అరవయ్యేళ్ళ సమైక్యాంధ్ర చరిత్ర … నాలుగు పంక్తులలో!

అభ్యుదయ కవిత్వంలో పీడితుల ఆర్తి, కవిత్వానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తమకు జరిగిన అన్యాయాలను సహించలేక దాదాపు పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు విభజనవాదులై ఉద్యమిస్తూ విజృంభించారు. ముఖ్యంగా గత దశాబ్దకాలంనుండి తెలంగాణ ఉద్యమంపై హృదయాలకు హత్తుకొనే చక్కని కవిత్వం అనేక కలాల నుండి అమితంగానే జాలువారింది. ఉద్యమ కారణాలుగా నిలిచిన అనేక అంశాలను చాల మంది కవులు చాల ప్రతిభావంతంగా కవిత్వీకరించి పాటలుగా, పద్యాలుగా, వచన కవితలుగా రచించి, ఉద్యమానికి ఎంతో బలాన్ని చేకూర్చారు. అందులో కొందరు సీమాంధ్ర కవులు కూడ ఉండడం విశేషం. ఈ కవిత్వమంతా తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని శాశ్వతంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు.

telangana

మరో వందేళ్ళకైనా … తెలంగాణ ఎందుకు విడిపోయిందో తెలుసుకోవాలంటే – ఈనాటి సీమాంధ్ర ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా కల్పనలు, కథనాలు చదువనక్కర లేదు. లేదా తెలంగాణవాదుల ఉపన్యాసాలు, వ్యాసాలు చదువనక్కర లేదు. ప్రతిభావంతంగా పదునెక్కిన పంక్తులతో గుండెలలోకి సూటిగా దూసుకుపోయే ఈ ఉద్యమ కవిత్వం చదివితే చాలు – సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే … ఆ కవిత్వం వాస్తవికతను నలుగురిలో నగ్నంగా నిలబెట్టి చూపింది. ఎందుకంటే … ఆ కవిత్వంలో నీతి, న్యాయాలను పాతరవేసారన్న ఆవేదన ఉంది. ఎందుకంటే … ఆ కవిత్వంలో నిగ్గదీసి అడిగే నిజాయితీ ఉంది.
అదిగో … అలాంటి కవిత్వంలోని ఒక నాలుగు పంక్తులను నిన్న నేను చదువడం తటస్థించింది. చదివినప్పటి నుండి ఆ పంక్తులు నా మస్తిష్కంలో సుడిగుండంలోని వలయాలుగా పరిభ్రమిస్తూనే ఉన్నాయి.

నిజమే! ఈ అరవయ్యేళ్ళ సమైక్య రాష్ట్రంలో మేము వాళ్ళ ప్రాంతానికి వలసలు పోకపోయినా, సీమాంధ్ర అంతా పర్యటించాం. సీమాంధ్రలోని పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొన్నాం. వాళ్ళ చరిత్ర, సంస్కృతిని గురించి ఘంటాపథంగా చెప్పగలం. మేము వాళ్ళతో ఎంతగా కలసిపోయామంటే – చివరికి మా అస్థిత్వాన్ని మేమే మరచిపోయి, తిరిగి నాలుక కరుచుకొని మళ్ళీ నిలుపుకొనేందుకు పోరాడవలసి వచ్చేంతవరకు.

మరి సీమాంధ్రులో … ! మా ప్రాంతానికి వలసలు వచ్చారు. మా నీళ్ళను, నిధులను, ఉద్యోగాలను స్వీకరించారు. కాని మా చరిత్రలో కనీసం ఒక పుటను మించి స్వీకరించలేకపోయారు. మా సంస్కృతిని తమ సంస్కృతిగా అంగీకరించలేకపోయారు. కనీసం మా ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ పుణ్యక్షేత్రం ఉందో గట్టిగా చెప్పలేరు.

వారి వ్యావహారిక భాష మాకు ప్రామాణిక భాష అయింది. మా వ్యావహారిక భాష వారి ఈసడింపులకు గురయింది. వారి ప్రాజెక్టులు చాల పూర్తయి పరవళ్ళు తొక్కాయి. మా ప్రాజెక్టులు ఒకటి రెండు తప్ప, అన్నీ పునాదిరాళ్ళుగానే మిగిలాయి.

తుదకు ’విశాలాంధ్ర’ ఒక సమ్మేళనం కాలేకపోయింది. ప్రజాస్వామ్యం ముసుగులో ఒక సామ్రాజ్య విస్తరణగా నిలిచింది.

ఇదే భావాన్ని కేవలం నాలుగయిదు పంక్తుల్లో నిక్షిప్తం చేసారా కవి.

ఆ కవి పేరు ’వడ్డెబోయిన శ్రీనివాస్’.

ఆ పంక్తులు …

” నేను గోదావరి పాయలా బయలుదేరి
సముద్రమై నీతో కలసిపోవాలనుకొన్నాను!
నీవు సముద్రంలా బయలుదేరి
‘నాగార్జున సాగర్’ ఎడమ కాలువ కూడ కాలేకపోయావు!! “

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

7 వ్యాఖ్యలు (+add yours?)

 1. Sudhakar
  నవం 09, 2013 @ 18:00:56

  అన్యాయాలు జరిగింది, ప్రజల వల్ల కాదు , ప్రజా నాయకుల వల్ల !
  పుణ్య క్షేత్రాలయినా , ప్రజా నాయకులైనా , ఏప్రాంతం లో ఉన్నా,
  ప్రజలకు చేస్తున్నదేమీ లేదు, తమ ఆస్తులు పెంచుకోవడం తప్ప !
  నేతల కుటిలత్వాన్ని , ప్రజలకు ఆపాదించడం, ‘ మా ‘ ‘ మీ’ లు పెంచుతూ ,
  ప్రాంతాల వారీగా ప్రజలను, ముద్దాయిలను చేయడం సమంజసమా ?

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  నవం 09, 2013 @ 21:02:53

  సుధాకర్ గారు!
  నేను ఇక్కడ సమీక్షించింది కవిత్వాన్ని. పని గట్టుకొని ’మా’, ’మీ’ అంటూ ప్రజలను ముద్దాయిలను చేయాలని కాదు. కాని సామాజికపరమైన కవిత్వంలో వస్తువును ప్రజలనుండి వేరు చేయలేం. భావ వ్యక్తీకరణ Generalized గా ఉంటుంది.
  ఇక ఆత్మాశ్రయ కవిత్వమైతే మరీ వ్యక్తిగతంగా మాటాడుకొన్నట్టు ఉంటుంది. ఇది అలాంటి కవితే! ఈ రీతి కవిత్వంలో ’నేను’ అంటే ’నేను’ కాదు – ఒక పీడిత వర్గం. ’నీవు’ అంటే పీడక వర్గం. కవిత్వ లక్షణాలు ఎరిగిన వారికి ఇవన్నీ విదితమే. బహుశః మీకు ఇవన్నీ తెలియనట్టుంది.
  మీరన్నది ఎంత అమాయికంగా ఉందంటే – “ఆంగ్లేయులు భారత దేశాన్ని 200 సంవత్సరాలు పాలించారు” అని అంటే, “పాలించింది పాలకులు కదా! ’ఆంగ్లేయులు’ అని బ్రిటిష్ ప్రజలను అంటున్నారేంటి?” అన్నట్టుంది.
  నిజానికి మీరనేదే ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. అంతెందుకు? మీకు నా మాటలలో ’మీ’, ’మా’నే కనిపిస్తుంది. “అందులో కొందరు సీమాంధ్ర కవులు కూడ ఉండడం విశేషం.” అన్న నా ప్రశంస మీ కంటికి ఆనదు.
  అయినా … కవిత్వపరంగా కాక నిజంగానే ఈ విషయంలో మాత్రం సీమాంధ్ర ప్రజలనే ముద్దాయిలను చేయాలి.
  విభజనను ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు విభజనవాద పార్టీలతో పొత్తు పెట్టుకొన్న, అనుకూలమే అని ప్రకటించిన పార్టీలకు బంపర్ మెజారిటీ ఓట్లు వేసి గెలిపించింది ప్రజలా? పాలకులా?
  తోటి తెలుగువారు తగులబెట్టుకొని కాలిపోతూ తీవ్ర ఉద్యమం చేస్తుంటే కనీస సానుభూతి లేకుండా చలనం లేకుండా ఉన్నవారు, ప్రకటనలు రాగానే రోడ్లపైకి వచ్చి ఉద్యమించింది, ఉద్యమిస్తున్నది ప్రజలా? పాలకులా?
  విభజనవాదులను ’తాగుబోతులు’, ’సోమరులు’, ’తెలబానులు’ అని దూషిస్తున్నది ప్రజలా? పాలకులా?
  చరిత్రలో ఎక్కడా లేని విధంగా కౌంటర్ ఉద్యమం చేస్తున్నది ప్రజలా? పాలకులా?
  ఆడవాళ్ళ రక్షణకు చట్టాలను చేస్తే, మగవాళ్ళు కౌంటర్ ఉద్యమం చేస్తే – న్యాయం జరుగుతుందా?
  పేదలకు సహాయ పథకాలను అమలు చేస్తే, ధనికులు కౌంటర్ ఉద్యమం చేస్తే – న్యాయం జరుగుతుందా?
  దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తే, అగ్ర వర్ణాలవాళ్ళు కౌంటర్ ఉద్యమం చేస్తే – న్యాయం జరుగుతుందా?
  ఈనాటి నేతలు నీతి మాలిన వాళ్ళని అందరికీ తెలుసు.
  ప్రజలు నీతి, న్యాయాలకు మద్దతు పలుకకపోతే వాళ్ళు ముద్దాయిలు కారా?
  “ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు” అనడం, “ప్రజలను తప్పు పట్టకూడదు” అనడం ఒక రకంగా మూర్ఖత్వం.
  సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం దురాచారాలను వ్యవస్థ మద్దతు చూసుకొని పాటించింది ప్రజలే. అయితే కొందరు మహనీయులు, వైతాళికులు వచ్చి “అది తప్పు” అని వివరించి ప్రజలకు మార్గదర్శనం చేస్తారు.
  ఇప్పుడు సీమాంధ్రలో అలాంటి మార్గదర్శి ఒక్కడు కూడా లేకపోవడం నిజంగా దౌర్భాగ్యం!

  స్పందించండి

 3. kinghari010ari.S.babu
  నవం 10, 2013 @ 18:31:02

  అది సరే కానీ మీరు సీమాంధ్రులకి పాకేజీని సూచించానన్నప్పుడు గుండు మధుసూదన్ గారు వారు ఈ జాలికి పాత్రులా అని అన్నది యెవరినో చెప్పగలరా?

  మీరు పాకేజీని ప్రతిపాదించింది ప్రజలకి అయితే , కానీ వాళ్ళు ఈ జాలికి తగుదురా అని గుండు మధుసూదన్ గారు దీర్ఘాలు తీసింది కూడా ప్రజల గురించే అవుతుంది కదా?

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  నవం 10, 2013 @ 19:37:44

  గుండు మధుసూదన్ గారు “పాత్రులా?” అని అన్నది ఈ క్రింది వార్త చదివాక –

  ” రాష్ట్ర విభజన వేళ ఆఖరి దోఖా జరుగుతోంది. రెండు జీవనదులున్న తెలంగాణకు నీళ్లు దక్కకుండా తరలించుకుపోయే కుట్ర జరుగుతోంది. సర్కారు వ్యవస్థపై నమ్మకంతో ఉన్న తెలంగాణ ప్రజలను కీలక స్థానాల్లో ఉన్న సీమాంధ్ర పెద్దలు ముంచుతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన వారి అక్రమ ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపులు చూపించుకుంటూ లెక్కలు తయారు చేశారు. తెలంగాణ నాయకుడే మంత్రిగా ఉన్న నీటి పారుదలశాఖలో అధికారులు తప్పుడు లెక్కలు తయారుచేస్తుంటే సదరు నాయకుడు జైత్రయాత్రల్లో బిజీబిజీగా ఉన్నారు. సీమాంధ్ర సర్కారు పంపిన లెక్కల ప్రకారమే నీటి పంపకాలు జరిగితే తెలంగాణ మరో 37 ఏళ్లు నీటిపై హక్కుల కోసం కనీసం పోరాడే న్యాయమైన హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ”

  ఇప్పుడు మీరే చెప్పండి మరి … ఆ నీటి పారుదలశాఖలో అధికారులు – ప్రజలా? పాలకులా ?
  వాళ్ళు పాపం … ’పాలకుల వంటి ప్రజలు!’ … ’ప్రజల వంటి పాలకులు!!’

  విషయం ఆలస్యంగా తెలుసుకొని మేమీ ప్రశ్నను లేవనెత్తితే, మీరు – ” నీటి పారుదల శాఖ మంత్రి మీ తెలంగాణవాడే! ” అని బుకాయించగలరు కూడ!

  స్పందించండి

 5. kinghari010ari.S.babu
  నవం 11, 2013 @ 08:53:19

  విషయం ఆలస్యంగా తెలుసుకొని మేమీ ప్రశ్నను లేవనెత్తితే, మీరు – ” నీటి పారుదల శాఖ మంత్రి మీ తెలంగాణవాడే! ” అని బుకాయించగలరు కూడ!
  —–>
  ఇది మామీద మీరు మోపుతున్న నింద కాదా? ఇలాంటి మనస్సుతో మీరు మాకోసం పాకేజీల గురించి ప్రస్తావించడం దేనికో?

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  నవం 11, 2013 @ 12:43:03

  hariSbabu గారు!
  “నేతల కుటిలత్వాన్ని , ప్రజలకు ఆపాదించడం, ‘ మా ‘ ‘ మీ’ లు పెంచుతూ ప్రాంతాల వారీగా ప్రజలను, ముద్దాయిలను చేయడం …” అంటూ మీరు మాపై నింద వేయవచ్చు.
  ” మధుసూదన్ గారు దీర్ఘాలు తీసింది …” అని మావాళ్ళపై వ్యంగ్య బాణాలు వేయవచ్చు.
  మా పామరుల వ్యావహారిక భాషను మా ప్రామాణిక భాషగా ముద్ర వేసి మమ్మల్ని అవమానించవచ్చు.
  ’తాగుబోతులు’, ’సోమరులు’, ’తెలబానులు’ అని మమ్మల్ని దూషించవచ్చు.
  కాని గతానుభవాలను బట్టి, మీరు ” నీటి పారుదల శాఖ మంత్రి మీ తెలంగాణవాడే! ” అని బుకాయించగలరు కూడ! ” అని మేమంటే అది ’పేద్ద తప్పు!’ మీరు లేవనెత్తిన ప్రశ్నలకు దీటుగా అదేరీతిలో సమాధానమిస్తే – అది ఇంకా పెద్ద తప్పు!! … ఇదే ’ఆధిపత్య ధోరణి’ అంటే!
  “మీరు మాకోసం పాకేజీల గురించి ప్రస్తావించడం దేనికో?” అంటూ మీరు నాతో వెటకారం ఆడనక్కరలేదు.
  మాకు నష్టం కలుగకుండా, మీకు అత్యధికంగా లాభం చేకూరాలని కోరుకోవడం మా మంచితనం. న్యాయంగా మాకు రావలసిన దానికి అడ్డుపడడం మీ లక్షణం! అదే ఇప్పుడు జరుగుతున్నది … ! అదే ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్నది … !!
  ఇది మీకు అర్థం కాకపోయినా ఫరవా లేదు. ప్రపంచానికి అర్థమయితే చాలు! పరమాత్మునికి అర్థమయితే చాలు!!

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  నవం 11, 2013 @ 19:13:36

  “అన్యాయాలు జరిగింది, ప్రజల వల్ల కాదు , ప్రజా నాయకుల వల్ల!” ; “నేతల కుటిలత్వాన్ని ప్రజలకు ఆపాదించడం సమంజసమా?” అంటూ అంతా సీమాంధ్ర నాయకుల మీదికి తోసేసి, సీమాంధ్ర ప్రజలదేం తప్పు లేదని వాదిస్తున్న బ్లాగర్లు ఒక విషయానికి సమాధానమివ్వాలి.
  “జాగో… భాగో…” అన్నది, “ఆప్షన్స్ లేవు” అన్నది ( అవి ఏ సందర్భంలో అన్నది, వాటిలోని ఔచిత్యమేమిటి? – అన్నది కాసేపు ప్రక్కన పెడితే … ) తెలంగాణ నాయకులు! తెలంగాణ ప్రజలు కాదు! ఆ కోపంతో ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ ప్రజలు సాధించుకొన్న తెలంగాణకు అడ్డుపడడం సమంజసం కాదని ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రజలు ఎందుకు ఆలోచించడం లేదో మీరు చెప్పగలరా?
  మీరన్నట్టే … అన్యాయాలు చేసిన సీమాంధ్ర నాయకుల మీద పోరాడి, తెలంగాణ ప్రజలు సాధించుకొన్న తెలంగాణకు అడ్డుపడడానికి సీమాంధ్ర ప్రజలు కారణాలుగా చెప్పుతున్నది – తెలంగాణ నాయకుల ఆ మాటలనే కదా! ఇది నాయకుల మాటలను ప్రజలకు ఆపాదించడం కాదా? మరి అది సమంజసమా?

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: