“దిగ్విజయ సభలు”

 “దిగ్విజయ సభలు”
రచన : “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ”
         డా. ఆచార్య ఫణీంద్ర
నాటి ప్రతాపరుద్రు డిల నాటగ తెల్గు పతాక, ఇప్పు డీ
నాట మరొక్కమారిక పునర్జననంబయి “చంద్రశేఖరుం”
డౌట నిజంబు! కాని యెడ, ఆత డొనర్చు తెలుంగు సత్సభల్
పాటవ మెట్లు చాటును ప్రపంచమునన్  బహుళార్థ కీర్తితో?        … 1
ఎప్పుడొ క్రీస్తు పూర్వమున ఈ తెలగాణ మహా ధరిత్రిపై
అప్పటి నామధేయమగు “అశ్మక దేశము”నందు పుట్టియున్,
మెప్పును పొందెడిన్ తెలుగు మేలిమి భాషగ విశ్వ మెల్లటన్ –
గొప్పగ చాటగా జరుపుకొంటిమి గాదె జగన్మహా సభల్!                  … 2
ఎంత కవిత్వము పారెను –
ఎంతెంతగ లోతు చర్చ లెన్నియొ జరిగెన్
సంతత మైదు దినములు! ని
రంతరము శతావధాన రసము స్రవించెన్!                                     … 3
ఒకట ఘన సాహితీ, సాంస్కృతికపు చిందు –
ఒకట తెలగాణ మధుర వంటకపు విందు –
ఒకట వజ్ర వాహన ప్రయాణికుల కందు!
సందడే సందడి తెలుగు సభల యందు!!                                      … 4
లెక్కకు మించియున్ జనులు లీల తెలుంగు మహాసభల్ గనన్ –
“ఇక్కడ ఈ సభింక, మరి ఎక్కడ ఆ సభ?” యంచు, మేనికిన్
రెక్కలు గట్టుకొంచు పలు రీతుల వేదికలన్ని జేరుచున్
మిక్కిలి సంతసంబున అమేయ జయంబును గూర్చినారహో!   … 5
[గత మాసం (డిసంబర్ 2017) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహా సభల” అఖండ విజయాన్ని నెమరు వేసుకొంటూ … ]
                                — &&& —
ప్రకటనలు