“Morning Coffee”

“మార్నింగ్ కాఫీ”
(వచన కవిత)
———————
రచన: డా.ఆచార్య ఫణీంద్ర

నీకు, నాకు
ఏకాంతం కుదిరి
ఎన్నాళ్ళయింది ప్రియా?
నీ చంద్రుడు
కాల్ సెంటర్లో పొడుస్తాడు
నా సూర్యుడు నన్ను
హైటెక్ సిటీలో మాడుస్తాడు
కంప్యూటర్ వనాల్లో
ఖైదీలమైన మనను చూసి
కాముడు వలవలా ఏడుస్తాడు
నీకు, నాకు
ఏకాంతం కుదిరి
ఎన్నాళ్ళయింది ప్రియా?

ఆదివారాల్లో
అమ్మా నాన్నల ఆప్యాయతల
ఐశ్వర్యంలో తేలియాడినా –
అమ్మలు ముద్దు మురిపాల్లో
ఆసాంతం మునిగి తేలినా –
ఏదో వెలితి!
ఏకాంతంలో
నీ నీలి కురుల నీడలో
చంద్ర బింబ దర్శనానికి
నోచుకోలేకపోతున్నానని ఆర్తి!!
పున్నమి రాత్రి సైతం
నీ చిరు నవ్వుల వెన్నెలలు
నాకు కరువే!
ప్రతి రాత్రీ
ఒక మోయలేని బరువే!!

నీ ఆలోచనల కుసుమ పరిమళాలలో
నేను పుప్పొడినై రాలిపోతూ –
నీ విరహాగ్నుల శయ్యపై
నేను జీవచ్ఛవమై కాలిపోతూ –
నా జీవితంలో చీకటి భాగం
జారిపోయాక –
నీ కారు హారన్ మోతతో
నాకు ప్రభాతమవుతుంది
నిన్ను ఆనందంగా ఎదురుకొనడానికి
అపార్టుమెంటు లిఫ్టులో
అగాధాలకు దిగుతున్నప్పుడు
నాకు అమర లోకాలకు
ఎగిరి పోతున్నట్టుంటుంది!
అప్సరసవై అరుదెంచి
వంటింటిని వెలిగించి
అచ్చిక బుచ్చికలాడుతూ
నీవందించే ’మార్నింగ్ కాఫీ’
అమృతమై నన్ను
అజరామరుణ్ణి చేస్తుంది
ఆ పైన –
ఊర్మిళా దేవిలా నీవు
నిద్రలోకి!
ఉద్యోగ బాధ్యతలతో నేను
నిర్బంధారణ్యంలోకి!!
photo-morning-coffee1
(’సాఫ్ట్ వేర్’ ప్రపంచంలో భార్యాభర్త లిద్దరూ వేలూ, లక్షలు సంపాదిస్తున్నా, వారి జీవితాల్ని జీవితాల్లా జీవించలేకపోతున్న దుస్థితిని చూచి ఆవేదనతో …)

–***–

12 వ్యాఖ్యలు (+add yours?)

 1. rayraj
  ఫిబ్ర 08, 2009 @ 12:53:00

  సార్ దీని మీద ఇంకా ఎవ్వరూ కామెంట్ ఎందుకు వేయ లేదా అని నాకు చాలా బాధగా ఉంది సార్. ఇది నిజంగానే నేటి స్థితి.

  బహుశా, ఇప్పుడు చంద్రుడు,వెన్నెల, కుసుమ పరిమళాలు, పుప్పొడి, ఊర్మిళా దేవి ఇలాంటి పదాలు ఇప్పటి మైండ్ అసోసియేషన్స్ లో ప్రేమ ని ప్రేరేపించటాంలేదేమో సార్. నాకోసం ఇంకో సారి ట్రై చేయ్యండి. ప్లీజ్! మీరు దగ్గరకొచ్చారు. లిఫ్ట్, కారు హారన్, మార్నింగ్ కాఫి…ఇవి ఖచ్చితంగా వారికి దగ్గరవే!

  “సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే, స్టెన్ గన్ పేలినట్టుంటాదే!” – జల్సాలో ఓ పాట లైనది

  నేను చాలా సార్లు నా మిత్రుడిని ఆడిగాను. నా మైండ్ అసోసియేషన్స్ మారి పోయాయి. నాకు సెల్ ఫోన్ రింగుతో తన కోసం గుండె తపిస్తుంది…అలా మారిన అసోసియేషన్స్ తో రాయమని. ఇంకా రాలేదు.

  నా గుర్తుండి, సెల్ఫోన్ జల్సా లోనూ, చాలా రోజుల క్రితం “భారతీయుడు” సిన్మాలో “సెల్ఫోన్ ధ్వనిలా నవ్వేదానా” అని ట్రై చేశారు. కాని ఆ పాత పాట రూపం కొంచెం వేరు. నాకు దగ్గరగా ఉన్నది ఈ జల్సా లైనే. కానీ,ఇందులో స్టెన్ గన్ ప్రయోగం మళ్ళా కాస్త రివర్సల్ అయిపోయింది.

  ప్లీజ్ గివ్ మె ఒన్ మోర్!

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 08, 2009 @ 14:27:16

  ’రాయరాజు’ గారికి నమః

  ఈ కవిత రెండేళ్ళ క్రితం ’ఆదివారం ఆంధ్ర జ్యోతి’లో ప్రచురితమై, పలువురి అభినందనలనందుకొన్నది. ఇప్పుడు బ్లాగులో స్పందనలు రాకపోవడానికి ’ప్రతీకల’లో ఆధునికత లేకపోవడం- అని నేను అనుకోవడం లేదు. ఆర్థిక మాంద్యం వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడుతున్న ఈ సమయంలో ఈ కవిత స్పందన కలిగించడం లేదేమో- అనుకొంటున్నాను. అయినా రాత్రేగా పోస్ట్ చేసింది. ఇంకా చూద్దాం.
  కవితలలో ఆధునికత అవసరమే- అయినా మన సంస్కృతి, మన ’నేటివిటీ’ని వదలకూడదు. ’పాత కొత్తల మేలు కలయిక’- కవి స్థాయిని ప్రతిఫలింపజేస్తుంది. ఇక సినిమా కవుల విషయమంటారా? ఉన్న పది మందిలో ఏడుగురు ఆధునికత పేర వెర్రి తలలు వేసేవారే!
  కవిత చదివి స్పందించినందుకు మీకు నా ధన్యవాదాలు.

  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 3. కొత్తపాళీ
  ఫిబ్ర 08, 2009 @ 16:56:32

  “నీ ఆలోచనల కుసుమ పరిమళాలలో
  నేను పుప్పొడినై రాలిపోతూ –
  నీ విరహాగ్నుల శయ్యపై
  నేను జీవచ్ఛవమై కాలిపోతూ –
  నా జీవితంలో చీకటి భాగం
  జారిపోయాక –
  నీ కారు హారన్ మోతతో
  నాకు ప్రభాతమవుతుంది”

  చాలా బాగ రాశారు.
  రేరాజు గారి అభిప్రాయాన్ని బొత్తిగా కొట్టెయ్యడానికి వీల్లేదు, కానీ మీ సాంప్రదాయకమైన వాడుకలతో అభివ్యక్తి వచ్చిన లోపమూ ఏమీ లేదు.

  స్పందించండి

 4. Satyanarayana
  ఫిబ్ర 08, 2009 @ 18:16:30

  కవిత బాగుంది. వారాంత దాంపత్యాలు చేస్తున్న ప్రస్తుత IT ఉద్యోగుల గురించి చక్కగా చెప్పారు.

  స్పందించండి

 5. ఉష
  ఫిబ్ర 08, 2009 @ 18:36:55

  సరైన ఆలోచన. ఈ కలియుగంలో ఇదే మన విరోధి – ఆధునిక జీవన రీతి. నేనూ దాని మీద ఎపుడోనే యుద్ధం ప్రకటించేసాను. నా వ్యూహరచనలో నేనుంటాను, దాని కుట్రలతో అది నన్ను గెలవాలని చూస్తుంటుంది. ప్రస్తుతానికి సంధికొచ్చినట్లుగావుంది. మల్లెలు, కాఫీలు వుండవు కాని, ఉర్మిళ నిద్రలు, పిల్లల పట్ల అపరాధభావనలు తగ్గాయి, ఆ స్థాయి/విజయం నన్ను చేరటానికి నేను వెచ్చించాల్సి వచ్చేది కొన్ని ఘడియల నిద్ర. సో, నా సమస్యకి నేనే పరిష్కారం వెదుక్కున్నాను. నా స్థితిలో వున్న వారంతా ఈ ఒక విషయం తెలుసుకుంటే, అలాగే భాగస్వాములిరువురూ పాలు పంచుకుంటే ఇకపై ఈ మాదిరి ఆవేదనలు, కవితలూ రావు. This is just yet my humble opinion out of personal experience.

  స్పందించండి

 6. padmarpita
  ఫిబ్ర 08, 2009 @ 20:13:51

  చాలా చాల బాగా వ్రాసారు…..
  ఇది కవిత కాదు, ఐ.టి ఉద్యోగుల జీవన దర్పణం…..

  స్పందించండి

 7. వికటకవి
  ఫిబ్ర 08, 2009 @ 20:26:45

  బాగుందండీ, కానీ రెక్క(లు) ఆడితేనే కానీ డోక్కలు ఆడని రోజులు ఇవి,

  ఒక సలహా. మీరు మరీ మీ పూర్తి వివరాలు బ్లాగులో ఇచ్చేస్తున్నారు. అంత మంచిది కాదేమో. ఆలోచించండి.

  స్పందించండి

 8. రానారె
  ఫిబ్ర 08, 2009 @ 21:43:21

  నిన్ను ఆనందంగా ఎదురుకొనడానికి
  అపార్టుమెంటు లిఫ్టులో
  అగాధాలకు దిగుతున్నప్పుడు
  నాకు అమర లోకాలకు
  ఎగిరి పోతున్నట్టుంటుంది!

  లిఫ్టులో దిగేటప్పుడు కలిగే అనుభూతిని మీరు వర్ణించిన తీరు ఆత్మలను పలికించేదిగా వుంది. అద్భుతమైన కవిత.

  స్పందించండి

 9. Dreamer
  ఫిబ్ర 08, 2009 @ 22:21:13

  ఈ విషయాన్ని melodramatize చేయవలసిన అవసరం లేదనుకుంటున్నా. ఒకవేళ ఎవరైనా అలా బతుకుతున్నా అది వాళ్ళ conscious choice అయి తీరుతుందని నా అభిప్రాయం. They just chose to live that way.

  PS: కవిత చాలా బావుంది. కవిత వస్తువు మీదే నా కామెంట్.

  స్పందించండి

 10. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 08, 2009 @ 22:31:46

  సత్యనారాయణ గారికి, ఉష గారికి, పద్మార్పిత గారికి, వికటకవి గారికి మరియు రానారె గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 11. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 08, 2009 @ 22:44:21

  డ్రీమర్(స్వాప్నికుడు) గారికి నమస్తే!
  ఇష్టపడి పని చేసే వారి గురించి వ్రాసిన కవిత కాదిది. సామాజిక చట్రంలో ఇరుక్కొని, మానసిక సంఘర్షణకు లోనవుతున్న వారి గురించి వ్రాయడం జరిగింది. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
  – డా.ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: