చిరు విరామము

‘చిరు విరామము’ ( ‘Short Interval’ )

రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా. ఆచార్య ఫణీంద్ర

drinking water

అదియొక పాఠశాల – అట అన్నెము పున్నె మెరుంగనట్టి సత్

హృదయులు బాల,బాలిక లనేకులు, నేక విధాన వస్త్రముల్

పొదిగిన దేహముల్ మరియు పొట్టి కరంబులు, చిట్టి పాదముల్,

చిదిమిన పాలు గారు చిరు చెక్కిళులన్ – తలపింత్రు మొగ్గలన్ !


క్రమశిక్షణతో వారలు

సమయంబునకన్న మున్నె చనుదెంతురు – తా

ము మరిక ఏమి భుజించిరొ ?

అమ లేమిడి నింపినారొ ఆ చిరు పొట్టల్ ?


ఎనిమిది గంటల వరకే

ప్రణమిల్లుచు పాడి వారు ప్రార్థన, పిదపన్ –

ధనధనమని తరగతులకు

చని, విందురు పాఠములను శ్రద్ధాసక్తిన్ !


రెండు గంటలటులె దండిగా పాఠాలు

తెరపి లేకయుండి తెలిసికొనుచు –

’ చిరు విరామ ’ మిడగ, సీత కోక చిలుక

లొకప రెగిరినట్టు లురుకుచుంద్రు !


ఈ విరామమ్ము కోసమై ఎంత సేపు

గా నిరీక్షించుచుండిరో కనగ వారు !

అరగిపోయెనో తిన్నదే – ఆకలగునొ ?

తరగిపోయెనో తేజమ్ము – దాహమగునొ ?


పరుగు పరుగునేగి, ’ వాటరు కూలరు ’

వద్ద నిలుతురొక్క వరుసయందు

ఒకరి పిదప నింక నొకరు త్రాగు కొరకు –

సుధను పంచు వేళ సురల యట్లు !


మూతి, కొళాయికిన్ నడుమ ముద్దుల చేతిని చేసి వారధిన్

’ స్వాతి ’ మనోజ్ఞ వర్షమున చాతక పక్షుల వోలె త్రావి, ఏ

దో తినుచుంద్రు జేబులను నుంచిన చాక్లెటొ ! లేక బిస్కెటో !

ఆ తరువాత కొందరెదొ హాస్యములాడుదు రంత నంతలో !


కొందరు ’ స్కూలు గేటు ’ కడ కుప్పలువోయుచు నమ్మునట్టి ఏ

బందరు లడ్లొ, జీళ్ళొ, మరి పాల మిఠాయిలొ, ఐసు ఫ్రూటులో –

తిందురు వేగ వేగ కొని – తిందురు కొందరు ’ కాకి ఎంగిళుల్ ’ !

సుందరమైన దృశ్యమది – చూడ కులాలు, మతాలు సిగ్గిలున్ !


కాలమున కంతలోననే కన్ను కుట్టు !

ఆ ’ చిరు విరామ ’ మంతలో నంతరించె –

ఖంగుమనియంచు మ్రోగెడి గంట వినగ,

పరువులెత్తి తరగతుల పరగిరెల్ల !


సందడి సమాప్త మొందెను –

అందరు తరగతుల జేర, ఆ స్థలమయ్యెన్

ముందటి వలె నిశ్శబ్దము !

కుందుచు నట వీచు గాలి కూలెను నేలన్ !

— *** —

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. Bhaskara Rami Reddy
  సెప్టెం 25, 2009 @ 08:17:04

  అన్నీ పద్యాలు చాలా బాగున్నాయి ఫణీంద్ర గారూ, కానీ ఎందుకనో మొదటి పద్యం మీదకు మనసు సారి సారికీ పోతుంది.

  స్పందించండి

 2. హరి దోర్నాల
  సెప్టెం 25, 2009 @ 10:55:12

  ఆచార్యా

  స్కూలు విశ్రాంతి సమయాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. మీకివే నా అభినందనలు.

  స్పందించండి

 3. Amma Odi
  సెప్టెం 25, 2009 @ 11:34:53

  చదువుతున్నంత సేపు, బడిలో బుజ్జాయిల మధ్య ఉన్నట్టే అన్పించిందండి!

  స్పందించండి

 4. డా || ఆచార్య ఫణీంద్ర
  సెప్టెం 26, 2009 @ 13:55:22

  భాస్కర రామిరెడ్డి గారికి,
  హరి దోర్నాల గారికి,
  ’ అమ్మ ఒడి ’ గారికి –
  హృదయ పూర్వక కృతజ్ఞతాంజలి !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: