అనాధ

నా టపాలకు ” షష్టి పూర్తి “

number-60-wrapped_~753042

అనాధ

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

orphan

పాదరక్షల ధూళి దుల్పుచు పాదమంటును పైసకై –

కాదు, లేదని ఈసడించిన ’కారు’ తుడ్చును జాలికై –

చీదరింపులు, తిట్ల నోర్చుచు చేయి చాచును కూటికై –

వేదభూమికి మచ్చ తెచ్చెడి బిచ్చగా డితడెవ్వడే ?   …   1

( ఛందం : మత్త కోకిల )


మనువుకు పూర్వమే పురుష మాయకు చిక్కియు మోసపోయి, ఏ

వనితయొ కన్నబిడ్డ ; వసి వాడని మొగ్గ ; అనాధ ! అయ్యహో !

తనకిక ఏరు లేరనుచు- దారియు, తెన్నును కానరాక, ఈ

చిన చిన చాకిరీ పనులు చేయుచు చేతులు చాచు పొట్టకై !   …   2


ఏ దుష్యంతుని క్షణికా

వేదన తీర్చుకొను నెపమొ విషమై, బాలుం

డీ దురవస్థకు లోనయె –

హ్లాదంబతనికి, విషాద లహరులితనికా ?   …   3


భరతుడు, కర్ణుడున్ మరియు భాగ్య విహీనుల నట్టి వారలన్

చరితను చూతుమెందరినొ ! సారమదొక్కటె సర్వ గాథలన్ –

పురుషుడు ద్రోహి, పాపమును, పున్నెమెరుంగని నారి నమ్మికన్

పరుపుకు లాగి, గడ్పుకొని పబ్బము, పిమ్మట పారిపోవయో !   …   4


ఈ మహిపైన నొంటరిగ, ఇంచుక నొక్కడు చూపునట్టి ఏ

ప్రేమకు నోచకుండ, నిరుపేదగ జీవితమందునన్ – మదిన్

దేముడటన్న, సంఘమన ద్వేషము పెంచుచు, పెర్గి, పెద్దయై –

ఈ మనిషేమి ద్రోహమొనరించగ నెంచునొ ఈ వ్యవస్థకున్ ?   …   5


ఈ అనాధయే జగతియం దెదిగి యిట్లు

సంఘవిద్రోహ శక్తిగా సంచరింప –

కరుణ జూపి, ఆదరమునే కురియ లేని

సంఘమునదె ! ఆ బాధ్యత సంఘమునదె !!   …   6

— *** —


ప్రకటనలు

10 వ్యాఖ్యలు (+add yours?)

 1. రాజశేఖర రాజు
  ఆగ 05, 2009 @ 00:46:35

  మానవీయ అంశాలను స్పర్శించడానికి పద్యాన్ని మీరు ఉపయోగించిన తీరు అభినందనీయం. అయితే అనాథలు సంఘ వంచితులే కాని సంఘ విద్రోహ శక్తులు కారు. మొత్తం సమాజ దౌష్ట్యానికి బలైపోయిన, పోతున్న వారిని విద్రోహ శక్తులుగా ముద్ర వేయటం భావ్యం కాదేమో. ఆలోచించగలరు.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఆగ 05, 2009 @ 07:01:13

  రాజశేఖర రాజు గారు !
  మీరు కవితను తప్పుగా అర్థం చేసుకొన్నారు. సంఘ దౌష్ట్యానికి బలైన అనాధ, ఏ దారి, తెన్ను లేక సంఘ విద్రోహ శక్తిగా మారితే – ఆ తప్పు సంఘానిదే అని ఈ సంఘాన్ని నిరసించాను, హెచ్చరించానే తప్ప, ప్రతి అనాధ కూడా సంఘ విద్రోహ శక్తి అని నేను ముద్ర వేయలేదు. అయితే జగతిలో దాదాపు ప్రతి సంఘ విద్రోహ శక్తి వెనుక ఏ సంరక్షణ లేని అనాధత్వంతో కూడిన కన్నీటి గాథ ఉండడం మీరు గమనించాలి. తీవ్ర వాదోద్యమాలు నడిపే వారు ఇలాంటి అనాధలకే గాలం వేసి, సంఘ విద్రోహ శక్తులుగా మారుస్తున్న వైనం మనకు చరిత్ర చెబుతున్నది. అలా అనాధలు దారి తప్పకుండా – కరుణ, ఆదరణ కురిపించి, సమాజంలో వారికి ఆదరమైన స్థానం కల్పించాలనే కదా నేను ఆఖరి పద్యంలో అన్యాపదేశంగా చెప్పింది.

  స్పందించండి

 3. aswinisri
  ఆగ 05, 2009 @ 16:20:39

  chaalaa baagundi! koddigaa last (6) padyam ibbandigaa irukuna pettinatlu vundi nachchinatlu anipinchanleadu!

  స్పందించండి

 4. రవి
  ఆగ 05, 2009 @ 17:46:17

  పద్యాన్ని మానవీయ అంశానికి ఉపయోగించడం అభిలషణీయం.

  “హ్లాదంబతనికి, విషాద లహరులితనికా ?” – కదిలించింది. ఇలాంటి బాలలకు ఏమైనా చేయాలి. చేస్తాను!

  స్పందించండి

 5. నరసింహారావు మల్లిన
  ఆగ 05, 2009 @ 21:28:38

  చాలా బాగావ్రాసారు. చివరి పద్యంలో చిరుమార్పు
  ఈ అనాధయే జగతియం దెదిగి యిట్లు
  సంఘవిద్రోహ శక్తిగా మారకుండ –
  కరుణ జూపి, ఆదరమునే కురియ జేసి
  నేర్పరించవలయు నీవు ! నేను ! మనము !

  స్పందించండి

 6. డా || ఆచార్య ఫణీంద్ర
  ఆగ 06, 2009 @ 10:38:10

  అశ్వినిశ్రీ గారికి, రవి గారికి, నరసింహారావు గారికి ధన్యవాదాలు.

  స్పందించండి

 7. madhavaraopabbaraju
  ఆగ 07, 2009 @ 16:22:15

  శ్రీ ఫణీంద్ర గారికి, నమస్కారములు.

  అనాదిగా, నాధుడు వుండి కూడా,లేనివాడిగా చేసి, అనాధలు అని ముద్ర వేసిన సంఘ చరిత్రను చక్కగా మరొకసారి ఇప్పటి సమాజానికి గుర్తుచేసి, అట్టి అనాధలను సంఘ వ్యతిరేక శక్తులుగా మారిపోకుండా చూడాల్సిన బాధ్యత ఈ సమాజానిదే అని గట్టిగా, చక్కగా తెలియచేసారు. ధన్యవాదాలు.

  భవదీయుడు,
  మాధవరావు.

  స్పందించండి

 8. Dr.Acharya Phaneendra
  ఆగ 07, 2009 @ 18:39:12

  మాధవరావు గారు !
  నా కవితను, నా ఆవేదనను చక్కగా అర్థం చేసుకొన్నారు.
  మీకు అనేకానేక ధన్యవాదాలు !

  స్పందించండి

 9. Vasu
  ఆగ 11, 2009 @ 23:37:27

  బావుంది. చిన్న ప్రశ్న. అనాధ అంటే ఏ కారణంగానైనా అయ్యుండచ్చు. మీరు మోసపోయిన పెళ్ళికి ముందు కానీ వదిలేసిన పిల్లలనే ఎందుకు కాంసిదర్ చేసారు? పెళ్ళికి ముందు తల్లి అయినంత మాత్రాన పిల్లలని వదిలేస్తారని నేను అనుకోవట్లేదు. ప్రకృతి వైపరీత్యాలలో, మత కలహాల్లో ఇంకా అనేక కారణాల వాళ్ళ అనాధలైన వాళ్ళు ఉంటారు. మీరు ౩ పద్యాలు కేటాయించారు ఈ విషయానికి అందుకని అడుగుతున్నా అంతే. చొప్ప ప్రశ్న అనిపిస్తే వదిలెయ్యండి. చెప్పదగినదనిపిస్తే చెప్పండి.

  స్పందించండి

 10. Dr.Acharya Phaneendra
  ఆగ 15, 2009 @ 05:51:23

  వాసు గారు !
  ముందుగా మీరు నన్ను క్షమించాలి. పాత టపాలోని వ్యాఖ్య కాబట్టి ఆలస్యంగా చూసాను.
  ఇక మీ ప్రశ్న …
  ప్రకృతి వైపరీత్యాలలో, మత కల్లోలాలలో లేక రైలు, విమాన ప్రమాదాలలో తల్లి తండ్రులు ప్రాణాలు కోల్పోతే, అటువంటి పిల్లల సంరక్షణను, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళో, మేన మామలో లేక నానమ్మ, తాతయ్యలో చేపడతారు. కాబట్టి అలాంటి వారు అనాధలయ్యే అవకాశాలు చాలా చాలా అరుదు. ఎక్కువ మట్టుకు ఎవరూ ( ఆత్మీయులు, బంధువులే కాక సమాజంతో సహా ) ఆదరించక అనాధలయ్యేది నేను చెప్పిన కారణం వల్లే. అలా నిరాదరణకు గురై అనాధలైన వారి గురించే నా బాధ !
  కవిత బాగుందన్నందుకు కృతజ్ఞతలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: