కార్గిల్ విజయ దశాబ్ద్యుత్సవ వేళ …

కార్గిల్ విజయ దశాబ్ద్యుత్సవ వేళ …

డా. ఆచార్య ఫణీంద్ర గత స్మృతులు

operation-Vijay_army

26 జూలై 2009 నాటికి కార్గిల్ యుద్ధంలో మన దేశం ఘన విజయం సాధించి ఒక దశాబ్ది కాలం కడచింది. యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే (1999 ), ఆ సంఘటనపై నేనొక దీర్ఘ కవితను రచించి, వివిధ సభలలో కావ్య గానం చేసి, పెద్దల ఆశీర్వాదాలను, మిత్రుల అభినందనలను పొందడం జరిగింది. తరువాత 6 నెలల వ్యవధిలో దానిని గ్రంథంగా ముద్రించి, డా. సి. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరింప జేయడం జరిగింది.
గ్రంథానికి అందించిన ముందు మాటలలో …

సినారె గారు

”   భరత మాత శిరస్సు

బహు మతాల సదస్సు

హిమ వన్నగ రోచిస్సుల

కాశ్మీరుకు నమస్సు !

మకుట సదృశంగా భాసించే ఈ పంక్తులలో ఆ శిరస్సు కాశ్మీర భూఖండమే. ఆ సదస్సు భిన్న మత సమన్వయానికి ప్రతీక. కవి కాశ్మీరానికి నమస్కరిస్తున్నాడు. అది ” స్వర్గానికి అద్దం ” లా ఉందంటున్నాడు. అంతటి స్తవనీయ స్థాయిలో ఉన్న కాశ్మీరు పైన జరిగిన కుటిల దండయాత్ర పట్ల తీవ్రంగా స్పందించి వెలువరించిన దీర్ఘ కవిత ఈ “విజయ విక్రాంతి”.
కథనం ప్రధానంగా ఉన్న ఈ దీర్ఘ కవితలో చిక్కని కవిత్వం దొరుకుతుంది. కాశ్మీరు ప్రకృతి సౌందర్యాన్ని ప్రస్తావిస్తూ _

ఇక్కడ అందం

యాపిల్ పండై కాస్తుంది.

ఇక్కడ నేలపై

వెండి తివాసీలు పరుచుకొంటాయి.

అంటాడు ఫణీంద్ర.. ఆ వెండి తివాసీలంటే మంచు ముద్దలే. ఇలాంటి వర్ణనల వరుసలో ఉన్న ఈ పంక్తి ఫణీంద్ర కవితా సాంద్రతకు నిదర్శనం.

ఇక్కడ బోలెడన్ని డాలర్లు

నక్షత్రాలై రాలుతాయి

ఈ అభివ్యక్తిలో విదేశీ సందర్శకులు ధ్వనిస్తారు.
ఫణీంద్ర ఈ కవిత ప్రారంభంలోనే

మంచు కొండల మాటున

పొంచి ఉన్నది నక్క

అంటూ వస్తు నిర్దేశం చేశాడు. దురాక్రమణదారు నక్కలాంటి పాకిస్తాన్. దుర్దమంగా నిలిచింది సింహంలాంటి హిందుస్తాన్. ఈ వస్తుగత సంకేతాలను కావ్యమంతటా సమర్థంగా నిర్వహించిన ఫణీంద్ర రచనా చణతను అభినందిస్తున్నాను. ” అని ;

డా. ఆచార్య తిరుమల గారు

” ఇది వీర రస ప్రధానమైన కవితా సంపుటి. మాతృ దేశాభిమానానికి అక్షరాకృతి ఈ కృతి. ’ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ’ అన్న రామ వాక్యానికి ఆచార్య ఫణీంద్ర చేసిన వ్యాఖ్యాన కథనమిది. ఇటీవల భారత దేశం మీద పాకిస్తాన్ చూపిన దౌర్జన్యానికి, దుర్మార్గానికి, దురాగతానికి రక్తం ఉడుకెత్తి ఫణీంద్ర చేసిన సింహ గర్జనమే ఈ ’విజయ విక్రాంతి’ ! భారత వీర సైనికులకు నైతిక ప్రోద్బలంగాను, భారత పౌరులకు కర్తవ్య ప్రబోధంగాను ఈ కావ్యేతిహాసాన్ని మలచిన ఫణీంద్ర ప్రతిభ ప్రశంసనీయం !
ఫణీంద్రలో దేశ భక్తి పొంగింది. ఉప్పొంగింది. పరవళ్ళు త్రొక్కింది. ఈ దేశంలో స్వేచ్ఛా వాయువులు ఊరకే ఉద్భవించ లేదని తెలిసిన ఫణీంద్ర _

అంగుళం జార విడుచుకొన్నాఅసమర్థతే అవుతుంది

అని హెచ్చరించాడు. ఫణీంద్ర కలం ఝళిపించాడు. ఒక వీర కవిగా తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చాడు.

ఒక సంఘటనకు ఇదొక చరిత్ర !

ఒక చరిత్ర కిదొక సంఘటన !!

అని ఆశీర్వదించారు.

( ఇంకా ఉంది. )

5 వ్యాఖ్యలు (+add yours?)

  1. భాస్కర రామిరెడ్డి
    జూలై 29, 2009 @ 06:11:49

    ఆచార్యా.. వీలైతే పూర్తి కవితను ప్రచురించ గలరా?

    స్పందించండి

  2. నరసింహారావు మల్లిన
    జూలై 29, 2009 @ 06:16:41

    ఆచార్యా.. వీలైతే పూర్తి కవితను ప్రచురించ గలరా?

    స్పందించండి

  3. Dr.Acharya Phaneendra
    జూలై 29, 2009 @ 07:18:36

    భాస్కర రామిరెడ్డి గారు !
    మల్లిన నరసింహారావు గారు !
    మీ అభిమానానికి కృతజ్ఞతాంజలి !
    అది 400 పంక్తుల సుదీర్ఘ కవిత _ ప్రచురించాలంటే కాస్త ఓపిక కావాలి. ప్రస్తుతానికి కష్టమే.
    మీకు గ్రంథ ప్రతులను పంపుదామన్నా, ప్రతులన్నీ అయిపోయాయి. మన్నించండి.
    ఇప్పటికే ” వరాహ శతకం ” ను పూర్తిగా ప్రచురించ లేదు. వీలును బట్టి దీనిని కూడ ధారావాహికంగా ప్రచురించే ప్రయత్నం చేయగలను.

    స్పందించండి

  4. anonymous
    జూలై 29, 2009 @ 16:17:55

    అన్నా మీరు గ్రేట్. మీకు పాదాభివందనం చేయాలనిపిస్తోంది.

    స్పందించండి

  5. Dr.Acharya Phaneendra
    జూలై 29, 2009 @ 17:31:03

    anonymous గారు !
    ” ఆకాశాత్పతితం తోయం యదా గచ్ఛతి సాగరం ” అన్నట్లు
    మీరు చేసే పాదాభివందనం ఆ సరస్వతీ మాతకు చేరుతుంది.
    మీ అభిమానానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

    స్పందించండి

Leave a reply to anonymous స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.