హైదరాబాద్ జిందాబాద్!

” సాక్షి” దినపత్రిక వారి కోరికపై నేను వ్రాసిన “హైదరాబాద్ జిందాబాద్” కవితను కుదించి ఈ రోజు ప్రచురించారు.

– డా. ఆచార్య ఫణీంద్ర

_20160112_072916

పూర్తి పాఠం :

“హైదరాబాద్ జిందాబాద్”

———————————–
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
————————————–
నాలుగు శతాబ్దుల క్రితం
మూసీ నది సాక్షిగా
అంకురించిన ప్రణయానికి చిహ్నం –
హైదరాబాద్!
కన్నతండ్రే కర్కశ ప్రభువై
కారాగృహంలో బంధిస్తే ..
ప్రాణాలకు తెగించి,
ప్రాణేశ్వరిని దక్కించుకొన్న
సాహసానికి సంకేతం –
హైదరాబాద్!
నిర్మలమైన నిజమైన ప్రేమకు
మల్కిభరాముడే నిలువెల్ల కరిగి
కవిత్వాన్ని, నృత్యాన్ని కలపడానికి
కట్టిన కల్యాణ వేదిక –
ఇక్కడి పురానా ఫూల్!
ఈ నేలపై ఆనాడు ..
రాచరికం నాట్యానికి నట్టువాంగం పాడింది.
ఈ నగరం పుట్టుక
సామ్యవాదానికి ప్రతీక!
ఈ భూమిపై ఆనాడు ..
ఇస్లాం హైందవం కౌగిలిలో పరవశించింది.
ఈ నగర జననం
మత సామరస్యానికి ఉదాహరణం!!
“భాగమతీ! నీ పేర వెలసిన ఈ నగరం
నా పాలిట భాగ్య నగరం” అన్నాడు కుతుబ్!
“నహీ .. మై తుమ్హారీ హైదర్ బేగమ్ హూ ..
ఇసీలియే యే హై హైదరాబాద్” అన్నది భాగమతి!
ఆ దివ్య ప్రేమికుల ‘మొహబ్బత్’ చూసి
ఆకాశమంత పొంగిన చార్మినార్
నాలుగు మినార్లతో చప్పట్లు కొట్టింది.

అలా ..
తెలుగు, ఫారసీ సంగమించి
‘దక్కనీ ఉరుదూ’కు జన్మనిచ్చింది ఇక్కడే!
గోల్కొండ కోట దివాణంలో
తెలుగు, సంస్కృతం, ఉరుదూ, పారశీక
భాషా సరస్వతులు బృంద గానం పాడాయి.
పహెలీ ‘ఉరుదూ షాయిరీ కితాబ్’ యహీ పైదా హుయీ!
తొలి తెలుగు యక్ష గానం పుట్టిందీ ఇక్కడే!
తొలి అచ్చ తెనుగు కావ్యం పుట్టిందీ ఇక్కడే!
ఇక్కడి కారాగారం ..
రక్తి పాఠాలే కాదు –
భక్తి కీర్తనలు నేర్పగలదు.
రామాలయం కట్టిన రామదాసు
ఆర్తితో “ఎవడబ్బ సొమ్ము?” అని నిలదీస్తే ..
దివి నుండి శ్రీరామచంద్రుడే దిగివచ్చి ఋణం తీర్చుకొన్నది ఇక్కడే కదా!

అక్కన్న పౌరుషం, మాదన్న మనీష
ఇక్కడ లభించిన ‘కోహినూర్’ వజ్రాన్ని
మించిన అమూల్య మణులు!

నగరానికి కూడ పెళ్ళి జరగడం ఎక్కడైనా విన్నారా?
ఒంటరిగా ఉన్న ఈ నగరం జంటగా మారింది
‘సికందరాబాద్ ‘ సొగసరిని చేపట్టి –
ఈ రెండు నగరాలను కలిపే మంగళ సూత్రం – ‘టాంక్ బండ్’!

మసీదులు, మందిరాలు, చర్చిలతో
ఈ నగరం ఒక త్రివేణీ సంగమం!
పరిశ్రమలకు ఈ షహర్ ఒక పరచిన తివాసీ!
వైద్యానికి ఈ నగరానిది వన్నె తరగని వాసి!
అన్నట్టు .. మలేరియాకు మందు పుట్టిందీ ఇక్కడేనండోయ్!

ఈ నగరం ఒక నందన వనం!
ఇక్కడ మూడు కాలాలు వసంతమే!!
ఈ ‘గోల్డెన్ త్రిషోల్డ్’ లోనే కదా ..
‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’
కమ్మని కవితా గానం పుట్టింది!

ఇక్కడి పడుచులు ‘బతుకమ్మలై’, పాటలై –
చెరువులలో నాట్యమాడుతారు.
బోనాలు, పీరీలు, క్రిస్మస్, దసరా, రంజాన్ –
ఏ పండుగైనా ..
నగర జనమంతా ‘అలై బలై’!

ముత్యాల మిలమిలలు
మెహిందీ తళతళలు
గాజుల గలగలలు
బిరియానీ ఘుమఘుమలు
ముషాయిరాల ‘వహువా’లు ..
హుషారు గొలుపుతాయి ఇక్కడ!

ఈ మహా నగరం
సంగీత సాహిత్య సంస్కృతుల కొలువే కాదు ..
స్వాతంత్ర్య సంగ్రామాలకూ నెలవే!
ఇక్కడ గడ్డి పరక కూడ
అవసరమైతే ఖడ్గమై విజృంభించగలదు –
గోల్కొండ కోట గుమ్మంలో దురాక్రమణదారులతో
మూడు పగళ్ళు .. మూడు రాత్రులు ..
వీరోచితంగా పోరిన ‘అబ్దుల్ రజాక్ లారీ’ –
శతృవులనే అబ్బురపరచిన పదునైన కటారీ!

కోఠీ ‘రెసిడెన్సీ’ పై దండెత్తి
తెల్లవారిని తెల్లబోయేలా చేసి ..
ఉరికంబమెక్కిన తుర్రే బాజ్ ఖాన్ –
హైదరాబాద్ కా ‘సమ్మాన్ ‘!

రైతాంగ పోరాటాన్ని
బాహాటంగా సమర్థించి
నవాబును నడి బజారు కీడ్చి,
రక్తాన్ని ధార వోసిన
రచయిత, పత్రికా సంపాదకుడు
షోయబుల్లా ఖాన్ –
హైదరాబాద్ కా ‘షాన్ ‘!

నవ్య భవ్య రాష్ట్రం కోసం
స్వీయ ప్రాణాన్ని తృణప్రాయంగా
సజీవ దహనం చేసి స్ఫూర్తి రగిలించాడు
శ్రీకాంతాచారి –
ప్రపంచమంతా ‘పరేషాన్ ‘!

ఉద్యమం ఈ నగరానికి ఊపిరి!
పోరాటం ఈ నగరం పోకడ!
ఇక్కడ విశ్వవిద్యాలయాలకు
విద్యార్థులే ఉద్యమ పాఠాలు నేర్పుతారు.
ఉత్తుంగ లక్ష్యాలను సాధిస్తారు.

ఇక్కడ అన్ని సంస్కృతులు కలిసి బ్రతుకుతాయి.
ఇక్కడ అన్ని సంప్రదాయాలు కలిసి బ్రతుకుతాయి.
అన్ని మతాలు కలిసి బ్రతుకుతాయి.
అన్ని భాషలు కలిసి బ్రతుకుతాయి.
ఈ నగరం అందరినీ
అక్కున చేర్చుకొంటుంది.
“నమస్తే అన్న!”, “కైసే హో భాయ్?”
అన్న పలకరింపులతో ఈ నగరం
పులకరింపజేస్తుంది.
సహజీవనం ఈ నగరం అసలు భాష!
సాదరమైన ఆప్యాయత ఈ నగరంలో ఆగని శ్వాస!
ఆధా కప్ ‘ఇరానీ ఛాయ్’ స్నేహాన్ని
అమృతమయం చేస్తుంది ఇక్కడ!

కాస్త ‘హలీమ్’. తిని, ‘ఫాలూదా’ తాగి,
నిజం చెప్పు భాయ్ ..
హైదరాబాద్ హై హైదరాబాద్!
హైదరాబాద్ జిందాబాద్!!
అవునా? కాదా?

— &&& —

ప్రకటనలు

1 వ్యాఖ్య (+add yours?)

 1. kiran
  జన 04, 2017 @ 17:08:46

  wow nice poetry sir
  hi
  We started our new youtube channel : Garam chai . Please subscribe and support
  https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: