వరాహ శతకము ( 5వ భాగము )

వరాహ శతకము

 

[ అధిక్షేప హాస్య వ్యంగ్య కృతి ]

( 5వ భాగము )

రచన : ‘ పద్య కళా ప్రవీణ ‘ డా. ఆచార్య ఫణీంద్ర

PigRoast

ఎంత భుజించినన్ కడుపు కింకను చాలదటన్న రీతి, నీ
వెంతయు నేది దక్క నది ఎట్టుల మేయుచునుందువో సుమా !
అంతయు నీదు పోలికయె ! అచ్చము మేయుదు రట్లె నాయకుల్,
గంతలు కట్టి మా కనుల – ’స్కాము’ల రూపున ! ఓ వరాహమా ! … 43

పశువుల గ్రాసమున్, బడుల పాఠము చెప్పు ’టెలీవిజన్ల’నున్
శిశువుల ’పాల డబ్బ’లును, ’షేరు బజారు’ల ’స్క్రిప్పు’లున్, ప్రజల్
దశలను మార్చుకోన్ ధనము దాచెడి ’బ్యాంకు’లు, ’చిట్టు ఫండ్లి’టున్ –
అశనము కేది కాదిక అనర్హము నేతలకో వరాహమా ! … 44

భూముల నాక్రమించి, అవె భూముల ప్రక్క విదేశ సంస్థకున్
’స్కాము’ను చేసి ’పర్మిటి’డి, సంస్థ యశస్సును చెప్పుకొంచు నా
భూముల కొక్కమారు పెద ’బూము’ను కల్గగ జేసి, అమ్ముకొం
ద్రేమని చెప్పుదింక సచివేంద్రుల ఆగడమో వరాహమా ! … 45

ఎవ్వడు నీతిమంతుడొ, మరెవ్వడు నీ యవతారమో యటన్
ఎవ్విధి ముందెరుంగుటయొ – ఎంతకు తోచుట లేదు మాకు ! నీ
వెవ్విధి కుంట వీడి దరికేగగ గుప్పున కంపు గొట్టునో –
అవ్విధి ’స్కాము’ గూర్చి తెలియన్ నిజమేర్పడునో వరాహమా ! … 46

దారిని ఎక్కడే మురికి దాగియునున్నను, శోధనమ్ముతో
చేరియు నాకి వేయుచు శుచిన్ కలిగింతువు ! ’మున్సిపాలిటీ’
నీరసమైనయట్టి విధి నిర్వహణమ్మును సల్పుచుండె – ’స
ర్కారు’కు మార్గ దర్శనము కావలె నీ కృషి ! ఓ వరాహమా ! … 47

” పడతియె జన్మనిచ్చునొక పందికి భావి “నటంచు పల్కెనే
కడచిన ఐదు వందలగు కాలము పూర్వము ’వీర బ్రహ్మమే’ !
విడమర చిద్ది చూడ – మరి వింతయె రూపము సంక్రమించినన్;
నడతను చూడ – నీకు వలె నాడె జనించిరి ! ఓ వరాహమా ! … 48

జన్మమునిచ్చి గంపెడును సంతతికీవు నొకొక్క కాన్పులో,
చన్మొనలన్ని పిల్లలకు చాపుచు నోటను, పాలు చేపెదో !
విన్మిపుడట్లె మానవులు పెక్కురు పిల్లల గన్న, కాంచుచో –
నిన్మదిలో తలంచి కడు నీరసమొందెద ! ఓ వరాహమా ! … 49

మీరుచు నొక్కరిద్దరికి మించిన సంతును తల్లిదండ్రులె
వ్వారును కల్గియున్న చెడు వారికినిన్, మరి దేశ వృద్దికిన్ !
భారత దేశమందు ననివార్య కుటుంబ నియంత్రణపు స్వీ
కారమె సంతరించును సుఖప్రద జీవనమో వరాహమా ! … 50

ఒక్కరు లేక నిద్దరు సుతుల్, సుతలంచని గాక దంపతుల్
దక్కినయట్టి బిడ్డలను తామదె చాలను తృప్తి బెంచుచున్
మిక్కిలి గారవమ్ముగను; మేలిమి బంగరు జీవితమ్ములన్
చక్కగ వారలందుటకు సాధన చేయవలెన్ వరాహమా ! … 51

పల్లెలయందు నేటికిని పందుల వీర విహార యాత్రలన్
కళ్ళకు కట్టుచుండు ! ఇది కాని పనేమియు కాక పోయినన్ –
పల్లెలు వృద్ధి చెందినటు పందులు లేని యెడన్న భావముల్
వెల్లడియౌను ! నీకు నది వేదన గూర్చునొ ? ఓ వరాహమా ! … 52

పాపపు కాలమిద్ది – ఇదె వచ్చెను వ్యాధులు వింత వింతలై !
నీ పయి దోమ కుట్టి, మరి నేరుగ ఏ నరునింక కుట్టినన్ –
పాపము ! వానికిన్ ’ మెదడు వాప ’ను వ్యాధియె వచ్చు ! అద్ది ఏ
శాపమొ గాని, వానికిడు శాశ్వత నిద్రయె – ఓ వరాహమా ! … 53

గడగడలాడుచుండె ప్రజ గాదె ఇటీవల ’ స్వైను ఫ్లూ ’ యనన్ –
గడబిడయంత నీదె ! అది కల్గెడి దింతకు ముందు నీకు – నే
డడుగిడె నద్ది మానవుల యందున హంతగ, నీదు పుణ్యమై !
వడివడి వ్యాప్తిజేయు టిటు భావ్యమె నీకది ? ఓ వరాహమా ! … 54

ముదిరియు వ్యాప్తిజెందుటకు ముందె జనంబుల కిట్టి రోగముల్,
కదలరు మంత్రులే తగిన కార్య ప్రణాళిక పూని; వారలా
పదవి సుఖాల దేలు చది పట్టనిచో – ప్రతిపక్ష మార్చినన్,
” అదియొక రాజకీయ ” మని యందురె అంధులునై ! వరాహమా ! … 55

శాకములెన్నియున్న, నర జాతిని కొందరదేల మాంసమున్
చేకురగా తలంచెదరొ జిహ్వకు లోబడి భోజనంబునన్ ?
నీకును తప్పదాయెను కనీసము కొందరి భోజనంబులో
ఆకలి దీర్పగా, సలుపు టాత్మను త్యాగము ! ఓ వరాహమా ! … 56

ఇప్పటికింక గ్రామముల నెచ్చట పందులు కానిపించినన్,
చప్పున వెంట పర్విడుచు సల్పుట జూతుము వేట నాడుటన్ !
తప్పని యెంచకుండ, అది తాతల నాటి కులాగ్ర వృత్తిగా
చెప్పు కిరాతులే ! అదియె చేటయె నీకిక ! ఓ వరాహమా ! … 57

పట్టగ సూకరం బురుకు పర్గుల వెట్టెడి వారినిన్, జనుల్
చుట్టుగ నిల్చి చూచెదరు చోద్యము వోలె – అదేదొ క్రొత్తగా
’ నట్టువుడున్, కిరీటియు పునః కిరికై సమరంబు సల్పెడున్ ’
ఘట్టము చర్మ చక్షువుల కాంచిన యట్టుల ! ఓ వరాహమా ! … 58

తరతరముల్ గతించినను తాతలు తండ్రుల సంప్రదాయమున్
గిరిజనులాచరించుచు నొకించుక నిన్ను భుజించుటన్ సరే !
పురజనులైన వారు నిను ’ పోర్క ’ ను పేరిట హోటలందునన్
కరచుచు, నాకుచుందు, రది కాంచిన చిత్రమె ! ఓ వరాహమా ! … 59

అందులకేమొ ! లాభకరమంచును కొందరు వర్తకాగ్రణుల్
’ పందుల పెంపకం ’ బనెడు భవ్య పరిశ్రమ స్వీకరింతురే !
ముందుగ ’ దూర దర్శను ’ న మొత్తమిదే తొలుదొల్త నాళులన్
సుందర దృశ్య కావ్యమటు చూపిరి గాదె ! అహో వరాహమా ! … 60

[ సశేషం ]

—– *** —–

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. Satyanarayana
  నవం 06, 2009 @ 00:13:08

  చాలా బాగున్నాయి.

  స్పందించండి

 2. rama
  నవం 06, 2009 @ 14:14:27

  varaha satakam ante yemito anukunnamu vyangyastram yento baagundi. dhanyavadaalu.

  స్పందించండి

 3. డా || ఆచార్య ఫణీంద్ర
  నవం 08, 2009 @ 22:29:16

  సత్యనారాయణ గారికి,
  రమ గారికి –
  ధన్యవాదాలు

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: