కులీ కుతుబు కావ్య మధువు

కులీ కుతుబు కావ్య మధువు

[గోల్కొండ ప్రభువు, ‘హైదరాబాదు’ నగర నిర్మాత – ‘మహమ్మద్ కులీ కుతుబ్ షా’ రచించిన ‘దక్కనీ ఉరుదూ’ కవితలకు ఆంధ్రానువాదం]

రచన : ‘పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

1
మదిలో ఒక్కటె కోర్కి నాకిక ఖుదా! మన్నించి ఆలింపుమా!
నదిలో చేపల నింపినట్లు – దయతో, నా చేత నిర్మాణమై
హృదులన్ రంజిల జేయునట్టి నగరంబీ ’భాగ్ పురం’బందునన్
చదలున్నంతటి దాక, నీవు ప్రజలన్ సమృద్ధిగా నింపుమా!

2
హిందు సంస్కృతి యన ఎంతొ ఆదర మొప్పు –
ఇచ్చినాడ మద్ద తేను సతము!
మందిరమ్ము గూడ మస్జీదు వంటిదే!
పక్షపాత బుద్ధి పడదు నాకు!

3
కానగ నభమను నల్లని
ఏనుగు కొక చిన్ని దంత మేర్పడె నేడే!
దానిని జూచిన వెంటనె
పూనిరి ’ఈదు’ను జరుపగ పురమున జనులే!

’ఈదు’ పండుగే సఖి! నేడు ఈదనిమ్ము
సరస శృంగార వైభోగ సాగరమ్ము!
ఎంత త్రావినన్ చషకమ్ము నింక నింపు!
ఎంత సేపైన ఈ శయ్య నింక దిగకు!

4
రండు! కలసి రోదింపగా రండు! రండు!
కార్చ ఈ శోక దినము రక్తాశ్రువులను!
త్యాగ ధనులౌ ’ఇమాములన్’ తలచి, తలచి –
గుండె పగులుటే ’మొహరమ్ము’ గుర్తు మనకు!

5
సప్త సాగరముల సమము సంస్కృత భాష!
తరచి చూడ – తెలియు దానిలోని
సరస శబ్ద భావ సంయోగ సంజాత
రాగ రచిత మధు తరంగ ఘోష!

6
చెంతకు రాత్రి మొత్తమును చేరగనీయవు నిద్ర – సుందరీ!
సంతసమందె నీ ప్రియుడు – సంతసమందెను మన్మథుండు – తా
సంతసమొందె శయ్య – మరి సంతసమొందెను నాల్గు కన్నులున్ –
సంతసమందె గాదె ఇటు సంగమమొందుచు కంటి కాటుకల్!

7
మధువునం దేమి కలదోయి మత్తటంచు
చెంపపై మీటి మృదువైన చేయి తోడ,
ప్రణయమున పంచ ప్రాణాలు రంగరించి
చషకమును నింపి త్రావించె జాణ నాకు!

చెలి సమాగమమ్మె జీవనంబీ ధాత్రి ;
మరి వియోగమన్న మరణమగును!
ఆమె కరము తోడ అందించు చషకమే
’విశ్వ పాలనమ్ము’ విలువ సుమ్ము!

8
ఆమె అందము గని అదిరిపోయిన దేమొ!
కొంత కొంత కరిగె క్రొవ్వు వత్తి!
సూర్య కిరణము లవి సోకగా ఒక్కింత
కరిగిపోయెడి వడగల్లు వోలె!

9
తప్ప త్రాగి తూలు త్రాగుబోతుల వంటి
మగువ మత్తు కనులు మరల మరల
వాలిపోయి, లేచి, వాలిపోవగ – నాకు
కలిగె సందియమ్ము పిలిచినట్లు!

10
మధువు గ్రోలి నేను మత్తుగా నిద్రింప –
నిద్ర పట్టనట్టి నీరజాక్షి
కరములందు స్వర్ణ కంకణమ్ముల నూపు!
చరణ నూపురములు సతము కదుపు!

11
అక్షరముల నేర్పు శిక్షకుం డెవడైన!
పదము, లర్థములను పండితుండు!
’పద్య విద్య’ నేర్పు పండితుం డెవడురా?
’అల్ల’ కరుణ వలన అబ్బు నద్ది!

***

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. రసజ్ఞ
  మే 21, 2012 @ 09:07:52

  ఈయన రచనలు చేశారా!! నాకు తెలియదు సుమీ! బాగుందండీ మీ అనువాదం.
  మీరు న్ అని పెట్టిన ప్రతీ చోటా స్ అని కనిపిస్తోంది! బోల్డ్ తీసేస్తే మామూలుగా కనిపిస్తుంది. అన్యధా భావించక దయచేసి సవరించగలరు.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  మే 22, 2012 @ 00:31:59

  అవును రసజ్ఞ గారు!
  ఉరుదూ భాషలో ’దక్కనీ’ మాండలికానికి ఈయనే ఆద్యుడు. అంతే కాదు. మొత్తం ఉరుదూ సాహిత్యంలోనే తొలి ముద్రిత కవితా సంకలనం ఈయనదే! ఈ భావుకుడే భాగమతీ ప్రియుడు! 15వ శతాబ్ది ఉత్తరార్థం వాడు.
  ఈతని తండ్రి ’ఇబ్రహీం కులీ కుతుబ్ షా’ – శ్రీకృష్ణదేవరాయల సమకాలికుడు. ఈతడు తెలుగులో సైతం కవిత్వం చెప్పేవాడు. ఈతనిని తెలుగు కవులు ’మల్కిభరాముడు’ అని పిలుచుకొనేవారు.

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  మే 22, 2012 @ 00:34:54

  రసజ్ఞ గారు!
  అక్షరాలయితే బోల్డులో లేవు మరి!
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: