మౌక్తిక హారం – 2

mouktika-haram

మౌక్తిక హారం – 2

వింత ఉద్యమము

” నాకు స్వేచ్ఛ వలయు ” – కేక పెట్టుచు నిట్లు
ఉద్యమములు చరిత నుండె గాని …
” వాని కిడకు స్వేచ్ఛ, వల ” దంచు పోరాడు
వింత ఉద్యమమ్ము వెలసె నేడు !

మాలి

పూవులునయ్యె తారకలు; పుష్ట ఫలమ్మయె చందమామ; నె
త్తావులునయ్యె సాగు జలదంబులె; ఆ నిశ – నీల పాదపం
బా వినువీధినయ్యె; వనమయ్యెను విశ్వమె; ఆ వనంబులో
కావలి గాయు ’మాలి’గ అకారణ మీ సుకవీంద్రుడయ్యెడిన్ !

శాక్యముని

ఆ నడురేయి శయ్యపయి యౌవన మాధురులొల్కు పత్నినిన్,
కానగ ముద్దుగారు పసికందగు పుత్రుని, రాజ్య భోగముల్ –
పూని విసర్జనన్ గరిక పోచలుగా యొనరించి పొందె బ్ర
హ్మానుభవంబు శాక్యముని మానవ లోకము నుద్ధరింపగాన్ !

వేసవి కాలమందు …

వేసవి కాలమందు నిశ వేళల ఆరు బయళ్ళ మంచమున్
వేసి వెలంది నవ్వి, వడి వీచెడి గాలుల పుల్కరింతలో –
మీసము దువ్వుచున్ మగడు మేనును వాల్చగ ప్రక్క జేరి, తా
నూసులు జెప్పు; చుంబనములుంచు మరెవ్వరు చూడనంతలో !

నరుని సీస బంధం

పాలుగారెడినట్టి పసిబుగ్గలనుగల్గు
బాల్యమ్ములోపల ‘పాల సీస’-
బుడిబుడి యడుగుల నడకలు సాగించు
డింభక దశను ‘కూల్ డ్రింకు సీస’-
మెత్తని నూనూగు మీసాలు మొలిచెడి
యవ్వనంబున ‘ఆల్కహాలు సీస’-
ఆరోగ్యమే కొంత అటునిటై, నడిమి ప్రా
యమ్మునందున ‘ఔషధమ్ము సీస’-

ముదిమి వయసునందు ముదిరిన జబ్బులో
ప్రాణ రక్షకై ‘సెలైను సీస’-
చిత్రమగును నరుని సీసాల బంధమ్ము!
‘సీస’ పద్యమె నర జీవితమ్ము!

 ఆర్ద్రత

ఎడ నెడ పృథ్వియందు రమణీయ కవిత్వము, సత్కళాకృతుల్,
బుడుతల చేష్టలున్, కరుణ పొంగెడు దృశ్యములున్, చమత్కృతుల్
తడి గల నాదు గుండియకు దర్శనమై, కెలుకంగ తీయగా –
వడి వడి జాలువారు కనుపాపల కొల్కుల నుండి బాష్పముల్ !

రావే ఆంధ్ర రసజ్ఞ!

భావావేశము పొంగిపొర్లి నదియై పారంగ, పద్యంబులే
వేవేలై ఎగసెన్ మదీయ హృది నువ్వెత్తున్ తరంగాలుగాన్ –
నా వాక్కందున తోయమయ్యె రుచిగా నానా రసాల్ పంచగాన్ –
రావే ఆంధ్ర రసజ్ఞ! తేల, రస ధారా స్నాన పానంబులన్!

విస్ఫోటన ధ్వని

భువిని విధ్వంసక క్రియల్ పూన వలదు –
ఇల నహింసా పథము నిల్వవలయుగాని,
చెవిటి వారికి వినిపింప జేయవలయు
నన్న, విస్ఫోటన ధ్వని అవసరమ్ము !
*[ఇది ‘షహీద్ భగత్ సింగ్’ కు స్ఫూర్తినిచ్చిన ఫ్రాన్స్ అమర వీరుడు ‘వాయియో’ సూక్తి ( పద్య రూపంలో )]

 ఇనుప గోడలు

అవ్వకు బుట్టువారె జనులందరు; అందరి కాకలైనచో
బువ్వ భుజించువారె; మన బొందిని పారెడి రక్తమొక్కటే –
ఇవ్విధి సత్యమున్ మరచి, ఈ ప్రజలందు కులాల్, మతాలటన్
క్రొవ్విన ధూర్తులే ఇనుప గోడలు కట్టుచునుందు రక్కటా!

కృతి మిగులును …

విజయనగర రాజ్య విభవమ్ము గతియించె –
ధనము, మణులు, పసిడి, జనము పోయె –
’భువనవిజయ’ సభల భవనాలు నశియించె –
కృష్ణరాయ డడగె – కృతులు మిగిలె !

సుఖ భోగము

కలిగిన నవ్య భావనల కమ్మని పద్యములట్లు కూర్చుచున్,
చెలగి కవిత్వ సాధనము చేయుచునుండెద – అట్టి వేళలో …
తొలకరి వానలో చినుకు తుంపరలై ముఖమెల్ల చిందగాన్,
పులకర మందజేయు సుఖ భోగమునందున తేలి నట్లగున్ !

గొడుగు కలిగి కూడ …

తడియు మిత్రునొకని దాతృత్వ బుద్ధితో
అతడు గొడుగు క్రింద కరుగుమనగ,
కొలది కొలది వాడు గొడుగెల్ల వ్యాపింప –
గొడుగు కలిగి కూడ తడిసె నతడు!

 పోరు

విజయమొందుదన్న విశ్వాసమే లేక

పోరువాని పోరు పోరు గాదు –

దాని కన్న సర్ది తట్ట బుట్టలవెల్ల

ఇంటి కేగి, కూరుచుంట మేలు!

దేవుడు …

ఆకలిగొన్నవానికగు అన్నపుముద్దగ – ఎండిపోయెడిన్
పీకను జారు శీతజలబిందువుగాన్ – దిశ గాననట్టి పెం
జీకటినున్నవానికడ చేరును కాంతిగ, దారి జూపగాన్ !
లోకమునందు దేవుని విలోకనమున్ సలుపంగ జాలరే ?

 (మరికొన్ని మరో పోస్టులో …)

*** *** ఇది ఈ బ్లాగులో నా 225వ పోస్ట్  *** *** 

225

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. ఫణి ప్రసన్న కుమార్
  డిసెం 01, 2012 @ 12:22:07

  అందమైనయట్టి ఆణిముత్యములయ్య
  ఒకటి మించి యొకటి హొయలు చిందె
  తీయనైనభావ తోయదమ్ములదేల్చి
  మనసుకెంతొ హాయినొనరజేసె

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  డిసెం 06, 2012 @ 20:25:21

  ఫణి ప్రసన్న కుమార్ గారికి
  ఫణీంద్రుని ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: