వెదికింది ఒకటి .. దొరికింది ఒకటి …

మొన్న ఆదివారం పాత పుస్తకాలు, పేపర్లను వెదుకుతుంటే –
ఎప్పుడో ఇరవయ్యేళ్ళ క్రితం నేను వ్రాసుకొన్న కొన్ని ‘బాల గేయాలు‘ కనిపించాయి.
నేను వెదికింది ఒకటి .. దొరికింది ఒకటి …
అయితేనేం? ఆ గేయాలను చూస్తే ఇప్పుడు ముచ్చటేసింది – బహుశః ఇంగ్లిష్ లో పిల్లలకు నేర్పుతున్న అర్థం పర్థం లేని వ్యర్థపు ‘రైము‘ల్లా కాకుండా – తెలుగులో చిన్న పిల్లలు సరదాగా పాడుకొనేలా ఉండి, వాళ్ళకు కాస్త విజ్జానాన్ని కూడా పంచేలా ఉండాలన్న సదుద్దేశ్యంతో వ్రాసినట్టున్నాను. ఒక యాభై దాక గేయాలు వ్రాసి పుస్తకంలా వేయాలన్న తలంపు అప్పట్లో ఉండి ఉంటుంది. అందుకే ‘బాలోల్లాసం‘ అన్న ‘బుక్ టైటిల్‘ కూడా వ్రాసి పెట్టుకొన్నాను. ఒక పదిదాక వ్రాసాను. తరువాత ఆ విషయమే మరచిపోయా నెందుకో మరి!
సరే – ప్రస్తుతానికి ఉన్నవాటిలో కొన్నిటిని అంతర్జాలానికి ఎక్కిద్దామనిపించింది — ఆస్వాదించండి.

చినుకు

చినుకూ చినుకు –
ఎక్కడి చినుకు?
ఆకాశంలో
పుట్టిన చినుకు –
ఆపై నేలకు
దూకే చినుకు –
వాకిట్లోనే
పారే చినుకు –
వాగూ, వంక
కలిసే చినుకు –
పొలాలలోకి
చేరే చినుకు –
పుట్టించేను
మనకొక మెతుకు! *

విద్యుత్తు

వెలుగులు చిందే విద్యుత్తు!
’ఎడిసన్’ చూపిన విద్వత్తు!!
గాలిమర నుండి పుట్టిస్తే –
అది ’వాయు విద్యుత్తు’!
నేలబొగ్గుతో పుట్టిస్తే –
అది ’ఉష్ణ విద్యుత్తు’!
సూర్యుని నుండి పుట్టిస్తే –
అది ’సోలార్ విద్యుత్తు’!
నీటిలో నుండి పుట్టిస్తే –
అది ’జల విద్యుత్తు’!
’న్యూక్లియస్’ నుండి పుట్టిస్తే –
అది ’అణు విద్యుత్తు’!
పంచ భూతాల విద్యుత్తు!

ప్రపంచమంతా విద్యుత్తు!! *

గులాబి పూలు

అందమైన గులాబి పూలు
మొక్కపై ఉంటేనే మేలు!
ముట్టుకొంటే రెక్కలు రాలు!
పట్టుకొంటే గుచ్చును ముల్లు!

’ఢాంఢాంఢాం’

కాకర పువ్వులు కాలిస్తే –
మిలమిల మెరుపులు మెరిపిస్తే –
కన్నుల వెలుగులు ’ఛాంఛాంఛాం’
పిల్లల మనసులు ’ఝాంఝాంఝాం’

ఆటం బాంబులు పేలిస్తే –
భయంభయంగా చూస్తుంటే –
చెవిలో శబ్దాల్ ’ఢాంఢాంఢాం’
పిల్లల గుండెలు ’ఠాంఠాంఠాం’ *

పుష్ప గుచ్ఛం

ఎర్రని పూలు –
తెల్లని పూలు –
పచ్చని పూలు –
విచ్చిన పూలు –
రంగులొలుకు పూలు!
రమ్యమైన పూలు!!

మల్లె పూలు –
బంతి పూలు –
రోజా పూలు –
చామంతి పూలు –
అందమైన పూలు!
ఆకర్షించే పూలు!!

పూవులన్నీ స్వచ్ఛం –
ఒకటిగ కడితే గుచ్ఛం –
పూలలాంటిదే జనం!
గుచ్ఛం వంటిది దేశం!! *

చిటపట చినుకులు

చిటపట చినుకులు పడుతుంటే –
టపటప చప్పుడు చేస్తుంటే –
ఇటు అటు గెంతే పిల్లలు
ఇళ్ళల్లోనికి ఉరికారు
కిటికీ ముందు కూర్చున్నారు
కిటకిట తలుపులు విప్పార్చారు
జల్లులు మొగమున చిల్లుతు ఉంటే –
ఉల్లము ఝల్లన పులకించారు! “*

విద్యుచ్ఛక్తి

విద్యుచ్ఛక్తి – విద్యుచ్ఛక్తి –
వెలుగుల నిచ్చే విద్యుచ్ఛక్తి –
గాలిని విసిరే విద్యుచ్ఛక్తి –
నీళ్ళను తోడే విద్యుచ్ఛక్తి –
పాటలు పాడే విద్యుచ్ఛక్తి –
వంటలు వండే విద్యుచ్ఛక్తి –
బట్టలు ఉతికే విద్యుచ్ఛక్తి –
బొమ్మలు చూపే విద్యుచ్ఛక్తి –
చల్లనుబరచే విద్యుచ్ఛక్తి –
షాకులు కొట్టే విద్యుచ్ఛక్తి –
’ఫుల్లు’ వాడితే విద్యుచ్ఛక్తి –
చిల్లు జేబుకు విద్యుచ్ఛక్తి – *

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

—***—

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. jyothirmayi
  జన 25, 2012 @ 01:38:15

  చాలా చాలా బావున్నాయండీ…మీకభ్యంతరం లేకపోతే మా పాఠశాల బ్లాగులో పెడతాను.

  స్పందించు

 2. రసజ్ఞ
  జన 25, 2012 @ 02:53:47

  చాలా బాగున్నాయండీ! నాకిలాంటివి నేర్చుకోవడం ఎంతో ఆసక్తి! అన్నట్టు మీరు వ్రాసినవి చదివి నాలో కూడా కవిత్వం పొంగింది!

  రచనలు రచనలు
  అందమయిన రచనలు
  సరళమయిన రచనలు
  చక్కనయిన రచనలు
  పిల్లలు నేర్చే రచనలు
  పెద్దలు మెచ్చే రచనలు
  అందరికీ నచ్చే రచనలు
  ముద్దు ముద్దు మాటల మూటల వంటి రచనలు
  ముచ్చటగా పాడుకునేందుకు వీలైన రచనలు

  స్పందించు

 3. kastephale
  జన 25, 2012 @ 04:45:33

  బాగున్నాయ్! మన ప్రభుత్వం వారికి ఇటువంటివి పడవులెండి.

  స్పందించు

 4. Dr.Acharya Phaneendra
  జన 25, 2012 @ 18:45:43

  జ్యోతిర్మయి గారు!
  తప్పకుండా మీ పాఠశాల బ్లాగులో పెట్టండి. తరువాత ఆ బ్లాగు ఐ.డి. ఇస్తే నేనూ చూసి ఆనందిస్తాను.
  మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

  స్పందించు

 5. Dr.Acharya Phaneendra
  జన 25, 2012 @ 18:51:40

  కష్టే ఫలే గారు!
  రసజ్ఞ గారు!
  ధన్యవాదాలు!

  స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: