దోషమె కంఠమెత్తినన్ ?

దోషమె కంఠమెత్తినన్ ?

రచన: ‘పద్య కళా ప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

ఏ రైతాంగమె ఆ ‘నిజాము’ విభుతో, ఈ భూమి మాదేయటన్
పోరాటంబును సల్పి సాయుధులునై, పొందెన్ తెలంగాణమున్ –
ఆ రైతాంగము నష్టపోయెను విశాలాంధ్రమ్ములో చేరుటన్ !
నీరే అందదు పంట కాల్వలకు – కన్నీరేమొ పొంగారెడిన్ !

కోస్తా, సీమల ముఖ్యమంత్రులకు సంకోచమ్మె లేకుండ, ఆ
కోస్తా ప్రాంతపు రైతు లాభములయెన్ కొండంత లక్ష్యంబుగాన్ !
బస్తాల్ నింపుచు బండ్ల కెత్తుటయె ఆ ప్రాంతంపు భాగ్యంబునై;
పస్తుల్ పండుట, ప్రాణముల్ విడుట ఈ ప్రాంతంపు ప్రారబ్ధమా ?

కిలకిలా నగవుల కృష్ణ , గోదావరుల్
తొలుత తాకు నిచట తెలుగు నేల !
పారి, దాటిపోవు – పంట భూముల యొక్క
దాహములను తీర్ప తలపడెవడు !

సకలారిష్టములన్ని దాటి, తుదకున్ సాధించి ఈ ప్రాంతమం
దొకరో, ఇద్దరొ ముఖ్యమంత్రులయి, తామూనంగ సద్వృద్ధికై
వికలంబౌనటు ‘లాంధ్ర’* నాయకులయో ! విద్వేషముల్ చిందరే ?
ఒకటే లక్ష్యము – వారి పెత్తనమె ! లేకున్నన్ ప్రభుత్వమ్మె ’హుష్’ !
( * ఇది ఇక్కడ ’భాషా వాచకం’గా కాక, ’ప్రాంత వాచకం’గా ప్రయోగింపబడిందని గమనించ గలరు )

ఏటికి ఎంచుట ఇవి ? ఆ
మాటయె పలుక – తెలగాణ మంత్రులయందున్
నూటికి తొంబది, ఎంగిలి
కూటికి ఆశపడుచుండు కుత్సితు లకటా !

వ్యవసాయంబున కూత లేదు – మరి విద్యా సంస్థ, లుద్యోగముల్,
భవనాల్, భూములవన్ని దోచ వలసల్ వచ్చున్న కామందులే;
అవి పోవన్, మిగులేవొ కొన్ని ఇట వారందేరు ! దుర్భాగ్యులౌ
యువకుల్ గాంచిది గుండె మండి, మరి పోరో ‘నక్సలైట్’ దారిలోన్ ?

ఇవియునన్ని గాక, ఇంక దారుణ మిద్ది –
ఇచటి పేదలన్న ఏదొ లోకు,
విచటి భాషయన్న ఏదో చులకన ! ఇం
కిచటి సంస్కృతియన హేళనమ్ము !

ఏకమైయున్న, ఆగబోదింక దోపి
డిట్లు ! అయిన దేదియొ ఆయె – నింక మీద
వీడి, అన్నదమ్ముల వోలె వేరుపడిన –
ఎవరి అభివృద్ధికై వార లేగవచ్చు ! 

అమ్మ ! ఇదేమి చిత్రమొ ! ఇదంతయు నింతగ సత్యమై కనన్ –
ఇమ్ముగ పల్కుచుంద్రు, కడుపెల్లయు నిండగ, జీవితమ్ము ప
బ్బమ్ముగ గడ్పుకొంచు గలవారె ‘సమైక్యత’ యంచు ! నోటిలో
దుమ్మునుబడ్డ వారలిక దోషమె వేర్పడ కంఠమెత్తినన్ ?
___ *** ___

 

ప్రకటనలు

11 వ్యాఖ్యలు (+add yours?)

 1. Giri Dornala
  డిసెం 13, 2009 @ 18:56:21

  ఆచార్యుల వారికి జోహార్లు. తెలంగానా ప్రజల మనోభావాలకి అద్దం పట్టినట్టు చెప్పారు.

  స్పందించండి

 2. kola
  డిసెం 13, 2009 @ 19:18:50

  Bagundhi. good poem.

  స్పందించండి

 3. అనానిమకుడు
  డిసెం 13, 2009 @ 19:37:08

  హతవిధీ! నీవు కూడా తెలబానువేనా? సిగ్గులేదూ? ఆంధ్రమున ఇంత విద్వత్తు సాధించి కన్నతల్లినే నరకబూనిన కసాయి కవివి నీవు.

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  డిసెం 13, 2009 @ 22:53:35

  గిరి గారికి, కోల గారికి
  హృదయ పూర్వక ధన్యవాదాలు !

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  డిసెం 13, 2009 @ 23:08:03

  అనానిమకుడు గారు !
  ఏమిటి ? ” సిగ్గా ” ?
  చిన్నప్పటి నుండి ఎక్కడ ఒక మంచి పద్యం రచించి, చదివినా – ” మీదే వైపూ ? ” అని నా తెలుగు తల్లికే పుట్టిన సహోదరులే అడిగి, చెప్పగానే – ” మీది తెలంగాణా ? మరి మీ తెలుగేటీ – ఇంత బావుందీ ? ” అన్నప్పుడు …
  జాషువా కవీంద్రుడన్నట్లు ” బాకున గ్రుమ్మినట్లగును – పార్థివ చంద్ర ! వచింప సిగ్గగున్ ! ” అని కుమిలిపోయిన వాణ్ణి మరి !
  నాకిప్పుడు 48 ఏళ్ళు. తెలంగాణ వాదం నా కంటె ముందే పుట్టింది.
  హస్తినాపురంలో తమ భాగాన్ని అడిగిన పాండవులు ” కన్నతల్లిని నరికిన కసాయిలే ” అయితే … నన్నూ అలాగే అనుకోండి !

  స్పందించండి

 6. kanred
  డిసెం 14, 2009 @ 12:50:38

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  డిసెం 14, 2009 @ 13:53:32

  KANRED గారు!
  నేను రాజకీయ నాయకులకు భజన చేసే వాణ్ణి కాదు.
  KCR పై NDTV సంపాదకుని అభిప్రాయాన్ని నాకెందుకు పంపారో నా కర్థం కాలేదు.
  ఆ మాటకి వస్తే, రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఆయనలోని మంచిని మాత్రమే గ్రహించి, పద్యాల్లో నివాళిని టపాగా అందించిన వాణ్ణి నేను.
  దీనికి కారణం … ఇంకా చాలా మంది ” ’తెలంగాణ వాదం’ KCR సృష్టి ” అన్న దురభిప్రాయంతో ఉండడమే. ఆ దురభిప్రాయాన్ని వీడి, ’తెలంగాణ వాదం’ లోని మౌలికాంశాలను అధ్యయనం చేస్తే గాని, తెలంగాణీయుల కష్ట నష్టాలు అర్థం కావు. ప్రజలలో ఒక వేళ, మీరంతా అనుకొన్నట్టు – ’తెలంగాణ వాదం’ లేదనే అనుకోండి. జరుగుతున్న మోసాలు, అన్యాయాలు కొనసాగవచ్చా ? ద్రష్టగా వాటినన్నిటిని గూర్చి చెప్పి, ప్రజలను జాగృతపరచవలసిన కవి నోరు మూసుకొని కూర్చోవాలా ?
  ఇలా ఏదో సమాచారాన్ని పోస్ట్ చేసే బదులు, విషయాన్ని పక్క దారి పట్టించకుండా, నా పద్యాల్లోని ఒక్కొక్క అంశాన్ని ఎత్తుకొని, అవన్నీ సత్య దూరమని నిరూపించే ప్రయత్నం చేస్తే, మీ హృదయ వైశాల్యాన్ని గుర్తించేవాణ్ణి.

  స్పందించండి

 8. pannaga
  డిసెం 18, 2009 @ 00:21:15

  ఎవరు వద్దనుకొన్నా లేక కావాలనుకొన్నా, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ఒక్కో అడుగు ముందుకు పడుతూ, కార్యాచరణ సాగిపోతూనే ఉంది. ముఖ్యంగా ఈ రోజు పరిణామాలు ఈ విషయాన్ని విశదీకరిస్తున్నాయి. సమైక్యాంధ్ర కోసం కేంద్రం నుండి స్పష్టమైన హామీని తీసుకొస్తామని ఢిల్లీకి బయలుదేరిన J.C. దివాకర రెడ్డి, T.G. వెంకటేశ్, సాయంత్రానికల్లా మొహాలు వేళ్ళాడదీసుకొని, MLAలంతా రాజినామాలు వెనుకకు తీసుకోవాలని, విద్యార్థులు ఉద్యమాలు ఆపేయాలని కోరారు. ప్రక్రియ ప్రారంభమైందని, బిల్లు రాష్ట్రపతి వద్దకు త్వరలో వెళుతుందని, ఆయన దానిని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానానికి పంపిస్తారని వారి మాటల ద్వారా స్పష్టంగా అర్థమయింది. వారు ఆంధ్రా ప్రజలకు ఏం చెప్పుకోవాలో తోచక, ” అధిష్ఠానం ఆ తీర్మానాన్ని ఆత్మప్రబోధానుసారం ఓటు వేసి ఓడించే అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆందోళన చెందనక్కర లేదని చెప్పింది.” అని చిలుక పలుకులు పలికారు. కాని వారు అదంతా లాంఛనమేనని తెలియని అమాయకులేం కారు. లోగడ ’మద్రాసు’ రాష్ట్రం నుండి ’ఆంధ్ర’ రాష్ట్రం ఏర్పర్చినప్పుడు, మద్రాసు అసెంబ్లీలో తీర్మానం వీగిపోయినా, పార్లమెంటులో బిల్లు పెట్టి, రాష్ట్రాన్ని ఏర్పర్చిన విషయం ఈ వృద్ధ జంబుకాలకు తెలియనిది కాదు. ఇటీవల ’బీహార్’ నుండి ’జార్ఖండ్’ రాష్ట్రం ఏర్పడింది కూడా ఇలాగేనని మనందరికీ తెలుసు. ఏమీ తెలియక, మోసపోతున్నది ’ఆంధ్రా’ ప్రాంతపు అమాయక ప్రజలే. నాకు బాగా ఆశ్చర్యం కలిగించే విషయం – ఆ ప్రాంతంలో ’యూనివర్సిటీ’ స్థాయి విద్యార్థులకు ఈ మాత్రం అవగాహన, లోకజ్ఞానం లేకపోవడమే.

  స్పందించండి

 9. Dr.Acharya Phaneendra
  డిసెం 18, 2009 @ 00:27:43

  పన్నగ గారు!
  మీ విశ్లేషణ బాగుంది. అక్షరాక్షరం సత్య సమన్వితం.

  స్పందించండి

 10. హరి దోర్నాల
  డిసెం 19, 2009 @ 22:57:55

  మీ యొక్క ఆద్భుతమైన పద్యాలను, కళ కళ కోసం కాదు, ప్రజల కోసమనే మీ భావాలను కొనియాడ కుండా ఉండ లేక పోతున్నాను.

  సాధులు సంతులందరును సత్కవులైన తెలుంగు వారలున్
  వీధుల కొచ్చినారు తమ వేదన దెల్పగ; జాతిసేవకై
  శోధన చేసి చూసినను సుంతయు లేని సమైక్య వాదమున్
  బోధన చేయ బూనితిరి బూటక నేతలు రాజ్య కాంక్షతో!

  స్పందించండి

 11. dr.acharya phaneendra
  డిసెం 19, 2009 @ 23:59:32

  హరి గారు !
  కృతజ్ఞతాభివందనాలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: