నీటికి కష్టమై …

నీటికి కష్టమై …

రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా|| ఆచార్య ఫణీంద్ర

” నీటికి కష్టమై కనుల నీరిడు కాలము దాపురించె – ఏ

నాటికి తీరునో వెతలు నా ” కని ఏడ్చెడు నా లతాంగి క

న్నీటిని మాపు వేళ ఇదె నేటికి వచ్చెను; నాదు భాగ్యమై

మూటెడు డబ్బు చేతికిని ముట్టెను ’ జీతపు పాత బాకి ’ గాన్ !


గొట్టపు బావి యొకటి నే

కొట్టించెదనంచు పలుక, కోమలి హృదిలో

పుట్టెడు సంతోషముతో

పెట్టెను బుగ్గలను ముద్దు, ప్రేమ కురియుచున్ !


మంచి దినము జూచి, మాటాడి యంత్రమున్,

పొలతి తోడ గూడి పూజ చేసి

ఇంటి కొక్క ప్రక్క ఈశాన్యమున, ఊట

కూప మపుడు త్రవ్వ గోరినాను.


మట్టి గంగగా మార్చెడు మంత్రగాడు –

దాహమును తీర్ప వచ్చిన తంత్రగాడు –

అభినవ భగీరథుండగు యంత్రగాడు –

మహిని దింపగా మొదలిడె మరను ద్రిప్పి –


’ గిర గిర ’ తిరుగుచు చొరబడె

త్వరితంబుగ తొలచుచు మర ధరణీ తలమున్;

హరి కరము వీడి ’ సుర సుర ’

అరి భంజన కొరకు చక్రమరిగెడు కరణిన్ !


తడి తడి మట్టి ముద్దలను తన్నుచు గ్రక్కుచునుండ యంత్రమున్,

పొడి పొడి నాదు మోవి తడి పుట్టుచునుండెను, కోర్కి మీరుచున్ !

పడి పడి చూచుచుంటినట – ప్రాప్త మదెప్పుడటంచు నార్తియై !

” పడునది ! ఏల తొందర ” ని ప్రక్కకు త్రోసెను కార్య దీక్షుడే !


తడి మట్టి వచ్చి, వచ్చియు

కడకది మా కర్మమేమొ ! కను మరుగగుచున్

పొడి మట్టి బయల్వెడలెను –

దడ పుట్టెను నాకు హృదిని, దరిశింపంగన్ !


” ఏమండీ ! ఇదియేమి శాపమని నా ఇల్లాలు బెంబేలుగా

భూమాతన్ మనసార మ్రొక్కె దయకై, భోరంచు రోదించుచున్ –

” ఏమీ బేల తనం ” బటంచు సతితో నేనెంత ఓదార్చినన్,

” ఏమో ! ఏమగునో ! ” యటంచు మదిలో నెంతైన సందేహమే !


సంశయించినటులె సగములో మర నాపి,

జలము లేదటంచు తెలిపె నతడు –

” ఇంత ఖర్చు చేసి, ఇదియేమి నాయనా !

ముందు కేగు ” మంచు మొరను బెట్ట –


” పడినదొక పెద్ద బండయె !

పడలేమిక ముందుకేగి బాధలయందున్ –

పడదిట జలమిక ! తెలియుడు !

పడదొకచో ! పోదుమిడిన పైకం ” బనియెన్ !


బండ పడెను త్రవ్వు బావిలోనే కాదు;

బండ పడెను నాదు గుండెలోన –

దాహమారుట పోయి, దాహ మధికమయ్యె

కుల పత్ని కక్కటా ! గొంతులోన –

దక్కక, దక్కక, దక్కిన దనుకొన్న

ధనమెల్ల కరిగెను ధరణిలోన –

గొంతును తడుపుటే గొంతెమ కోర్కియై

చతికిల బడితిని బ్రతుకులోన –


బిక్క మొగము వేసి, బేలగా నా వైపు

భార్య చూడ – నాకు బాధ కలిగి,

ఆమె దప్పి తీర్ప నసమర్థుడనటంచు

తలచి, దించుకొంటి తలను నేను !


నీటికి కష్టమై, కనుల నీరిడు కర్మము వీడదాయె – క

న్నీటికి మాత్రమే కొరత నిత్యము, సత్యము ! లేకపోయె – మా

బోటుల మధ్య వర్గముల పూడిన గొంతులు పూడు నూతులే !

ఏటికి ఈ ప్రభుత్వములు ? ఎప్పుడు కన్నులు విప్ప నేర్చునో ?


— ***** —ప్రకటనలు

8 వ్యాఖ్యలు (+add yours?)

 1. నరసింహారావు మల్లిన
  జూన్ 17, 2010 @ 19:40:22

  చాలా బాధ కలిగింది సార్, మీకు మీ శ్రీమతి గారికి నా సహానుభూతి.
  పరమేశుని ప్రార్ధింపుడు
  పరమేశా గంగ విడువు, పార్వతి నీదోయ్
  పరమేశుడె దిక్కు మీకగు
  పరమేశుడె గంగ విడచు భాగ్యనగరికిన్.
  ఇది నా ప్రార్ధన.
  సరిగా వచ్చినట్లులేదు, తప్పులున్నట్లున్నాయి, క్షమించగలరు.

  స్పందించండి

 2. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
  జూన్ 17, 2010 @ 20:26:49

  బోరు వేయటాన్ని ఇంత కమ్మగా పద్యాలలో చెప్పారు.బావుంది సార్

  స్పందించండి

 3. రవి
  జూన్ 17, 2010 @ 20:57:28

  మీరు అందమైన పద్యాలుగా రూపొందించినా, వెనుక దుఃఖమే కనబడుతున్నది. ఈ ప్రభుత్వాలు దోచుకునేకే గానీ, మరెందుకూ పనికి రావు.

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  జూన్ 17, 2010 @ 22:48:46

  మల్లిన నరసింహారావు గారికి నమః
  సార్.. సార్… మీరు మరీ అంత బాధపడి సానుభూతి చూపేంత ’ సీన్ ’ మాకు లేదు. ఈ కవిత నా స్వీయానుభవం కాదు.
  తెలంగాణంలో సగటు మధ్య తరగతి కుటుంబాల బాధను ఒక కవిగా ఆత్మాశ్రయ రీతిలో వ్రాసాను. అంతే ! ఏమైనా, ఈ కవిత మిమ్మల్ని అంతగా కదిలించినందుకు ఆనందంగా ఉంది. మీకు నా ధన్యవాదాలు.

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  జూన్ 17, 2010 @ 22:57:13

  శ్రీకాంత్ గారు !
  మీరు బోరు వేయడం సంగతే వ్రాసారు. అది ఫెయిలయి ఆ దంపతులు పడ్డ ఆవేదన గురించి కూడా సమీక్షిస్తే, ఇంకా ఆనందించే వాణ్ణి. మీకు నా ధన్యవాదాలు.

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  జూన్ 17, 2010 @ 22:59:22

  రవి గారు !
  కవిత ఆత్మను పట్టుకొన్నారు. మీకు నా ధన్యవాదాలు !

  స్పందించండి

 7. హరి దోర్నాల
  జూన్ 18, 2010 @ 20:26:03

  ఆచార్య ఫణీంద్ర గారు,

  చాలా బాగా వ్రాసారు సార్, తెలంగాణా కన్నీటి గాధని.

  స్పందించండి

 8. Dr.Acharya Phaneendra
  జూన్ 18, 2010 @ 22:48:52

  హరి గారు !
  ధన్యవాదాలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: