ఎర్ర తామర పువ్వు

alluri

ఎర్ర తామర పువ్వు
రచన : ” పద్య కళా ప్రవీణ ” డా. ఆచార్య ఫణీంద్ర

నల్లని గడ్డమున్, సునయనంబుల కుంకుమ కాంతి, చేతిలో
విల్లును గల్గినట్టి ఘన విప్లవ వీరుడు; భారతాంబకున్
తెల్లని వారి ఆగడము తీర్చగ దీక్షను బూనినట్టి ఆ
” అల్లురి రామరా ” జితడె ! అంజలి సేయరె గారవించుచున్ !

నేటికి నూర్వత్సరముల
చాటున పరికింప _ ఆంధ్ర చరిత పుటలలో
మేటి, స్వరాజ్యముకై పో
రాటము సేయంగ రామరాజై పుట్టెన్ !

చదువుతోబాటుగా స్వారాజ్య కాంక్షనే
అమిత శ్రద్ధ గలిగి అభ్యసించె _
బెంగాలు, పంజాబు పెద్దలన్ దర్శించి
స్వాతంత్ర్య సంగ్రామ సంగతి గనె _
పస గల్గు ప్రాయమ్ము పణమొడ్డి, ఆంగ్లేయ
ప్రభుత నణచివేయ ప్రతిన బూనె _
వలచిన దానినిన్, వైవాహికాదులన్
వదలి వనాంతర వాసియయ్యె _

గిరిజనావళి నొక గీతపై నిలబెట్టి,
తాను గూడ చేత ధనువు బట్టి,
సైన్య మొకటి జేసి, సమర శంఖము నూది
ఆంగ్ల ప్రభుత గుండె లదరగొట్టె _

” మిరప సందేశము ” ల జైళ్ళ మీద పంపి,
దాడి వార్తల పుట్టించి ” దడ దడ ” లను;
అటులె దండెత్తి, గొనిపోయి ఆయుధముల,
ప్రక్కలో బల్లెమయె నాంగ్ల పాలకులకు _

” చిప్పలు చేతబట్టి ఇట చేయగ వర్తక మేగుదెంచి, మా
తప్పుల కారణాన మము దాసుల జేసియు నేలుచున్న మీ
గొప్పలు చాలునింక ! మిము గొంతులు కొయ్య ! దురాత్ములార ! ఛీ !
కప్పము, పన్నులంచు మము కట్టుమనం గెటు సిగ్గు లేదొకో !

నేలయు మాదే ! పీల్చెడు
గాలియు మాదే ! శరీర కష్ట ఫలితమౌ
కూలియు మాదే ! ఇంకన
దేలా పన్నులును, కప్ప మీవలె మీకున్ ?

పోరా ! ఈ భరతావనిన్ విడిచి పొమ్మం ” చు గర్జించుచున్
పోరాటంబును వీర సింహమయి పెంపుం జేసె ” నల్లూరి ” ; తా
” మే రీతిన్ పడగొట్టుటా యతని ” నం చింగ్లీషువారల్ మహా
ఘోరాలోచనలందు మున్గి రకటా ! క్రూరాత్ములై, ఉగ్రులై !

అంత నొకనాడు …

ఉదయ సంధ్య వేళ ఉద్యమకారుండు
ఇతరు లెరుగనట్టి యేటి లోన
వక్షమందు గల్గు వస్త్రాదులన్ విప్పి
స్నానమాచరింప సాగిపోయె _

కంట బడని ఆ యేటిని
ఒంటరిగా నతడు స్నాన మొనరింపంగన్ _
తుంటరి యొక డెరిగింపగ
కంటకులై చుట్టుముట్టి కాల్చి తుపాకుల్ _

చిట్టడవిని మసక చీకటిన్ తీసిరి
తెల్ల దొరలు దొంగ దెబ్బ నటుల _
తూట్లు పడెను మేను తూటాలు దూరగా _
రాజు దేహమయ్యె రక్త మయము !

” నలుగురు గూడి ఒక్కనిని, నన్ను నిరాయుధు జేసి, ఒంటిగా
జలముల నున్న వేళ నిటు చంపిన చంపితిరేమొ గాని ! ఈ
వెలువడు రక్త బిందువులు విప్లవ మూర్తుల రూపు దాల్చి, మీ
తలలను ద్రుంచి, మా భరత ధారుణి స్వేచ్ఛను బ్రోవకుండునే ! “

అని శపించి కఠిను లాంగ్ల జాతీయులన్;
చిందు రుధిరమంటు చేతులెత్తి,
భారతాంబ కమిత భక్తితో కడసారి
ప్రణతులిడెను దేశ భక్త వరుడు _

” జన్మించితి నీ ఒడిలో _
జన్మము ధన్యంబు నిట్లు జన్మించుటయే !
మున్ముందు నిటులె తల్లీ !
జన్మింపగ నెంతును ప్రతి జన్మము ” ననుచున్ _

భరత మాత కంట బాష్పాలు రాలగా
కనులు తేలవేసి మునిగె నీట _
ఏటిలోన తేలె ఎర్ర తామర పువ్వు !
విప్లవమున కతడు విత్తనమ్ము !

( 4 జూలై 2009 నాడు విప్లవ వీరుడు ” అల్లూరి సీతారామరాజు ” 112 వ జయంతి సందర్భంగా నివాళిగా … )

___***___

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. padmarpita
  జూలై 05, 2009 @ 02:17:16

  ఎర్ర నెత్తురుని ఉత్తేజభరితం చేసింది మీ ఈ కవిత….జైహింద్1

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  జూలై 05, 2009 @ 05:11:42

  పద్మార్పిత గారు !
  అనేకానేక ధన్యవాదాలు !
  జై హింద్ !

  స్పందించండి

 3. sailendra to phaneendra
  జూలై 05, 2009 @ 16:51:33

  respected sir

  i have just read your verses of “erra tamara puvvu” which just has given entire episode of revered alluri’s gorilla rebellion in few lines. I am just astonished and amazed of your skill in telling a major episode of arround three decades of alluri’ fight against british in a brief of few verses. i wish i learn the same. i am now out of H.Qrs. i will meet you after i come back. i congratulate you for your successful programme of reciting the poems of mahaprastanam of sri sri.

  yours sincerely

  seshasailendra

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  జూలై 05, 2009 @ 22:32:56

  శేష శైలేంద్ర గారికి
  అనేకానేక ధన్యవాదాలు !

  స్పందించండి

 5. ఉష
  జూలై 06, 2009 @ 05:49:14

  అంధ్రుల వీరాభిమానానికి తలమానికం మన అల్లూరి. వరద వేగం ఆతని మానసిక బలం. ప్రకృతి వరం ఆతని శౌర్యం. వీర మరణం పొందిన ఆతని జన్మ ధన్యం, ఆతని గాధ అమరం, కారణ జన్మునికి నివాళి మన భాగ్యం. మీరిలా మరిచిపోరాని స్మృతిని తలపుకి తెచ్చినందుకు కృతజ్ఞాతిభివందనలు.

  స్పందించండి

 6. డా || ఆచార్య ఫణీంద్ర
  జూలై 06, 2009 @ 17:51:53

  ఉష గారు !
  అనేకానేక ధన్యవాదాలండి !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: