనం అన్న ప్రస్తావన ఎక్కడిది? – చెప్పండి.

 1. నిజాం రాజు భారత ఉపప్రధాని సర్దార్ పటేల్ ను హైదరాబాదుకు ఆహ్వానించి, బేగంపేట విమానాశ్రయంలో స్వయంగా వెళ్ళి సాదర స్వాగతం పలికి ‘విలీనం’ చేస్తున్నట్లుగా అధికారిక పత్రాన్ని సమర్పించాడు.
 2. భారత ప్రభుత్వం తరఫున సర్దార్ పటేల్ నిజాం రాజ్యాన్ని భారత దేశంలో ‘విలీనం’ చేసుకొంటున్నట్టుగా అధికారకంగా ప్రకటించారు.
 3. అటు పిమ్మట నిజాం రాజును – భారత దేశంలో ‘విలీనం’ అయి, క్రొత్త రాష్ట్రంగా ఏర్పడిన “హైదరాబాద్ రాష్ట్రా”నికి ‘రాజ్ ప్రముఖ్’ (ఈనాటి గవర్నర్ పదవితో సమానం) గా భారత ప్రభుత్వం నియమించింది.
 4. నిజాం ప్రభుత్వానికి ఆనాడు అనుకూలంగా పనిచేస్తూ, రజాకార్ల అధినేత అయిన ఖాసిం రజ్వీ అధ్యక్షత వహించిన MIM పార్టీ ‘విలీనం’ తరువాత, భారత దేశంలోని ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో, అటు తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ పైన ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఒక రాజకీయ పార్టీగా రాణిస్తూ .. ఏడు దశాబ్దాలుగా ఎందరో ఎమ్మెల్యేలను, ఎంపీలను ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలిపించుకొంటూ వస్తున్నది.
 5. అంతే కాదు … 1967లో నిజాం రాజు మరణించినప్పటి సన్నివేశ వివరాలను పరికించండి –
  He died on Friday, 24 February 1967. In his will, he asked to be buried in Masjid-e Judi, a mosque where his mother was buried, that faced King Kothi Palace. The then Andhra Pradesh government declared state mourning on 25 February 1967, the day when he was buried. State government offices remained closed as a mark of respect while the National Flag of India was flown at half-mast on all the government buildings throughout the state.
 6. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఎన్టీయార్ టాంక్ బండ్ పై నిజాం రాజు విగ్రహం పెట్టి గౌరవించారు.
 7. యుద్ధనీతిలో సంధి ఒక భాగం. సంధి చేసుకొన్న రాజు తప్పులను క్షమించడం రాజ ధర్మం. అదే భారత ప్రభుత్వం చేసింది. భారత పౌరులుగా మనం దానిని గౌరవించాలె.
 8. ఒక వైపు గౌరవిస్తూ .. మరొక వైపు ఆయన నుండి ‘విమోచనం’ పొందామనడం ఎంతవరకు సముచితం?
 9. పై విషయాలన్నీ అధికారికంగా జరిగాక, అది ‘విలీనమే’ అవుతుంది కానీ .. ‘విమోచనం’ ఎట్లా అవుతుంది?
  పైగా .. మరణించినప్పుడు ఏ నిజాం రాజయితే అంతటి గౌరవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి పొందాడో .. ఆ రాజు నుండి ఈ రాష్ట్రం ‘విమోచనం’ పొందింది అనడం ఏ విధంగా సముచితం?
  అంతే కాదు .. విలీనమయ్యాక కూడ తన ట్రస్ట్ ద్వారా నిజాం రాజు తెలంగాణలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించాడు.
 10. వినోబా భావే భూదానోద్యమానికి తన స్వంత ఆస్తిలోని వేల ఎకరాలను దానం చేసాడు.
 11. నిజాం ఆర్థోపిడిక్ ఆసుపత్రి (ప్రస్తుతం ఇది “నిమ్స్” పేరిట ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ప్రజలకు ఉన్నత స్థాయి వైద్యం అందజేస్తున్న పెద్ద విద్యాలయం) ను నెలకొల్పాడు.

తన రాజ్యాన్ని భారత దేశంలో విలీనం చేసి, కేంద్ర ప్రభుత్వంచే రాజ్ ప్రముఖ్ గా నియమింపబడి, ఒక భారత పౌరునిగా తన అనేక ఆస్తులను దానం చేసి, అనేక సేవా కార్యక్రమాలను చేసి, మరణించినపుడు ప్రభుత్వ లాంఛనాలతో సాగిపోయిన నిజాం రాజు గూర్చి వివరాలు తెలియని వారు .. ఇంకా అది ‘విమోచనం’ అని వాదిస్తూ ఉంటారు. కానీ నిజానికి …
అది విలీనమే! విలీనమే!! విలీనమే!!!



స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: