విశాద యశోద – 2

విశాద యశోద – 2

[ కంస వధానంతరం రేపల్లెకు తిరిగి రాని శ్రీ కృష్ణుని గూర్చి చింతిస్తూ, మాతృమూర్తి యశోద పడే ఆవేదన – రెండవ భాగం ]

రచన: ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

కం.           నిన్నయొ మొన్నయొ గాదయె!
                ఎన్నాళ్ళయె నిన్ను వీడి? ఇల్లంతట పల్
                గిన్నెలలో వెన్నను గన –
                కన్నులలో నీరు గారి కాల్వలు గట్టున్!

కం.          అన్నము రుచియింపదు –
               కన్నులకే నిద్ర రాదు – కాంచుచు నీకై
               కన్నులు కాయలు గాచెను –
               నిన్నే దలచుచు నిరతము నీరగుచుంటిన్!

ఆ.వె.      చల్ల చిలుకబోవ చల్ల ముంతను నీదు
               చారడేసి కనుల సౌరు దోచు –
               వెన్న నెత్తు వేళ గిన్నెలందున, నాటి
               మన్ను దిన్న నోటి మహిమ దోచు –

కం.         ఎన్నటికి వత్తువో యని
              కన్నుల నీరొలికి పైకి గాంచ నిరాశన్ –
              మిన్నున నల్లని మబ్బులు
              నిన్నే బోలుచు కనబడి నిట్టూరుచెదన్!

ఉ.          ఏ గది కేగినంత నటనే గలవేమొ యటన్న భ్రాంతి! నే
              నేగగ చెంతకున్, కనుల నీడలు గ్రమ్మి నిరాశ గల్గు! నే
              వేగుచు నుంటిరా విరహ వేదనమందున నిన్ని నాళ్ళుగా –
              వేగమె రమ్ము తండ్రి! ఇక వేదన నేను భరింపజాలరా!

ఉ.          తల్లిని నాదు సంగతిని దాపున నుంచుము – నిన్ను గాన కీ
              పల్లె కళా విహీనమయి బావురుమన్నటులున్నదయ్య! రే
              పల్లె ప్రజల్ మనమ్ముల నపార వ్యధాగ్నుల మ్రింగుచుండ్రి! తా
              తల్లడమల్లడంబగు గదా మరి నందవిభుండు నయ్యహో!

కం.        మందారమ్ములు పూయవు –
              సిందూరమ్ములు విరియవు – చినబోయిన దీ
              బృందావన మెల్లయు – గో
              విందా! నీ వేణుగీతి వినిపింప దటన్!

చం.        అట గనుచుంద్రు – లేవనుచు నా పయి నింకొక ప్రక్క గంద్రు – నీ
              వట నగుపించకున్న నిటు నాశగ జూతురు – కాన కిచ్చటన్

             “ ఎట గలడో? “ యటన్ వెదకి యెల్లెడ కానక నిన్ను కన్నయా!
              వెట వెట వెక్కి వెక్కి విలపించుచునుండిరి గోప కాంతలున్!

ఉ.         “నల్లని వాడు – పద్మ నయనంబుల వాడు – కృపా రసంబు పై

              జల్లెడు వాడు – మౌళి పరిసర్పిత పించము వాడు – నవ్వు రా

              జిల్లెడి మోము వాడిపుడు చెప్పరె యెచ్చట దాగెనో” యటన్

              పల్లియ లోన గల్గు ప్రతి వారికి ప్రశ్నల గ్రుచ్చుచుందురే!

కం.         సుందర గోపిక లింతకు
              ముం దనునిత్యమును వచ్చి మూగుచు నీపై
              నిందలు వేసిరి – ఇపుడీ
              సందులలో వేచి నిన్ను శ్లాఘింతురయో!

కం.         గొల్లల బాలురు సైతము 
               ఇళ్ళకు మళ్ళక, మనిల్లు నెల్ల వెదుకగా –
              “ వెళ్ళి తిరిగి రాలే “ దన –
               కల్లరి ననుకొంద్రు నన్ను కడు హీనముగాన్!

చం.        నిను గనకున్న గోవు లిట నిక్కిన క్రోధము తోడ మా యుర
              మ్మున తమ కొమ్ములన్ విసురు – ముత్తెమునంతయు పాల నీవు – పె
              ట్టిన తినబోవు మేతను – పటిష్ఠముగా బలపడ్డ వాని యా
              తనువులు బక్క జిక్కె – ఎటు తండ్రి! సహింతుము మూగ వేదనన్?

చం.        వల వల యేడ్చుచున్నవి దివా నిశలందున, కాన రాని నిన్
               తలపుల యందు నిల్పుకొని – తాండవమాడవు – ప్రీతి ధాన్యపుం
               బలుకులనైన ముట్టవు – ప్రభాసిత కేశ విభూష గాగ నీ
               తలను ధరించు పింఛముల తామిడునట్టి మయూర జాలముల్!

కం.          వెళ్ళిన పని ఇక చాలయ!
               ఎల్ల జనులు నీ వియోగ మిక నే మాత్రం
               బొల్లరు – అదెల్ల సరె! నీ
               తల్లి మనము నెరిగియైన  రారా!

[ ప్రస్తుతానికి సంపూర్ణం … కాని దీనిని ఇంకా విస్తరించి ఒక ఖండకావ్యంగా ముద్రించాలని నా తపన … ఆ పైన దైవేచ్ఛ! ]

 **** ఽఽఽ ****

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. padmarpita
  డిసెం 30, 2011 @ 03:59:45

  Wow..Good one!

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  డిసెం 31, 2011 @ 20:23:36

  పద్మ గారు!
  ధన్యవాదాలు! మీకు మీ కుటుంబ సభ్యులకు నూతనాంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: