ఎగ్జిబిషన్ లో కవి సమ్మేళనం


హైదరాబాదులో నిర్వహించబడుతున్న 72వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ప్రతి సంవత్సరంలాగే ఈ యేడు కూడ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఏర్పాటు చేయబడిన కవి సమ్మేళనానికి ప్రముఖ కవి, సినీగీతరచయిత డా. వడ్డేపల్లి కృష్ణ అధ్యక్షత వహించారు.
కవులలో – డా. జె.బాపురెడ్డి, డా. ముదిగొండ శివప్రసాద్, డా. పోతుకూచి సాంబశివరావు, డా. తిరుమల శ్రీనివాసాచార్య, డా. కసిరెడ్డి వెంకటరెడ్డి, డా. అక్కిరాజు సుందరరామకృష్ణ, ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ, డా. తిరునగరి, డా. రాధశ్రీ తదితరులతోబాటు నన్నూ ఆహ్వానించారు.
’సంక్రాంతి లక్ష్మి’ అన్న వస్తువుపై కవులందరూ వారి వారి శైలులలో కవితలు వినిపించి శ్రోతలను అలరించారు. నా పద్యాలు బాగున్నాయని శ్రీ టి.వి. నారాయణ, ఆచార్య మసన చెన్నప్ప, డా. తిరునగరి లతోబాటు పలువురు ప్రశంసించడం ఆనందం కలిగించింది. కవి సత్కారం, బరువైన కవర్లు అందుకొన్నాక అందరం కలిసి ఛలోక్తులు విసురుకొంటూ, నిర్వాహకులు ఎంతో ఆదరంగా వడ్డించిన విందుభోజనం ఆరగిస్తూ సరదాగా గడపడం మరింత ఆనందం కలిగించింది.

కవి సమ్మేళనంలో వినిపించిన నా కవిత >
———————————————–
ఆ.వె.
మకరరాశియందు మార్తాండుని ప్రవేశ
మై శుభప్రదమగునట్టి దినము
స్వాగతమ్ము నీకు – సంక్రాంతి లక్ష్మి! రా!
ఉర్వి జనుల కిద్ది పర్వదినము!

తే.గీ.
పడుచు లందాలు వాకిళ్ళ పరిమళించ –
పరికిణీ లాగి నడుముకున్ ప్రక్క జెక్కి,
మూతి బిగబట్టి, చేతిలో ముగ్గు పిండి
రాల్చి తీర్చెదరు విశాల రంగవల్లి!

కం.
పెద్దలు గని – తమ పిల్లలు
ముద్దుగ తోచెడి పతంగముల గొని నింగిన్
హద్దులు గానని ఎత్తున
ఒద్దికతో నెగురవేయ – నుబ్బుట కనమే!

చం.
పొలముల పంట యింటికిని పుష్కలమై చనుదెంచ – పూనియున్
తిలలను గ్రుప్పి పొంగలియు, తీయని నువ్వుల లడ్డు, లర్సెలున్,
అలర నిజాము ప్రాంతమున యద్భతమౌ రుచి చక్కినంబులన్ –
వెలదులు చేసి చూపెదరు వేవిధముల్ మన పాక వైభవాల్!

మధ్యాక్కర:
బూరనూదుచు గంగిరెద్దు బులిపించు బుడబుక్కలాట –
’హారి.. హారీ .. ’ యంచు చిరతలాడించు హరిదాసు పాట –
కోరి వాకిళ్ళ ముగ్గుపయి కూర్చిన గొబ్బిళ్ళు మరియు
చారు పుష్పాలు బంతులవి చాటురా సంక్రాంతి శోభ!
——————————————————

పనిలో పనిగా కొందరు కవులు ’నుమాయిషీ’ [ఎగ్జిబిషన్] పై కూడ కవితలు వినిపించారు. ఆచార్య ఎస్. వి. సత్యనారాయణ కవితలోని ఈ పంక్తులు అందరినీ ఆకట్టుకొన్నాయి.

”ఒకప్పుడు ఇంటికెవరైనా వస్తే ..
ఈమె మా అమ్మ, వీడు నా తమ్ముడు, ఇది నా చెల్లి – అని
పరిచయం చేసేవాళ్ళం –
ఇప్పుడు ఇంటికెవరైనా వస్తే …
ఇది మా ఎల్.సి.డి టి.వి., ఇది మా ఫ్రిజ్, ఇది మా మైక్రోవేవ్ ఓవెన్ – అంటూ
పరిచయాలు చేస్తున్నాం –
ఒకప్పుడు ఇంట్లో మమతలు కనిపించేవి –
ఇప్పుడు ఇంట్లో వస్తువులు కనిపిస్తున్నాయి!
ఒకప్పుడు ఇంటి నిండా మనుషులుంటే ..
వస్తువులను చూడడానికి నుమాయిషీకి వచ్చేవాళ్ళం!
ఇప్పుడు ఇంటి నిండా వస్తువులుంటే …
మనుషులను చూసేందుకు నుమాయిషీకి వస్తున్నాం!!”

నేను నా శైలిలో ఎగ్జిబిషన్ పై ఒక మినీకవిత వినిపించాను.

” నాన్న చేయి పట్టుకొని నేను
దర్శించాను ఆమెను –
నా చేయి పట్టుకొని మా అబ్బాయి
దర్శించాడు ఆమెను –
మా అబ్బాయి చేయి పట్టుకొని నా మనుమడు
దర్శించాడు ఆమెను –
నిత్య యవ్వని – నుమాయి’షీ’! ”

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: