‘అమ్మ పదం‘

ఇటీవల ‘జి.ఎం.ఆర్. వరలక్ష్మి ఫౌండేషన్‘ వారు ప్రముఖ రచయిత్రి ‘ఘంటసాల నిర్మల‘ గారి సంపాదకత్వంలో వెలువరించిన ‘అమ్మ పదం‘ కవిత్వ సంకలన గ్రంథంలో అచ్చయిన నా కవిత ‘అమ్మ బొమ్మ‘ ను ఈనాటి ‘మాతృ దినోత్సవం‘ సందర్భంగా అందిస్తున్నాను.

అందరికీ ‘మాతృ దినోత్సవ‘ శుభాకాంక్షలతో –

– డా. ఆచార్య ఫణీంద్ర

‘అమ్మ బొమ్మ’

మహిని సృజియింప తొలుదొల్త ‘మాతృమూర్తి’
తలమునుకలునై ‘శ్రీహరి’ దైవముండె !
స్వామి ఏకాగ్రతయు, దీక్ష – సాధ్వి ‘లక్ష్మి’
కాంచి, తుడిచి స్వేదమ్ము చేలాంచలమున,
” అంత విశ్వంబు సృష్టించునపుడు గూడ
ఇంతగాను శ్రమించి మీ రెరుగబోరు !
కొంచె మెక్కువే కష్టంబు కోర్చి, మీరు
అతిగ ఆయాసపడుచుంటి ” రనిన – అతడు
” అవును ! నే తీర్చుచున్నట్టి ‘అమ్మ’ బొమ్మ
నూట ఎనిమిది కీళ్ళతో నుండి కదులు !
ఆరు జతల హస్తా, లింక ఆరు కళ్ళు –
మిగులు తిండితో ఇవియన్ని మెదలవలయు –
ఊపునూయలై పాపాయి నొక్క చేయి –
ఒలికి జలము, ‘లాలలు’ పోయు నొక్క చేయి –
‘ఉంగ’ యని నోట బువ్వొత్తు నొక్క చేయి –
దిద్ది తీరుచు నొక చేయి దిష్టి చుక్క ! “
” ఆరు కళ్ళేల ? ” ఆసక్తి నడిగినంత –
” రెండు కళ్ళు చూచుచు ముందు నుండి, బిడ్డ
నూరకే నయము భయమునుంచ నడుగు
‘ఏమి చేయుచున్నా’ వంచు, ఎరిగి గూడ !
రెండు కళ్ళు వెనుక వైపు నుండి చూచు
బిడ్డ యొనరించకుండ నే చెడ్డ పనులు !
మరియు రెండు కళ్ళు కరుణ, మమత కురిసి
పలుకు ‘బిడ్డయే నా పంచ ప్రాణము’ లని !
ఉక్కువలె లక్ష్యమున్నట్టి ఉల్లముండు –
తుప్పు పట్టబోదైన నే తునక గూడ !
అలసినంత నెవ్వరి కద్ది తెలియనీదు –
తెరవుగొని తనంతట తాను తేరుకొనును !
ఆమె కూర్చుండ ‘ఒడి’ తీరు నాదరింప –
ఆమె నిలుచుండ, మాయమౌ నదియె – వింత !
ఆమె చుంబించ నుదుటిపై అమృతమొలికి,
గాయపడినట్టి గుండెలో కరవు దీరు !
ఇన్ని మాటలేల ? – ఇది నా కించుమించు
బింబ, ప్రతిబింబ భావమై పిలువబడును ! “
అనిన శ్రీనాథు, కాశ్చర్యమంది లక్ష్మి
పలికెనిటు, చూచి యది పరిపరి విధాల –
” ఇద్ది యేమి చెక్కిలి పైన ఈ ద్రవమ్ము ?
తమకు లేనట్టి దేదొ ఈ యమకు గలదు ! ” –
” అదియె కన్నీరు ! నా సృష్టి యద్ది కాదు !
ఇన్ని పొదుగంగ, తనకు తా నేరుపడెను !
ఆమె ఆవేదనను పొంద నద్ది కారు –
ఆమె మోదంబు మితిమీర నద్ది కారు –
ఆమె తన్మయంబొందగా నద్ది కారు –
ఆమె ఆత్మీయతను పంచ నద్ది కారు ! “
అనగ వినగ నా శ్రీదేవి కంతలోన
ఏమి అనుభూతి కలిగెనో హృదయమందు –
ఆమె చెక్కిళ్ళ జాల్వారె నా ద్రవమ్మె !
‘అమ్మతన’ మొందె నారీతి ఆమె గూడ !

              —-***—-

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. ramnarsimha
  మే 15, 2011 @ 15:40:32

  Nice Post.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  మే 21, 2011 @ 20:08:13

  Thank you Ramnarsimha garu!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: