నగ్న సత్యము

నగ్న సత్యము

రచన : “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ” డా. ఆచార్య ఫణీంద్ర

 

“సత్య”,”మసత్యముల్” జగతి సాగగ నెవ్వరి దారి వారు, సాం

గత్యము గూడె నొక్క కడ! చక్కగ మాటలలోన దించి, సౌ

హిత్యమునున్ నటించె తెగ ఎచ్చులు వల్కుచు నా “అసత్యమున్”!

“సత్య” మమాయికత్వమున శాంతముగా విని, నమ్మె దానినిన్! – 1

 

కొన్ని రోజు లట్లు కూడి తిరిగినారు –

అక్క, చెల్లె లన్న యట్లు వారు!

వస్త్రములను గుర్తు పట్టకుండిన యెడ

కవల పిల్లల వలె కలుగు భ్రాంతి! – 2

 

చల్లని ఒక సాయంత్రము

వెల్లువగా పారు నదికి వెడలెద మనుచున్

కల్లరి – “అసత్య” మంతట –

అల్లన కోరిక దెలిపిన దా “సత్యము”తో! – 3

 

ఉత్సాహ పూర్ణులై ఉరికి చేరిరి వేగ

తరుణు లిర్వురు నదీ తటము కడకు!

వెల్లువెత్తు నదిని వెచ్చని నీటిలో

స్నానమాడుమని “అసత్య” మనియె!

యోచించుచున్న ఆ యోష – “సత్యము” గాంచి,

ఆ “అసత్యము” దుస్తు లంత విప్పె!

సఖికి తోడుగ వీడి “సత్యము” వస్త్రముల్

నగ్నమూర్తియయి తా నదిని మునిగె!

 

అప్పుడా “అసత్యము” జూపి అసలు బుద్ధి –

స్నానమాడుటకై తాను నదిని దిగక,

కట్టి “సత్యము” విడిచిన పుట్టములను

పారిపోయె – లేక రవంత పాప చింత! – 4

 

శుద్ధియె శుద్ధమునై పరి

శుద్ధంబైనటుల నగ్న శుద్ధిని గొని తా

నుద్ధరణము నొందితినని

బుద్ధిని తలపోసి సత్యము తటమును గనన్ – 5

 

అట “నసత్యము” తన కగుపింపకుండుట

గాంచి, నదిని వీడి కనె నటు, నిటు!

తన వలువలు గూడ కనరాక “సత్యము”

నిండ మునిగితంచు నీరుగారె! – 6

 

చేయునదేమి లేక, చెలి చేసిన మోసము చిత్తమందునన్

రోయుచు, నామె యొక్క ఒలె రోత పడన్ విధి లేక దాల్చియు

“న్నేయెడ తాను దాగినదొ? యేమొ?” యటం చిక తాను వీక్షణన్

జేయుచు సాగుచుండె – పురజీవులు గాంచుచు నీసడించగాన్! – 7

 

“నేనే సత్యము!” ననుచును

వేనోళ్ళను చెప్పుకొనుచు విహరించిన దా

జాణ – “అసత్యము” భువిలో!

నానా విధ స్వార్థ జనులు నడిచిరి తనతో! – 8

 

“సత్య” ముడుపు లూనిన ఆ “అసత్యము”నకు

ప్రజలు బట్టిరి నిత్య నీరాజనములు!

ఆ “అసత్యము” చేలము లమరు వెలది

నెంత మాత్రము గుర్తించ కీసడించ్రి! – 9

 

తుద కిట్లు గాదని తలచి

పొదివికొనిన బట్టలు విడి, పురవీధులలో

కదలెడు “సత్యము”ను గనుచు

పదుగురు నిందించినారు బాహాటముగాన్! – 10

 

“సత్యము”నకు చెందు శాటి ధరించిన

ఆ “అసత్యము” గని అబ్బురపడి

మాయలో బడిన అమానుష ప్రజలకు

“నగ్న సత్యము” గన నచ్చు నెట్లు? – 11

 

భగ్నమగు తన ప్రతిష్ఠ, ని

మగ్నమయి “అసత్య”పు వసమందున దిరుగన్!

నగ్నముగ తిరుగజాలదు!!

భగ్న హృదయ – “సత్య” మటుల పడె వేదనలో! – 12

 

బయట తిరుగగ తన బట్టలు దొరకక

సిగ్గుతోడ తాను చితికిపోయి,

నదిని చేరి తుదకు “నగ్న సత్య” మపుడు

నిలువ నీడ లేక నీట దాగె! – 13

 

తిరుగాడె “నసత్య” మటుల

ధరణిని తా “సత్యము”నని తరతరములుగాన్!

మరుగునపడె “సత్య” మకట!

ఎరుగము తా వెలికివచ్చు నెపుడో భావిన్? – 14*

 

(19వ శతాబ్ది ఫ్రెంచ్ జానపద కథ ఆధారంగా …)

 

 

 

 

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: