‘నవ తెలుగు గీతి’

’నవ తెలుగు గీతి’

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

telangana

ఇదేం నీతి? ఇదేం నీతి?

ఇదేనా తెలుగు రీతి?
ఇదేం నీతి? ఇదేం నీతి?
ఇది తగునా తెలుగు ’జ్ఞాతి’?

చేసుకొన్న బాసలన్ని
వ్రాసుకొన్న వ్రాతలన్ని
మీ స్వార్థం చూసుకొని
మీ లాభం కోసమని
మాట తప్పి, కాల రాసి,
నీటి వ్రాతలుగ జేసి,
ఉమ్మడి పరివారంలో
తిమ్మిని బమ్మిని చేసి
తమ్ములనే ముంచారు –
సొమ్ములనే దోచారు –

ఇదేం నీతి? ఇదేం నీతి?
ఇదేనా ’తెలుగు జాతి’?

అరవయ్యేళ్ళ రాష్ట్రంలో
అధికారం మీదేనా?
అరవయ్యేళ్ళ పాలనలో
ఉద్యోగాల్ మీవేనా?
అరవయ్యేళ్ళ మనుగడలో
వ్యవసాయం మీకేనా?
అరవయ్యేళ్ళ కలయికలో
వ్యాపారం మీదేనా?
అరవయ్యేళ్ళ కాలంలో
అభివృద్ధి మీకేనా?

ఇదేం నీతి? ఇదేం నీతి?
ఇదేనా తెలుగు ’ప్రీతి’?

ఆశలన్ని అడుగంటి
మోసాలను పసిగట్టి
ఇక దోపిడి కూడదని
ఇక కలయిక సాగదని
నా కుంపటి నాకంటూ –
నా బ్రతుకిక నాదంటూ –
తమ గోడును వినిపించే
తమ్ములనే కరిచేరా?
ఒక చెట్టే పెరిగి రెండు
కొమ్మలైన విరిచేరా?

ఇదేం నీతి? ఇదేం నీతి?
ఇదేనా తెలుగు ఊతి?

ప్రాంతాలుగ విడిపోదాం –
ప్రజలుగా కలిసుందాం!
మట్టిగా విడిపోదాం –
మనుషులుగా కలిసుందాం!
మనుగడలో విడిపోదాం –
మనసులతో కలిసుందాం!
తెలుగు రాష్ట్రాలు రెండు
ఉంటే తప్పంటారా?
అన్నదమ్ములుగ విడిపోదా
మంటే ముప్పంటారా?

ఇదేం నీతి? ఇదేం నీతి?
ఇదేనా తెలుగు భాతి?

కడుపు మాడి, కడుపు మండి,
విడిపోతామని అంటే –
ఉద్యమించు పార్టీని
ఓడించాలని పూని
ఓట్ల కొరకు, సీట్ల కొరకు
అట్లే అని ఒప్పుకొని
తీరా ఇక తీర్పిస్తే –
తెలంగాణ ప్రకటిస్తే –
తీరు మార్చుకొంటారా?
నోరు మడచి వాగేరా?

ఇదేం నీతి? ఇదేం నీతి?
ఇదేనా తెలుగు ఖ్యాతి?

పలు యేళ్ళుగ ఉద్యమించు
ప్రజలిక ప్రజలే కారా?
ప్రాణాలను అర్పించిన
ప్రజలిక ప్రజలే కారా?
ప్రజాభిప్రాయమంటే
మీ ప్రాంతం పలుకేనా?
సమైక్యాంధ్రమంటే
పదమూడు జిల్లాలేనా?
ప్రజలంటే మీరేనా?
తెలుగంటే మీదేనా?

ఇదేం నీతి? ఇదేం నీతి?
ఇదేనా తెలుగు జ్యోతి?

ఇకనైనా కళ్ళు తెరచి
ఇక మీదట బుద్ధి కలిగి
ఒకటి ఇంక రెండైనా –
రాష్ట్రాలవి వేరైనా –
ప్రజలంతా ఒకటేనని
తెలుగంటే అందరిదని
సోదరులమే మనమని
భరతమాత బిడ్డలమని
తెలుసుకొనుట మంచిదిరా!
వెలుగు కనుట మార్గంరా!!

ఇదే నీతి! ఇదే నీతి!!
ఇదే ఇదే ’నవ తెలుగు గీతి’!!!

  — &&& —

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: