“ఉగాది కోలా”

“ఉగాది కోలా”
——————–
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
—————————-

ug1

ముద్దు గారు నాదు బుజ్జాయి పుత్రుండు
’పఫ్ఫు’ లింక ’పిజ్జ’, ’బర్గరు’లను,
’కోకొ-కోల’,’పెప్సి’ కోరగా – వారించి,
ఈ ఉగాది రోజు నిటుల యంటి –

“వానికి మించిన రుచికర
మైనది చేసినది అమ్మ! అందుము మేమ
ద్దానిని ’ఉగాది పచ్చడి’!
కూనా! నీ వది ’ఉగాది కోలా’ యనుకో!

ఇందులోని ముక్కల రుచి ముందు నీదు
పిచ్చి ’బర్గర్లు’, ’పిజ్జాలు’ పేలవమ్ము!
ఈ రసామృత రుచి ముందు నింక చూడు –
నీదు ’కోకోలు’, ’పెప్సీలు’ నీరు గారు!”

తొలుత ఇష్ట పడక, “తొండి నీ”వని పల్కి,
కష్టపడుచు త్రావి కాస్త, పిదప –
కొలది కొలది రుచియె కొండ నాల్కకు తాక,
కోరి కోరి త్రావె కుండ నుండి!

కోరిన యంత ద్రావి, ఇక కుండను మాత్ర మిగిల్చె – గొంతులో
చేరిన బిందు, బిందువును చేకుర జేసెనొ మత్తు – నిద్రలో
జారెను వాడు గాఢముగ చాలిన యంతటి సేపు – పిమ్మటన్,
“లేర! ఇదేమి నిద్ర?” యని లేపిన యప్పుడు మేలుకాంచెనే!

నిద్ర లేచు పిదప, “నేనొక్క కలగంటి”
అనుచు చెప్పదొడగె నపుడు వాడు –
కలను చెప్పు వేళ – కనులలో మెరుపుండె!
భాష మారిపోయె స్పష్టముగను!!

“నేనొక తెన్గు తోటను జనించు వసంత పరీమళమ్ములన్
వేనకువేలు వెంటగొని, విశ్వము నెల్లెడ పంచబోవ – ఆ
స్థానములందు గల్గు తరు జాలము కొమ్మల చేతు లెత్తి, ఆ
హ్వానము పల్కె నంత, అభివాదముజేయుచు తెల్గు తల్లికిన్!”

నాతో ’తెల్గు దనమ్ము’నున్, ’నవ వసంతమ్ము’న్ విహారమ్మునై,
చేతోమోదముతోడ వచ్చి యచటన్ చేకూర్చె నవ్యత్వమున్!
ప్రాతఃకాలములో విదేశ పురుషుల్ పంచెల్ ధరింపంగ, ఆ
మాతల్ వారి ’కుగాది పచ్చడుల’తో మాధుర్యమున్ పంచిరే!

క్రొత్త చివురులు, పత్రాల క్రొత్త వస్త్ర
ములను ధరియించి తరువులు మురిసె నచట
గూడ – గుబురుల మాటున కోయిల లట
క్రొత్త తెలుగు గీతుల సభల్ కొలువు దీర్చె!

విరుల విరబూయ వనములే విరివిగాను –
తెలుగు పరిమళా లట నిండె దిశల నెల్ల!
తెలుగు – తెలుగు – తెలుగు – తెలుగెల్ల వ్యాపింప –
విశ్వ భాషలందు వెలిగె తెలుగు!”

అనుచు వాడు జెప్ప – ఆనందమున నాదు
కనుల యందు ధార గట్టె నీరు!
“వాని కలయె నిజము భావి నగుత!” యంచు
మనము నందు నేను మరులు గొంటి!

—***—

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. భాస్కర రామిరెడ్డి
  మార్చి 22, 2009 @ 08:30:10

  మీ బాబు నిద్రలేచేదాకా మాచూపులకు కూడా చెమ్మగిల్లాయి ( నవ్వడం వల్ల )..
  మీ బాబు కల వింటుంటే కాంతి కిరణాల వెలుగు కు చూపులు చెమ్మగిల్లాయి.

  స్పందించండి

 2. భాస్కర రామిరెడ్డి
  మార్చి 22, 2009 @ 08:32:30

  చిన్న సవరణ

  మీ బాబు నిద్రకుప్రమించే దాకా మాచూపులు కూడా చెమ్మగిల్లాయి ( నవ్వడం వల్ల ).. నిద్రలేచాక కాంతి కిరణాల వెలుగు కు చూపులు చెమ్మగిల్లాయి.

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  మార్చి 22, 2009 @ 18:30:38

  మిత్రులు రామిరెడ్డి గారికి నమః

  మన సంస్కృతిని మరచి పోయి, మన ప్రజలు ’వెస్టనైజ్’ అయిపోతున్నారని ఇప్పుడు మనం బాధ పడుతున్నాం. అలా కాక, ప్రపంచమంతా మన తెలుగు సంస్కృతి, భాష వ్యాపించాలన్న అకాంక్షను ఒక మధుర స్వప్నంగా ఈ కవితలో మలచడం జరిగింది. ఈ కవిత మిమ్మల్ని చెమ్మగిలేలా చేసిందన్నారు. మీకు నా ధన్యవాదాలు.

  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: