మౌక్తిక హారం – 1

మౌక్తిక హారం

 

నా మరొక బ్లాగు “మౌక్తికం” లో ఒక మెరుపులా ఆలోచనలు మెరిసినప్పుడు రూపు దిద్దుకొన్న ముక్తక పద్యాలను పోస్టులుగా అందిస్తున్నాను.ఆ బ్లాగు ఇటీవలే వంద పోస్టుల మైలు రాయిని దాటింది. వాటిలో నాకు బాగా సంతృప్తిని ఇచ్చిన పద్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆస్వాదించండి.

– ‘పద్య కళా ప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

పెండ్లి కూతురు

అరయ కవనమన్న ఆలోచనమె గదా ! 

ఊహ విస్తరించి దేహమగును –

మేలి పదములన్ని మెరుగు భూషలగును –

కూడి, కవిత పెండ్లి కూతురగును !

మత్తు

మందు త్రావినపుడె మత్తెక్కునను మాట

ఉత్త మాట ! వట్టి చెత్త మాట !

మంచి కవిత గ్రోల, మత్తెక్కు నాకెంతొ –

దిగదు మత్తు త్వరగ ! దిగదు ! దిగదు !

ఇంచుక బిందువు …

పెక్కుగనుండు వేయి, పదివేలని గాకయు లక్షలాదిగా

చుక్కలు నింగియందు కనుచూపుకు తోచుచు; కంటి చూపుకున్

దక్కకయున్నయట్టి ఘన తారకలెన్నియొ విశ్వమందునన్ –

ఎక్కడ మానవుండు ? అతడించుక బిందువు సంద్రమందునన్ !

ఒకింత నవ్వరా !

ఏడ్చుచు భూమిపై పడెద; వేడ్చెద వా పయి అమ్మ పాలకై;

ఏడ్చెద వన్నమున్ తినగ; ఏడ్చెద వేగగ పాఠశాలకున్;

ఏడ్చెద వీవు జీవనము నీడ్చుచు తాకగ నాటు పోటులున్;

ఏడ్చెద వట్లె చచ్చుటకు – ఏడ్పుల మధ్య ఒకింత నవ్వరా !

ఆకలి

దాహమైన యపుడు త్రాగు నీరు వలయు –

పసిడి ద్రావకమ్ము పనికి రాదు !

ఆకలైన వేళ అన్నమే కావలెన్ –

వజ్రములవి తినగ పనికి రావు !

వరియన్నము

అప్పుడ వండి వార్చు వరియన్నము పళ్ళెమునందునుంచగా

గుప్పున వేడియావిరులు కొల్లలుగా ముఖమందు సోకగా

చెప్ప తరంబె ఆకలికి చిత్తయియున్నటువాని గుండెలో

డప్పులు మ్రోగినట్లగును – డాసినయట్లనిపించు స్వర్గమున్ !

బంగారు గడ్డ

సత్య వాక్పథ దీక్ష సాగించు క్రమములో

సతిని, సుతుని అమ్ము సహన గుణము –

పితృ వాక్య పాలన ప్రియముగా తలదాల్చి,

వన వాసమున కేగు వినయ గుణము –

ప్రాణ హానియునైన, వర కవచము జీల్చి

దానమ్మొసంగు వదాన్య గుణము –

పతి ప్రాణ రక్షకై భయ కంపములు వీడి

సమునితో ఎదురించు సాధ్వి గుణము –

రాజ్య, భోగమ్ము, లర్ధాంగి, ప్రాణ సుతుని

సత్య శోధనకై వీడు సత్త్వ గుణము –

ఇన్ని సుగుణాల గల పుణ్య హృదయ వరుల

బిడ్డలుగ గన్న బంగారు గడ్డ మనది !

బాలీవుడ్ టాప్ గ్లామరస్ హీరోయిన్స్

అందగత్తెగ తొల్త అలరించె ’ నర్గీసు ’;

’ నూతన్ ’ చెలువము మనోజ్ఞమగును;

మధువులొలుకు రూపు ’ మధుబాల ’ కే సొత్తు !

అతి మనోహరి ’ వైజయంతి మాల ’;

భామలందున మేటి ’ హేమ మాలిని ’ చెన్ను;

’ రేఖ ’ సౌందర్య సురేఖ సుమ్ము !

అందాల బొమ్మ ’ జయప్రద ’ యన చెల్లు;

దివ్య శోభలిడు ’ శ్రీదేవి ’ సొబగు !

మదిని దోచెడు కొమ్మ ’ మాధురీ దీక్షిత్తు ’;

కోమలాంగి మనీష కోయిరాల;

విశ్వ విఖ్యాతమ్ము ’ ఐశ్వర్య రాయ్ ’ సొంపు;

ప్రీతి నందించు ’ కరీన ’ సొగసు –

’ బాలివుడ్డు ’ సినిమ ప్రారంభమందుండి

భారతీయ పురుష వరుల మదుల

దోచుకొన్నయట్టి దొరసానులే వీరు !

కనుడు కన్నులార ! కొనుడు ముదము !

(ఇది అత్యధికంగా వీక్షించబడిన పోస్ట్ )

‘డబ్బు’ జబ్బు

కనులు నెత్తికెక్కు – గర్జించు కంఠమ్ము –

చెవుల దీన ఘోష చేరబోదు –

పొరుగు వార లెల్ల పురుగు లట్లగుపించు –

’డబ్బు’ జబ్బు గలుగు డాబుసరికి !

‘ డాలర్ ‘

డబ్బన పిచ్చి! అందునను, ‘డాలర’ టన్న మరింత పిచ్చి! ఏ

సుబ్బికి చూలు వచ్చినను, చూచును స్వప్నము – పుట్టబోవు నా

అబ్బియె ‘కంప్యుటర్’ చదివి, ‘అమ్మెరికా’ భువికేగి, ‘డాలరుల్’

దొబ్బియు పంపగా, నవియె దోపగ సంచులు నుబ్బినట్లుగాన్!

చిత్రం !

ఒక శిల గుడిలో ప్రతిమగు –

ఒక శిల ఆ గుడికి ముందు నొదుగును మెట్టై –

ఒకదానిని మ్రొక్కెదరు – మ

రొకదానిని త్రొక్కెద, రదియొక చిత్రమ్మే !

’ ఫ్యూడలిస్టు ’ బుద్ధి

వామపక్ష భావ వాదిని ‘మార్క్సు’పై

చిరు ప్రసంగ మొకటి చేయ బిలువ –

కారు పంపకున్న కదలబోనన్నాడు!

‘ఫ్యూడలిస్టు’బుద్ధి పోవు నెట్లు?

(ఇంకా కొన్ని తరువాత పోస్టులో…)

—***—

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. veenalahari
  నవం 04, 2012 @ 17:37:40

  nijam ga moukthikaale annee chaalaa baagunnaayandi

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  నవం 05, 2012 @ 06:56:14

  Dhanyavadaalu Veenalahari gaaru!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: