దీపమారిన చీకటి తీరమందు …

దీపమారిన చీకటి తీరమందు …

రచన : ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

కోవెల వంటి ఇంట, ఘన ‘కోవెల’ నామ కులీన దీపమై,
‘కోవెల సోదర ద్వయము’ కుందులలో కుడి ప్రక్క దానిలో
నీవు ప్రకాశమొందితి, వినిర్మితి జేయుచు కావ్య కాంతులన్ –
కోవెల సంపతార్య ! మది కోవెల జేసియు వాణి గొల్వగన్ !

‘కాలస్పృహ’, ‘అంతర్మథ
నా’లను కూర్చితివొ – ‘చేతనావర్తము’లై
ఆలాపించగ ‘హృద్గీ
తా’లయె, ‘ఆనంద లహరి’ తాండవమాడన్ !

విశ్వవిద్యాలయాచార్య ! విబుధ వర్య !
తీర్చి విద్యార్థి గణములన్ దిద్దినావు !
లక్ష్య శుద్ధి నల్లితి పల్ విలక్షణమగు
కవన లక్షణ సువిమర్శ గ్రంథములను !

ఇంపారగ వెలయించుచు
సొంపగు వ్యాఖ్యానములను స్ఫూర్తి, కృతులకున్ –
సంపత్కుమార వర ! ఘన
సంపత్తిని కూర్చి తాంధ్ర సాహిత్యమునన్ !

ఖ్యాతి నొందితి పరిశోధకాగ్ర మణిగ !
సాటి లేని విమర్శక ! సంపతాఖ్య !
నీ మృతి వలన – సాహితి నిలుచు నింక
దీపమారిన చీకటి తీరమందు !

( సుప్రసిద్ధ విమర్శకులు, కవి ‘ఆచార్య కోవెల సంపత్కుమార’ మృతికి సంతాపంగా … )

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

  1. కంది శంకరయ్య
    ఆగ 08, 2010 @ 15:31:37

    ఫణీంద్ర గారూ,
    కోవెల సంపత్కుమార గారిపై మీ స్మృతి పద్యాలు బాగున్నాయి. ధన్యవాదాలు. కోవెల సోదరద్వయంతో నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది. ఇద్దరిలో నన్ను సంపత్కుమార గారి వ్యక్తిత్వం ఆకట్టుకుంది. ఆయన నిరాడంబరుడు, నిగర్వి. స్నేహశీలి, ఎప్పుడు వెళ్ళినా సాదరంగా కూర్చోబెట్టి ఓపిగ్గా సందేహ నివృత్తి చేసేవారు. ఛందస్సు వారి అభిమాన విషయం. వారిపై మీరు వ్రాసిన పద్యాలకు మరోసారి ధన్యవాదాలు.

    స్పందించండి

  2. Dr.Acharya Phaneendra
    ఆగ 08, 2010 @ 22:54:49

    శంకరయ్య గారు!
    కోవెల సోదర ద్వయం ఆంధ్ర భారతి ముద్దు బిడ్డలు. వారిద్దరూ నాపై కూడా వాత్సల్యం వర్షించినవారే. ముఖ్యంగా సంపత్కుమార గారితో నాకు ఒక దశాబ్దికి పైగా సన్నిహిత పరిచయ భాగ్యం ఉంది. సంపత్కుమార గారి మరణం
    తెలుగు విమర్శ రంగానికి తీరని లోటు. వారి స్వహస్తాలతో నాకందించిన వారి ’ఆముక్త’ కావ్యం, వారి స్మృతి చిహ్నంగా నాకు మిగిలింది.
    మీకు నా ధన్యవాదాలు.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: