గొడుగు

గొడుగు
రచన : ” పద్య కళా ప్రవీణ ” డా || ఆచార్య ఫణీంద్ర

umbrella

గొడుగును _ నే వర్షములో
అడుగిడుటకు వెరచు నరుల నార్ద్ర మనముతో _
పుడమిని మోయు ననంతుని
పడగ వలెన్ , పైన నిలిచి పరిరక్షింతున్ !

నేను తడిసి పోయి నీరైన కానిమ్ము !
జనులు తడియకుండ సాగుటకును
నిజము ! సలుపుచుందు నిస్వార్థ బుద్ధితో
వర్ష ధార తోడ ఘర్షణమ్ము !

మండు టెండలో సైతమ్ము మార్గమందు
మాడు పైన వేడిమి తాకి మాడకుండ _
సూర్య కిరణాలతో పోరి ధైర్యముగను ,
నీడ నొసగి మానవుల కాపాడుచుందు !

తల కెత్తుకొనుచు నాకు ప్ర
జ లిడ మహా గౌరవమును సంతోషింతున్ !
కలకాలము దీని నిలిపి
తలపున , నే తీర్చుకొందు తగిన ఋణంబున్ !

చిటపట చినుకులు పడ న
న్న్నిటు నటు వెదుకుదురు కొంద రెట నుంటినటన్ _
అటువంటిది లేనప్పుడు
అటకను పడవైచి ముఖము నటు జూపరయో !

ఎచటికైన కొంద రెంతొ ప్రేమను జూపి
వెంట నన్ను గొనుచు వెడలుచుంద్రు _
అసలు వారి ప్రేమ ఆ పైన నెరుగుదున్
మరలి వచ్చు వేళ మరచినపుడు !

ఎండకు నెండి , వర్షమున కెల్ల శరీరము ముద్దయైన , నే
దండిగ సేవ జేయుచు , సదా ప్రజ స్వాస్థ్యము గాచుచుందు ! ఇ
ట్లండగ నుండు నా తనువు , నంగము లించుక గాయమొందినన్ _
గుండియ లేక , స్వాస్థ్య మొనగూర్పరు నాకు సకాలమందునన్ !

గుర్తింపరు నా సేవలు _
పూర్తిగ ఆరోగ్యము చెడిపోయిన నన్నున్
ధూర్తుల వలె వర్జింతురు _
ఆర్తి యొకింతయును లేక , అయ్యో ! మనుజుల్ !

వారికి రాక పో దిటుల వార్ధక మెప్పటికైన _ అప్పుడున్
వారసులైన వా రిటులె వారిని కానక త్రోసి పుచ్చగా _
ఏ రకమైన బాధ ఇది _ ఎంతటి ఘోరమొ ! _ మోయలేని ఆ
భారము , మానసంబు కనుభావముగా విదితంబు గాదొకో !

___ * * * ___

ప్రకటనలు

8 వ్యాఖ్యలు (+add yours?)

 1. ఆత్రేయ కొండూరు
  జూన్ 15, 2009 @ 23:45:00

  గొడుగు విలాపము ఆర్యా !!…
  కడుముచ్చటగ తెలిపిరిగ కవితగ చదువన్‌ !
  ఇడుములు బడు పేదలకిల
  గొడుగయి నిలిచిన తరువుల గోడుయు ఇదియే !!

  ( చెట్లు కొట్టేస్తున్న సందర్భంలో )

  స్పందించండి

 2. padmarpita
  జూన్ 16, 2009 @ 00:22:42

  ఇప్పుడే మూల పెట్టిన గొడుగుని తీసి తలని సవరించానండి!!!
  గొడుగు మాట్లాడితే ఇలాగే వెళ్ళగక్కుకునేదేమో తన గోడు!!!

  స్పందించండి

 3. డా || ఆచార్య ఫణీంద్ర
  జూన్ 16, 2009 @ 19:49:12

  ఆత్రేయ గారు ! ధన్యవాదాలు !
  నా పాత టపాలలో “వృక్ష కావ్యం” అన్న కవిత కూడా ఉంది. చదవండి.
  _ డా || ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 4. డా || ఆచార్య ఫణీంద్ర
  జూన్ 16, 2009 @ 19:53:51

  పద్మార్పిత గారు !
  గొడుగు గోడు విని మెచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు !
  _ డా || ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 5. madhavaraopabbaraju
  జూలై 07, 2009 @ 18:32:50

  శ్రీ ఫణీంద్ర గారికి, నమస్కారములు.

  ” గొడుగు ” కవిత చాలా బాగున్నది. మనుషులు, గొడుగు సేవలను గుర్తించుకోపోయినా, గొడుగు బాధ పడాల్సిన అవసరంలేదు. ” గొడుగెత్తుకొని,- అంటే, తలెత్తుకొని ” ధీమగా వెళ్ళవచ్చు. శెలవ్.

  భవదీయుడు,
  మాధవరావు.

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  జూలై 08, 2009 @ 05:27:08

  మాధవ రావు గారు !
  కృతజ్ఞతాంజలి !

  స్పందించండి

 7. వేదకిరణ్‌
  జూలై 21, 2010 @ 14:00:43

  గొడుగు గురించి చాలా బాగా రాశారు.
  గొడుగు కూడా ఉన్న వాళ్ల కంటే అది అందుబాటులో లేని వాళ్లకే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంది.
  ఇంట్లో ఒక గొడుగు పాడైపోయి మూల పడి ఉంది. బహుశా మా ఇంటి గొడుగు కూడా ఇలానే తన గోడు చెప్పుకుంటుందేమో. . . ఇవ్వాళ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లగానే బయటికి తీస్తాను.

  స్పందించండి

 8. Dr.Acharya Phaneendra
  జూలై 23, 2010 @ 07:45:26

  వేద కిరణ్ గారు!
  అనేక కృతజ్ఞతలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: