పునఃప్రచురణ

సాంకేతిక కారణాల వలన ఈ టపా జల్లెడ, కూడలి, హారం నుండి లంకె వేసినపుడు ” పేజీ కనబడడం లేదు ” అని చూపుతున్నందు వలన మళ్ళీ ప్రచురిస్తున్నాను.

కార్గిల్ విజయ దశాబ్ద్యుత్సవ వేళ … ( రెండవ భాగం )

డా. ఆచార్య ఫణీంద్ర గత స్మృతులు

” విజయ విక్రాంతి ” గ్రంథావిష్కరణానంతరం పలు పత్రికలలో దానిపై సమీక్షా వ్యాసాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది _ ” మహతి ” మాస పత్రికలో, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డా. అబ్బూరి ఛాయాదేవి చేసిన సమీక్ష ! నా దీర్ఘ కవిత పూర్తి పాఠం అందించలేక పోయినా, ఆ సమీక్ష దాని పూర్తి సారాంశాన్ని అందిస్తుందన్న ఉద్దేశ్యంతో ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

Image0660

కార్గిల్ విజయానికి అక్షరాంజలి

_ డా. అబ్బూరి ఛాయాదేవి

పరదేశంతో యుద్ధం సంభవిస్తే దేశ ప్రజలలో దేశ భక్తి మరింతగా జాగృతమవుతుంది. దేశ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న వీర సైనికులకు స్ఫూర్తిని కలిగిస్తారు కవులూ, కళాకారులూ.

మే _ జూలై 1999 లో కార్గిల్ ప్రాంతంలో జరిగిన  భారత _ పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యాలు విజయం సాధించడం వల్ల కలిగిన ఉత్సాహంలో కొంత మంది తెలుగు కవులు తమ కవితల్ని హైదరాబాదులో నవ్య సాహితీ సమితి ఏర్పాటు చేసిన సభలో చదివి వినిపించారు. ఆ సభలో ఆచార్య ఫణీంద్ర చదివిన దీర్ఘ కవిత ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకొంది. ఆ కవిత ” విజయ విక్రాంతి ” ఇప్పుడు పుస్తక రూపంలో వెలువడింది. ఇంతవరకూ యువకవి ఆచార్య ఫణీంద్ర మంచి పద్య కవిగానూ, వచన కవిగానూ కూడా తన కవితా సంపుటాల ద్వారా గుర్తింపు పొందాడు.

ఈ ” కార్గిల్ కదనంపై దీర్ఘ కవిత ” కి వచన కవితా ప్రక్రియనే అనుసరించాడు. అయితే అంకితాన్ని మాత్రం పద్య రూపంలో రాశాడు. కవితాత్మకత ఉన్న కవి ఏ ప్రక్రియలోనైనా రాణిస్తాడని చెప్పడానికి ” విజయ విక్రాంతి ” ఒక నిదర్శనం.

” మంచు కొండల మాటున

పొంచి ఉన్నది నక్క “

అంటూ ఎత్తుగడలోనే పాఠకులను ఆకట్టుకొంటాడు ఫణీంద్ర. మంచు కొండల ఇవతల ఉన్న కాశ్మీరులోని ప్రకృతి సిద్ధమైన సుందర దృశ్యాలను, సుసంపన్నతను రసరమ్యంగా అభివర్ణించాడు.

” హిమ వన్నగ రోచిస్సుల

కాశ్మీరుకు నమస్సు ! “

అంటాడు ఆరాధనాపూర్వకంగా.

అటువైపు ఉన్నది ’ నక్క ’ అయితే, ఇటువైపు ఉన్నది ’ సింహం ’ అంటూ జిత్తులమారి పాకిస్తాన్ చేసిన ఆగడాలను వివరిస్తాడు. వాటి ఫలితం _

” ఒకనాడు పాండిత్యానికి చేసిన

సత్కారం _ కాశ్మీరు శాలువా !

ఈనాడది మృత కళేబరంపై

కప్పిన దుప్పటి !

ఒకనాటి పండితుల వేదిక

ఈనాడొక శ్మశాన వాటిక ! “

అంటూ కాశ్మీరు చరిత్రను క్లుప్తంగా, కవితాత్మకంగా కళ్ళకు కట్టేటట్లు చిత్రించాడు కవి. అలాగే, భారత దేశంలోని రాజకీయాల్ని, దేశ స్వాతంత్ర్యానంతరం ప్రారంభమైన భారత _ పాకిస్తాన్ శత్రుత్వాన్ని వివరిస్తాడు.

” భరత మాత శిరస్సు

బహు మతాల సదస్సు ” అని కాశ్మీరును వర్ణిస్తూ,

” కళకళలాడే కాశ్మీరును

కాంచిన గుంట నక్క

కన్ను కుట్టింది ” అంటాడు కవి.

” దేశమైనా, దేహమైనా

ఒక అంగానికి గాయమైతే

మరో అంగం చూస్తూ ఊరుకోదు “ అంటూ,

” తల నొప్పి ఎంతటిదైనా

తల వంచేది లేదు “ అంటూ పౌరుషాగ్నిని రగిలిస్తాడు.

” శత్రువు ప్రాణాలతో

దేశ రక్షణ దీపం వెలిగించు “ అని ప్రోత్సహిస్తాడు.

” దేశ రక్షణ దీపం వెలగాలంటే

కొన్ని ప్రాణాలు కర్పూరాలు కాక తప్పదు “

అన్న కఠోర సత్యాన్ని కూడా వెల్లడించాడు.

” నాటి భారత యుద్ధంలో

ఒక అభిమన్యుడు …

నేటి భారత యుద్ధంలో

ఒక వివేక్ గుప్తా …

ఒక హనీఫుద్దీన్ …

ఒక పద్మపాణి ఆచార్య …

వీరాభిమన్యులెందరో ! “

అంటూ వారికి జోహారులర్పించాడు. పాకిస్తానీ సైనికుడు ” రాబందు కన్న హీనం ” అనీ, ” ధర్మానికి అర్థం తెలియని రాక్షసుడు “ అని నిరసించాడు.

ఈ దీర్ఘ కవితను ఉద్రేకం ఉట్టిపడేలా, ప్రవాహ సదృశంగా రాయడంతోబాటు ” శివా రావాలు ” ( నక్కల శబ్దాలు );

” శార్దూల గిరులు ” ( టైగర్ హిల్స్ ) వంటి చక్కని పద బంధాలను ఔచిత్యవంతంగా ప్రయోగించాడు. పదహారు భాగాలతో సాగిన ఈ దీర్ఘ కవిత ఆచార్య ఫణీంద్ర కవితా విజిగీషకీ, విజయానికీ ప్రతీక.

( ” మహతి ” మాస పత్రిక – అక్టోబరు 2000 )

ఎంతలో పదేళ్ళు గడచిపోయాయి. ఆనాటి సంఘటనలను ఇప్పుడు గుర్తు చేసుకొంటుంటే, ఇప్పటికీ నా నరాలు ఉత్తేజితమవుతున్నాయి. గుండెలో ఆనందం ఉప్పొంగుతోంది.

( సమాప్తం )

ప్రకటనలు

1 వ్యాఖ్య (+add yours?)

 1. nagaraju
  డిసెం 20, 2010 @ 12:47:20

  plz visit my blog

  gsystime.blogspot.com

  spiritual and universal knowledge

  thanks,
  nagaraju g

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: