‘బసవరాజు అప్పారావు గీతాలలో దేశభక్తి‘

‘బసవరాజు అప్పారావు గీతాలలో దేశభక్తి‘

(సుమారు 15 సంవత్సరాల క్రితం ఆకాశవాణిలో నేను చేసిన ప్రసంగం ఇది. ఆకాశవాణి – హైదరాబాదు కేంద్రంలో అప్పుడు సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులుగా ఉన్న ప్రముఖ కవి శ్రీ సుధామ గారి కోరిక మేరకు కాస్త పరిశోధన సలిపి ఈ ప్రసంగ పాఠాన్ని రూపొందించాను. రెండు రోజుల క్రితం పాత పేపర్లను వెదుకుతుంటే కనిపించింది. ఆసక్తి గల సాహిత్యాభిమానుల కోసం ఈ 65వ స్వాతంత్ర్య దినోత్సవం సంబరాల ప్రారంభ వేళ … ఇక్కడ ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర )

భావ కవిత ఉజ్జ్వలంగా విరాజిల్లుతున్న రోజులలో గీతాలతో తనదైన ముద్రను తెలుగు సాహిత్యంలో ప్రతిష్ఠింప జేసుకొన్న మహాకవి బసవరాజు అప్పారావు గారు. “గుత్తొంకాయ్ కూరోయ్ బావా! కోరి వండినానోయ్ బావా! కూర లోపల నా వలపంతా కూరి పెట్టినానోయ్ బావా!” వంటి అత్యంత ప్రసిద్ధి నొందిన గీతాలను రచించిన అప్పారావు గారి గీతాలలో దేశభక్తికి విశిష్ట స్థానం ఉంది.

“కొల్లాయి గట్టితేనేమి మా గాంధి …” అంటూ గాంధి గుణ గణాలను వర్ణిస్తూ, ఆనాటి స్వాతంత్ర్యోద్యమానికి ఆంధ్ర దేశంలో స్ఫూర్తినిచ్చారు అప్పారావు గారు. ” నాల్గు పరకల పిలక – నాట్యమాడే పిలక – నాలుగూ వేదాల నాణ్య మెరిగిన పిలక – ” అంటూ, ఇంకా ” చక చక నడిస్తేను జగతి కంపించేను – పలుకు పలికితేను బ్రహ్మ వాక్కేను – ” అంటూ సాగిపోయే ఈ గీతం ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపింది. మరొక గీతంలో గాంధీజీని వర్ణిస్తూ – ” హిందూ పైగంబర్ జన్మించినాడోయ్ ” అని అన్య దేశీయ పదాలతో ఆకట్టుకొంటారు బసవరాజువారు. ” గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్విందీ – జగత్తు కలకల నవ్విందీ – ” అన్న గీతంలో గాంధీజీ నడకను, నవ్వును, చూపును, మాటను కీర్తిస్తారు బసవరాజు అప్పారావు గారు. ఆనాటి స్వాతంత్ర్యోద్యమమంతా గాంధీజీ చుట్టూ పరిభ్రమించింది. అందుకే అప్పారావు గారి దేశభక్తి గీతాలలో చాలా మట్టుకు గాంధీని వర్ణించడం, శ్లాఘించడం కనిపిస్తుంది.
“ఎవరేశారీ మత్తు మందు – ఎన్నాళ్ళ దాకాను ఈ మొద్దు నిదుర -” అన్న గీతంలో ” గాంధీ మహాత్ముడు కనిపెట్టినట్టి ఈ సత్యాగ్రహ మంత్రముతో ఈ మత్తు తగ్గేనో -” అని సత్యాగ్రహోద్యమాన్ని ప్రస్తుతించారు. అలాగే ఉప్పు సత్యాగ్రహాన్ని ఉటంకిస్తూ వ్రాసిన ఒక గీతమూ ఉంది. ” గాంధీ మహాత్మ! గాంధీ మహాత్మ! కాచి రచ్చించు గాంధీ మహాత్మ! ” అన్న ఈ గీతం పల్లెవాసపు దళితులు గ్రామ్య భాషలో పాడినట్టు రూపు దిద్దబడింది. ” సరకారువోరు కరకైనవోరు – ఉప్పేరితేను తప్పేశినోరు – ” అంటారా దళితులు. ఆ రోజులలోనే కుల వివక్షను నిరసించే భావాలను ఆ దళితులతో పలికించారు అప్పారావు గారు. ” మాల మాదిగలం – మనుసులం గామా ? కుక్కల కన్నా తక్కువయ్యామా ? ” అంటూ హృదయాన్ని కదిలించే విధంగా ప్రశ్నిస్తారు వారు. ” కాచి రచ్చించు ” అనడంలో ఆనాటి దళితులకు గాంధీజీపై ఉన్న భక్తి విశ్వాసాలు ప్రస్ఫుటమౌతాయి.

స్వాతంత్ర్యోద్యమంలో పాలు పంచుకొనడానికి ప్రజలను జాగృతం చేసే గీతాలలో ” వేణు నాదము మోగుతుందండోయ్ – ఓ భక్తులారా! వేణు నాదము మోగుతుందండోయ్ – ” అన్న గీతం ఒకటి. ” వేగు జామూ కోడి కూసె – వేగు చుక్కా తూర్పున బొడిచె – వేగమె నిద్దుర లేచి రండోయ్ – వేళ మించి పోయేనండోయ్ – ” అంటూ ” భారత దేశపు దాస్యము బాపగ పయనమైన మోహన గాంధీ ” ని అనుసరించమంటారు ప్రజానీకాన్ని. అందుకోసం – ” భార్యల విడిచీ భర్తలు రండోయ్ – భర్తల విడిచీ భార్యలు రండోయ్ – తల్లుల విడిచీ పిల్లలు రండోయ్ – పిల్లల విడిచీ తల్లులు రండోయ్ -” అంటూ త్యాగ నిరతిని నూరి పోస్తారాయన. స్వదేశీ ఉద్యమాన్ని సమర్థిస్తూ, విదేశీ దుస్తులను ధరించే వారిని కాస్త ఘాటుగానే ప్రశ్నిస్తారు – ” సిగ్గూ లేదా? నీకు శిరమూ లేదా? అన్నమైనా లేక బీద లల్లాడుతుంటేను సీతాకోక చిలుక లాగా సీమ గుడ్డ కట్టి తిరుగ – ” అంటూ విదేశీ దుస్తులు ధరించే వారిని శిరమెత్తుకోలేని విధంగా విమర్శించారు. జాతీయ పతాకాన్ని చూచి అప్పారావు గారు నిలువెల్ల దేశభక్తితో పులకించిపోయారు. అందుకు తార్కాణం – ” పతాకోత్సవం సేయండీ – స్వతంత్ర భారత జాతి చిహ్నమౌ పతాకోత్సవం సేయండీ – ” అన్న గీతం. ” వీర కేసరుల యెర్రని రంగూ – దేశ సేవకుల తెల్లని రంగూ – భక్తుల పాలిటి పచ్చని రంగూ – బీదల పెన్నిధి రాటపు మెరుపే – అన్ని మతాలకు, అన్ని తెగలకూ ఆశ్రయ మీ జండా ఒకటేనోయ్ -” అంటూ పతాకౌన్నత్యాన్ని వర్ణించారు. ” ప్రాణము పోతే పోనీ – జండా మానము మాత్రము మంట గలపక పతాకోత్సవం సేయండీ -” అన్న బసవరాజు వారి దేశభక్తి ప్రస్తుతింపదగినది. స్వాతంత్ర్యానికి పూర్వమే బసవరాజు అప్పారావు గారు “స్వరాజ్య లక్ష్మికి పెండ్లి”ని తన మనోఫలకంపై రమణీయంగా ఊహించారు. ” సంద్రమె పెళ్ళి పీట – సదస్యులు దేవతలంట – ఉప్పే తలంబ్రాలటా – మన లక్ష్మి పెండ్లికి గాంధీ వశిష్ఠుడంట – కస్తురమ్మ ముత్తైదువంట – ” అంటూ కల్యాణం జరిపించి ఉప్పొంగిపోయారు అప్పారావు గారు. అయితే ఆ స్వరాజ్య లక్ష్మి సాకారం కాక ముందే ఆ మహాకవి అస్తమించడం విధి విలాసం.

ఇలా ఎన్నో దేశభక్తి గీతాలనల్లిన బసవరాజు అప్పారావు గారు ఇంకా ఎన్నో మధుర గీతాలను రచింపవలసియుండగా 39 ఏళ్ళ పిన్న వయసులో పరమపదించడం ఆంధ్ర సాహిత్యానికి తీరని లోటు. గేయ సాహిత్యం నిలిచి ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయ పీఠాలపై బసవరాజు అప్పారావు గారు నిలిచే ఉంటారు.

                                           — *** —

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: