ఏక వాక్య కవితలు ( మరి కొన్ని )

ఏక వాక్య కవితలు ( మరి కొన్ని )
——————————
రచన : డా. ఆచార్య ఫణీంద్ర

తెలుగు సాహిత్యంలో ఒక నూతన ప్రక్రియగా నేను ప్రవేశపెట్టిన ” ఏక వాక్య కవితలు ” లో కొన్నింటిని లోగడ ఒక టపా ద్వారా అందించడం జరిగింది. ఆ టపా కి ఇప్పటికీ మంచి స్పందన ఉంది. ప్రతి రోజూ ఎంతో కొంత మంది ఆ టపాను చూస్తూనే ఉన్నారు. అది నాకెంతో సంతోషం కలిగించే విషయం. ఆ రసాత్మక వాక్యాలను ఆస్వాదిస్తున్న వారందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ టపా ద్వారా మరికొన్నింటిని అందిస్తున్నాను _ ఆస్వాదించండి.

flowers-2

* అక్షరాల ఇటుకలు అయిదారు చాలు _ భావ సౌధం నిర్మించేందుకు !
* నలుగురి సాక్షిగా మూడు ముళ్ళతో రెండు జీవితాలను ఒక్కటి చేస్తుంది పెళ్ళి.
* హృదయం విశాలమే _ భావాలే సంకుచితం !
* రాళ్ళలో ఏముంది _ రాపిడిలో నిప్పుంది !
* అగుపించేది కళ్ళకు _ అనుభూతి గుండెకు !
* తన ఒడిలో నిద్దురపుచ్చే తల్లి _ మంచం !
* కాల గర్భ చరిత్రను సమాధిగా మోస్తుంది భూమి.
* చిలిపి మనసు _ కోతి !
* గుండెల మీద కొండలను మోసే మొండి ధైర్యం భూమాతకెలా అబ్బిందో !
* వసుధ చుట్టూ విసుగు లేకుండా తిరిగే ప్రేమికుడు _ చంద్రుడు !
* మంచివాణ్ణే _ నా మీదే రాళ్ళు !
* కనిపించడు _ లేడని మాత్రం అనిపించడు !
* చిత్రకారుని కుంచెకు చిక్కని కవిత _ చిక్కని కవిత !
* జీవితాన్ని చిలుకు _ అనుభవం వెన్న !
* ఏడ్చే పిల్లలు ఎదిగి ఏడిపిస్తారు.
* కళ్ళు తెరిచే నాటికే సగం జీవితం గడచిపోయింది.
* కన్నీటి రుచి చిన్ననాడే తెలిసిన వాణ్ణి !
* తొక్కినా తోవ చూపించే తల్లి _ కాలి బాట !
* లోకానికి సూ
ర్యుడు పెట్టే భిక్ష _ ఉదయం !
* రేపు నేడై, నిన్న అయేసరికి _ ఆశ నిరాశై, అశ్రు కణంగా జారిపోయింది.
* సూర్యుడిచ్చిన కాంతి పత్రంపై మనిషి చేసే సంతకం _ జీవితం !
* వెన్ను చూపని వీరుడు _ కాలం !
* విచిత్రమేమిటంటే _ అన్ని దారులూ కాటికే చేరుతాయి !
* భవిష్యద్గవాక్షం తెరిచి, ఆశా కిరణాలలో స్నానించాను.
* గుండెల్లో గుచ్చుకొని, పెదవులపై నవ్వులు పూయించేది కవిత !

___ *** ___

ప్రకటనలు

19 వ్యాఖ్యలు (+add yours?)

 1. ఆత్రేయ
  జూలై 12, 2009 @ 04:18:25

  ౧. కట్టడానికైనా… కూల్చడానికైనా..
  ౨. దేంట్లోనూ ఇమడలేము
  ౩. కసిగల గుండె పస గల చేయి కావాలి
  ౪. ఆ మోసే నలుగురెవరో ?
  ౫. ఎదురు తిరిగిన వాటినే.. శిధిలాలంటాం.
  ౬. రాయికీ కొబ్బరి చిప్పకీ తేడాలేదు.
  ౭. కళ్ళనుండి పారే ఆ సెలయేళ్ళు చెప్పట్లా ?
  ౮. ఎన్ని గింగిరాలు తిరుగుతున్నాడో.. ?
  ౯. వినేవాడికే తుంపరలు మరి.
  ౧౦. భయం హుండీలు నిండుతుంది అందుకే..
  ౧౧. త్ర్పువాట బాబా..
  ౧౨. త్రాగడానికి నీళ్ళ మజ్జిగేనన్న మాట.. కొత్తేముంది ?
  ౧౩. కన్నుతడి ఆరితే.. చుట్టాలు ఏడుస్తారు మరి.
  ౧౪. మిగిలినది సగం చీకటి పాలు. మిగిలిన సగం మనం చీకటి పాలు.
  ౧౫. అందుకే బ్రతుకు సాగరం.
  ౧౬.. వదిలి గమ్యానికి వెళతాం.
  ౧౭. ఆకాశమంత బొచ్చెలో చిన్న మెతుకు.
  ౧౮. రేపు రానిరోజు, మనం నిన్నలో ఇరుక్కుపోతాం.
  ౧౯. నిజమే.. నిద్ర… మృత్యువే
  ౨౦. వాడి పరాజయం మన చావుకొచ్చింది.
  ౨౧. ఆదారిన అందరి ప్రయత్నం వెనక్కి పరుగుతీయడానికే
  ౨౨. ప్రస్తుతమూ జారిపోయింది
  ౨౩. ముఖమంతా నందన వనమే.,.. తిండికే దిక్కులేదు.

  స్పందించండి

 2. ఆత్రేయ
  జూలై 12, 2009 @ 04:34:54

  అయ్యో రెండవది నేను మిస్సు చేశాను..

  ౨. నలుగురు సాక్షిగా.. మూడు ‘ముళ్ళ ‘ తో రెండు జీవితాలు…ఒంటరవుతాయి.

  స్పందించండి

 3. ప్రభాకర్ మందార
  జూలై 12, 2009 @ 06:39:47

  ” మాకు గోడలు లేవు … గోడలు పగులగొట్టడమే మా పని ! ”
  వంటి ప్రయోగాలు శ్రీ శ్రీ చేసారు కదా.
  కాకపోతే పదాలను ఒకదాని కింద ఒకటి రాయకుండా పక్క పక్కన రాస్తే కవిత వాక్యంగా … ఏకవాక్య కవితగా అవుతుందేమో!

  >>>>వసుధ చుట్టూ విసుగు లేకుండా తిరిగే ప్రేమికుడు _ చంద్రుడు!
  >>>>తొక్కినా తోవ చూపించే తల్లి _ కాలి బాట !
  >>>>వెన్ను చూపని వీరుడు _ కాలం !
  చాలా బావున్నాయి.

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  జూలై 12, 2009 @ 09:37:03

  ఆత్రేయ గారు !
  నా ” ఏక వాక్య కవితల ” కు మద్దతుగానో, వ్యతిరేకంగానో, వెటకారంగానో మీరు వ్యాఖ్యలు వ్రాసి, ఏం సాధించారో నా కర్థం కాలేదు. ఎందుకంటే, నా కవితలు చదువకుండా, మీ వ్యాఖ్యలు చదివితే ఎవరికీ ఏమీ అర్థం కాదు మరి ! పోనీ .. నా కవితలపై మీ అభిప్రాయాన్ని తెలియజేసారా .. అంటే _ అదీ కాదు. ఇదే శక్తిని, సమయాన్ని _ కొత్త భావాలతో కొన్ని కొత్త ” ఏక వాక్య కవితల “ను వ్రాసేందుకు వినియోగిస్తే, అవి స్వయంప్రతిపత్తితో వెలిగి రస హృదయులను అలరించేవి కదా !

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  జూలై 12, 2009 @ 10:21:56

  ప్రభాకర్ గారు !
  ” మాకు గోడలు లేవు. ” _ ఒక వాక్యం.
  ” గోడలు పగులగొట్టడమే మా పని ! ” _ అన్నది రెండో వాక్యం.
  ఇది ” ఏక వాక్య కవిత ” కాదు గదా !
  నా కవితల్లో …
  ” హృదయం విశాలమే _ భావాలే సంకుచితం !
  రాళ్ళలో ఏముంది _ రాపిడిలో నిప్పుంది !
  అగుపించేది కళ్ళకు _ అనుభూతి గుండెకు ! ” వంటివి _ సంయుక్త వాక్యాలు ( compound sentences ).
  ఆ వ్యత్యాసాన్ని గమనించ గలరు.
  నా ఏక వాక్య కవితల సంపుటి ” వాక్యం రసాత్మకం ” గ్రంథానికి పీఠిక వెలయించిన ప్రముఖ కవి, విమర్శకులు డా. అద్దేపల్లి రామమోహన రావు “ఒకేఒక్క వాక్యంలో కవిత్వ స్ఫురణ కలిగించడం ఒక మంచి ప్రయత్నమే. ఆ ప్రయత్నం మొదటిసారిగా చేసి, 252 వాక్యాలతో “వాక్యం రసాత్మకం” అనే సంపుటిని ప్రచురిస్తున్నారు ఆచార్య ఫణీంద్ర. ఆచార్య ఫణీంద్ర తన ఏక వాక్య కవితలలో అనేక విధాలైన వస్తువులను తీసుకొన్నారు. అనేక విధాలైన అభివ్యక్తులను అనుసరించారు. సౌందర్య వర్ణన నుండి తాత్వికత దాకా ఆయన ఆలోచనల పరిధి ఈ సంపుటిలో విస్తరించింది. బాహ్య చమత్కృతి నుండి, లోతైన అభివ్యక్తి దాకా ఆయన రచనా శైలి పరుచుకొని ఉంది.” అని కితాబు నిచ్చారు.
  దీనికి సంబంధించిన వివరాలు నా పాత టపా ” ఏక వాక్య కవితలు ” లో ఉన్నాయి. చూడండి.
  కవితలు నచ్చినందుకు ధన్యవాదాలు.

  స్పందించండి

 6. bollojubaba
  జూలై 12, 2009 @ 13:47:33

  ఫణీంద్రగారు
  మీరు పెద్దలు మీకు చెప్పదగినవాడిని కాదుకానీ.

  కవిత్వం పేరుచెప్పి ఇలాంటి ప్రయోగాలు అవసరమా. పైపెచ్చు ఇలాంటి చమత్కార వాక్యాలని కవిత్వమని ఎలా చెప్పగలరు. వాక్యం రసాత్మకం కావ్యం అంటే ఉట్టి ఒక్క రసాత్మక వాక్యం కావ్యమైపోతుందన్నది వక్రభాష్యం కాదా?

  వీటిని కవిత్వంగా కాక, జీవనసత్యాలు/సూక్తులు/పెద్దలమాటలు/ఆణిముత్యాలు/లోచనాశకలాలు గామాత్రమే నేను స్వీకరిస్తున్నాను. మన్నించగలరు.

  ఆ ద్లృష్టితో ఆలోచిస్తే మంచిగా ఉన్నాయి.

  మరోలా భావించరని భావిస్తూ

  బొల్లోజు బాబా

  స్పందించండి

 7. ఆత్రేయ
  జూలై 12, 2009 @ 15:55:14

  ఆచార్యా

  మీ రాసిన దానిని అపహాస్యమో అవహేళనో చేసే ఉద్దేశ్యం కాదు. మీకు అలా అనిపిచి ఉంటే క్షంతవ్యుడను. నాకు సొంతగా ఏక వాక్య కవితలు రాసే స్థోమత ఎలానూ లేదు.. మీరు రాసిన ఏక వాక్యాన్ని కొన్ని పదాలు మార్చి మరో కవితగా చేయడమే నేను సాధించింది. మీ కవితలు కవితాత్మకంగా మధురానుభూతినిస్తే.. నేను చేసిన మార్పులు వాటికి చేదు జతచేసి జీవితానికి దగ్గరగా తిసుకొచ్చాయి అనుకున్నాను.. ఇందులో వెటకారమేమీలేదు.

  ఒక కవితను చదివి.. అది నాకు నచ్చితే.. దానికి ప్రతిగా మరో కవితతో సమాధానమివ్వడం నాకు ఎప్పటినుంచో అలవాటు. కొన్నిసార్లు అది మొదటి కవితకు కొనసాగింపుగానో, లేక మొదటి కవితకు మరో అర్ధం చెప్పేవిగానో ఉంటాయి. అవి అతని/ఆమెనుగానీ కవితనుగానీ కించ పరిచడానికి ఉద్దేసించినవి కావు. నా బ్లాగులో ఇటువంటికవితలు చాలా వున్నాయి.

  ఏమైనా.. నా కామెంటులోని ఆంతర్యం, మీకు అనిపించినది మాత్రం కాదు. ఐనా మీకు అలా అనిపించడానికి కారణమయిన కామెంటేసినందుకు క్షమించండి. .. పెద్దలని, చదువుల తల్లి ముద్దుబిడ్డలని అవహేళన చేసి చరిత్రలో ఎవరూ సాధించినదేమీ లేదు.

  మీ ఏకవాక్య కవితలు బాగున్నాయి.

  స్పందించండి

 8. Dr.Acharya Phaneendra
  జూలై 12, 2009 @ 17:42:43

  బాబా గారు !
  కవిత్వం నిరంతరం పరిణామశీలమైనదని అంగీకరిస్తే, ప్రయోగాలు అవసరమే మరి !
  పైగా మినీ కవిత్వం పేరిట ” హైకూ ” వంటి విదేశీ ప్రక్రియను పట్టుకొని వ్రేళ్ళాడుతూ, ఒక్క వాక్యాన్నే మూడు ముక్కలు చేసి గొప్ప కవిత్వమన్నప్పుడు, దాని ననుసరించి నానీలు, రెక్కలు, చుక్కలు అంటూ రకరకాల ప్రక్రియలు పుట్టి విస్తృతంగా కవిత్వం ( ? ) వస్తున్నప్పుడు, ఏ విదేశ వాసనలు లేకుండా స్వచ్ఛమయిన వచన కవిత్వం ( సంపూర్ణంగా ముక్తచ్ఛందం ) గా, అదీ పూర్తి భారతీయమైన ఆలంకారిక సిద్ధాంత ప్రాతిపదికతో ” ఏక వాక్య కవితల ” ను నేను ప్రతిపాదిస్తే తప్పేంటి ?
  ” వాక్యం రసాత్మకం కావ్యం అంటే ఉట్టి ఒక్క రసాత్మక వాక్యం కావ్యమైపోతుందన్నది వక్రభాష్యం కాదా? ” అన్నారు. 14 వ శతాబ్దికి చెందిన ఆలంకారికుడు ” విశ్వ నాథుడు ” ప్రతిపాదించిన ” వాక్యం రసాత్మకం కావ్యం ” అన్న సిద్ధాంతాన్ని మీరు మరొకమారు సరిగా అధ్యయనం చేయాలేమో !
  నేను ఈ ప్రక్రియను ప్రారంభించినప్పుడు నాకు తెలియదు గానీ, తరువాత పరిశీలిస్తే _ నా కంటె 80 సంవత్సరాల పూర్వం విశ్వ కవి రవీంద్ర నాథుడు బెంగాలీలో ఇదే ప్రక్రియను చేపట్టాడు. దానినే మళ్ళీ ఆంగ్లంలో ప్రవేశ పెట్టి ” STRAY BIRDS ” గా వెలువరించాడు. అలా ఏ విధంగా చూచినా నాది పూర్తి భారతీయమైన ప్రామాణిక ప్రక్రియ !
  బ్లాగు మిత్రులకు ఈ ప్రక్రియ కొత్త కావచ్చు గాని, దీని గురించి, నా ” వాక్యం రసాత్మకం ” గ్రంథం వెలువడిన కొత్తలోనే
  ( 2004 ) అన్ని పత్రికలలో మంచి ప్రశంసలే వచ్చాయి.
  ” లోతులు తరచిన కొద్దీ, పాఠకుడి సహృదయతను బట్టి, విశ్లేషణను బట్టి, రస స్పందనను బట్టి ప్రతి కవిత్వపు పంక్తీ కాంతిచ్ఛటలు కుమ్మరిస్తుంది. ప్రతిదీ ఉదాహరించదగిన కవితా వాక్యంగా రచించడమే ఫణీంద్ర ప్రతిభ. అచ్చమైన
  ” మన తనం ” కోసం, ” మనీషి తనం ” కోసం తపిస్తున్న ఆచార్య ఫణీంద్ర ” వాక్యం రసాత్మకం కావ్యం ” అన్న ఆర్ష వాక్యానికి దృష్టాంతంగా ఈ ఏక వాక్య కవితలను ఒక నూతన ప్రక్రియగా అందించడం ఎంతయినా అభినందనీయం.
  సహృదయ సమాదరణీయం. ” అన్నారు ప్రముఖ కవి సుధామ.
  ” రస సిద్ధికి విస్తీర్ణంతో, వెడల్పుతో పని లేదని, భావనా సౌందర్యం ఉంటే చాలునని కవి నిరూపించడానికి ప్రయత్నించారు. భావనా సౌందర్యం ఒక్కటే కాదు. జీవితం పట్ల నిర్దిష్టమైన దృక్పథం, ద్రవించే హృదయం, ఆ తడిని అక్షర బద్ధం చేయగల కవితా సామగ్రి, అన్నీ పుష్కలంగా ఉన్న కవి ఫణీంద్ర. ఈ ఏక వాక్య కవితలు అతని ఒరిజినాలిటికి మచ్చు తునకలు. స్పందించే ప్రతి హృదయానికి అందులోని లోతులు స్పష్టమే.
  ఈ కవికి ఏక వాక్యానికి ఏయే విషయాలు అనుకూలిస్తాయో ఖచ్చితంగా తెలుసు. అందుకే చావు, జీవితం, ప్రేమ, కవిత్వం, కాలం వంటి అంశాలపై ఎక్కువ రాసారు. ” అన్నారు తెలుగు విశ్వ విద్యాలయం ఆచార్యాణి డా. సి. మృణాళిని.
  విమర్శకాగ్రేసరులు కీ.శే. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం న్యాయ నిర్ణేతలుగా రాష్ట్ర స్థాయి వచన కవితల పోటీలో ఈ ఏక వాక్య కవితలకు ” ఉత్తమ కవితా పురస్కారం ” ప్రదానం చేసారు.
  ప్రస్తుతం ఈ ఏక వాక్య కవితలను ” త్రివేణి ” పత్రికా సంపాదకులు ప్రొఫెసర్ ఐ. వి. చలపతి రావు, రాష్ట్ర ప్రభుత్వ అనవాదాల శాఖ పూర్వ సంచాలకులు గోవిందరాజుల రామకృష్ణా రావు ఆంగ్లంలోకి అనువదించారు. అతి త్వరలో అది గ్రంథంగా వెలువడబోతుంది.
  ఆత్మీయంగా పలుకరించారు. ఈ విషయాలు మీతో పంచుకోవాలనిపించింది.

  స్పందించండి

 9. Dr.Acharya Phaneendra
  జూలై 12, 2009 @ 20:33:13

  ఆత్రేయ గారు !
  మీరు మంచి భావుకులైన కవి. తరచుగా మీ కవితలు చదివి ఆనందిస్తూ ఉంటాను. మీ శక్తి ఇలా వృథా కాకూడదనే అలా సూచన చేసాను. అంతే ! మీరు శ్రద్ధ వహిస్తే నా కంటే మంచి ” ఏక వాక్య కవితలు ” వ్రాయగలరు !

  స్పందించండి

 10. bollojubaba
  జూలై 12, 2009 @ 20:59:35

  ఫణీంద్ర గారికి
  నమస్కారములు

  మీ సుదీర్ఘ సమాధానానికి ధన్యవాదములు.

  ఈ క్రింది నా అభిప్రాయాలు ఒక అంశంపై చర్చలో భాగమే తప్ప, వ్యక్తులమధ్య విభేదాలు కావని అభ్యర్ధన.

  కవిత్వానికి నిర్వచనంగా మీరు వాక్యం రసాత్మకం కావ్యం అనే సూత్రాన్ని సూత్రప్రాయంగా అన్వయించుకొంటున్నారు.

  నా ఉద్దేశ్యంలో కవిత్వం అంటే ఓ ప్రవాహం,ఒక జీవితం అంతే తప్ప ఉత్త తళుకు కాదని నమ్ముతున్నాను.

  మీ ఏకవాక్య కవిత్వాన్ని మీరు ఒక నూతన సాహితీ ప్రక్రియగా భావిస్తున్నారా, లేక కవిత్వ ప్రక్రియగా భావిస్తున్నారా? నా దృష్టిలో రెండూ వేరు. మొదటిదయితే ఏం పేచీ లేదు.(ఎందుకంటే సాహిత్యం అంటే కవిత్వమొక్కటే కాదు కదా) ఒక కవిత్వ ప్రక్రియ అన్నప్పుడే వస్తుంది. చిక్కు.

  ఇలాంటివన్నీ రిఫైన్డ్ వచనం అనిపించుకొంటాయితప్ప, కవిత్వస్థాయినొందలేవు.

  పెద్దలు సెర్టిఫికేట్ ఇచ్చినంతమాత్రాన కాలం ఇవ్వొద్దూ. ఎన్నిప్రయోగాలు కాలప్రవాహంలో కలసిపోలేదు. వీటివల్ల కవిత్వానికొరిగేదేమీ ఉండదని చరిత్ర చెప్పింది. సిరిసిరిమువ్వలు, ఆరుద్రకూనలమ్మపదాలు, సిప్రాలిలు,మినీ కవిత్వాలు వంటివి ఒక తాత్కాలికానందాన్నిచే ప్రక్రియలయ్యాయి. కాగా చివరికంటా నిలచినవి, మహాప్రస్థానాలు, త్వమేవాహాలు,తంగేడుపూవులే.

  నానీలు,నానోలు, రెక్కలు, రెట్టలను కవిత్వమనేకంటే కవిత్వశకలాలు అనటం వినయం అనిపించుకొంటుంది.
  అంతటి రవీంద్రుడే తన చిన్న చిన్న వాక్యాలను కవిత్వం అని పేరు పెట్టలేదు. స్టే బర్డ్స్ అన్నాడు. అంటే స్ట్రే థాట్స్ అని. అంటే దారితప్పిన ఆలోచనలు/స్వేచ్చా విహంగాలు అన్న అర్ధంలో వాడతాడు. అంటే ఆయనకు తెలుసు దీనిని కవిత్వమనకూడదని. కనుకనే pieces of poems అన్న అర్ధం వచ్చేలా పేరు పెట్టుకొన్నాడు. అది కవిత్వంపై మనకు ఉండవలసిన నిబద్దత, వినయమూనూ.

  అల్లానే శ్రీ సోమసుందర్ గారు, మినీ కవిత్వఉద్యమం రాకముందే అల్లానే అయిదారు వాక్యాల కవిత్వాన్ని వెలువరించారు. వానికి ఆయనపెట్టుకొన్న పేరు “రాలిన ముత్యాలు” అని. ఇక్కడకూడా అదేదో ఆయన కొత్తగా కనిపెట్టిన ప్రకియనో, ప్రయోగమనో, ప్రచారం చేసుకోలేదు.

  ఇక హైకూల గురించయితే, ఈ రోజున హైకూల పేరుతో వస్తున్నవేవీ హైకూలు కావు. వస్తురీత్యా కొన్ని మినహాయింపులు ఇచుకొన్నా హైకూల ప్రధాన సూత్రమయిన 17 అక్శరాల నియమాన్ని ఎవరు పాటిస్తున్నారు? తెలుగులోకి హైకూలను దింపిన (నాకు తెలిసి) ఇస్మాయిల్ గారే పాటించలేదు.

  ఎవరో కుర్రవాళ్లు, తెలుగు భాషలో పట్టులేనివారు, సాహిత్యాన్ని మధించనివారు, సాహిత్య చరిత్ర తెలియని వారు ఇలా చేస్తున్నారంటే క్షమార్హమే, కానీ చందోబద్దంగా పద్యాలు రాయగలమీరు, తలచుకొంటే ఓ పుస్తకమేయగలిగినంత దీర్ఘకవిత ను వ్రాయగలిగిన మీరు ఇలాంటి లొల్లాయి ప్రక్రియలకు పాల్పడటం, తెలుగు కవిత్వానికి చేస్తున్న ద్రోహంగానే భావిస్తున్నాను. యూ టూ బ్రూటస్ లా అనిపిస్తుంది.

  ఇదే విషయాలపై ఆవకాయ్.కాం లో విస్త్రుత చర్చలు జరిగాయి. వీలైతే చూడండి.

  ఇక మీరన్న స్ట్రే బర్డ్స్ ను చాన్నాళ్లక్రితం నేను తెలుగులోకి అనువదించాను. పుస్తకరూపంలోకి తీసుకురాబోతున్నాను కూడా.
  దాని లింకు ఇక్కడ. వీలైతే చూడండి.

  భవదీయుడు

  బొల్లోజు బాబా

  స్పందించండి

 11. bollojubaba
  జూలై 12, 2009 @ 21:17:25

  పైన నే చెప్పిన చర్చల లింకులు ఇవి

  http://aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=1425&pageNo=0

  http://aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=1495&pageNo=0

  బొల్లోజు బాబా

  స్పందించండి

 12. Dr.Acharya Phaneendra
  జూలై 13, 2009 @ 00:20:12

  బాబా గారు !
  నేనూ సహృదయ చర్చగానే భావించి సమాధానమిస్తున్నాను. ఇదీ సుదీర్ఘమవుతుందేమో చూడాలి !
  మొట్ట మొదటగా కవిత్వ నిర్వచనం సూత్రప్రాయంగా ఒకటి, మరోలా ఇంకొకటి ఉండదని మీరు గ్రహించాలి.
  మీ ఉద్దేశ్యంలో కవిత్వం అంటే ఓ ప్రవాహం, జీవితం _ అంటూ, మినీ కవిత్వాన్ని కాలానికి నిలిచేవి కావంటూ తీసిపారేసారు. నిలిచేది ” మహా ప్రస్థానం ” లాంటివే _ అన్నారు. మరి అదే మహా ప్రస్థానంలోని ” ఆః ” సంగతేంటి ? అది నిలుస్తుందా ? నిలువదా ? అసలు 1930-40 లలో వచ్చిన కావ్యాల పరిమాణం ముందు మహాప్రస్థానం సైజు ఎంత ? మరి అదెలా నిలిచింది ? అప్పుడు ప్రవాహాలు, జీవితాలను రాశులుగా పోసిన కావ్యాలెందుకు కాల గర్భంలో కలిసాయి ? అదే శ్రీశ్రీ ” నాటి మహా కావ్యానికి 18 పర్వాలు. నేటి కావ్యం 18 పేజీలే ! ” అన్నది లూజు స్టేట్మెంటేనా ? అవునూ _ ఈనాటి పాఠకులకు ” త్వమేవాహం ” కొరుకుడు పడుతుందా ? కూనలమ్మ పదాలా ? రేపు ఏది నిలుస్తుంది ? కూనలమ్మను వ్రాసి యాభై ఏళ్ళైనా నిలిచింది కాబట్టే కదా, మీరు దాని ప్రసక్తి తెచ్చారు.
  అమృతం ఒక్క చుక్కయినా అమృతమే ! గంగాళాలు తోడి పోయడం ఎవరి తరం కాదు. ఎంత వాల్యూమ్ పెరిగితే అంత వ్యర్థ వాక్యాలు కూడ పెరుగుతాయి. అందుకేగా మన ప్రాచీన కావ్యాలలో అక్కడో పద్యం, ఇక్కడో ఘట్టం గురించి చెప్పుకొనేది. మిగితా అంతా కథా సంవిధానానికి ఉపయుక్తమయ్యే అకవిత్వమే ! కాదంటారా ? ఒకసారి ఆలోచించండి _ 12వ శతాబ్దిలో బద్దెన, 17 వ శతాబ్దిలో వేమన వ్రాసిన ముక్తకాలు ఇప్పుడే కాదు _ ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆ తరువాత వ్రాసిన మహా కావ్యాలు మట్టి కొట్టుక పోయాయి.
  అంతెందుకు ? రవీంద్రుని stray birds నిలిచేది కాకపోతే ఒక శతాబ్ది తరువాత మీ కెలా దొరికింది ? దాని మీద ఆయనకే గౌరవం లేదని అన్నారు. దానిని మీరెందుకు మరి అనువదించారు? ఇప్పుడు పుస్తకంగా ఎందుకు వేస్తున్నారు ? చేస్తున్న పని మీద గౌరవం లేకుండా చేయడం ఆత్మ వంచన కాదా ? అది క్షమార్హమా ?
  మీరేదో దురవగాహనలో ఉండి చర్చకు దిగారు. ఒక్కటి గ్రహించండి _ బంగారం టన్నుల్లో ఉన్నా, మిల్లి గ్రాముల్లో ఉన్నా బంగారమే ! చిక్కని కవిత్వమూ అంతే !
  అందుకే నాలాంటి వాడు పద్య కావ్యం వ్రాసినా, గేయం వ్రాసినా, దీర్ఘ ( వచన ) కవిత వ్రాసినా, మినీ కవిత వ్రాసినా పరితపించేది ఆ చిక్కని కవిత్వం కోసమే ! నేను ఏ ప్రక్రియను చులకనగా చూడను. ఏ ప్రక్రియ పట్ల నాకు ద్వేష భావం లేదు. కానీ మన దగ్గర ప్రక్రియలు కరువైనట్టు, జాతి యావత్తు హైకూలు, హైకూల మానస పుత్రికల వెంట పరిగెత్తడం చూచి రోత పుట్టింది. కవిత్వం చిప్పిలే హైకూను ఇప్పటికీ నేను గౌరవిస్తాను.
  మీరు అక్షర నియమం గురించి వ్రాసారు. ముక్తచ్ఛందమైన వచన కవిత్వంలో భాగంగా దానిని చూసినప్పుడు మళ్ళీ అక్షర నియమంపై అంత పట్టింపులెందుకు ? నియమాలపై అంత పట్టింపే ఉంటే పద్యమే వ్రాసుకోవచ్చు కదా ! ఏం ఆటవెలది కన్న అందమైనదా హైకూ ? మీలో వైరుధ్య భావాలు కనిపిస్తున్నాయి.
  కాబట్టి ప్రక్రియ ముఖ్యం కాదు. దాని పరిమాణం ముఖ్యం కాదు. కావలిసింది చిక్కని కవిత్వం. ఆ చిక్కని కవిత్వాన్ని కాలానుగుణంగా కొత్త రూపంలో అందించగలిగితే ఆహ్వానించాలి. ఆనందించాలి. అంతే కాని, ద్వేషించ కూడదు. చులకన చేయకూడదు.
  చివరిగా ఒక్క మాట _ నేను చేసిన పనిని నేను చేసానని చెప్పడం వినయం కాదని చెప్పడం దౌర్భాగ్యం. అది గర్వం కాదు. ఆత్మ విశ్వాసం. మన మానస పుత్రిక మీద మనకుండే మమకారం. ఆనాడు ” నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగాన్ ” అని నన్నయ అన్నప్పుడు కూడా ఆయన సమకాలికులు ఇలాగే అని ఉంటారు. అయినా ఆయన లెక్క చేసి ఉండడు. అందుకే ఆ పద్యం అలాగే ఉంచాడు. ఆయన ఆత్మ విశ్వాసానికి నేను సదా జోహారులు పలుకుతాను. అదే మిమ్మల్ని చూడండి. అద్భుతంగా stray birds ని అనువదించిన మీలోని కవిని చూస్తే, అపారమైన గౌరవం కలుగుతుంది. ఆ కవిని గౌరవించలేని, ఆ కృతి పట్ల ప్రేమ, మమకారం లేని మిమ్మల్ని చూస్తే బాధా, కోపం కలుగుతుంది.

  స్పందించండి

 13. bollojubaba
  జూలై 13, 2009 @ 01:47:01

  ok
  మీ అభిప్రాయాలు మీవి నావి నావి.
  నేను మిమ్ములను మార్చలేనట్లె మీరూ నన్ను మార్చలేరు.
  చర్చించితే విషయాలు మార్పిడి జరగొచ్చేమోనన్న ఆశ ఉండింది. అందుకే పంచుకొన్నాను. బహుసా ఈ లోకంలో నాలాగా ఆలోచించేవారుకూడా ఉంటారని మీరు, మీలాగా ఆలోచించేవారు ఉంటారని నేనూ నేర్చుకోగలిగాము. అందుకు ఈ మాధ్యమానికి ధన్యవాదాలు తెలుపుకుందాము.

  నా వాదన కొన్ని చోట్ల సరిగా వినబడటం లేదేమోనని అనిపిస్తుంది. కనుక మరికొంత క్లారిటీ తో ఈ కామెంటు రాస్తున్నాను

  ౧. నా దృష్టిలో కవిత్వమనేది జలదరింపు కలిగించాలి, ఒక జీవితాన్ని చూపించాలి. కవితకు కూడా కావ్యానికున్నట్లే నాంది, ప్రస్తావన, విషయం, ముగింపు వంటి శిల్పలక్షణాలుండాలని భావిస్తాను. (తిలక్ కవితలు చూడండి) అవి లేని వాటిని కవితగా అంగీకరించలేకపోవటం నా దౌర్భల్యం. దానికి మీరు జవాబుదారీ కాదు.

  ౨. అక్షర నియమంపై అంత పట్టింపులెందుకు ? —
  హైకూల రాజ్యమేలుతున్నదని మీరన్నందకు నేనలా అన్నాను. ప్రస్తుతం హైకూలపేరుతో వ్రాస్తున్నవేమీ హైకూలు కావు. అవి చిన్న చిన్న చమత్కార వాక్యాలో లేక పదచిత్రాలో. ఇది నా నిశ్చితాభిప్రాయం. అంతే తప్ప హైకూలు వ్రాసేవారందరినీ అక్షరనియమాలు పాటించమని కాదు నా ఉద్దేశ్యం. పాటించటంలేదు కనుక హైకూలనవద్దని.

  ౪. స్ట్ర్రేబర్డ్స్ మీద టాగోర్ కే గౌరవం లేదని అన్నానని అన్నారు. రామ రామ నా మాటల్లో అంత దారుణమైన అర్ధం ధ్వనించటం నా దురదృష్టం. నేనన్నది గౌరవం లేదని కాదు. స్ట్రే బర్డ్స్ లో ఒక్కొక్క వాక్యాన్నీ ఒక పూర్ణ కవిత అని ఆయన ఎక్కడా చెప్పుకోలేదని లేదా నేను ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఏక వాక్య కవితలను వ్రాసానని ప్రచారించుకోలేదని నా ఉద్దేశ్యం. వాటిని stray thoughts గానే ఆయన భావించాడు. అవంతే. ఏక వాక్యాలు (కొన్ని చోట్ల రెండు లేదా మూడు కూడా). ఒక్కొక్కటి ఒక్కో జీవనసత్యాన్నో, పదచిత్రాన్నో, తెలుపుతా ఉంటాయి.

  వాటి పట్ల నా నిబద్దత, ప్రేమా నాకు మాత్రమే తెలుసు. మీకూ తెలియాలని లేదు కదా? తెలియకుండా ఆ కృతి పట్ల నాకు ప్రేమ, మమకారం లేదని అనటం మీకు తగునా?

  ౪.కాబట్టి ప్రక్రియ ముఖ్యం కాదు. దాని పరిమాణం ముఖ్యం కాదు. కావలిసింది చిక్కని కవిత్వం. — నావాదనంతా అదే కవిత్వమే వ్రాయండి. ఒడలు జలదరించే కవిత్వం వ్రాయండీ. ఎవరు కాదన్నారు? కానీ ఆ క్రమంలో రకరకాల పేర్లెందుకు. (నానీ ప్రక్రియ, రెక్కల ప్రక్రియ, నాలుగులైన్లు, రెండు లైన్లు, ఒక లైను అంటూ) పరిమాణాలపై ఆంక్షలెందుకు. బహుసా ఈ విషయంలో మనిద్దరి భావాలూ ఒకటేనేమో.

  ౫. చేసిన పనిని నేను చేసానని చెప్పడం వినయం కాదన్నది నా అభిప్రాయం.
  చేసిన పనిని చెప్పుకోకపోతే ఎలా? అన్నది మీ అభిప్రాయం.
  ఎవరి భావాలు వారివి. you have every right to believe, so i too.

  ౬. నా బ్లాగులో మూడునుంచి ఆరులైన్లలోపు ఉండే కవితలను (?) నేను కవితలుగా పరిచయం చేయను, వాటిని శకలాలంటాను. ఆలోచనలవో, కవితవో. లేక ఎదో ఒక పదచిత్రానివో. ఇది నా ప్రస్తుత అభిప్రాయం. ఏమో మీబోటి పెద్దల మార్గంలో నెనూ నడవవలసిన రోజు వస్తుందేమో. ఎవరు చెప్పగలరు.

  ౬.ద్వేషించ కూడదు. చులకన చేయకూడదు – . మీ గురించి వ్రాసినవాక్యాలలో ముమ్ములను, మీ ప్రతిభను మెచ్చుకొన్నానే!

  వీటిని కవిత్వంగా కాక, జీవనసత్యాలు/సూక్తులు/పెద్దలమాటలు/ఆణిముత్యాలు/లోచనాశకలాలు/కొటేషన్లు గా భావించుకొని చదువుకొంటున్నప్పుడు నాకెంతో రససిద్దిని కలిగిస్తున్నాయి. ఇది వైయుక్తికం కావొచ్చు. మరొకనికి ఇవే మహా కావ్యాలుగా అనిపించవచ్చు.

  ౭. నా రెండవ కామెంటు మీ అస్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉందని మీరు భావిస్తే క్షంతవ్యుడను. ముందుగా చెప్పినట్లు ఇవన్నీ చర్చలో భాగంగానే భావించాను. (మీ కామెంటు మాత్రం నా అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లనిపించింది). మీకంటే చిన్నవాడిని కనుక అందుకుకూడా నేనే బాధ్యత వహిస్తున్నాను.
  శలవు.

  బొల్లోజు బాబా

  స్పందించండి

 14. కత్తి మహేష్ కుమార్
  జూలై 13, 2009 @ 10:08:03

  చర్చ బాగుంది.

  స్పందించండి

 15. Dr.Acharya Phaneendra
  జూలై 14, 2009 @ 02:13:40

  బాబా గారు !
  ” మీ అభిప్రాయాలు మీవి, నావి నావి ” అంటూ మీరు రాజీకొచ్చారు. కాని, సహృదయ చర్చ అనుకొన్నపుడు, విషయం తేలే వరకు చర్చించాలి కదా ! అయితే మీ కిష్టం లేకపోతే నిరభ్యంతరంగా చర్చను నిలిపేయవచ్చు ! మీకా హక్కు ఉంది .
  మీరు క్లారిటీతో ఇచ్చానన్న కామెంట్లతో కూడ నేను విభేదించక తప్పడం లేదు. మీరిచ్చిన కామెంట్ల వరుస సంఖ్యలోనే నా సమాధానాలను చూడండి.
  1.” రసం యన్నిష్ఠం అంటే రసం సహృదయ జన నిష్ఠం ” అన్నారు మన లక్షణకారులు. మీరన్నజలదరింఫు పాఠకుని సహృదయతను బట్టి, విశ్లేషణా శక్తిని బట్టి, రస స్పందనను బట్టి మారుతుందని గ్రహించండి. ఇక శిల్ప లక్షణాలంటారా ?
  అవి కవిత పరిమాణాన్ని బట్టి కాకుండా, కవి ప్రతిభను బట్టి ఉంటాయి.
  చంద్రబోస్ కవిత అనుకొంటా …
  ” కన్ను విప్పితే జననం
  కన్ను మూస్తే మరణం
  రెప్పపాటుదే జీవితం ! ”
  ఏం ? ఈ మూడు లైన్ల కవితలో ఒక జీవిత వైశాల్యం విస్తరించి లేదా ? ఇందులో శిల్ప లక్షణాలు లేవా ?
  సినారె కవిత చూడండి …
  ” విసిరేసిన ఖాళీ సీసా !
  ఉసూరుమనకు !
  నీ ముఖాన్ని పగుల గొట్టుకో _
  పదునైన బాకులు పొడుచుకొస్తాయి ! ”
  ఇందులో విసిరేసిన ఖాళీ సీసా దేనికి ప్రతీక ? బాకులు పొడుచుకు రావడం దేనికి ప్రతీక ? ఏం ? కేవలం ఈ 4 లైన్లలో ఆ మహాకవి శిల్ప సౌష్టవాన్ని నిలుప లేదా ?
  అంతెందుకు ? శ్రీశ్రీ కవిత ” ఆః ” గురించి ఇంతకు ముందు సమాధానంలో అడిగినప్పుడు దాని గురించి మాట్లాడలేదే ? అందులో శిల్పం లేదా ?
  చంద్రబోస్ అంత అందంగా చెప్పక పోయినా, నా ఏక వాక్య కవిత ” పడుకొన్నవాడు లేచి, తిరిగి, మళ్ళీ పడుకోవడమేగా జీవితం ! ” లో జీవిత వైశాల్యం లేదా ? శిల్పం లేదా ?
  కేవలం ఒక్క వాక్యంలోనే శిల్ప లక్షణాలను, రస సిద్ధిని సాధించే ప్రయత్నాన్ని గమనించకుండా, గుడ్డిగా 6 లైన్ల కంటె తక్కువుంటే అది కవితే కాదనడంలో అర్థం ఉందా ?
  2. సంస్కృతంలో ఉన్న ” ఉత్పలమా ” లాది పద్యాలలో యతిప్రాసలు చేర్చి, నన్నయ తెలుగు పద్యాలను తీర్చి దిద్ద లేదా ? జపనీస్ హైకూ, తెలుగు హైకూ ఒకేలా ఉండాలని రూలుందా ? ఆ ప్రక్రియను తెలుగులో ప్రవేశ పెట్టిన కవికి లేని భావ దాస్యం మీకెందుకు ? దీనిని కవిత అనవద్దు .. దానిని హైకూ అనవద్దు .. అంటూ మొత్తం తెలుగు సాహిత్యంపై మీరే గుత్తాధిపత్యం వహించడం ఆశ్చర్యంగా ఉంది. రాయప్రోలు వారు ప్రాస లేని వృత్తాలను వ్రాస్తే, దేవులపల్లి వారు మూడు పాదాల తేటగీతులను వ్రాస్తే, విమర్శకులు ” వారి కనువుగా లక్షణాలను మార్పు చేసుకొన్నారు ” అన్నారే తప్ప వాటిని పద్యాలే అనవద్దు .. వీటిని కవితలే అనవద్దు అని ఆక్షేపించ లేదన్న విషయం మీకు తెలియాలి.
  3. కావ్య పరిభాషలో కవితకు గౌరవం అంటే ” కావ్య గౌరవం ” అని. అది ” మినీ కవితలకు ఈయలే ” నంటూ ఇంతకు ముందు సమాధానంలోనే కాదు .. ఇప్పటి సమాధానంలోనూ విస్పష్టంగా వ్రాసారు. మళ్ళీ అంతలోనే మాట మార్చి, ” రామ రామ ! నాకు గాని, టాగోర్ కి గాని గౌరవం లేదని నేను అనలేదు ” అంటే ఎలా ? కావ్య గౌరవం కాకుండా, మరి ఇదే రకం గౌరవం ? ఒక వేళ అది ఉన్నా, ఇతర కవితా ప్రక్రియలలాగా గౌరవించనప్పుడు మీ so called గౌరవం, నిబద్ధత, ప్రేమ, మమకారం etc., etc., ఎందుకు పనికొచ్చేను ?
  4. ఇది మరీ బాగుంది ? ” ఉన్న ప్రక్రియలోనే చిక్కని కవిత్వం వ్రాయండి .. ఇక కొత్త ప్రక్రియలెందుకు ? కొత్త పేర్లెందుకు ? ” అంటే 12వ శతాబ్దిలో సోమనాథుని దేశి కవితలు, దేశి ఛందస్సులు వచ్చేవా ? 15వ శతాబ్దిలో అన్నమయ్య కీర్తనలు, ప్రౌఢ ప్రబంధాలు, మళ్ళీ ఆధునిక కాలంలో గురజాడ ముత్యాల సరాలు, శ్రీశ్రీ మహాప్రస్థానం వంటి గేయాలు, ఆ పైన వచన కవితలు, ఇంకా మనం చర్చిస్తున్న మినీ కవితలు వచ్చేవా ? అంటే మీరు కవిత్వాన్ని ఎక్కడ కక్కడ మట్టు బెట్టి, అభివృద్ధి కాకుండా ఆపాలంటారా ? లేదా మినీ కవిత్వం వ్రాసినా దానికో పేరు, పద్ధతి, తీరు, తెన్నులేకుండా చేయాలంటారా ? మీరు కవిత్వ పరిణామ శీలాన్ని గూర్చి తెలియకుండా మాట్లాడుతున్నారు.
  5. ఒక కవిత గానీ, ప్రక్రియ గానీ, లేక మరే సృజన గానీ _ మన మానస పుత్రికగా లేక మస్తిష్క పుత్రికగా భావిస్తాం మనం. కూతురును కూతురుగా చెప్పుకోలేక పోవడం నా దృష్టిలో దౌర్భాగ్యమే ! మీరు చెప్పిన ప్రకారం మన కవులంతా పాటించి ఉంటే, ఈనాడు మనకు నన్నయ భారతం వ్రాసాడని మనకు తెలిసేది కాదు ( ఆది కావ్యం మరి .. కొత్త ప్రక్రియ .. చెప్పుకోకూడదు కదా ! ). తొలి ద్విపద కావ్యం పాల్కురికి వారు వ్రాసారని, గురజాడ ముత్యాల సరాలకు రూపు దిద్దాడని… ఇలా మనకంటూ ఓ సాహిత్య చరిత్రే ఉండేదే కాదు, కలగా పులగంగా కావ్యాలు తప్ప. ఇదంతా చూస్తుంటే, ఏ ఒక వ్యక్తికి కొత్తగా ఏదన్నా credit వస్తే సహించ లేమన్న మాట !
  ఇలాంటి వారికి భయపడో, అదేదో వినయమనో, చాలా మంది కవులు ఏదీ చెప్పక పోవడం వల్లే, చాలా గ్రంథాల కర్తృత్వాలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ దౌర్భాగ్యం మన సాహిత్యంలోనే కాదు, ఇతర రంగాల్లో కూడా ఉంది. అందుకేగా జగదీశ్ చంద్ర బోస్ కనుక్కొన్న రేడియో మార్కొని పేర నమోదయింది. ఇప్పుడు కూడ మనకు చెందాల్సిన ఎన్నో పేటెంట్లు విదేశీయుల పాలవుతున్నాయి.
  ( రాత్రి 2 – 15 గం||లయింది … సారీ ! సశేషం )

  స్పందించండి

 16. bollojubaba
  జూలై 14, 2009 @ 03:23:10

  ఫణీంద్రగారికి

  సహృదయతో చర్చ జరపటమంటే అంశంపై కాక ప్రశ్నించిన వ్యక్తిపై వ్యక్తిగత దాడి చేయటం కాదని తెలుసుకోండి ముందు.

  మీరు మీ కామెంటులలో అభిప్రాయాలను విభేదించటం మాని నన్ను విభేదించటం ఎప్పుడైతే మొదలెట్టారో అప్పుడే నేను మీ అభిప్రాయాలు మీవి నా అభిప్రాయాలు నావి అని విరమించుకొన్నాను. (దాన్ని రాజీ కొచ్చానని చెప్పుకొంటున్నారు) నా చివరి కామెంటుకు శలవు అని వ్రాసాను. అది మీరు అర్ధం చేసుకోలేదని నేను అనుకోను.

  అయినా సరే ఇంకా చర్చను కొనసాగించాలనుకోవటం మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను.

  ఇక పైన చేసిన మీ కామెంటులో కూడా కొన్ని వాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.

  అది మీ సంస్కారం

  నా నిబద్దత , విశ్వాసాలు మీరు ప్రశ్నించినంతమాత్రాన మారిపోవు, జారిపోవు.

  చివరగా
  ” పడుకొన్నవాడు లేచి, తిరిగి, మళ్ళీ పడుకోవడమేగా జీవితం ! ” దీన్ని కూడా కవితగా అనుకోమంటున్నారు. . తెలుగు సాహితీ రంగంలో ఆవిష్కరింపబడుతున్న గొప్ప ప్రక్రియగా చెపుతున్నారు. సంతోషం

  ఇది చాలు కవిత్వం పట్ల మీ ఆలోచనా స్థాయి ఏపాటిదో అర్ధం చేసుకోవటానికి. ఇంక మాట్లాడటానికేముంటుంది. రణగొణధ్వనులు తప్ప.

  మరో సారి శలవు
  బొల్లోజు బాబా

  స్పందించండి

 17. కేతా
  జూలై 14, 2009 @ 10:06:54

  ఏక వాక్య కవితలను మీరు కొత్తగా కనిపెట్టారా?
  భలే ఉందే మీ బడాయి.
  మరి వీటినేమంటారు? పాపం వీటిని వ్రాసిన వారికి మీలా ఓ కొత్త పేరు పెట్టి పేటెంటు తీసుకోవాలన్న తెలివితేటలు లేకపోయాయి. అమాయకులు.

  మచ్చుకు కొన్ని

  అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
  అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
  అతి రహస్యం బట్టబయలు
  అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
  అనువు గాని చోట అధికులమనరాదు
  అభ్యాసం కూసు విద్య
  అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
  అయితే ఆదివారం కాకుంటే సోమవారం
  ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
  ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
  ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
  తనువు లస్థిరములు ధర్మంబు నిత్యము
  చేయు ధర్మమెల్ల చెడని పదవి
  ధార్మికునకు గాని ధర్మంబు గనరాదు
  చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు, -కొంచె మైన నదియు కొదువ గాదు
  ఇరుగు పొరుగు వారి కెనయు సంపద జూచి, – తమకు లేదటన్న ధర్మమేమి?

  స్పందించండి

 18. Dr.Acharya Phaneendra
  జూలై 14, 2009 @ 19:55:57

  బాబా గారు !
  మిగిలిన అభిప్రాయ భేదాలను కూడా వివరించాక స్పందిస్తారనుకొన్నాను.
  6,7,8 కామెంట్ల ( అభిప్రాయాలే కదా !) పై కూడా నా అభిప్రాయాలను వివరించే లోపే మీలో అసహనం పెరగడం .. ఆశ్చర్యంగా ఉంది.
  మీ అభిప్రాయాలపై నా అభిప్రాయాలను వెలిబుచ్చితే, అది మీకు వ్యక్తిగతమైన దాడి అనిపించింది.
  ” యూ టూ బ్రూటస్ లా ” అని తెలుగు కవిత్వానికే నన్నొక హంతకునిగా చిత్రించడం, ” దీన్ని కూడా కవితగా అనుకోమంటున్నారు. తెలుగు సాహితీ రంగంలో ఆవిష్కరింపబడుతున్న గొప్ప ప్రక్రియగా చెపుతున్నారు. సంతోషం. ” అని వెటకారం చేయడం, ” ఇది చాలు కవిత్వం పట్ల మీ ఆలోచనా స్థాయి ఏ పాటిదో అర్థం చేసుకోవటానికి. ” అనడం మీకు వ్యక్తిగతమైన దాడి అనిపించడం లేదు.
  అక్కడే సహృదయ చర్చ గాడి తప్పింది. అయినా చర్చలో విషయ నిర్ధారణ జరగాలన్న సహృదయంతో సంయమనం పాటించి చర్చ కొనసాగించాను. కాని ఇంత వరకు వచ్చాక, ఇక ఈ చర్చ కొనసాగడం అనవసరం. అందుకే ఆపేస్తున్నాను.
  చివరిగా ఒక్క మాట ! నాకు మీతో వ్యక్తిగతమైన విభేదమేమీ లేదని మరొకమారు విజ్ఞప్తి చేస్తున్నాను. ఐతే ఒక సాహితీ మిత్రునిగా నాడు చేమకూర కవి చెప్పిన ” అల్పాక్షరాలలో అనల్పార్థ రచన ” అన్న వ్యాఖ్యను లోతుగా అధ్యయనం చేయమని సూచిస్తూ _
  సెలవు !

  స్పందించండి

 19. Dr.Acharya Phaneendra
  జూలై 14, 2009 @ 20:13:18

  కేతా గారు !
  మీకు సామెతలకు, నా ఏక వాక్య కవితలకు తేడా కనిపించక పోవడం ఆశ్చర్యంగా ఉంది.
  సామెతలను ఏ కవి పనిగట్టుకొని రచించడు. అవి జన వ్యవహారంలో సామాన్యుల నోటి నుండి పుట్టుకొస్తాయి.
  వాటిలో వాక్య లయ ఉంటుంది గాని కవిత్వాంశ ఉండడం అరుదు.
  మీరు నా మీద మొదటి కలయికలోనే నోరు పారేసుకొన్నా, నాకెందుకో మీకీ విషయాలు వివరించాలని అనిపించింది.
  అన్నట్టు, ” అమాయకులు ” సాధు రూపం కాదు. ” అమాయికులు ” అనాలి.
  శుభమస్తు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: