మౌక్తిక హారం – 4

pearl necklace

చింత

చితి దహించివేయు జీవితమ్ము ముగిసి
నట్టి వాని తనువు నంతె గాని –
చింతయే దహించు జీవించియున్నట్టి
వాని తనువు మరియు మానసమును!

ఎవడో ఒక్కడు …

భువిపై వస్తువులేవియైన విడువన్, భూమార్గమందే చనున్!
అవనిన్, కేవల మగ్నికీల యెగబ్రా కాకాశ మార్గంబునన్!
భువనంబం దటు రాలిపోదురు గదా భూమిన్ జనుల్ పాపులై –
ఎవడో యొక్క డుదాత్తుడై ధ్రువుని తీ రెక్కున్ నభో వేదిపై!

నిద్ర లేని రాత్రులు!

ఏక రాత్రి యందె ఎంతటి ఘనుడైన
ఉన్నతమగు పదము నొందలేదు –
ఇతరులెల్లరు నిదురించు రాత్రు లవెన్నొ
గడుపు నతడు కృషిని, కడు తపించి!

మెల్ల కన్ను!!!

భార్య ప్రక్కనున్న పడతి అందాలను
రసికుడొకడు చూచి రక్తి నొందె –
భర్త చూపు భార్యపై ననుకొనిరెల్ల –
మెల్ల కన్ను వలన మేలు కలిగె!

తప్పు

నీ తప్పు నెత్తి చూపగ,
ఆ తప్పునె జేసినట్టి అన్యుల గనుడం
చే తర్కమొ నీవు సలుప –
ఆ తప్పిక అవనిలోన అలరునె ఒప్పై?

రామ భక్తి in every walk of life!

వింతగ రోజు … ‘ఆఫిసు‘కు వెళ్ళెడి నాకు కలమ్ము కాన రా;
దెంతొ గవేషణన్ సలుప నెచ్చటొ యేదొ కలమ్ము జిక్కు – “అ
ద్దింతకు వ్రాయునా?“ యనుచు నేర్పడు శంకయె దీర, ‘రామ‘ యం
చంత లిఖించి చూతు – అటు లబ్బు నదెంతటి పుణ్యమో గదా!

ఆలుమగలు

పూలును, పరిమళముల వలె –
పాలును, మీగడల వోలె – భాస్వంత శర
త్కాల శశియు, వెన్నెల వలె –
ఆలుమగలు కలసిమెలసి యలరారవలెన్!

తెరచుకొనకున్న…

చీకటి గదిని మూసియుంచి, మరి బయట
ఎన్ని దీపాలు వెలిగింప నేమి ఫలము?
తెరచుకొనకున్న హృదయమ్ము, నరయ నింక
ఎన్ని గ్రంథాలు పఠియింప నేమి ఫలము?

ఆత్మ బలము

కురియు వర్షమ్ము నాపదు గొడుగు – కాని,
అందు నిలుచుండు ధైర్యమ్ము నందజేయు!
ఆత్మ బలమట్లె కష్టమ్ము నాపబోదు!
దాని నెదురొడ్డి పోరాడు ధైర్య మిచ్చు!!

’హీరొ’

విలువలను కాలరాయగా కలిగినట్టి
విజయమది యొక్క విజయమా? ’విలనిజమ్ము’!
విజయమొందకున్న, విలువల్ వీడకుండ
ఎవడు నిలుచునో, వాడె పో – ’హీరొ’ నాకు!

పట్టుదల

నూరు ప్రయత్నములు సలిపి,
కోరిన ఫలితమ్ము దక్కకున్న – విసిగి వే
సారకు! కలదేమొ మరొక
మారు ప్రయత్నమ్మునందు మధుర విజయమే!

మంచి ఆలోచన!

ఫలమునందు సగము పంచి నీకిచ్చుచో
సగము నాకు మిగులు – సగము నీకు –
పంచి ఇచ్చునెడల మంచి ఆలోచనన్
నాకు మొత్తముండు! నీకునుండు!

అప్రయత్న సూర్య నమస్కారం!

భూమి పయి నిలుచు భాగ్యమ
దేమో – తద్విధి ప్రదక్షణించుచునుం దీ
వ్యోమాలయ సూర్య పరం
ధామునకు, మదీయ జన్మ ధన్యత గాంచన్!

భూసురుడు

భూసురుడైనవాడు ఫల భూజము వోలె పరోపకారమే
ధ్యాసగ నిల్పి, జ్ఞాన సముపార్జన సల్పి, జగద్ధితంబుకై
భాసురమైన సత్కృతుల బాగుగ చేసి తరించగావలెన్!
భూసురు డట్లు కానియెడ భూసురుడౌనె? నిశాచరుం డగున్!

గొప్పవాడు!

శత్రువును జయించిన వాని, జగతి యందు
గొప్ప వానిగా కీర్తింప తప్పు లేదు!
ఎవ్వడు జయించగలడొ శత్రుత్వము నిల –
వాని కన్న మించిన గొప్ప వాడు లేడు!!

‘పాంచజన్యం’

పాలిడెడి నెపమున వచ్చి ‘పూతన‘ తనన్
చంప గోరి, నోట స్థనము గ్రుక్క –
భావి నొత్త బోవు పాంచజన్యంబుగా
తలచు బాలకృష్ణు గొలతు మదిని!

రసికత !

రసికత లేని వారలను రమ్య సుధారస పూర్ణ కావ్యముల్
కొసరుచు విన్ము విన్మనుచు కోరకుమో కవిరాజ! కోరినన్,
విసుగును చూపి పొమ్మనిన – వేదన చెందక, యట్టి వారిపై
పసులని, భాగ్యహీనులని ”పాపమయో!” యని జాలి చూపుమా!

వ్యాకరణం

వ్యాకరణంబే కవికిని
కాకూడ దొక గుదిబండ కవన పథములో –
నా కవితావేశమునకు
నా కది యొక పట్టుగొమ్మ నా భావనలో!

మందహాసం

“ఈ విషాద వదన మేల?” యని యడుగ –
కారణమును దెలుప కష్ట మగును!
చిందు టెంతొ సులువు మందహాసంబులే!
మంద హాస మెపుడు చిందుమోయి!

‘పునుగు పిల్లి’

వలదు జన్మమ్ము నాకింక వలదు మరల!
“తగదు – జన్మమ్మునొందక తప్ప”దన్న –
తిరుమలేశునికి సుగంధ పరిమళమిడు
‘పునుగు పిల్లి’గా నేనింక పుట్టదలతు!

విజయమ్ము!

శాశ్వతమ్ము కాదు సాధించు విజయమ్ము!
అపజయమ్ము సైత మట్లు గాదు!
నరునికి ప్రతి గడియ – నవ యుద్ధమే గదా!
పూని విజయ మొంద పోర వలయు!

హా! హాలికా!

పంట చేలకు తెగు లంటినపుడు గాంచి
అల్లలాడు గాదె హాలికుండు –
ఇంట సుతునికి జ్వర మంటినపుడు గాంచి
తల్లడిల్లు కన్నతండ్రి వోలె!

అధిక రక్తపు పోటు

నా దేశమున పూర్వ నాగరికత జూడ –
నరనరమ్ముల బొంగును రుధిరమ్ము!
నా దేశ సంస్కృతి నాణ్యమ్ము నెరుగగా –
నరనరమ్ముల బొంగును రుధిరమ్ము!
నా దేశ మహనీయ నాయకులను గాంచ –
నరనరమ్ముల బొంగును రుధిరమ్ము!
నా దేశ సంస్కార మాదర్శము లెరుంగ –
నరనరమ్ముల బొంగును రుధిరమ్ము!

నాదు జన్మ ధరిత్రి సౌందర్య దీప్తి,
నాదు దేశ పతాక ఘనతను గాంచ –
నిజము! మేనిపై రోమాలు నిక్క బొడుచు!
అధిక రక్తపు పోటు సౌఖ్యమ్ము గూర్చు!

’అధికారి’

కలముతో నొకరికి కలిగింప భాగ్యమ్ము
సాధ్యపడని యెడల సరియ! కాని,
‘ఎరెజ’రైన వాడి ఎవరి దుఃఖమునైన
తుడిపివేసి తృప్తి బడయవలయు!

రైతు బిడ్డ!

కుండ పోతగా వర్షమ్ము కురియ నేమి? –
దండిగా మేని వస్త్రమ్ము తడియ నేమి? –
ఎవ్వ డతడు మోమున నవ్వు రువ్వి సాగు?
ఆతడై యుండు తప్పక – రైతు బిడ్డ!

 ( ఇంకా కొన్ని మరొక పోస్ట్ లో … )

             — *** —

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: