మాతెలుగు తల్లికీ మల్లెపూదండ –

ఇది 2008లో నేను ప్రచురించిన నా పాత టపా.
రాష్ట్ర విభజన జరుగుతున్న ఈ సందర్భంలో దానిని మళ్ళీ ప్రచురించాలని అనిపించింది. చివరలో మొత్తం గీతాన్ని ప్రచురించాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

————————————————————————————————————————–

TeluguTalli

భాష వేరు .. రాజకీయాలు వేరు …

రాష్ట్ర గీతమైన ” మా తెలుగు తల్లికి మల్లె పూదండ ” లో ’ రుద్రమ్మ భుజ శక్తి ’ అన్న ఒక్క పదం తప్ప, మా ప్రాంత ప్రశస్తి ఏదీ లేదంటూ కొందరు తెలంగాణ ప్రాంతీయులు నిరసించిన సంగతి విదితమే ! అయితే శంకరంబాడి సుందరాచారి కవి ఆ గీతాన్ని రచించింది 1939లో. అప్పటి నేపథ్యమే వేరు. ఉమ్మడి మద్రాసు నగరం నుండి కోస్తా, రాయలసీమలతో కూడిన తెలుగు ప్రాంతం యొక్క వేర్పాటువాదంతో పుట్టిన నాటి ఆంధ్రోద్యమానికి ప్రాతిపదికగా రచించిన గీతం అది. ఆనాటికి ఆ తెలుగు ప్రాంతం పట్లే ఎవరికీ పూర్తి అవగాహన లేదు. అందులో మద్రాసు ఉంటుందో, లేదో తెలియదు. తెలుగు వాగ్గేయకారుడు త్యాగయ్య స్వస్థలం – తంజావూరు ఉంటుందో, లేదో తెలియదు. ఒకవేళ ఆ తెలుగు ప్రాంతం మద్రాసు రాష్ట్రం నుండి  వేరుపడ్డా, అది మరి కొన్నాళ్ళకు మరో తెలుగు ప్రాంతమైన తెలంగాణంతో కలిసి ’ఆంధ్ర ప్రదేశ్’ ఏర్పడుతుందా ? – అన్నది ఊహాజనితమైన విషయం. ఎందుకంటే, అప్పటికి తెలంగాణ బ్రిటిష్ ఇండియాలో కాక, నిజాం పాలనలో ప్రత్యేక దేశంగా ఉంది. నిజానికి సమగ్ర తెలుగు దేశం అంటే, నేటి మహారాష్ట్రలోని అజంతా – ఎల్లోరా ( ఉత్తర హిందుస్థానం నుండి దక్షిణం వైపుకు ప్రయాణిస్తుంటే, ఎక్కడ ’హలంత భాష’ మాట్లాడడం ఆగిపోయి, ’అజంత భాష’ అయిన  మన తెలుగు మాట్లాడడం మొదలవుతుందో, ఆ ప్రాంతాన్ని ’అజంతా’ అని పిలువడం ప్రారంభించారని కొందరు చరిత్రకారులు అంటారు.) నుండి దక్షిణాంధ్ర రాజులు పాలించిన నేటి తమిళనాడులోని తంజావూరు వరకు; తూర్పున నేటి ఒరిస్సాలోని గంజాం జిల్లా నుండి పడమరన కర్ణాటకలో బళ్ళారి వరకు వ్యాపించి ఉండాలి. తరువాత ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నెన్ని ప్రాంతాలను కోల్పోయి ఎలా ఏర్పడిందో అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితులలో, ఆనాటి ఒక కవి ( 1939లో ), ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులను ఊహించి, గీతాన్ని రచించాలి – అనుకోవడం అత్యాశే అవుతుంది. పైగా, ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు కవులకు తెలంగాణ ప్రాంత ప్రశస్తి, ఇతర చారిత్రిక వివరాలు తెలిసే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ. అంతెందుకు ? ఆ గీత కర్త, గుంటూరు జిల్లాలోని అమరావతిలో గుహలున్నాయో- లేవో- తెలియకుండానే ” అమరావతీ గుహల అపురూప శిల్పాలు ” అని వ్రాసాడని, తరువాత తన మిత్రులు అక్కడ గుహలు లేవని చెప్పితే, దాన్ని ” అమరావతీ నగరి అపురూప శిల్పాలు ” అని మార్చుకొన్నారని – మా గురువుగారు డా. నండూరి రామకృష్ణమాచార్యులు నాతో చెప్పారు. కాబట్టి ఆ కవిని తప్పు పట్టవలసిన పని లేదని, ఆ గీతాన్ని నిరసించవలసిన అవసరం లేదని అందరూ గ్రహించాలి.

ఆ గీతంలో – రెండవ చరణంలో తెలుగు వారు గర్వించ దగ్గ మహనీయుల ప్రశస్తిని అద్భుతంగా అందించారా కవి. ఆ చరణాన్ని ఒకసారి చూద్దాం –

” అమరావతీ నగరి అపురూప శిల్పాలు

త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములో తియ్యందనాలు

నిత్యమై, నిఖిలమై నిలచి యుండే దాక … (*)

రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి

తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి

మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక … (*)

నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం – “

అయితే, ఇందులో (*) గుర్తు పెట్టిన పాదాలు రెండూ దాదాపుగా ఒకే అర్థాన్ని ఇస్తూ పునరుక్తి అవుతోంది. అందులో మొదటి దాని బదులు (అదే ట్యూన్ లో) – ” పోతన్న కవన మందార మకరందాలు ” అని అంటే … ఏ గొడవ లేక పోను !

అసలు సుందరాచారి కవి ఈనాడూ జీవించి ఉంటే, ఈనాటి వాదోపవాదాలకు నొచ్చుకొన్నా – తెలంగాణ ప్రాంత ప్రశస్తిని వర్ణిస్తూ ఇంకో చరణం వ్రాసి ఉండే వారని నాకనిపించింది. ఆ తలంపు రాగానే, తెలంగాణ ప్రాంత మహనీయుల ప్రశస్తిని వర్ణిస్తూ, పై చరణం ట్యూన్ లోనే, అదే శైలిలో ఒక చరణం నా గుండెలోనుండి తన్నుక వచ్చింది.

” రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు

గోపన్న గొంతులో కొలువైన రాగాలు

పాల్కుర్కి కలములో జాను తెనుగందాలు

పోతన్న కవన మందార మకరందాలు

రుద్రమ్మ భుజ శక్తి, దమ్మక్క హరి భక్తి,

మాదన్న ధీయుక్తి, రుద్ర దేవుని కీర్తి

మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక …

నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం – “

రాష్ట్రాలుగా విడిపోయినా … కలసి ఉన్నా … రాజకీయాలు ఎటు మలుపు తిప్పినా …

నా మనసులోని మాట ఒకటే –

” జై తెలుగు తల్లి !

జై తెలుగు తల్లి !!

జై తెలుగు తల్లీ !!! “

 

– డా. ఆచార్య ఫణీంద్ర

___  ***  ___

————————————————————————————————————————-

మాతెలుగు తల్లికీ మల్లెపూదండ –
మాకన్నతల్లికీ మంగళారతులు –
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి!

||మాతెలుగు తల్లికీ||

గల గల గోదారి కడలి పోతుంటేను…
బిర బిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను…
బంగారు పంటలే పండుతాయి!
మురిపాల ముత్యాలు దొరలుతాయి!

||మాతెలుగు తల్లికీ||

అమరావతీ నగర అపురూప శిల్పాలు –
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు –

తిక్కయ్య కలములో తియ్యందనాలు –

నిత్యమై నిఖిలమై నిలిచియుండే దాక –

మొల్ల కవితా శక్తి, మల్లమ్మ పతిభక్తి,
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి –
మాచెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం! – నీ పాటలే పాడుతాం!

||మాతెలుగు తల్లికీ||

రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు –

గోపన్న గొంతులో కొలువైన రాగాలు –

పాల్కుర్కి కలములో జాను తెనుగందాలు –

పోతన్న కవన మందార మకరందాలు –

రుద్రమ్మ భుజ శక్తి, దమ్మక్క హరి భక్తి, 

మాదన్న ధీయుక్తి, రుద్ర దేవుని కీర్తి –

మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక …

నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం –

జై తెలుగుతల్లి !

జై తెలుగుతల్లి !! 

జై తెలుగుతల్లి !!!

— *** —

10 వ్యాఖ్యలు (+add yours?)

  1. sreerama
    ఆగ 11, 2013 @ 22:37:42

    repu bhavishyatlo vaere evaro telangana nunchi, ee pata lo chakali ailayya laedu, mangali malli gaadu laedu etc., ani abhyantaraalu levadeestaaru. deeniki antham laedu. evari voorlo, zilla lo, pranthamlo etc., vaallaki ishtamaina vaadu, prasiddhi pondina vaadu vundochchu. vaalla perlu aa desa geethamlo lekapothe daanni vivaksha ani anukune kusamskaaram manushulaki vunnantha varaku deeni antham laedu.
    sreerama

    స్పందించు

  2. తాడిగడప శ్యామలరావు
    ఆగ 11, 2013 @ 23:24:03

    ఫణీండ్రగారూ
    చాలా చక్కగా విశదీకరించారు.
    ధన్యవాదాలు.

    స్పందించు

  3. narasimharaomallina
    ఆగ 12, 2013 @ 03:27:05

    ఇక్కడ ఓసారి చూడండి.
    http://kasstuuritilakam.blogspot.in/2012/12/2.html

    స్పందించు

  4. Dr.Acharya Phaneendra
    ఆగ 12, 2013 @ 07:12:18

    శ్రీరామ గారు!
    “evari voorlo, zilla lo, pranthamlo etc., vaallaki ishtamaina vaadu, prasiddhi pondina vaadu vundochchu. vaalla perlu aa desa geethamlo lekapothe daanni vivaksha ani anukune kusamskaaram manushulaki vunnantha varaku deeni antham laedu.” అన్నారు. మిగితా ఏ విషయాలలోనైనా ఏ మాత్రం వివక్ష అన్నది లేనప్పుడు మీరన్నది నిజమే. కాని ప్రతి విషయంలో కూడ వివక్ష కళ్ళ ముందే తాండవిస్తుంటే- ఉద్యమకారులు ఆ కవిని తప్పు పట్టక పోయినా ( అదే నేను పైన వివరించింది), ప్రభుత్వం వారు మా ప్రాంత ప్రాతినిధ్యం లేని గీతాన్ని ఎందుకు రాష్ట్ర గీతం చేసారని ప్రశ్నించరా?
    మీరన్నది నిజమే! రేపు మరికొంత మంది మా ప్రాంత ప్రాతినిధ్యం లేదని ఆక్షేపించవచ్చు. అవును – రేపు మళ్ళీ విభజన భావం మొలకెత్తినప్పుడు అలాంటి ఆక్షేపణలు తప్పకుండా వస్తాయి. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా చూడవలసిన బాధ్యత పాలకులది.
    అయినా, ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రాలలో జనాభా పది,పది కోట్లు దాటి ఫలాలు అందరికీ అందకపోతే ఆ రాష్ట్రాలను మళ్ళీ విభజించరా? సరిహద్దు భద్రతలకు విఘాతం కలిగించనంత వరకు, దేశంలోని అంతర భాగంలో రాష్ట్రాలు ఏర్పర్చడానికి అభ్యంతరం ఎందుకుండాలి? అప్పుడు అవి కూడ భారత దేశంలోనే కదా ఉండేది.
    “దీనికి అంతేది?” అని వాపోతున్నారు. అసలు అంతెందుకు ఉండాలి? ఎప్పటికప్పుడు సామాజిక న్యాయం జరగాలి కదా? బలమైన కారణాలు లేకుండా ఏ ప్రాంత ప్రజలైనా ముక్త కంఠంతో విభజనను కోరుకోరు. చేతనైతే ప్రభుత్వాలు ఆ కారణాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. లేదా విభజనను ఒక మార్పుగా గ్రహించి అంగీకరించాలి. గతి తార్కికంగా మార్పు సహజం!
    ఎక్కడో ఒక చోట – “ఇంకా విభజన అసాధ్యం!” అనుకొన్నప్పుడు… లేదా ఇంకా విభజిస్తే ఆ ప్రాంతం ఒక స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా మనలేదు అనుకొన్నప్పుడు… ప్రజలే అర్థం చేసుకొంటారు. (అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో ముప్పయి కోట్ల జనాభాకు యాభయి రాష్ట్రాలు చేసాక, “ఇక భావిలో విభజన వద్దు” అని ప్రజలే నిర్ణయించుకొన్నారు.) అంతవరకు ఆ యా ప్రజల ప్రజాస్వామిక హక్కును గౌరవిస్తూ, “విభజన వికాసానికే!” అని గుర్తించి ముందుకు సాగవలసిందే!
    ఐక్యత అన్నది హృదయానికి సంబంధించినది. మట్టికి కాదు.
    మనం విభజిస్తున్నది మట్టిని – మనుషులను కాదు.
    సీమాంధ్ర రాజకీయ నాయకులు ఇప్పుడు చేస్తున్నది అందుకు విరుద్ధం.
    “దేశమంటే మట్టి కాదోయ్- దేశమంటే మనుషులోయ్!” అన్న గురజాడ పుట్టిన గడ్డ మీద పుట్టిన మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.

    స్పందించు

    • Jai Gottimukkala
      ఆగ 13, 2013 @ 14:41:13

      ఫణీంద్ర గారూ, భూస్వాముల దౌర్జన్యాల మీద చేసిన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన చాకలి ఐలమ్మ లాంటి మహాయోధురాలిపై చిల్లర వ్యాఖలను పట్టించుకోకుండా, అడిగిన ప్రశ్నకు మూతోడ్ సమాధానం చెప్పిన మీ సంవయనం మెచ్చుకోవాల్సిందే.

      స్పందించు

  5. Dr.Acharya Phaneendra
    ఆగ 12, 2013 @ 07:15:01

    శ్యామలరావు గారు!
    ధన్యవాదాలు!

    స్పందించు

  6. Dr.Acharya Phaneendra
    ఆగ 12, 2013 @ 07:17:08

    ’మల్లిన’ వారికి నమః
    మీరు వ్రాసిన చరణాలు కూడ బాగున్నాయి.
    అభినందనలు!

    స్పందించు

  7. anu
    ఆగ 12, 2013 @ 19:11:35

    i like it

    స్పందించు

  8. Dr.Acharya Phaneendra
    ఆగ 15, 2013 @ 23:20:56

    ‘జై గొట్టిముక్కల‘ గారు!
    సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం పుట్టడానికి – ఆరు దశాబ్దాలుగా నీళ్ళు, నిధులు నియామకాల్లో సీమాంధ్ర నాయకులు మనకు చేసిన అన్యాయాలతో బాటు, మనం సోదరులుగా భావించే ‘శ్రీరామ‘ వంటి సీమాంధ్ర ప్రజలు చేసే ఇలాంటి అవహేళనలు కూడ ప్రధాన కారణం. అది వారి ఆధిపత్య, ఆభిజాత్య అహంకార పూరిత భావజాల ప్రభావం. అది వారిని విషయ చర్చలో బలహీనపడుతున్నప్పుడు మరింత సంయమనాన్ని కోల్పేయాలా చేస్తుంది. మనం వాటికి స్పందిస్తే విషయం ప్రక్కదోవ పడుతుంది. సంయమనం కోల్పోకుండా సమాధానం చెప్పగలిగితే – అది మన ధర్మ విజయానికి సంకేతం. విడిపోతున్నప్పుడు కూడ వారు విషం చిమ్మితే – అది వారి ఓటమికి నిదర్శనం.
    మీకు నా ధన్యవాదాలు!

    స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: