అల్లూరి సీతారామరాజు

నిన్న RRR చిత్రం చూసాను. సినిమా బాగుంది. కానీ, అల్లూరి సీతారామరాజు పాత్ర విషయంలో “ఫిక్షన్” పేరిట మరీ ఎక్కువ లిబర్టీ తీసుకొన్నారనిపించింది. కొంతవరకు ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని తగ్గించినట్టు అనిపించింది. స్వాతంత్ర్య సమరానికి వలసిన ఆయధాల సమీకరణ కొరకు అల్లూరి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ పోలీస్ స్టేషన్లపై దాడి చేసాడన్నది చరిత్ర! దానిని మరొక విధంగా మార్చడం కొంచం అదోలా అనిపించింది.

ఈ సందర్భంగా .. ముప్పదేండ్ల క్రితం నేను విప్లవ వీరుడు అల్లూరిపై రచించిన ఖండ కావ్యం స్మృతిపథంలో మెదిలింది. ఆ పద్యకవితను మీరూ మరొకమారు ఆస్వాదించండి.

ఎర్ర తామర పువ్వు
~~~~~~~~~~~~~~
రచన : ”పద్య కళా ప్రవీణ”, “కవి దిగ్గజ”
డా. ఆచార్య ఫణీంద్ర
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
నల్లని గడ్డమున్, సునయనంబుల కుంకుమ కాంతి, చేతిలో
విల్లును గల్గినట్టి ఘన విప్లవ వీరుడు; భారతాంబకున్
తెల్లని వారి ఆగడము తీర్చగ దీక్షను బూనినట్టి ఆ
”అల్లురి రామరా” జితడె ! అంజలి సేయరె గారవించుచున్ !

నేటికి నూర్వత్సరముల
చాటున పరికింప _ ఆంధ్ర చరిత పుటలలో
మేటి, స్వరాజ్యముకై పో
రాటము సేయంగ రామరాజై పుట్టెన్ !

చదువుతోబాటుగా స్వారాజ్య కాంక్షనే
అమిత శ్రద్ధ గలిగి అభ్యసించె _
బెంగాలు, పంజాబు పెద్దలన్ దర్శించి
స్వాతంత్ర్య సంగ్రామ సంగతి గనె _
పస గల్గు ప్రాయమ్ము పణమొడ్డి, ఆంగ్లేయ
ప్రభుత నణచివేయ ప్రతిన బూనె _
వలచిన దానినిన్, వైవాహికాదులన్
వదలి వనాంతర వాసియయ్యె _

గిరిజనావళి నొక గీతపై నిలబెట్టి,
తాను గూడ చేత ధనువు బట్టి,
సైన్య మొకటి జేసి, సమర శంఖము నూది
ఆంగ్ల ప్రభుత గుండె లదరగొట్టె _

”మిరప సందేశము”ల జైళ్ళ మీద పంపి,
దాడి వార్తల పుట్టించి ”దడ దడ” లను;
అటులె దండెత్తి, గొనిపోయి ఆయుధముల,
ప్రక్కలో బల్లెమయె నాంగ్ల పాలకులకు _

”చిప్పలు చేతబట్టి ఇట చేయగ వర్తక మేగుదెంచి, మా
తప్పుల కారణాన మము దాసుల జేసియు నేలుచున్న మీ
గొప్పలు చాలునింక ! మిము గొంతులు కొయ్య ! దురాత్ములార ! ఛీ !
కప్పము, పన్నులంచు మము కట్టుమనం గెటు సిగ్గు లేదొకో !

నేలయు మాదే ! పీల్చెడు
గాలియు మాదే ! శరీర కష్ట ఫలితమౌ
కూలియు మాదే ! ఇంకన
దేలా పన్నులును, కప్ప మీవలె మీకున్ ?

పోరా ! ఈ భరతావనిన్ విడిచి పొమ్మం ” చు గర్జించుచున్
పోరాటంబును వీర సింహమయి పెంపుం జేసె ” నల్లూరి ” ; తా
” మే రీతిన్ పడగొట్టుటా యతని ” నం చింగ్లీషువారల్ మహా
ఘోరాలోచనలందు మున్గి రకటా ! క్రూరాత్ములై, ఉగ్రులై !

అంత నొకనాడు …

ఉదయ సంధ్య వేళ ఉద్యమకారుండు
ఇతరు లెరుగనట్టి యేటి లోన
వక్షమందు గల్గు వస్త్రాదులన్ విప్పి
స్నానమాచరింప సాగిపోయె _

కంట బడని ఆ యేటిని
ఒంటరిగా నతడు స్నాన మొనరింపంగన్ _
తుంటరి యొక డెరిగింపగ
కంటకులై చుట్టుముట్టి కాల్చి తుపాకుల్ _

చిట్టడవిని మసక చీకటిన్ తీసిరి
తెల్ల దొరలు దొంగ దెబ్బ నటుల _
తూట్లు పడెను మేను తూటాలు దూరగా _
రాజు దేహమయ్యె రక్త మయము !

”నలుగురు గూడి ఒక్కనిని, నన్ను నిరాయుధు జేసి, ఒంటిగా
జలముల నున్న వేళ నిటు చంపిన చంపితిరేమొ గాని ! ఈ
వెలువడు రక్త బిందువులు విప్లవ మూర్తుల రూపు దాల్చి, మీ
తలలను ద్రుంచి, మా భరత ధారుణి స్వేచ్ఛను బ్రోవకుండునే !“

అని శపించి కఠిను లాంగ్ల జాతీయులన్;
చిందు రుధిరమంటు చేతులెత్తి,
భారతాంబ కమిత భక్తితో కడసారి
ప్రణతులిడెను దేశ భక్త వరుడు _

”జన్మించితి నీ ఒడిలో _
జన్మము ధన్యంబు నిట్లు జన్మించుటయే !
మున్ముందు నిటులె తల్లీ !
జన్మింపగ నెంతును ప్రతి జన్మము” ననుచున్ _

భరత మాత కంట బాష్పాలు రాలగా
కనులు తేలవేసి మునిగె నీట _
ఏటిలోన తేలె ఎర్ర తామర పువ్వు !
విప్లవమున కతడు విత్తనమ్ము ! #

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: