ఛందస్సా? రసమా?

errana

ఇటీవల “శంకరాభరణం” బ్లాగులో ఒక సమస్యా పూరణ (“కుండెఁడు పాలుబోసి యిడెఁ గోమలి కప్పెఁడు కాఫి భర్తకున్”) కు సంబంధించి, ’అఖండ యతి’ విషయంలో నేను “ఛందస్సా? రసమా? – ఏది ప్రధానం?” అన్న చర్చ లేవదీయడం జరిగింది. పలువురు విద్వత్కవులు, పండితులు పాల్గొన్న ఈ చర్చ యువ కవులకు, పద్య కవితాభిమానులకు ఆసక్తికరంగా, ఉపయుక్తంగా ఉంటుందన్న ఉద్దేశ్యంగా ఒక ప్రత్యేక పాఠంగా నా ఈ బ్లాగులో ప్రచురిస్తున్నాను.
చివరలో ఏల్చూరి మురళీమోహన్ రావు గారు, డా. కోడూరి విష్ణు వర్ధన్ గారి వంటి విద్వత్కవులు ఒక వైపు “నిజానికి డా ఆచార్య ఫణీంద్ర గారితో కొంత వరకు ఏకీభవించవలసి ఉన్నది” అంటూనే, మరొక వైపు –
“ఆధునిక కాలంలో శాస్త్రబద్ధమైన నిర్దోష పద్యమే ప్రచురించాలనుకుంటే క్వాచిత్కం గా ఒకటో అరో తప్ప ఏవీ నిలువజాలవు … ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే ఈ కాలానికి ‘ ఔదాసీన్యమే ‘ శరణ్యం” అని, “ఆధునిక కాలంలో ఆలోచనలు మాఱాయి. ఈనాడు అన్నింటికీ ఉపేక్షా నికషోపలమే శరణ్యం. శరణ్యాంతరం లేదు కనుక” అంటూ ఒక రకమైన నిర్వేదాన్ని ప్రకటిస్తూ, ఛందస్సు వైపే తమ మొగ్గును చూపినట్టుగా కనిపిస్తుంది. కాని, “ఛందస్సా? రసమా?” అన్న చర్చలో ’రస’ ప్రాధాన్యాన్ని పూర్తిగా అంగీకరించినట్టుగా కనిపించదు. సరే! ఎవరి అభిప్రాయాలు వారివి.
అయితే … “అఖండ యతిని వేయాలా? వద్దా? … అన్నది ఒక భావాన్ని పద్యంలో చెబుతున్నప్పుడు ఆ పరిస్థితిని బట్టి రస దృష్టి విచక్షణతో ఆ కవి మాత్రమే తీసుకోవలసిన నిర్ణయమే!” అన్నది నా నిశ్చితాభిప్రాయం. 

ఇందులో … ఆధునిక దృక్పథంతోబాటు, “కేవలం ఛందస్సో, వ్యాకరణమో కావ్య లక్షణం కానేరదు – రసమే కావ్య లక్షణం!” అన్న లాక్షణిక దృక్పథం కూడ ఉంది” … అన్నది గమనార్హం.

– డా. ఆచార్య ఫణీంద్ర

ఆధునిక పద్య కవిత – అఖండ యతి : ఒక చర్చ

Pandita Nemani చెప్పారు…

“పండువునాడు చేరి కనుపండువుగా నొకచోట బాలికల్
వండుచు నున్నయట్లు పలు వంటకముల్ పొనరించునట్టులన్
మెండు ముదాన నొండొరుల మెచ్చుచు చక్కని బొమ్మ లాటలన్
కుండెడు పాలుబోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్”

కంది శంకరయ్య చెప్పారు…

ఆశావాది ప్రకాశరావు గారి పూరణ…..
“వండిన దెల్ల చేఁదనుచు వాసి చెడన్ మది కోపమందుచున్
మండెడు కన్నుదోయిఁ గన; మానిని మాటున జేరి నవ్వుచున్
పిండిన ప్రేమ కన్నుఁగవ వ్రేలఁగ; వ్రేల్మిడి లోపమొండు లే
కుండెడు పాలుపోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.”

Pandita Nemani చెప్పారు…

అయ్యా శ్రీ శంకరయ్య గారూ శుభాశీస్సులు.
సమస్యను ఉండెడు అని మొదలిడు భావముతో పూరించ వచ్చును అనుకొన్నాను కానీ, యతి స్థానములో “అఖండ యతి” అనే శంకతో ఆ విధముగా పూరించుటను మానుకొంటిని. స్వస్తి.

కంది శంకరయ్య చెప్పారు…

పండిత నేమాని వారికి నమస్సులు.
అఖండ యతిని మన బ్లాగు మిత్రులే యథేచ్ఛగా ప్రయోగిస్తున్నారు. మీరు గమనించే ఉంటారు. నేను వ్రాసే పద్యాలలో అఖండయతిని ఎప్పుడూ ప్రయోగించను. కాని ఎవరైనా ప్రయోగిస్తే దానిని దోషంగా పరిగణించను.

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు…

శంకరయ్య గారు!
రసాత్మకంగా మలిచేప్పుడు అఖండ యతిని ప్రయోగించడంలో తప్పు లేదేమో!
రస మాధుర్యాన్ని త్యాగం చేసి, మరీ మడి గట్టుకోవలసిన అవసరముందా? … అనిపిస్తుంది నాకు.
“మానసమం దెదో తళుకు మన్నది పుష్ప విలాప కావ్యమై” – (కరుణశ్రీ పద్య పాదం) హృదయానికి హత్తుకొని నరుల నాల్కల పైన శాశ్వతంగా నాట్యమాడడం లేదా?
ఏ లక్షణకారుడైనా రీతినో, రసాన్నో, ధ్వనినో .. కావ్య లక్షణాలుగా పేర్కొన్నారు గాని, కేవల వ్యాకరణాన్నో, ఛందస్సునో కావ్య లక్షణంగా చెప్పలేదన్నది వాస్తవం.

శ్యామలీయం చెప్పారు…

అఖండయతిని గురించిన చర్చ చూసాను.
లాక్షణికులు దీన్ని తప్పుపట్టినా ఆదునికులు యధేఛ్చగా ప్రయోగిస్తున్నారు. తిక్కనాదికవులూ అఖండయతిని అక్కడక్కడ వాడారని విన్నాను. వాసుదాసుడు శ్రీవావ్లిలికొలను సుబ్బారావు గారు ఆంద్రవాల్మీకి బిరుదాంకితులు, వారు అఖందయతిని ఆదరించారు.
రసాత్మకంగా మలిచేప్పుడు అఖండ యతిని అంతగా పట్టించుకోవలసిన పని లేదేమో అన్నమాట బాగుంది. కాని సాధ్యమైనంతవరకు పరిహరించటమే బాగుంటుంది. అలా పరిహరించినంతమాత్రాన పూర్వకవులకు ఇబ్బంది రాలేదు, రసప్రకర్షకు అడ్డుకాలేదు.
అఖండయతిని ఒక exception క్రింద మాత్రం తీసుకొని యేదైనా పెద్దకృతుల్లో ఒకటి రెండు తప్పనిసరి పరిస్థితుల్లో వాడవచ్చును. కాని పద్యవిద్యను సాధనం చేసే వారు పెద్దకవులు ప్రయోగించారుకదా అని యధేఛ్ఛగా వాడటం ప్రయత్నపూర్వకంగానే మానుకోవటం ఉచితం.

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు…

అఖండ యతిని వేయాలా? వద్దా? … అన్నది ఒక భావాన్ని పద్యంలో చెబుతున్నప్పుడు ఆ పరిస్థితిని బట్టి రస దృష్టి విచక్షణతో ఆ కవి మాత్రమే తీసుకోవలసిన నిర్ణయమే గాని; పెద్ద కవి, చిన్న కవి అని వ్యక్తిగతంగా కాదు. ఆ పరిస్థితి ఒకానొక భావ ప్రకటనలో పెద్ద కవికీ రావచ్చు. చిన్న కవికీ రావచ్చు. అలాంటి పరిస్థితులలోనే పూర్వకాలంలో కూడ పెద్ద కవులు సైతం అఖండ యతిని ప్రయోగించింది. నేటి చిన్న కవులైనా అఖండ యతిని పరిహరించే నెపంతో పద్యాన్ని రస హీనం చేయకూడదు. మొత్తానికి రస దృష్టి ప్రధానమన్నది నా ఉద్దేశ్యం. రసంపై ప్రధానంగా దృష్టి గలవాడు కవిగా ఎదుగుతాడు. వ్యాకరణంపై, ఛందస్సుపై ప్రధానంగా దృష్టి గలవాడు పండితునిగా మారుతాడు. సమాజానికి కవుల ఆవశ్యకతే ఎక్కువ.
ఎందుకంటే పండితులను బోధించి తయారు చేయవచ్చు. కవి స్వీయ ప్రతిభతో, స్వీయాభ్యాసంతో ఎదగవలసి ఉంటుంది.
పాండిత్యం శాస్త్రాధ్యయనంతో అబ్బుతుంది. కవిత్వం పరిశోధనతో, ప్రయోగాలతో ముందుకు సాగుతుంది.
సరళంగా చెప్పాలంటే – పాండిత్యం(వ్యాకరణం,ఛందస్సు,అలంకార శాస్త్రం మొదలైనవి) మరియు కవిత్వం అన్నవి సైన్స్ మరియు ఇంజినీరింగ్ లేక చట్టం మరియు న్యాయవాద వృత్తి లాంటి యుగళాలు. వీటిలో మొదటివి గైడ్ లైన్స్ అందిస్తే రెండవవి వాటి ఆధారంగా ప్రజోపయోగమైన పనులు చేస్తాయి. వీటిలో రెండవ పని చేసేవారు కార్య సాధనలో కొంత వారి ’ఇంటర్ ప్రిటేషన్’ చేసే స్వేచ్ఛను కలిగి ఉంటారు.
కవులూ అంతే. దీనిని ప్రాచీన కాలంలోనే కొందరు పండితులు అంగీకరించారు. అందుకే వారు “కవయః నిరంకుశాః” అని ఆమోద ముద్ర వేసారు. అది అంగీకరించని పండితులూ ఉన్నారు. వారు “పాండిత్య హీనాః కవయో భవంతి” అని దూషించారు.
కాని ఇప్పుడు కొందరు కవిత్వం ఛందస్సు బంధనాలను ఛట్ పట్ మని త్రెంపామంటూ, వచన కవిత్వం, మినీ కవిత్వమే నేటి కవిత్వమంటూ, పద్య కవిత్వం ఒక ఛాందస కవిత్వమని నిరసిస్తున్న తరుణంలో… పద్య కవిత్వమంటేనే నేటి యువకులు దరిజేరడానికి భయపడుతున్న రోజులలో … రసదృష్టితో ప్రాచీన కవులు తీసుకొన్న స్వేచ్ఛను కూడ నేటి కవులు తీసుకోకూడదు అనడం భావ్యమా? లేదా రసదృష్టితో అక్కడక్కడా అలాంటి స్వేచ్ఛను తీసుకొంటూ ఇంపైన సొంపైన పద్యాలను రచిస్తూ ఎక్కువ మంది పాఠకులను పద్యం వైపు ఆకర్షించడం ముఖ్యమా? అంతే కాకుండా ఎప్పుడూ అవే పురాణ గాథలు, పురాణ విషయాలపై కాకుండా, వచన కవిత్వంలోలా నవీన వస్తువులను తీసుకొని, పద్యంలో అంతకన్న అందంగా చెప్పవచ్చు – అని నిరూపిస్తూ నవీన పద్ధతిలో అందమైన పద్యాలను చెప్పవలసిన అవసరం లేదా? ఇదీ అసలు చర్చించవలసిన విషయం. ఇదే మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యులు గారు నాకు అందించిన ఉపదేశం. ఈ బాటలో నడిస్తే పద్య కవిత్వం కొత్త పుంతలు తొక్కుతుంది. ఎక్కువ మంది మంచి పద్య కవులు రూపొందుతారు. ఇదే మా ఆంధ్ర పద్య కవితా సదస్సు ఆశయం. కాబట్టి …
రస దృష్టి వర్ధిల్లు గాక!
నవ్య పద్యం వర్ధిల్లు గాక!!

కమనీయం చెప్పారు…

శ్యామలీయంగారికి,ఫణీంద్రగారికి,Sir Roger de coverly చెప్పినట్లు much might be said on both sides. పద్యరచనకి వ్యాకరణం,చందస్సు ముఖ్యమే.అలాగే రసపోషణ కూడా ముఖ్యం.కవుల్లో అత్యధికసంఖ్యాకులు పద్యరచనకు దూరమౌతున్న యీ రోజుల్లో,మరీ కఠినంగా ఉండనవసరం లేదనుకొంటాను. అలా అని విశృంఖలత్వం మంచిదికాదు.( M.A. TELUGU)డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా నామాత్రం కూడా పద్యాలు వ్రాయలేకపోతున్నారు కదా!

శ్యామలీయం చెప్పారు…

ఫణీంద్రగారూ, మీ ఆంధ్ర పద్య కవితా సదస్సు గురించి యిదే వినటం. ఆశయం‌ బాగుంది. ప్రాచీనులైన మహాకవులు పద్యాన్ని అందంగా చెప్పారు, నవీనులూ చెప్పగలరు ప్రయత్నిస్తే. . యతిప్రాసలను వదలి పద్యకవిత్వం చెప్పిన వాళ్ళూ ఉన్నారు. ఇతర భాషల్లోనూ తెలుగులోనూ‌ కూడా. అయితే స్వేఛ్ఛ తీసుకునే ముందు సంప్రదాయంపై పట్టు సాధించటం అవసరం అని నా భావన. అది కొందరి దృష్టిలో తప్పో అనవసరమో కావచ్చును. దానికేమి. అవసరమైన సేఛ్ఛ తీసుకోవటం గురించి మరింత వ్యాఖ్యానించేంత అధికారం నాకుందని అనుకోవటం లేదు.
మీరన్నట్లు పద్యకవితకు ఈ రోజుల్లో‌ఆదరం తక్కువే. నేను నాతోచినట్లు నా బ్లాగులో పద్యకవిత వ్రాస్తున్నాను కాని పెద్దగా చదువరులు లేరనే చెప్పవచ్చును.

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు…

మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
నమస్కృతులతో,
“కుండెఁడు పాలుబోసి యిడెఁ గోమలి కప్పెఁడు కాఫి భర్తకున్” అన్న సమస్య చిత్రంగా ఉన్నది. మానార్థకమైన “ఎఁడు” ప్రత్యయం తద్ధితార్థంలో “కప్పెఁడు” అని సాహిత్యంలో గాని, లోకవ్యవహారంలో కాని ఎక్కడా కనుపింపలేదు. కేవలం వైచిత్రీమాత్రప్రయోగం అనుకోవాలి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు

మిస్సన్న చెప్పారు…

డా. ఏల్చూరి వారి వ్యాఖ్య చూశాక నా కనిపిస్తోంది. సాధారణంగా కప్పెడు అనడం కన్నా కప్పుడు అని వ్యావహారికంలో వింటూంటాం.

డా. విష్ణు నందన్ చెప్పారు…

శ్రీ శంకరయ్య గారికి ,

ఈనాటి సమస్యే ఒక విచిత్రం . లాక్షణికుల గురించి చర్చ జరుప వలసినంత పెద్ద శాస్త్రీయమైన కావ్య లక్షణాలు కలిగిన పద్యపాదమేమీ కాదు . నిజానికి డా ఆచార్య ఫణీంద్ర గారితో కొంత వరకు ఏకీభవించవలసి ఉన్నది , పద్యపూరణాలు అన్నవే ఆటవిడుపు కొరకు . పొడుపుకథల వంటివి . ఇక ఆధునిక కాలంలో వరుస పెట్టి నెరసులెంచ వలసి వస్తే , శంకరాభరణమే కాదు , అస్మదాదుల పద్యాలేవీ – శాస్త్ర చర్చకు నిలువ జాలనివే . నిజాన్ని నిష్కర్ష గా చెబుతున్నందుకు మన్నించండి కానీ , శాస్త్రబద్ధమైన నిర్దోష పద్యమే ఈ వేదిక మీద ప్రచురించాలనుకుంటే క్వాచిత్కం గా ఒకటో అరో తప్ప ఏవీ నిలువజాలవు . 

CUP ని కప్పు అని ఆంధ్రీకరిస్తూ అంటూ పాత్రా సూచకమైన ఇతర భాషా పదాన్ని తీసుకున్న సమస్యలో , దానికి ఏల్చూరి మురళీధరరావు గారు చెప్పినట్టు అపదాదిస్వర సంధి చేసి విచిత్రమైన ” కప్పెడు ” పదాన్ని సాధించిన పద్యపాదంలో సాధుత్వాసాధుత్వాలను , లక్షణావలక్షణాలను , అఖండ యతి గత్యాది అగత్యాలను విమర్శించడం – పాశ్చాత్య సంగీతం లో ఫలానా రిషభమెందుకు వచ్చింది అని ప్రశ్నించడం లాంటిదే అని నా భావన .

ఇకపోతే విద్వత్కవులు ఏల్చూరి వారు చెప్పినట్టు ఇదొక వైచిత్రీమాత్ర ప్రయోగమే కాని , శ్రీశ్రీ మార్కు
ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము మువ్వా !
లాంటి విలాస పద్యాలుండనే ఉన్నాయి కదా !

ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే ఈ కాలానికి ‘ ఔదాసీన్యమే ‘ శరణ్యం .

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు…

మాన్య విద్వత్సుకవివరేణ్యులు డా. విష్ణు నందన్ గారికి
నమస్కృతులతో,
తెలుగులో పద్యరచయితలు పాదం చివఱ పదాన్ని విఱిచి రెండవ పాదంలోకి తీసికొనివెళ్ళే సౌకర్యం ఉన్నది. నన్నయ గారు “… భూరిభుజాకృపాణధా, రా జల శాంతశాత్రవపరాగుడు” అన్నట్లు. సంస్కృతంలో ఆ సౌకర్యం లేదు. పాదం చివఱ పదాన్ని విఱిచి తీరాలి. ఆ విధంగా లేని ప్రయోగాలు సంస్కృతంలో ఎంతో అరుదుగా కాని కనబడవు. అలాగని సంస్కృత లాక్షణికులు (ఎక్కడో ఒకే ఒకచోట తప్ప) తమ లక్షణగ్రంథాలలో ఆ విషయాన్ని నొక్కి చెప్పలేదు. ప్రయోగాలను పరిశీలించి మనము గ్రహింపవలసిందే.
అయితే, తెలుగు లాక్షణికులు “అఖండయతి”ని అలా పాఠకుల ఊహకు విడిచిపెట్టలేదు. పదే పదే లక్షణనిర్వచన చేశారు. అందుకు కారణం శ్రీ తంజనగరం తేవప్పెరుమాళయ్య, శ్రీ రావూరి దొరసామిశర్మ మొదలైన పెద్దలు చెప్పే ఉన్నారు కనుక మనము పునరుక్తం చేయనక్కర లేదు. ఆ నాటి వ్రాతప్రతులలో దోషాలను పరిహరించటానికి అదొక సాధనం. అందువల్ల వారు మహాకవులు విరళంగా ప్రయోగించిన ప్రయోగాలను తాము చూసి ఉన్నా, లాక్షణికులు వాటిని ఉపేక్షించారు. పద్యవిద్యకు మెఱుగులు దిద్దారు.
ఆధునిక కాలంలో ఆ ఆలోచనలు మాఱాయి. మీరన్నట్లు ఈనాడు అన్నింటికీ ఉపేక్షా నికషోపలమే శరణ్యం. శరణ్యాంతరం లేదు కనుక.
శ్రీ మిస్సన్న గారన్నట్లు “కప్పుడు” అనటం కూడా ఉన్నది. చూ. http://kinnerasani.blogspot.in/2006_08_01_archive.html

శ్రీశ్రీ గారి ప్రయోగాన్ని గుర్తుచేసినందుకు మీకు ధన్యవాదాలు.
“చమత్కార శ్చిత్తవిస్తారరూపో విస్మయాపరపర్యాయః” – సాహిత్యదర్పణం.
ఈ చర్చకు మీ వ్యాఖ్య భరతవాక్యమై భవ్యంగానూ, భావ్యంగానూ ఉన్నది.
విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు

కంది శంకరయ్య చెప్పారు…

ఈనాటి సమస్య ఆసక్తికరమైన చర్చకు దారితీయడం, డా. ఆచార్య ఫణీంద్ర గారు, కమనీయం గారు, ఏల్చూరి మురళీధర రావు గారు, డా. విష్ణునందన్ గారు స్నేహపూర్వకంగా పాల్గొని శాస్త్రీయంగా, సహేతుకంగా వివరణలిచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి చర్చలు ఆహ్వానింపదగినవి.

(01/05/2013 నాడు శంకరాభరణం బ్లాగులో జరిగిన చర్చ)

potana

ప్రకటనలు

7 వ్యాఖ్యలు (+add yours?)

 1. గోపాలకృష్ణ
  మే 08, 2013 @ 18:51:05

  ఈ చర్చను నేను ఆలస్యంగా చూస్తున్నాను.పండితుల చర్చలో పాల్గొనే అర్హత ఉన్న వాడిని కాను.ఏ కవిత్వానికైనా, ఇతర రచనలకైనా పాఠకాదరణే ముఖ్యం. .ఎందుకంటే వ్రాసేది వారి కోసమే కాబట్టి.అందుచేత పాఠకుడి గా నా అభిప్రాయం చెబుతున్నాను.ఆచార్య ఫణీంద్ర గారి అభిప్రాయమే సరైనది.కవిత్వానికి రసపోషణమే పరమావధి.దాని తర్వాతే మిగిలిన వేవైనా.అందుచేత చక్కటి పద ప్రయోగానికి యతి ఆటంకమైతే దానిని వదిలి పెడితే కొంపలు ములగవు.చర్చ అంటూ వచ్చింది కనుక నా అభిప్రాయం చెబుతాను. తెలుగులో మన యతి నియమం పెద్దగా సాధిస్తున్న దేమీ లేదు. నిజానికి అక్కడ విరామం ఉంటే అంటే పదం విరిగితేనే ఆ యతి శోభిస్తుంది. పదం మధ్యలోని అక్షరంతో యతిని సరిపెట్టుకుని మనం సాధిస్తున్నది సున్నా.పండితులకీ వాదం రుచించక పోవచ్చును. కవులు పండితులైతే మంచిదే. కాని వారి పాండిత్యం కవిత్వానికి అడ్డు తగల కూడదు. ఏమందము మందయాన మొగమందము మీరు నవారవిందమున్ అన్నది పండితులకి అభ్యంతరకరమైనా, అది మరోలా ఎలా చెప్పినా ఈ అందం రమ్మన్నా రాదు కదా?

  స్పందించండి

 2. తాడిగడప శ్యామలరావు
  మే 09, 2013 @ 11:01:05

  కవిత్వానికి రసం జీవం, ఛందస్సు శరీరం. పూర్వకవీంద్రులెవ్వరికీ ఛందోనియమాలు రసపోషనకు అడ్డంకి కాలేదు. ఈ రోజున మనకు అడుగడుగునా అడ్డం వచ్చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఛందస్సూ కాదు రసపోషణలో మనం పూర్వమహాకవులను మించిపోయినా మనీ‌ కాదు. కారణం కేవలం అభ్యాసలోపమే. ఏ విద్యా అబ్యాసం తగినంతగా లేక రాణించదు. ఆడలేక మద్దెల ఓడు అన్న చందాన మనకు ఛందస్సుపైన పట్టు తక్కువగా ఉన్న సంగతిని ఒప్పుకోవటానికి నిరాకరించి రసపోషణకోసం అని చెప్పుకోవటం కేవల కుంటిసాకు.

  అలాగని ఛందోనియమాలు అనుల్లంఘ్యనీయాలని అనటం లేదు. తగినంత పట్టు సంపాదించిన తరువాత ప్రయోగాలు చేస్తే అవి రాణిస్తాయి. ఉదాహరనకు చదరంగం ఆటగాడు మంచి కఠోరపరిశ్రమతో అంతర్జాతీయస్థాయికి యెదిగిన తరువాతే కొత్తకొత్త యెత్తులను MCO లోనికి తీసుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. నాకు చదరంగక్రీడ ఇష్టం కాబట్టి నేను కొత్తకొత్త అందమైన యెత్తులు కనిపెట్టెస్తాను అవి అంతా అమోదించెయ్యాలీ అంటే కుదరదు కదా? అలాగే కవిత్వసాధన చేసేవారూ ముందు మంచి పరిశ్రమ చేయాలి. కాదూ అంతా మా యిష్టం రసపోషణ అనేది మేము చెప్పినట్లుగా వినేదే అంటారా – మంచిది తప్పకుండా మీయిష్టం.

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  మే 09, 2013 @ 23:59:44

  గోపాలకృష్ణ గారు!

  “కవిత్వానికి రసపోషణమే పరమావధి” అన్న మీ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాను. పలుమార్లు ఇదే అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ వస్తున్నాను. కాని కొందరు దానిని అంగీకరించుట లేదు.

  అయితే ఛందో నియమాల్లో పూర్వ కవులలాగే మనమూ కొన్ని సడలింపులను అక్కడక్కడా .. అదీ … రస పోషణను ఇనుమడింప జేయడానికి అంగీకరించవచ్చు గానీ, మీరన్నట్టు – పూర్తిగా నియమాలనే పరిత్యజించడం సబబు కాదు. మీరన్నట్టు తెలుగు ఛందస్సు లోని యతిని పూర్తిగా వదలివేయడానికి లాక్షణికులే కాదు … నేనూ అంగీకరించను.

  చర్చలో పాల్గొన్నందుకు మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  మే 10, 2013 @ 01:41:11

  శ్యామలరావు గారు!

  ” పూర్వకవీంద్రులెవ్వరికీ ఛందోనియమాలు రసపోషనకు అడ్డంకి కాలేదు. … … … ఆడలేక మద్దెల ఓడు అన్న చందాన మనకు ఛందస్సుపైన పట్టు తక్కువగా ఉన్న సంగతిని ఒప్పుకోవటానికి నిరాకరించి రసపోషణకోసం అని చెప్పుకోవటం కేవల కుంటిసాకు.” అని నిష్ఠుర వ్యాఖ్యలు చేసారు.

  రస పోషణకు అడ్డంకి కాకనే –

  ఆది కవి నన్నయ
  “కాదన కిట్టిపాటి యపకారము తక్షకు డేక విప్ర సం
  బోధన జేసి చేసె …” (ప్రాస నియమంలో సడలింపు);
  “వీరలు దైవ శక్తి ప్రభవించిన వారగుటేమి …” (అఖండ యతి)

  శ్రీనాధుడు
  “కాశి యణిమాది సిద్ధుల కాటపట్టు” (అఖండ యతి)

  బమ్మెర పోతన
  ” … కన్నుల
  కఖిలార్థ లాభంబు కలుగుచుండు” (అఖండ యతి)

  వంటి ఛందో నియమోల్లంఘనలను చేసారా? ( ఇంకా ఇలాంటివి ప్రాచీన కవుల ప్రయోగాలలో కోకొల్లలుగా చూపగలను) లేక ఆ మహాకవులు కూడ ’ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందాన వ్రాసుకుపోయారా?

  అంతే కాకుండా, ఈ వాదాన్ని చెప్పుతున్న మేము ఇంత విస్తృతంగా పద్యకవితా వ్యవసాయం చేస్తూ … మా పద్యాలలో ఎన్నిమార్లు ’ఆడలేక మద్దెల ఓడు’ అన్నామో మీ విచక్షణతో మీరే చెప్పాలి మరి!

  స్పందించండి

 5. తాడిగడప శ్యామలరావు
  మే 10, 2013 @ 09:21:53

  ఫణీంద్రగారూ, సరేనండీ పూర్వకవులు అడపాదడపా అఖండయతీత్యాదులను ప్రయోగించి ఉండవచ్చును. కాదనటం లేదు. అంతమాత్రంచేత అభ్యాసులు అటువంటి వాటినే పట్టుకోనవుసరంలేదు. మీ వివరణకు కృతజ్ఞుడను.

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  మే 10, 2013 @ 19:28:26

  శ్యామలరావు గారు!
  … అంతే కానీ, పద్య కవితాభ్యాసం చేసే యువ కవులకు ప్రధానంగా రస పోషణ మీద దృష్టి నిలిపి చక్కని పద్యాలు వ్రాయుమని చెప్పకూడదంటారా? కేవలం ఛందో నియమాల పైనే ప్రధానంగా దృష్టి నిలపాలంటారా? మీ అభిప్రాయాన్ని వ్యాకర్తలు కూడ అంగీకరించరని తెలుసుకోండి. వాళ్ళే “ప్రయోగ శరణం వ్యాకరణం” అని ప్రవచించారు. మేమోదో ఛందస్సుకు ద్రోహం చేస్తున్న వాళ్ళలాగా మీరు భావిస్తున్నట్టుంది. మేము చెప్పేది – “రసమా? ఛందస్సా?” అన్న మీమాంస వచ్చినప్పుడు … ఛందస్సు కన్న రసం వైపు మొగ్గు చూపుమని మాత్రమే. ఎందుకంటే ఏ లక్షణకారుడూ ఛందస్సును కావ్య లక్షణంగా పేర్కొన లేదు. ఈ విషయం ఎంత చెప్పినా మీకు అర్థం కావడం లేదు. సరే! కానీయండి … మీ అభిప్రాయం మీది.

  స్పందించండి

 7. తాడిగడప శ్యామలరావు
  మే 11, 2013 @ 00:08:40

  అల్పజ్ఞుడను. మన్నించవలసినది. నేనెప్పుడూ రసం అప్రధానం అని వాదించలేదు. మీ కలా నా వాదంగా తోచటం దురదృష్టకరం. ఇలా వాదించుకుంటూ పోవటం నాకూ సుతరామూ ఇష్టం లేదు కాబట్టి యీ చర్చను వదిలేద్దాం. నా వ్యాఖ్యలు ప్రచురించినందుకు వాటికి వివరంగా జవాబు చెప్పినందుకు ధన్యవాదాలు.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: