గడ్డి పూవు

గడ్డి పూవు

రచన: ‘పద్య కళాప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

నేనొక గడ్డి పూవు – మరి నీవొక సాగెడి బాటసారి – నీ
ధ్యానము వింత వింతలయి, దర్శన భోగ్యములౌ స్థలంబులున్;
చానల సోయగమ్ములును; సంపెగ, జాజులు, మల్లె తోటలం
దానునులే! గరీబునిక – ఆదర మెట్టుల యబ్బు నా కిలన్?

నీరదమే, ధరిత్రిపయి నిక్కియు నిల్చిన పర్వతంబుతో

తా రమియింపగా, కురియు ధారలు గట్టిన వీర్యవర్షమే

పారుచు నొక్కమూల నెదొ పాపమెరుంగని నేల గుంతలో

జారగ, రూపు దిద్దుకొని జన్మమునొందు ననాధనే సుమా!

 

పూజలు సేయగా; సొగసు పొల్తుకలే సిగలోన దాల్చగా;
రాజుల గౌరవింప, మెడ రాజిల వేసెడి మాల గూర్చగా;
మోజుల యందు దంపతులు మున్గెడి శయ్య నలంకరింపగా –
ఏ జనమైన మెచ్చెదరె ఈ ముదనష్టపు గడ్డి పూవులన్?

త్రొక్కుచు పోవునొక్కడు; సుదూర ప్రయాణము సేయు బండికిన్
ప్రక్కల గల్గు చక్రములు పైబడి సాగగ నడ్పు నొక్కడున్;
క్రక్కి విషంబు నొక్కడయొ! గ్రక్కున నేలను పీకివేయు – నే
వెక్కియు వెక్కి యేడ్చెదను – విన్నటువంటి మహాత్ముడెవ్వడే?

పుట్టెద నెందుకో యను నపోహయె గల్గును మానసంబునన్ –
పట్టదు నాదు జీవితము, భాగ్యము నేరికి లోకమందునన్!
పుట్టెడు సౌరభమ్ములను, పుష్ప మరందము లీయలేను – నే
కట్టలు త్రెంచుకొన్న గతి కార్చెద కన్నుల నీరు మాత్రమే!

పూవులందు ’దళిత’ పూవునై నిలుతును –
అగ్ర వర్ణ పుష్ప మందునట్టి
గౌరవమ్ము నేను కాసింత నోచనా?
అణచివేత నాకు నబ్బె గాదె!

’సమ సమాజ’మని ప్రసంగించు మానవా!
సుమ సమాజము నటు చూడలేవె?
సుమ సమాజమందు చూపించి కరుణనే
సమ సమాజ దృష్టి సాగనిమ్ము!

=== *** ===

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. sarath
  ఫిబ్ర 13, 2011 @ 05:07:29

  chala baaga raasaaru maastaaru….

  స్పందించండి

 2. కంది శంకరయ్య
  ఫిబ్ర 13, 2011 @ 06:58:57

  ఆర్య! శుభోదయ మ్మిదె! యనాదర మందుచు, సోలిపోవుచున్
  ధైర్యముఁ గోలుపోయి కడు దైన్యదశం గను గడ్డిపూల కే
  చర్య యొసంగు సాంత్వనము? చక్కని కైతను జెప్పినట్టి యా
  చార్య ఫణీంద్ర! మీ కవన చాతురికిన్ గయిమోడ్చి మ్రొక్కెదన్.

  స్పందించండి

 3. Dr. Acharya Phaneendra
  ఫిబ్ర 13, 2011 @ 20:55:38

  శరత్ గారు! ధన్యవాదాలు!

  స్పందించండి

 4. Dr. Acharya Phaneendra
  ఫిబ్ర 13, 2011 @ 20:57:39

  అందించితి వభినందన,
  కుందిన నా ’గడ్డిపూవు’ గోడును వినియున్ –
  సుందరమగు పద్యములో!
  వందన మిదె శంకరయ్య! పండిత వర్యా!

  స్పందించండి

 5. ramnarsimha
  మార్చి 22, 2011 @ 13:24:32

  Abhinandanalu.

  స్పందించండి

 6. Dr. Acharya Phaneendra
  మార్చి 24, 2011 @ 07:54:17

  Ramnarsimha garu!
  Thank you sir!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: