తెలంగాణ తల్లి (గీతం)

telanagana-Talli

తెలంగాణ రాష్ట్రావిర్భావ ప్రథమ వార్షికోత్సవాల సందర్భంగా నేను రచించిన గీతం :

తెలంగాణ తల్లి (గీతం)
రచన : డా. ఆచార్య ఫణీంద్ర

జయము జయము తెలంగాణ తల్లి !
జయహో జయహో మా కల్పవల్లి !!
అందుకోవమ్మా దివ్య హారతులు –
అందుకోవమ్మ మా నమస్కృతులు – || జయము ||

‘అశ్మక దేశం’ గా అంకురించినావు
‘కోటి లింగాల’ లో కొలువు దీరినావు
‘ఓరుగల్లు’ జిల్లాలో ‘కాకతి’ వై వెలసినావు
‘గోలకొండ’ ఖిల్లాలో ‘కోహినూరై’ వెలగినావు – || జయము || 1

‘భద్రాద్రి సీత’ గా భద్రత చేకూర్చేవు
‘బాసర వాణి’ గా పలుకు తీర్చి దిద్దేవు
‘ఆలంపూర్ జోగులాంబ’ గా శుభమందించేవు
ముగురమ్మల మూలపుటమ్మగ నీవే నిలిచినావు – || జయము || 2

‘గణపతి దేవ చక్రవర్తి’ ఘన కీర్తివి నీవే –
‘రాణి రుద్రమాంబ’ ఖడ్గ వీర విఖ్యాతి నీవె –
‘మల్కిభరాముని’ మత సామరస్య రక్తి నీవె –
‘మహామంత్రి మాదన్న’ మహిత ధీయుక్తి నీవె – || జయము || 3

‘వేములవాడ భీమ కవి’ వశ్య వాక్కు నీవే –
‘పాల్కుర్కి సోమన’ జాను తెనుగు పల్కు నీవె –
‘మల్లినాధ సూరి’ మధుర వ్యాఖ్యాన రీతి నీవె –
‘పోతన కవి’ భాగవత పద్య సుధా నిధివి నీవె – || జయము || 4

‘అప్ప కవి’ వెలయించిన ఛందశ్శాస్త్రం నీవె –
‘విద్యానాధుని’ నృత్య లక్షణ శాస్త్రం నీవె –
‘పొనగంటి తెలగన’ తొలి అచ్చ తెనుగు కృతి నీవె –
‘కందుకూరి రుద్ర కవి ‘ తొలి యక్ష గాన జతి నీవె – || జయము || 5

‘కంచర్ల గోపన్న’ భక్తి కీర్తన నీవె –
‘శేషప్ప కవి’ విరచిత శతక కీర్తివి నీవె –
‘సురవరం’, ‘దాశరథి’, ‘వానమామలై’, ‘సుద్దాల’ …
నవ సాహితీ నిర్మాతల నవ్య స్ఫూర్తివి నీవె – || జయము || 6

“దున్నే వానిదె భూమి” అన్న ఆశయంతో –
‘కొమురం భీం’ – “జల్, జమీన్, జంగల్” నినాదంతో –
రైతాంగ పోరులు, విద్యార్థి ఉద్యమాలతో –
దేశానికి దారి చూపు దివ్య క్షేత్రం నీది – || జయము || 7

మగువ లాడి పాడు పూల ‘బతుకమ్మ’ గీతాలు
‘సమ్మక్క, సారలమ్మ’ తరతరాల జాతరలు
‘లష్కర్ మహంకాళి బోనాల’ పండుగలు
నీ సంస్కృతి చాటేను – మా గుండెలు మీటేను – || జయము || 8

గోదావరి జల జలా .. కృష్ణవేణి కిల కిలా ..
రావాలు పలుకగ, ప్రవాహాలు ఒలుకగ,
నిండు కుండ చెరువులతో – నీటి ప్రాజెక్టులతో –
బంగారం పండవలె ! భాగ్యాలు నిండవలె !! || జయము || 9

‘కాకతీయ తోరణాలు’, ‘చార్మినార్’ వెలుగులతో
‘నిర్మల్, పెంబర్తి కళలు’, ‘సింగరేణి’ జిలుగులతో
‘ఉస్మానియ’ విజ్ఞానం, ‘ఐ. టి.’ విజయాలతో
‘నవ తెలంగాణ’ వై – ఆనంద నాట్యమాడు మమ్మ! || జయము || 10

— *** —

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: