‘ఆధునిక కవిత్రయం’

‘ఆధునిక కవిత్రయం’

రచన: ‘పద్య కళాప్రవీణ’  డా. ఆచార్య ఫణీంద్ర

[పదహారు సంవత్సరాల క్రితం, ఆకాశవాణి-హైదరాబాదు కేంద్రం ద్వారా ప్రసారమైన నా సాహిత్య ప్రసంగం ఇది.]

ఆధునిక యుగంలో ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయిన పద్యాలను అందించిన మహాకవులు ముగ్గురు – దాశరథి, జాషువా, కరుణశ్రీ. వీరిని ‘ఆధునిక కవిత్రయం‘గా భావించవచ్చు. ఆంధ్ర సాహిత్యమున్నంత వరకు మననం చేసుకోదగిన మహాకవులు వీరు. వీరి కలాల నుండి జాలువారిన కొన్ని పద్యాలను కొన్నింటిని మననం చేసుకొని పరవశిద్దాం.
డా. దాశరధి –
 వ్రాసి వ్రాసి పొత్తమ్ములు మాసి నా క
లమ్ములో సిరా యింకి, రక్తమ్ము పోసి
అరుణ తరుణాక్షరాల పద్యాలు కూర్చి
ఆకలికి మాడిపోయెద నీ కొరకయి!  – అని పేదవాని గురించి పరితపిస్తూ కరుణ రసాన్ని కురిపించారు. ‘ఉస్సురనెదవు‘ అన్న శీర్షికలో చార్మినారు వద్ద రాతి కట్టడాల నిర్మాణంలో కష్టించే ఒక కూలిదానిని వర్ణిస్తూ –
 ఓసి కూలిదానా! అరుణోదయాన
మంటి తట్ట నెత్తిన బెట్టి, మరుగు లేని
ఎత్తు రొమ్మును పొంగించి ఎందు కొరకు
ఉస్సురనెదవు? ఆకాశ ముడికిపోవ!  – అంటూ అంగారాన్ని, శృంగారాన్ని కలబోసి అలరించారు. శ్రామిక జనానికి మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తూ –
 అంబర చుంబి సౌధముల కాయువు బోసెడి నీ శ్రమ ప్రభా
వంబు నెరుంగ లేని ధనవంతుల బంగరు పళ్ళెరాలలో
అంబలి పోసి త్రాగు సమయంబులు డగ్గరె లెమ్ము! నీ నవా
స్యంబున రుద్ర నేత్ర విలయాగ్నుల కుంకుమ బొట్టు పెట్టుమా!  అంటూ ఉద్బోధించారు. అణగారిన వర్గాలను ఉద్యమించమని ప్రబోధిస్తూ –
 ఈ సమాజాన దోపిడికే నివాస
మిందు నీ కేమి లేదు; సహింప రాని
వేదనయె గాని వేరు కన్పింపబోదు –
లే! చివాలున లేచి మళ్ళించు రథము!  – అన్నారు మహాకవి డా. దాశరథి.
 నా గీతావళులెంత దూరము ప్రయాణంబౌనొ – అందాక ఈ
భూగోళంబున నగ్గి వెట్టెదను; నిప్పుల్ వోసి హేమంత భా
మా గాంధర్వ వివాహమాడెదను; ద్యోమణ్యుష్ణ గోళమ్ముపై
ప్రాగాకాశ నవారుణాస్ర జల ధారల్ చల్లి చల్లార్చెదన్!  – అంటూ, ఇంకా …
 వీణియ తీగపై పదను పెట్టిన నా కరవాల ధారతో
గానము నాలపించెద; స్వకంఠము నుత్తరణంబొనర్చి స్వ
ర్గానకు భూమి నుండి రస గంగలు చిమ్మెద – పీడిత ప్రజా
వాణికి ‘మైక్‘ అమర్చి అభవాదులకున్ వినిపింప జేసెదన్!  – అని నినదించారా విప్లవ కవి.

ఈనాడు ప్రసిద్ధి చెందిన దళిత వాదానికి మాతృక మహాకవి జాషువా కవితల్లో మనకు దర్శనమిస్తుంది –
 నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూప రే
ఖా కమనీయ వైఖరుల గాంచి భళీ భళి యన్నవాడె నీ
దే కులమన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోవుచో,
బాకున గ్రుమ్మినట్లగును – పార్థివ చంద్ర! వచింప సిగ్గగున్!  – అని కుల వ్యవస్థను నిరసించారు జాషువా.
 గవ్వకు సాటి రాని పలుగాకులు మూక లసూయ చేత న
న్నెవ్విధి దూరినన్ నను వరించిన శారద లేచి పోవునే?
ఇవ్వసుధా స్థలిన్ పొడమరే రసలుబ్ధులు? గంట మూనెదన్ –
రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్!  అని ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించారు జాషువా మహాకవి.

ఈ సమాజంలోని అసమానతలకు కర్మఫలం కారణమన్న విషయాన్ని ఎద్దేవ చేస్తూ –
 కర్మ సిద్ధాంతమున నోరు కట్టి వేసి
స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు –
కర్మమన నేమొ? దాని కక్ష్య యేమొ?
ఈశ్వరుని చేత ఋజువు చేయించవమ్మ!  అన్నారు.
విగ్రహారాధనను సున్నిత హాస్యంతో మేళవించి నిరసిస్తూ –
 నిన్ను చూపుమని నే నర్చకుని వేడ –
చూడుమంచు గుడిని జూపినాడు!
గుడికి పోయి చూడ గుండ్రాయి వైనాడ
వెందు కిట్టు లైతి, వేడ్పు వచ్చు!  అని హేళన చే్సారు.
 ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని, దుః
ఖిత మతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్ప దీ భరత మేదిని! ముప్పది మూడు కోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తు లారునే? – అని మానవత్వం లేని దైవ భక్తి గర్హనీయమని ప్రకటించారు గుర్రం జాషువ.

కరుణ రసాన్ని కలంలో నింపి పద్య కవితలనల్లి మన కందించారు కరుణశ్రీ మహాకవి.
 మా వెల లేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించి పోమె – మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారవోతురు గదా! నరజాతికి నీతి యున్నదా?  అని పుష్పాల ఆవేదనను తన భావనలో పలికించారు కరుణశ్రీ జంధ్యాల పాపయశాస్త్రి. భాగవత కర్త పోతనామాత్యుని వర్ణిస్తూ –
 గంటమొ? చేతిలోది ములుగర్రయొ? నిల్కడ ఇంటిలోననో?
పంట పొలానొ? చేయునది పద్యమొ? సేద్యమొ? మంచమందు గూ
ర్చుంటివొ? మంచె యందొ? కవివో? గడి తేరిన కర్షకుండవో?
రెంటికి చాలియుంటివి సరే! కలమా, హలమా ప్రియంబగున్? – అంటూ కవిగా, కృషీవలునిగా ఆ మహాకవి సవ్యసాచిత్వాన్ని ప్రశంసించారు కరుణశ్రీ.

హత్యను చేయవచ్చిన హంతకుణ్ణి బాధితుడు ప్రశ్నిస్తున్నట్లుగా కరుణశ్రీ రచించిన ఈ పద్యం హృదయాన్ని కలచివేస్తుంది.
 హంత! ఇదేమి? నీదు ప్రణయాంక తటమ్మున నిద్ర పుచ్చి నీ
వింతటి వాడి కత్తి నిటు లేటికి గ్రుచ్చితివోయి? నిర్దయ
స్వాంతుడ! నాదు పేద హృదయమ్మున – చేయి కదల్పబోకు – ప్రా
ణాంతకమైన ఈ నరక యాతన గుండెలు మోయ లేవురా! 

ఆధునిక యుగంలో ఇలాంటి హృద్యమైన పద్యాలను రచించిన ఈ కవిత్రయం ఖ్యాతి తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు అజరామరంగా నిలిచి ఉంటుందన్న విషయం కచ్చితం.

— *** —

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. S.Ravi kumar
  ఏప్రి 01, 2012 @ 21:57:40

  chaala bagunnai sir. meeru kavithalu ilaage vrasthune undandi makosam.
  eemadhya kaalamlo vachina journy film nu nenu oka indian titanic ga bhavinchanu.
  manchi sandhesathmaka film nu manam ellappudu adharinchali sir.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఏప్రి 03, 2012 @ 23:11:10

  Thank you very much Ravikumar garu!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: