వర్షోపరి

వర్షోపరి

రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా. ఆచార్య ఫణీంద్ర

after rain

ఉక్కు పలక నెటుల ఉత్తరించునొ యంత్ర

మురిమి, ఎగయ జిమ్మి మెరపు – లటులె

ఆకసమును చీల్చె ఆ మేఘ మాలికల్ !

కుండ పోత వాన కురిసె నపుడు !   …   1


వర్షానంతర ప్రకృతిని

తర్షముతో బయటకేగి దర్శింపగ, ఆ

ర్షించుచు సౌందర్యము –

హర్షము కలిగించె మదిని అపరిమితముగాన్ !   …   2


ఒక్కచో అగుపించె ఉరుకులెత్తుచు కొన్ని

సెలయేళ్ళు క్రొత్తగా వెలసినట్లు –

ఒక్కచో అనిపించె ఊరి బాట లెవండొ

కడు నిర్మలమ్ముగా కడిగినట్లు –

ఒక్కచో కనిపించె ఉత్తుంగ పర్వతం

బభ్యంజన స్నాన మాడినట్లు –

ఒక్కచో తలపించె మొక్కలకు మరల

ఆకుపచ్చని రంగు లద్దినట్లు –


ఒక్కచో తోచె ముత్యంబు లొక్కటొకటి

గుమ్మముల నుండి, చూర్లపై కొసల నుండి,

తరుల శాఖలం దలరు పత్రముల నుండి,

నేల జవరాలి ఒడిలోన రాలినట్లు –   …   3


తోచె – నేలపై వినయంబు తోడ గడ్డి

వచ్చి పోవు వారికి తల వంచినట్లు –

వీధులం దేగు వారిపై ప్రియము మీర

చల్ల గాలులే పన్నీరు చల్లినట్లు –   …   4


ప్రాత వడ్డ దెల్ల ప్రక్షాళనంబొంది

క్రొత్త దనము మరల కూడి, తోచె –

నిర్విరామ చలన నియతోర్వి యంత్రమ్ము

’ సర్విసింగు ’ నెవడొ సలిపినట్లు !   …   5


— *** —ప్రకటనలు

12 వ్యాఖ్యలు (+add yours?)

 1. నరసింహారావు మల్లిన
  ఆగ 28, 2009 @ 22:19:01

  బాగుందండి. టోపీలు తీసేసాం.

  స్పందించండి

 2. నరసింహారావు మల్లిన
  ఆగ 28, 2009 @ 22:21:01

  ర్ష కు ర్శకు ప్రాస వేయవచ్చునాండీ ?

  స్పందించండి

 3. నరసింహారావు మల్లిన
  ఆగ 28, 2009 @ 22:23:44

  ఆకర్శించుచు లో ర్శిం టైపాటు లావుంది.ఆకర్షించుచు అని ఉండాలనుకుంటా. సరిచేయగలరు.

  స్పందించండి

 4. నరసింహారావు మల్లిన
  ఆగ 28, 2009 @ 22:29:38

  ఒక్కచో తలపించె మొక్కలకు మరల కు బదులుగా
  మొక్కల కమరులు అని వుంటే ఇంకా అందగిస్తుందేమో అనిపించింది.

  స్పందించండి

 5. padmarpita
  ఆగ 28, 2009 @ 23:51:46

  మీ “వర్షోపరి” మనసున తొలకరి జల్లు కురిపించె!

  స్పందించండి

 6. చదువరి
  ఆగ 29, 2009 @ 00:26:56

  ‘భూమికి సర్వీసింగు’ బావుంది. నాకు తోచిన మరో కోణం ఇక్కడ..

  చినుకు పడిన చాలు చిందరవందర
  దార్లు నదులవోలె పొర్లిపోవు
  కార్లు పనికిరావు కావాలి నావలే
  భాగ్యనగరి జనుల బాధలివియె

  మీ పద్యాల్లోని మధుర భావావేశాన్ని పాడుచెయ్యడం నా ఉద్దేశం కాదు సుమండి..

  స్పందించండి

 7. సత్యనారాయణ
  ఆగ 29, 2009 @ 00:54:33

  చాలా బాగుంది.

  స్పందించండి

 8. పుష్యం
  ఆగ 29, 2009 @ 02:43:05

  కం//
  తొలకరి అందములను మీ
  పలుకుల బంధించినారు, బ్రహ్మాండముగా.
  సలలితమౌ మీ పదములు
  సులభముకద చదవనెంచ, సుకవి ఫణీంద్రా!!

  స్పందించండి

 9. డా || ఆచార్య ఫణీంద్ర
  ఆగ 29, 2009 @ 18:01:29

  నరసింహారావు మల్లిన గారికి నమః
  మీరు చెప్పినట్టుగా అది Typographic Error. సరి చేసాను.
  కవిత నచ్చినందుకు ధన్యవాదాలు !

  స్పందించండి

 10. డా || ఆచార్య ఫణీంద్ర
  ఆగ 29, 2009 @ 18:03:29

  పద్మార్పిత గారికి
  అనేక ధన్యవాదాలు !

  స్పందించండి

 11. డా || ఆచార్య ఫణీంద్ర
  ఆగ 29, 2009 @ 18:21:10

  చదువరి గారికి నమః
  ’ భూమికి సర్విసింగు ’ బాగుందన్నారు.
  ” నిర్విరామ చలన నియత ’ ఉర్వి ’ యంత్రమ్ము
  సర్విసింగు నెవడొ సలిపినట్లు – ”
  ఒక కవిగా, ఒక Mechanical engineer గా కలగలసిన నేను
  ఆధునికంగా పద్యాలు వ్రాయాలన్న ప్రయత్నంలో భాగంగా,
  రచించిన అనేక పద్య పాదాలలో, నాకు బాగా నచ్చిన వాటిలో ఇది ఒకటి.
  సరిగ్గా దానినే స్పృశించి, మెచ్చుకొన్నారు.
  ఒక కవిగా ఇంత కన్న ఆత్మానందం ఏముంటుంది ?

  స్పందించండి

 12. డా || ఆచార్య ఫణీంద్ర
  ఆగ 29, 2009 @ 18:27:37

  సత్యనారాయణ గారికి, పుష్యం గారికి
  కృతజ్ఞతాంజలులు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: