ఆచార్య ఆత్రేయ – అంకెల తమాషా

aatreya ఆచార్య ఆత్రేయ – అంకెల తమాషా
———————————————————————-
పరిశోధన, వ్యాస రచన: డా.ఆచార్య ఫణీంద్ర

“సంఖ్యా వాచకం ద్విగు” అన్నారు ’ద్విగు సమాసా’న్ని నిర్వచిస్తూ లాక్షణికులు. సనాతన కాలం నుండి సాహిత్యంలో సంఖ్యలకు సముచిత స్థానం లభించింది. ’ఏక దీక్ష’, ’ద్విగుణీకృతం’, ’కవిత్రయం’, ’చతుస్సాగర పర్యంతం’, ’పంచమ వేదం’, ’షట్చక్రవర్తులు’, ’సప్త గిరులు’, ’అష్ట దిగ్గజాలు’, ’నవ గ్రహాలు’, ’దశావతారాలు’ … వంటి శబ్దాలను పరిశీలిస్తే – సంఖ్యలు సాహిత్యంలో ఎంత చక్కగా ఇమిడిపోతాయో అవగతమవుతుంది.
సినిమా పాటకు సంబంధించినంత వరకు కీ.శే. డా|| ఆచార్య ఆత్రేయ సంఖ్యలతో అనేక చమత్కారయుక్తమైన ప్రయోగాలను చేసారు. సినిమా పాటలలో ఇలాంటి ప్రయోగాలు చేసిన వారు అరుదనే చెప్పాలి. అంకెలతో ఆయన చేసిన తొలి తమాషా – “ఒకటి – ఒకటి – ఒకటి – మానవులంతా ఒకటి -” అన్న గీతంతో ప్రారంభమయింది. ఆ పాటను ఒక్కసారి నెమరు వేసుకొంటే – అంకెలను ఒకటి నుండి పది వరకు వరుసగా ప్రయోగించి ఎంత గమ్మత్తుగా నీతి బోధ చేసారో బోధపడుతుంది.
“ఒకటి – ఒకటి – ఒకటి –
మానవులంతా ఒకటి –
రెండు – రెండు – రెండు –
మంచి వారని, చెడ్డ వారని
మనలో జాతులు రెండు – ||ఒకటి||

మూడు – మూడు – మూడు –
మూఢుల స్నేహం వీడు –
నాలుగు – నాలుగు – నాలుగు –
నలుగురి సుఖమును చూడు – ||ఒకటి||”

… ఇలా సాగిపోతుందా పాట. ఈ పాటలో ఒక చోట –
“ఏడు – ఏడు – ఏడు –
ఇతరుల చూసి ఏడవకు -” అంటూ సగటు తెలుగు వాణ్ణి మందలిస్తారు మహాకవి ఆత్రేయ.
’బడి పంతులు’ చిత్రంలో –
” భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు” అన్న గీతంలో –
“త్రివేణి సంగమ పవిత్ర భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచ శీల బోధించిన భూమి” అంటూ ’మూడు’, ’నాలుగు’, ’ఐదు’ అంకెలను వరుసగా ప్రయోగిస్తూ, భారత మాతను కీర్తించారు ఆత్రేయ.
ఆచార్య ఆత్రేయ సంఖ్యలను ఇలా ప్రబోధ గీతాలకే పరిమితం చేయకుండా, ప్రేమ గీతాలలో సైతం కొలువుంచారు. ’దేశోద్ధారకులు’ అనే చిత్రంలో ఈ పాటను గమనిస్తే – సంఖ్యలనే సింహాల పాలిట ఆయన ’రింగ్ మాష్టర్’ అని అర్థమవుతుంది.
“మబ్బులు రెండు బేటీ అయితే
మెరుపే వస్తుంది –
మనసులు రెండు పేచీ పడితే
వలపే పుడుతుంది – ||మబ్బులు||

మూడు ముళ్ళు పడతాయంటే
సిగ్గే మొగ్గలు వేస్తుంది –
ఆ మొగ్గలు పూచిన మూడు రాత్రులు
తీయని ముద్రలు వేస్తాయి –
కన్నులు నాలుగు కలిసాయంటే
పున్నమి వెన్నెల కాస్తుంది –
ఆ వెన్నెల నాలుగు వారాలయిన
తరగని వెలుగై ఉంటుంది – ||మబ్బులు||

అయిదో తనమే ఆడ జన్మకు
అన్ని వరాలను మించింది –
ఆ వరాన్ని తెచ్చిన మగువే మగనికి
ఆరో ప్రాణం అవుతుంది –
అడుగులు ఏడు నడిచామంటే
అనుబంధం పెనవేస్తుంది –
ఆ అనుబంధమే ఏడేడు జన్మలకు
వీడని బంధం అవుతుంది – ||మబ్బులు||”

’ఆత్మ బలం’ చిత్రంలోని ఈ క్రింది పాటలో – అల్ప సంఖ్యలతో ఎంతటి అనల్ప భావాన్ని సృష్టించారో పరిశీలిస్తే – ఆచార్య ఆత్రేయ ప్రతిభా పాటవాలకు అంజలి ఘటించకుండా ఉండ లేము.
” నాలుగు కళ్ళు రెండయినాయి –
రెండు మనసులు ఒకటయినాయి – ”

ఈ గీతంలో ” ఉన్న మనసు నీ కర్పణ జేసి
లేని దాన నయ్యాను – ఏమి
లేని దాన నయ్యాను” – అంటూ ’శూన్యా’న్ని ( సున్న అంకెను) కూడ తలపింప జేస్తా రాయన. ’ఇంధ్ర ధనుస్సు’ అన్న చిత్రం కోసం ఆత్రేయ రచించిన
” ఏడు రంగుల ఇంధ్ర ధనుసు
ఈడు వచ్చిన నా సొగసు –
ఆ ఏడు రంగులు ఏకమైన
మల్లె రంగే నా మనసు – ” అన్న గీతంలో, ఆయన సాహిత్యంలో సంఖ్యలతోబాటు విజ్ఞాన శాస్త్రాన్ని సమ్మిళితం చేసిన తీరు నిజంగా శ్లాఘనీయం.
ఇంకా, ’బంగారు బాబు’ చిత్రంలో ” ఏడడుగుల సంబంధం – ఏనాడో వేసిన బంధం”; ’కొడుకు – కోడలు’ చిత్రంలో ” నువ్వు, నేను ఏకమయినాము – ఇద్దరము మనమిద్దరము ఒక లోకమయినాము” వంటి గీతాలు ఆత్రేయకు అంకెలపై గల మక్కువను చాటుతాయి. అలాగే, ’మరో చరిత్ర’ చిత్రంలో “పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు – శత కోటి దండాలు” వంటి గీతాన్ని పరిశీలిస్తే – ఆత్రేయ చిన్న సంఖ్యల నుండి, పెద్ద సంఖ్యల వరకు వేటినీ వదల లేదని, అపురూప భావాల సృష్టిలో ఆయనకు అంకెలతో ఆడుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని తెలుస్తుంది.
మనసు మీద ఎన్నో మధుర గీతాలను రచించి ’మనసు కవి’ గా, ’మన సుకవి’ గా ప్రసిద్ది చెందిన డా|| ఆచార్య ఆత్రేయను ’ద్విగు సమాసాల దిట్ట’ గా అభివర్ణించవచ్చు.

—***—

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. రాఘవ
  ఏప్రి 09, 2009 @ 22:10:40

  బావున్నాయండీ ఆత్రేయగారి అంకెల కబుర్లు. అన్నట్టు ఈ పాట ఎవరు వ్రాసారో తెలియదు కానీ చిన్నప్పుడెప్పుడో విన్నాను… “ఒకరు ఇద్దరుగ మారేది ఇద్దరు ఒకటవ్వాలని, ఇద్దరు ఒకటిగ మారేది ముచ్చటగా ముగ్గురవ్వాలని” అని. ఆ పాట గుర్తొచ్చిందండీ మీ టపా చదివి. 🙂

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఏప్రి 10, 2009 @ 08:42:20

  రాఘవ గారికి నమః

  అవునండీ – భలే గుర్తు చేసారు. అదీ ఆత్రేయ గారి రచనే!
  ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి.
  ధన్యవాదాలు!

  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: