వరాహ శతకము

నేను త్వరలో గ్రంథంగా ముద్రించబోయే నా ” వరాహ శతకము ” ను ధారా వాహికగా ఈ బ్లాగులో ఉంచుతున్నాను. ఆధుని కాభ్యుదయ భావజాలంతో అధిక్షేప, వ్యంగ్య, హాస్యాలను రంగరించి రచించిన ఈ శతక భాగాలను చదివి, బ్లాగు మిత్రులు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను, స్పందనలను వ్యాఖ్యల ద్వారా తెలియజెప్పుమని విజ్ఞప్తి చేస్తున్నాను.
_ డా. ఆచార్య ఫణీంద్ర

వరాహ శతకము
( అధిక్షేప, హాస్య, వ్యంగ్య కృతి )
————————-
రచన : ” పద్య కళా ప్రవీణ ” డా. ఆచార్య ఫణీంద్ర
____________________________________________________

pig

” శ్రీ ” యని దిద్ది, పూనితొక చిత్ర విచిత్రమునైన కార్యమున్ !
చేయవె ఒక్క సాయమును _ చెంతన నిల్వుము కొంత కాలమున్ !
ఏయది కార్యమందువె ? మరేమియొ గాదది _ నీదు పైననే
వ్రాయగ బూనినాడ నొక వాసి గలట్టి కృతిన్, వరాహమా !   …   1

ఒక్కడు నీదు పైన నిటు లుర్విని ప్రేమను చూపలేదటం
చుక్కిరి బిక్కిరై చనకు _ ఉండునులే సమ దర్శనంబు ! నే
నెక్కుడు జేసి వ్రాయను ! మరెక్కువ మట్టుకు దూషణంబులే
దక్కును నీకు ! సిద్ధపడి దానికి నూపు తలన్ ! వరాహమా !   …   2

ఊపిన, నూపకున్న తల _ నొక్కప రేనెది నిర్ణయించుచో _
ఓపగ లేను చేయకది ! ఒప్పక తప్పదు నీవు నింక ! నీ
వోపిన, నోపకున్న మరి ఒక్కొక పద్యము చెప్పినంత, కా
స్తోపిక తెచ్చుకొంచు _ ” అహ ! ఓహొ ! ” యటం చనుమా ! వరాహమా !   …   3

కుప్పలు వోసి వ్యంగ్యమును, కూరిచి హాస్య, మధః కృతంబులన్
చిప్పిలు రీతి నే శతక సృష్టిని సల్పగ బూనినాడ ! నే
చప్పున నోరు జారినను సాగగ నీ కవనంపు బాటలో
తప్పది నాది కాదు _ గతి తప్పిన నీ నడతే ! వరాహమా !   …   4

అటులని నాకు లేదనకు మంతయొ, నింతయొ జాలి నీదుపై _
కటువుగ మాటలాడినను కల్గును నా మదిలోన వెన్నయే !
కుటిలత లేక _ గుండె నెలకొన్నపుడే కరుణామృతమ్ము , తా
పటుతరమైన కైత కవి వ్రాయగ నోపునులే ! వరాహమా !   …   5

లోకమునందు నిన్ను గన లోకు లదేలనొ ఈసడింతురే ?
తాకిన యంత మాత్రమున తత్క్షణ మింటికి పోయి, స్నానమున్
చేకొని శుద్ధి నొంది, నిను చేయుదు రంటగ రాని దానిగాన్ !
నీ కథ విన్నయంత _ దయనీయము గాదొకొ ? ఓ వరాహమా !   …   6

ప్రాణులవన్ని యొక్కటని, వానిని జీవము సైత మొక్కటే
గాని, వివక్ష కూడదని _ క్రైస్తవ కాలము కన్న పూర్వమే
వీనుల చాటె ” శాక్య ముని ” విశ్వమునందున ! ఐన గాని, మా
మానవు లెంత మాత్రమును మారరు నేటికి ! ఓ వరాహమా !   …   7

” ప్రాణులు ” పెద్ద మాటగు _ ప్రపంచమునందున మానవాళినిన్
కానగ నెన్ని భేదములు ? కంటికి మాసిని పూసుకొందురే ?
నేనిది, నీవదంచు పలు నీచ వివక్షత గల్గు మాటలన్
మానవు లింక పల్కుదురు _ మచ్చయె జాతికి ! ఓ వరాహమా !   …   8

పందుల యందు గూడ మరి పల్విధమౌ ఉప జాతులెన్నియో
కందుము ! సీమ పందులును, గ్రామములందున ఊర బందులున్
వందల కొల్ది యుం, డడవి పందులు, నింకను ముళ్ళ పందులుం,
డందున తెల్లనైనవియు, నట్టులె నల్లనివో వరాహమా !   …   9

ఇన్ని రకాల భేదముల వెన్నియొ యున్నను కాంచ లేదు నే
నెన్నడు _ మీరు, మీరొకరి నింకొక రెప్పుడు తిట్టి పోయుటన్;
మున్నుగ నవ్వి, వెన్కకును మోసము సల్పుట ! కాని, మానవుల్
పన్నియు భేద భావ మిటు పాపము చేయుదురో వరాహమా !   …   10

రంగులు వేరటంచు; తమ రాష్ట్రము, దేశము వేరటంచు; దే
హాంగము లెంచి కుంటి, అవి, టంధులు, మూగలటంచు; సంపదల్,
హంగుల నెంచి పేద, ధనవంతులటంచు; కులాల్, మతాలటన్ _
పొంగగ ద్వేషముల్ నరులు పూర్తిగ జారిరి ! ఓ వరాహమా !   …   11

ఎవ్వడు క్రైస్తవుం, డెవడు హిందు, వెవండు మహమ్మదీయుడున్ ?
అవ్వకు బుట్టు వారె మరి అందరు ! అందరి కాకలైనచో
బువ్వ భుజించు వారె ! తమ బొందిని పారెడి రక్త మొక్కటే !
క్రొవ్విన ధూర్తులే మతము గోడలు కట్టుదురే ! వరాహమా !   …   12

సత్య, మహింస, శాంతి _ భువి స్థాపన జేయగ నుద్భవించి, సత్
కృత్యము లాచరించుచును, కీర్తన జేయుచు ” నీశ్వ, రల్ల ” లన్,
నిత్యము బోధ జేసెను వినిర్మల జీవన మార్గ మేదొ ! ఔ
న్నత్యము నెంచి మ్రొక్కెదను మనంబున ” గాంధి ” కి _ ఓ వరాహమా !   …   13

వశమయి ఆంగ్ల పాలనకు భారత మాతయె బానిసైన, ఏ
దిశయును, మార్గమేదియును దేశ జనావళి కానకున్న, ఆ
దశ నరుదెంచి చూపెనట దారిని _ చేకొని శాంతి యుద్ధమున్ _
యశము, స్వరాజ్య మందగ మహాత్ముడు గాంధి ! అహో వరాహమా !   …   14

రాజ కిరీటముల్ ధరణి రాలి, ప్రజావళి రాజ్యమేలు మేల్
రోజులు వచ్చె నేడు _ చెడు రోజుల దాస్యము లంతరించె _ ఈ
రోజున జాతి, లింగ, కుల రోగము లింక సమాజ మందునన్
బూజుగ బట్టి వ్రేలుటన మూర్ఖము గాదటె ? ఓ వరాహమా !   …   15

నల్లని వాడు _ లోతు నయనంబుల వాడు _ మనుష్యులందునన్
తెల్లగ, నల్లగా యనుచు దేహపు వన్నెల భేద ముల్లమం
దొల్లని వాడు _ నిమ్న జను లుబ్బ, ” ఒబామ ” అమేరికన్లకున్
” తెల్లని ఇల్లు ” సాక్షిగ అధీశ్వరుడయ్యె నహో ! వరాహమా !   …   16

( సశేషం)

___ *** ___

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. narasimharaomallina
  జూలై 10, 2009 @ 21:57:43

  వోపిన, నోపకున్న మరి ఒక్కొక పద్యము చెప్పినంత, కా
  స్తోపిక తెచ్చుకొంచు _ ” అహ ! ఓహొ ! ” యటం చనుమా ! వరాహమా !

  ఆహా ! ఓహో ! ఎంతో బాగున్నాయని అనాలనే ఉందండి ఎలాగో ఓలా వోపిక చేసుకుని . మంచి ధారాశుద్ధితోనూ, తేట తెనుగు పదాలతోనూ సాగుతున్న ముచ్చటైన మీ పద్యాలను చదివి ఆహా ! ఓహో! అనకుండా వుండటం సాధ్యం కూడా కావట్లేదు కూడాను .

  స్పందించండి

 2. narasimharaomallina
  జూలై 10, 2009 @ 22:01:45

  నల్లని వాడు _ లోతు నయనంబుల వాడు _ మనుష్యులందునన్
  తెల్లగ, నల్లగా యనుచు దేహపు వన్నెల భేద ముల్లమం
  దొల్లని వాడు _ నిమ్న జను లుబ్బ, ” ఒబామ ” అమేరికన్లకున్
  ” తెల్లని ఇల్లు ” సాక్షిగ అధీశ్వరుడయ్యె నహో ! వరాహమా ! …

  చాలా బాగుందండి. మా ఆభినందనలు అందుకోండి . కాని ఇంకేమీ దొరకనట్టు వెళ్ళి వెళ్ళి దానిమీద పడ్డారేంటండీ బాబు.

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  జూలై 11, 2009 @ 05:17:24

  నరసింహారావు గారికి నమః
  ” కాదేది కవిత కనర్హం ” అన్నారు కదండి శ్రీశ్రీ.
  కాస్త అధిక్షేపం, వ్యంగ్యం, హాస్యం జోడించడానికి వరాహం వెంట పడక తప్పలేదు మరి !
  ముందు ముందు పద్యాల్లో మీకే అర్థమౌతుంది. ధన్యవాదాలు !

  స్పందించండి

 4. కోడీహళ్లి మురళీమోహన్
  జూలై 14, 2009 @ 21:18:43

  కాస్త ఆలశ్యంగా మీ బ్లాగులో తొంగి చూస్తున్నాను. నా కోరికను మన్నించి మీ వరాహ శతకాన్ని బ్లాగులో ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు! మీ ఏకవాక్య కవితలపై జరుగుతున్న చర్చ రసవత్తరంగా ఉంది. బాబాగారి 6,7,8 కామెంట్లపై మీ అభిప్రాయాలు వివరించకుండా చర్చను ఆపివేయడం మాత్రం బాగాలేదు.

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  జూలై 14, 2009 @ 22:33:13

  సహృదయులు మురళీ మోహన్ గారికి నమః
  కోరి, నా చేత ” వరాహ శతకం ” ను బ్లాగులో పెట్టించినందుకు ముందుగా నేనే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
  ఇక ” ఏక వాక్య కవితల ” చర్చ అంటారా ?
  నన్ను బాబా గారు ఎన్నెన్ని మాటలన్నా, చర్చే ప్రధాన మనుకొని నేను తప్పుగా భావించ లేదు. కాని నా అభిప్రాయ వ్యక్తీకరణే ఆయనకు తప్పనిపించింది. ఏం చేయను ? అందుకే ఆపేసాను. అనవసరంగా అపార్థాలు పెంచుకోవడం నా కిష్టం లేదు. ఆయనే కాదు. ఆ పైన కూడా నా పైన వెటకారపు వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. వాటినన్నిటినీ అంగీకరించి, అందరికి సమాధానాలిస్తూ, చర్చను పొడిగిస్తూ నా సమయాన్ని వృథా చేయలేను. ఎందుకంటే …
  THEIR ARGUMENT IS NOT FOR POINT SAKE …
  THEIR ARGUMENT IS FOR ARGUMENT SAKE !
  బ్లాగులలో పద్యం, గేయం, వచన కవిత … ఇలా అన్ని రకాల ప్రక్రియలలో రచనలు చేస్తున్న కొద్ది మందిలో నేను ఒకణ్ణి !
  కాని, వీళ్ళ వాలకం చూస్తుంటే, నేను ఏ ప్రక్రియలు చేత గాక , ఒక ” ఏక వాక్య కవితలు ” వ్రాసి వెలిగిపోదామని ఆశిస్తున్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. ఏం చేస్తాం ?
  ” మంచి వాణ్ణే _ నా మీదే రాళ్ళు ! “

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: