ఇంకా పిడివాదనలేనా?

ఇద్దరి మధ్య, ఒకడు నాకు అన్యాయం జరిగిందని తగవు పడితే, ఆ ఇద్దరూ మూడో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఆ పెద్ద మనిషి ఇచ్చిన తీర్పును విని గౌరవించడం … సంస్కారవంతుల లక్షణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎన్నో యేళ్ళు ఆలోచించి, ఎంతో కసరత్తు చేసి, ఇచ్చిన తీర్పును సీమాంధ్ర ప్రజలు ఇప్పటికైనా గౌరవించి, తెలంగాణ ప్రజలను అభినందించి, సోదర భావాన్ని పెంపొందించుకోవడం హుందాగా ఉంటుంది. ఈ తీర్పు ఇచ్చిన కేంద్ర మంత్రివర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన విభిన్నమైన పార్టీలకు చెందిన మంత్రులున్నారు. ఒక్క సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు మంత్రులు తప్ప అందరూ ఏకగ్రీవంగా ఈ తీర్పును ఆమోదించారంటే, దేశంలోని దాదాపు అన్ని ప్రతిపక్షాలు దానికి మద్దతు తెలిపాయంటే, ఈ తీర్పును దేశమంతా అంగీకరించినట్టు కాదా? సీమాంధ్రుల ’సమైక్యాంధ్ర’ వాదానికి దేశంలో ఎక్కడా మద్దతు లభించడం లేదంటే న్యాయాన్యాయాల విచక్షణలో సీమాంధ్రులు తప్పటడుగులు వేస్తున్నట్టు అర్థం కావడం లేదా? ఇన్నేళ్ళ పోరాటం తరువాత కూడ ఇంకా మా తెలుగు సోదరులే మమ్మల్ని అర్థం చేసుకోకుండా, మా సుదీర్ఘమైన పోరాటానికి దక్కిన విజయానికి అడ్డుపడుతున్నారనే భావన తెలంగాణ సోదరులకు సీమాంధ్రులు కలిగించడం సముచితమేనా ? 

ఇంకా కొందరు సీమాంధ్రులు చేస్తున్న పిడివాదం చూస్తుంటే – వాటికి సమాధానంగా ఎప్పుడో దశాబ్ద కాలం క్రితం నేను వ్రాసిన “దోషమె కంఠమెత్తినన్ ?” అన్న పద్య కవిత గుర్తుకు వచ్చింది. ఆ కవితను పునః ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

TEL2

దోషమె కంఠమెత్తినన్ ?

రచన: ‘పద్య కళా ప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

ఏ రైతాంగమె ఆ ‘నిజాము’ విభుతో, ఈ భూమి మాదేయటన్
పోరాటంబును సల్పి సాయుధులునై, పొందెన్ తెలంగాణమున్ –
ఆ రైతాంగము నష్టపోయెను విశాలాంధ్రమ్ములో చేరుటన్ !
నీరే అందదు పంట కాల్వలకు – కన్నీరేమొ పొంగారెడిన్ !

కోస్తా, సీమల ముఖ్యమంత్రులకు సంకోచమ్మె లేకుండ, ఆ
కోస్తా ప్రాంతపు రైతు లాభములయెన్ కొండంత లక్ష్యంబుగాన్ !
బస్తాల్ నింపుచు బండ్ల కెత్తుటయె ఆ ప్రాంతంపు భాగ్యంబునై;
పస్తుల్ పండుట, ప్రాణముల్ విడుట ఈ ప్రాంతంపు ప్రారబ్ధమా ?

కిలకిలా నగవుల కృష్ణ , గోదావరుల్
తొలుత తాకు నిచట తెలుగు నేల !
పారి, దాటిపోవు – పంట భూముల యొక్క
దాహములను తీర్ప తలపడెవడు !

సకలారిష్టములన్ని దాటి, తుదకున్ సాధించి ఈ ప్రాంతమం
దొకరో, ఇద్దరొ ముఖ్యమంత్రులయి, తామూనంగ సద్వృద్ధికై
వికలంబౌనటు ‘లాంధ్ర’* నాయకులయో ! విద్వేషముల్ చిందరే ?
ఒకటే లక్ష్యము – వారి పెత్తనమె ! లేకున్నన్ ప్రభుత్వమ్మె ’హుష్’ !
( * ఇది ఇక్కడ ’భాషా వాచకం’గా కాక, ’ప్రాంత వాచకం’గా ప్రయోగింపబడిందని గమనించ గలరు )

ఏటికి ఎంచుట ఇవి ? ఆ
మాటయె పలుక – తెలగాణ మంత్రులయందున్
నూటికి తొంబది, ఎంగిలి
కూటికి ఆశపడుచుండు కుత్సితు లకటా !

వ్యవసాయంబున కూత లేదు – మరి విద్యా సంస్థ, లుద్యోగముల్,
భవనాల్, భూములవన్ని దోచ వలసల్ వచ్చున్న కామందులే;
అవి పోవన్, మిగులేవొ కొన్ని ఇట వారందేరు ! దుర్భాగ్యులౌ
యువకుల్ గాంచిది గుండె మండి, మరి పోరో ‘నక్సలైట్’ దారిలోన్ ?

ఇవియునన్ని గాక, ఇంక దారుణ మిద్ది –
ఇచటి పేదలన్న ఏదొ లోకు,
విచటి భాషయన్న ఏదో చులకన ! ఇం
కిచటి సంస్కృతియన హేళనమ్ము !

ఏకమైయున్న, ఆగబోదింక దోపి
డిట్లు ! అయిన దేదియొ ఆయె – నింక మీద
వీడి, అన్నదమ్ముల వోలె వేరుపడిన –
ఎవరి అభివృద్ధికై వార లేగవచ్చు !

అమ్మ ! ఇదేమి చిత్రమొ ! ఇదంతయు నింతగ సత్యమై కనన్ –
ఇమ్ముగ పల్కుచుంద్రు, కడుపెల్లయు నిండగ, జీవితమ్ము ప
బ్బమ్ముగ గడ్పుకొంచు గలవారె ‘సమైక్యత’ యంచు ! నోటిలో
దుమ్మునుబడ్డ వారలిక దోషమె వేర్పడ కంఠమెత్తినన్ ?

___ *** ___

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. Atal
  అక్టో 05, 2013 @ 15:52:11

  just want to say that if Telangana is formed without constitutional ammendment, then 371D will be only applicable for Andhra/rayalaseema and not for Telangana state. Then legally all Andhras/Rayalaseema people will have clear right/way to get govt jobs in HYD. so division should be done with proper agreement with Seemandra.

  స్పందించండి

 2. Matam Mallikharjuna Swamy
  అక్టో 05, 2013 @ 16:37:48

  తెలంగాణా దోపిడీని కనులకు కట్టినట్లు చాలా బాగా రాశారు, అభినందనలు.

  తిన మరిగిన తిండిపోతు తిరగలి ద్రోసి

  కంచము జేరిన కూడున్ కాజేసినట్లు

  సములమంచు సమైఖ్యమంచు లక్ష ఘోషలెత్తి

  పెత్తనమే లక్ష్యమై లక్ష ఎత్తులు ఎత్తున్!

  చూస్తిరా చిత్రం! ఎప్పటికో రాసింది ఇప్పటికి వర్తించె

  వీరు మారకున్న మరి రేపటికి వర్తించు నదిసత్యం

  అట్టిపెట్టుడీ కవిత నట్టే వీరల వీరగాథగా!

  రేపటి తరాల వినిపించ పద్యకళా ప్రవీణ ఆచార్య ఫణీంద్రా

  స్పందించండి

 3. rameshbanala
  అక్టో 05, 2013 @ 20:33:48

  సీమాంధ్రులు ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి ఇరు రాష్ట్రాల అభివృధ్దికి సహకరించుకోవాలి

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  అక్టో 05, 2013 @ 22:29:11

  Mr. Atal
  It seems you have very little understanding about Zonal System.
  This system was introduced as a part of Six point formula by late Smt. Indira Gandhi, the then Prime minister of India, for recruitment in State Govt. jobs.
  Already 7th zone (the Twin Cities ofHyderabad & Secunderabad) has ceased to exist with abolishment of G.O.14F, which has been illegally issued by Seemandhra rulers to allow people of Seemandhra to get jobs in Twin Cities. Constitutional Amendment done after KCR’s hunger strike has included the Twin Cities into 6th zone. Due to this, already no Seemandhra person is eligible to get job in Twin Cities and only Telangana people belonging to 6th zone are eligible to get jobs in Twin Cities. Now with formation of Telangana, 5th & 6th zones also cease to exist, which makes entire Telangana as one unit. This helps in making entire Telangana people eligible to get jobs in Twin Cities and that is what Telangana people have been fighting for all these days.
  The 1st,2nd,3rd and 4th zones exist unchanged as the remaining part after bifurcation still exists as Andhra Pradesh.

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  అక్టో 05, 2013 @ 22:32:46

  మల్లికార్జున స్వామి గారు!
  ధన్యవాదాలు!

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  అక్టో 05, 2013 @ 22:35:37

  Ramesh Banala garu!
  Thank you very much!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: