” మా తెలుగు తల్లికి … ” గీతం – వివాదం

 

TeluguTalli

భాష వేరు .. రాజకీయాలు వేరు …

రాష్ట్ర గీతమైన ” మా తెలుగు తల్లికి మల్లె పూదండ ” లో ’ రుద్రమ్మ భుజ శక్తి ’ అన్న ఒక్క పదం తప్ప, మా ప్రాంత ప్రశస్తి ఏదీ లేదంటూ కొందరు తెలంగాణ ప్రాంతీయులు నిరసించిన సంగతి విదితమే ! అయితే శంకరంబాడి సుందరాచారి కవి ఆ గీతాన్ని రచించింది 1939లో. అప్పటి నేపథ్యమే వేరు. ఉమ్మడి మద్రాసు నగరం నుండి కోస్తా, రాయలసీమలతో కూడిన తెలుగు ప్రాంతం యొక్క వేర్పాటువాదంతో పుట్టిన నాటి ఆంధ్రోద్యమానికి ప్రాతిపదికగా రచించిన గీతం అది. ఆనాటికి ఆ తెలుగు ప్రాంతం పట్లే ఎవరికీ పూర్తి అవగాహన లేదు. అందులో మద్రాసు ఉంటుందో, లేదో తెలియదు. తెలుగు వాగ్గేయకారుడు త్యాగయ్య స్వస్థలం – తంజావూరు ఉంటుందో, లేదో తెలియదు. ఒకవేళ ఆ తెలుగు ప్రాంతం మద్రాసు రాష్ట్రం నుండి  వేరుపడ్డా, అది మరి కొన్నాళ్ళకు మరో తెలుగు ప్రాంతమైన తెలంగాణంతో కలిసి ’ఆంధ్ర ప్రదేశ్’ ఏర్పడుతుందా ? – అన్నది ఊహాజనితమైన విషయం. ఎందుకంటే, అప్పటికి తెలంగాణ బ్రిటిష్ ఇండియాలో కాక, నిజాం పాలనలో ప్రత్యేక దేశంగా ఉంది. నిజానికి సమగ్ర తెలుగు దేశం అంటే, నేటి మహారాష్ట్రలోని అజంతా – ఎల్లోరా ( ఉత్తర హిందుస్థానం నుండి దక్షిణం వైపుకు ప్రయాణిస్తుంటే, ఎక్కడ ’హలంత భాష’ మాట్లాడడం ఆగిపోయి, ’అజంత భాష’ అయిన  మన తెలుగు మాట్లాడడం మొదలవుతుందో, ఆ ప్రాంతాన్ని ’అజంతా’ అని పిలువడం ప్రారంభించారని కొందరు చరిత్రకారులు అంటారు.) నుండి దక్షిణాంధ్ర రాజులు పాలించిన నేటి తమిళనాడులోని తంజావూరు వరకు; తూర్పున నేటి ఒరిస్సాలోని గంజాం జిల్లా నుండి పడమరన కర్ణాటకలో బళ్ళారి వరకు వ్యాపించి ఉండాలి. తరువాత ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నెన్ని ప్రాంతాలను కోల్పోయి ఎలా ఏర్పడిందో అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితులలో, ఆనాటి ఒక కవి ( 1939లో ), ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులను ఊహించి, గీతాన్ని రచించాలి – అనుకోవడం అత్యాశే అవుతుంది. పైగా, ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు కవులకు తెలంగాణ ప్రాంత ప్రశస్తి, ఇతర చారిత్రిక వివరాలు తెలిసే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ. అంతెందుకు ? ఆ గీత కర్త, గుంటూరు జిల్లాలోని అమరావతిలో గుహలున్నాయో- లేవో- తెలియకుండానే ” అమరావతీ గుహల అపురూప శిల్పాలు ” అని వ్రాసాడని, తరువాత తన మిత్రులు అక్కడ గుహలు లేవని చెప్పితే, దాన్ని ” అమరావతీ నగరి అపురూప శిల్పాలు ” అని మార్చుకొన్నారని – మా గురువుగారు డా. నండూరి రామకృష్ణమాచార్యులు నాతో చెప్పారు. కాబట్టి ఆ కవిని తప్పు పట్టవలసిన పని లేదని, ఆ గీతాన్ని నిరసించవలసిన అవసరం లేదని అందరూ గ్రహించాలి.

ఆ గీతంలో – రెండవ చరణంలో తెలుగు వారు గర్వించ దగ్గ మహనీయుల ప్రశస్తిని అద్భుతంగా అందించారా కవి. ఆ చరణాన్ని ఒకసారి చూద్దాం –

” అమరావతీ నగరి అపురూప శిల్పాలు

త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములో తియ్యందనాలు

నిత్యమై, నిఖిలమై నిలచి యుండే దాక … (*)

రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి

తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి

మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక … (*)

నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం – “

అయితే, ఇందులో (*) గుర్తు పెట్టిన పాదాలు రెండూ దాదాపుగా ఒకే అర్థాన్ని ఇస్తూ పునరుక్తి అవుతోంది. అందులో మొదటి దాని బదులు (అదే ట్యూన్ లో) – ” పోతన్న కవన మందార మకరందాలు ” అని అంటే … ఏ గొడవ లేక పోను !

అసలు సుందరాచారి కవి ఈనాడూ జీవించి ఉంటే, ఈనాటి వాదోపవాదాలకు నొచ్చుకొన్నా – తెలంగాణ ప్రాంత ప్రశస్తిని వర్ణిస్తూ ఇంకో చరణం వ్రాసి ఉండే వారని నాకనిపించింది. ఆ తలంపు రాగానే, తెలంగాణ ప్రాంత మహనీయుల ప్రశస్తిని వర్ణిస్తూ, పై చరణం ట్యూన్ లోనే, అదే శైలిలో ఒక చరణం నా గుండెలోనుండి తన్నుక వచ్చింది.

” రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు

గోపన్న గొంతులో కొలువైన రాగాలు

పాల్కుర్కి కలములో జాను తెనుగందాలు

పోతన్న కవన మందార మకరందాలు

రుద్రమ్మ భుజ శక్తి, దమ్మక్క హరి భక్తి,

మాదన్న ధీయుక్తి, రుద్ర దేవుని కీర్తి

మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక …

నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం – “

రాష్ట్రాలుగా విడిపోయినా … కలసి ఉన్నా … రాజకీయాలు ఎటు మలుపు తిప్పినా …

నా మనసులోని మాట ఒకటే –

” జై తెలుగు తల్లి !

జై తెలుగు తల్లి !!

జై తెలుగు తల్లీ !!! “

– డా|| ఆచార్య ఫణీంద్ర

___  ***  ___

ప్రకటనలు

16 వ్యాఖ్యలు (+add yours?)

 1. krishna
  నవం 03, 2009 @ 00:10:56

  Very well written.

  స్పందించండి

 2. Vamsee
  నవం 03, 2009 @ 03:37:29

  అంతా బాగా వ్రాసి చివర్లో సొంత భావన బయట పెట్టి మాకు కొంచెం అసౌకర్యం కలిగించారు…
  “తెలంగాణ తల్లి-తెలుగు తల్లి ఒక్కరే నా దృష్టి లో” అని ఉంటే టపా పరిపూర్ణం అయ్యుండేది…
  వారెవరికో గీత గీయబోయి…

  స్పందించండి

 3. Madhav
  నవం 03, 2009 @ 04:14:21

  chala baaga raasaru andi.. telagana vaadulaku ee chartithra teliyaka povatam.. vallayokka murkhtvaniki nidarshanam.

  oka teacher padavilo vunna srinivas laanti manushulaku ee vishyam teliyaka povatam anthakanna vicharam

  స్పందించండి

 4. భాస్కర రామి రెడ్డి
  నవం 03, 2009 @ 04:16:21

  చారిత్రక సత్యాలనుదహరిస్తూ చాలా బాగా వ్రాసారు.

  స్పందించండి

 5. Phani
  నవం 03, 2009 @ 05:51:38

  మీరు రాసిన చరణం కూడా ఎంతో బావుంది. చాలా బాగా రాసారు.
  నాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. ధన్యవాదాలు.
  ఇవాళ్ళ ఒక గొప్ప బ్లాగ్ నాకు పరిచయమైనందుకు ఎంతో ఆనందంగా వుంది.

  స్పందించండి

 6. వేములవాడ రాజన్న
  నవం 03, 2009 @ 07:37:08

  కవిని ఎవరూ తప్పు పట్టడం లేదు,
  తెలుగు తల్లి గీతాన్నీ ఎవరూ నిరసించడం లేదు.

  అయితే తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర డిమాండును దెబ్బకొట్టేందుకు ఆ గీతాన్ని దురుద్దేశంతో బయటకు తీసి దాన్నొక తేనెపూసిన కత్తిలా వాడాలని చేస్తున్న కుటిల ప్రయత్నాన్ని మాత్రమే తెలంగాణా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.!

  ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో తెలుగుకు అన్యాయం జరిగిపోతున్నదని….. ఇంగ్లీషు ( ఉర్దూ ?) మీడియం స్కూళ్ళతో సహా రాష్ట్రం లోని అన్ని స్కూళ్ళలో ప్రతిరోజూ పిల్లలంతా ఈ పాటను పాడాలని ఏలిన వారి ఆదేశం … ! మీకు ఇది సబబైన, నిజాయితీతో , నిబద్ధతతో కూడిన , వివాదాలకు తావు లేని నికార్సైన నిర్ణయంగానే తోస్తోందా? ముందు అది చెప్పండి.

  ప్రభుత్వం నిజంగానే తెలుగును ఉద్ధరించాలనుకుంతోందా ? అధికార భాషగా తెలుగును అన్ని రంగాలలో నిజంగా అమలు చేయాలని భావిస్తోందా? తెలుగు ప్రజలకు ఉద్దేశించిన జీ. ఓ. లను, చట్టాలను, న్యాయస్థానాల్లో తీర్పులను ఇకనుంచీ తెలుగులోనే తేవాలనుకుం టొన్దా ? నిజంగానే…. నిజంగానే ??????
  ముంది ఇది తేల్చండి. !

  ఉర్దూ పాలకులు ఈ దేశాన్ని ఆక్రమించుకుని ఉర్దూలో పాలించారు.
  ఇంగ్లీషు వాడొచ్చి ఈ దేశాన్ని ఇంగ్లీష్ లో పాలించాడు.
  మన తండ్రులూ తాత ముత్తాతలు ఉర్దూని, ఇంగ్లీశ్ని చచ్చినట్టు నేర్చుకున్నారు.
  తెలంగాణలో అయితే తురక పాలకులు మూడు వందల ఏళ్ళు తెలుగును నిర్దాక్షిణ్యంగా ఉక్కు పాదం తో నలిపి పారేశారు.

  ఈ నేపధ్యంలో తెలుగు తల్లి పుట్టి షష్టిపూర్తి కావస్తోంది కదా ….అయినా తెలుగు వాడు తెలుగువాళ్ళని తెలుగులో ఎందుకు పాలించలేక పోతున్నాడు. ఈ ఇంగ్లీషు ఫైళ్ళు, ఈ ఇంగ్లీషు జీ వో లు ఎవరి కోసం ? ఎవరి కోసం ? చెప్పండి.

  పోనీ ఈ తెలుగుతల్లి పాట బలవంతంగా పసి పిల్లలచేత పాడిస్తే పై లక్ష్యాలన్నీ నేరవేరినట్టేనా?
  ఇది ఆ దిశలో వేసే అడుగే నని మీరు నిజంగానే భావిస్తున్నారా?
  దీని వెనక మన పాలకులకు ఎ దురుద్దేశం లేదనుకుంటున్నారా ?
  ఈ విషాయలను ముందుగా మీరు ప్రస్తావించండి.

  అస్తిత్వాన్ని కోల్పోయి మద్రాసీలుగా కునారిల్లుతున్న ఆనాటి ఆంద్ర, రాయలసీమ ప్రజల్లో ఉద్యమ దీప్తిని వెలిగించేదుకు తెలుగు తల్లి భావనను రేకెత్తించారు. ఆ క్రమంలో నే మా తెలుగు తల్లికి పాట రూపుదిద్దుకుంది. అది తన లక్ష్యాన్ని నెరవేర్చింది.

  ఆ తర్వాత ఎన్టీ రామారావు మరోసారి దానిని జమ్మి చెట్టు మీదనుంచి కిందకు దింపి ధిల్లీ పెత్తనం మీద విజయ సాధనకు ఉపయోగించుకుని లబ్ది పొందాడు.

  అట్లాగే ఇప్పుడు కడప స్కూలు లోని ఓ తిక్కల మాష్టారి చర్యను సాకుగా తీసుకుని అదే పాట తో తెలంగాణా వాదాన్ని చావుదెబ్బ కొట్టాలని కుట్రపన్నుతున్నారు.
  కానీ ఈసారి ఆ పప్పులు ఉడకవు.
  తెలంగాణా ప్రజలు ఇప్పుడు జిత్తులమారి ఎత్తులను చాలా సులువుగా గ్రహించగలుగుతున్నారు. వాళ్ళు ఇదివరికటిలా “దొరా నీ కాల్మొక్త బాంచెను ” అనడం లేదు.
  అంటే గింటే తెలంగాణా లోని కొందరు లోఫర్ నాయకులు తమ స్వార్ధం కోసం ఆంద్ర రాయలఅ సీమ నేతల కాళ్ళ మీద పది అంటున్నారు. సామాన్య ప్రజలు మాత్రం ఎవరి ముందూ మోకరిల్లడం లేదు.

  ప్రతి ఉద్యమానికీ పాట ఒక ప్రధాన చోదక శక్తి.
  తెలంగాణా ఉద్యమానికి అనేక పాటలు ఊపిరిపోస్తున్నాయి.
  వాటిలో తెలంగాణా జాతీయ గీతం అన తగ్గ ఈ పాటను మేం ఇప్పుడు ముక్త కంఠంతో పాడుకున్టున్నాం. దీనిని మా అందెశ్రీ అన్న రాసిండు. వింటారా ? .

  జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
  ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…||
  తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…||
  పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
  జై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||

  పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
  గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ
  కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
  గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్ || జై…||

  జానపదా జనజీవన జావళీలు జాలువార
  కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
  జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర
  అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం || జై…||

  సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
  అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
  సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద
  సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద || జై…||

  గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
  పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
  సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె
  స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి || జై…||

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,

  స్పందించండి

 7. Krishna
  నవం 03, 2009 @ 15:19:50

  “అయితే తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర డిమాండును దెబ్బకొట్టేందుకు ఆ గీతాన్ని దురుద్దేశంతో బయటకు తీసి దాన్నొక తేనెపూసిన కత్తిలా వాడాలని చేస్తున్న కుటిల ప్రయత్నాన్ని మాత్రమే తెలంగాణా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.!”

  అన్నా రాజన్నా. ఇందులో కుట్ర ఏమి కనిపించిందో నాకర్థం కావట్లేదు. అందరికి ఉమ్మడి భాషని సెలబ్రేట్ చేసుకొమ్మని చెప్పే ఒక పాట కూడా కత్తిలా ప్రత్యేకరాష్ట్ర డిమాండును దెబ్బకొట్టేస్తే ఇంకా వాదానికి బలమేమిటని. వేర్పాటువాదుల అభిప్రాయాలే తెలంగాణా ప్రజల అభిప్రాయంలా చెప్తున్నావు.

  నిజంగా తెలుగు మీద ప్రేమ ఉంటే తెలుగును అధికార భాషగా ఎందుకు అమలు చేయించలేకపోతున్నారు అని ఆడిగావు. అది అమలు చేయించే శక్తి మాకు(భాషాభిమానులకు) ఉంటే తప్పకుండా చేయించి ఉండేవాళ్ళం. అది లేదు కాబట్టే ఇన్ని రోజులకు కనీసం కంటి తుడుపు చర్యగా అయినా ఎవడో మంత్రి కనీసం తెలుగు గురించి పాటైనా పాడమని చెప్పాడని సంతోషిస్తున్నాం. అదీ నీ కళ్ళకు కుట్రలాగా, ఏదోలాగా కనిపిస్తోంది.

  స్పందించండి

 8. వేములవాడ రాజన్న
  నవం 03, 2009 @ 22:37:59

  కృష్ణ గారు
  తెలంగాణా వాదం మీద ఎన్ని రకాలుగా దాడి జరుగుతోందో మీకు తెలియదనుకోను.
  1968 – 69 లో దాదాపు నాలుగు వందలమంది తెలంగాణా ప్రజల ఉసురు పోసుకుని ఆనాడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని అణిచి వేసారు. అయినా ఇవ్వాళ తెలంగాణా వాదం మళ్ళీ ఫినిక్ష్ పక్షిలా పైకి లేచింది. ఇప్పుడు కాంగ్రెస్ తెలుగు దేశం, ప్రజారాజ్యం, బీజేపీ, సీపీ ఐ వంటి అన్ని పార్టీలు “తెలంగాణా కు మేం వ్యతిరేకం కాదు” అనే నయవంచక మాటలతో తెలంగాణా ప్రజల ఓట్లను కొల్లగొట్టుకుంటూ వీలైనప్పుడల్లా ఆ వాదాన్ని బలహీన పరిచేందుకు ప్రయత్నించడం చూస్తూనే వున్నాం.
  ఈ నేపధ్యం లోనే . పాలకులు తెలుగు తల్లి పాట పై ఇంత హఠాత్తుగా జీవో తీసుకురావడం -దానిని తెలంగాణా ప్రజలు వ్యతిరేకించడం జరుగుతోంది. టీఆర్ ఎస్ మాత్రమె కాదు తెలంగాణా లోని కవులూ కళాకారులూ అందరూ ఈ పాటను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అని గ్రహించండి.

  >>>> నిజంగా తెలుగు మీద ప్రేమ ఉంటే తెలుగును అధికార భాషగా ఎందుకు అమలు చేయించలేకపోతున్నారు అని ఆడిగావు.>>>> అన్నారు.
  నేనేక్కడన్నాను బ్రదర్??? అసలు అంశాలను అన్నింటిని పక్కన పెట్టి ఈ ఆరోపనేంటి? నేను ప్రస్తావించింది పాలకుల హిపోక్రసీ గురించి !!. ప్రభుత్వం చేత ఆ పనిని మీలాంటి నాలాంటి సగటు మనుషులు ఎట్లా చేయించ గలరు???

  మీకు అంత ఆసక్తి గా వుంటే మీ పాట మీరు పాడుకోండి. మా పాట మేం పాడుకుంటాం.
  నిజంగా తెలుగు అభివృద్ధి చెందేది మాత్రం తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాతే.!!!
  అప్పుడు మీ రాష్ట్రం మా రాష్ట్రం పోటీ పడి తెలుగు ను అభివృద్ధి చేస్తాయి .
  ఇది జ్యోస్యం కాదు. రేపటి నిజం.

  స్పందించండి

 9. రమేష్
  నవం 04, 2009 @ 00:07:01

  నాకు ఒక విషయం పూర్తిగా అర్ధం కాలేదు ఎవరైనా నివృతి చేయగలరు

  తెలంగాణా అనేది భాష పరంగా చూస్తే ఒక మాండలికం (లిపి లేని భాష)
  అని అనుకుంటాను ఇది కరెక్ట్ఏనా ?
  లిపి లేని ఆ భాష తెలుగు లిపి మీద ఆధారపదవలసిందే కదా (పైన తెలంగాణా ప్రాంతం గురించి అందేశ్రీ గారు రాసిన పాట కూడ తెలుగే కదా )

  తెలంగాణా ప్రాంతం పై పోరాటానికి తెలుగు భాష / తెలంగాణా యాసకు లంకె పెట్టి ఈ రాజకీయాలు చేయడం నాకు ఆసలు అర్ధం కావడం లేదు. 😦

  స్పందించండి

 10. డా || ఆచార్య ఫణీంద్ర
  నవం 04, 2009 @ 08:21:49

  రమేశ్ గారు !
  తెలంగాణము అన్నది ఒక ప్రాంతం పేరు. భాష పేరు కాదు.
  ఈ రోజు ’ తెలంగాణ భాష ’ అని అందరు అంటున్నది ఆ ప్రాంతంలోని ఒక మాండలిక గ్రామ్య భాష. అంత మాత్రాన తెలంగాణలో గ్రాంథిక భాష, శిష్ట వ్యావహారిక భాష లేదనుకోవడం మూర్ఖత్వం. తెలంగాణంలోనే పుట్టిన పోతన – భాగవతాన్ని, రామదాసు – కీర్తనలను మాండలిక భాషలో వ్రాసారా ? లేదే !
  ’ ఆణెము ’ అంటే అచ్చ తెలుగులో ’ దేశము ’ అని అర్థం.
  తెలుంగు + ఆణెము = తెలుంగాణెము ( అంటే – ’ తెలుగు దేశం ’ అని అర్థం. )
  అదే వ్యవహార భాషలో తెలంగాణము లేక తెలంగాణ అయింది.
  ఈ విషయాలు చాలా మంది తెలంగాణేతరులకే కాదు, తెలంగాణ వారికి కూడ తెలియదు.
  ’ తెలంగాణలో శిష్ట వ్యావహారిక భాష ’ అన్న అంశంపై గతంలో ’ మూసీ ’ మాస పత్రికలో నేను వ్యాసాలను వ్రాసాను.
  అందెశ్రీ నాకు మంచి మిత్రుడు. గతంలో కలసి ఎన్నో కవి సమ్మేళనాలలో పాల్గొన్నాం. అయితే, ఆయన రచించిన గీతంలో గ్రాంథిక భాష, గ్రామ్య భాష కలసి ఉండడం విచారకరం.
  అందరి అభిప్రాయాలు చూసాను. ఎవరి ఆవేశ కావేశాలు వారికి ఉన్నాయి. అందరికీ నేను చెప్పేదొకటే !
  భాష వేరు – ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు వేరు. శతాబ్దాలుగా తెలుగు భాష ఒకే దేశంలోనే, లేక ఒకే రాష్ట్రంలోనే ఉండి అభివృద్ధి చెందలేదు. భాషే ప్రాతిపదిక అయితే ఉత్తర భారత దేశమంతా ఒకే రాష్ట్రంగా ఉండాలి. ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, అమెరికాలు ఒకే దేశంగా ఉండాలి. కాబట్టి …..
  మట్టిగా కలిసి ఉండ వచ్చు … విడిపోవచ్చు …
  మానసికంగా ఐక్యంగా ఉందాం !
  అందరికీ నా హార్దికాభివందనాలు !

  స్పందించండి

 11. రమేశ్
  నవం 04, 2009 @ 09:32:11

  “మట్టిగా కలిసి ఉండ వచ్చు … విడిపోవచ్చు …
  మానసికంగా ఐక్యంగా ఉందాం !”

  బాగా చెప్పారు,
  నా సందేహం నివృతి చేసినందుకు ధన్యవాదాలు

  స్పందించండి

 12. Phanikumar
  నవం 04, 2009 @ 09:41:48

  ఆచార్య ఫణీంద్ర,
  చాలా బాగా చెప్పారండీ….

  స్పందించండి

 13. Raju
  జన 29, 2010 @ 04:26:55

  Asalu baashaku maathruthvaanni kattabettadamanede vichitramuga vundhi.

  Prapancamlo ekkada kuda baashanu thaalli gaa chusina dhaakhalaalu levu.
  So, in my opinion teluguthalli itself fake.

  స్పందించండి

 14. Dr.Acharya Phaneendra
  జన 29, 2010 @ 06:57:15

  మీరన్నది నిజమే అయినా, ఒక ఉదాత్త భావనను అందరూ అంగీకరించాలి.
  అది ’ తెలుగు తల్లి ’ అయినా, ’ తెలంగాణ తల్లి ’ అయినా, ’ భారత మాత ’ అయినా !

  స్పందించండి

 15. SURESH KUMAR
  సెప్టెం 24, 2012 @ 15:12:47

  pahneedragaaru raasina charanaalu baagunnayi. telangaana paata kooada baagundi. sarala padaalato raase andesri gaaru 50 saatam padaalu grandihikam lo vunnayi. debate baagundi. telugu ki jayamu

  స్పందించండి

 16. Dr.Acharya Phaneendra
  అక్టో 06, 2012 @ 21:22:32

  సురేశ్ కుమార్ గారికి ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: