నా సంపాదకత్వంలో…
27 మే 2012 వ్యాఖ్యానించండి
2010లో నా సంపాదకత్వంలో ప్రముఖ కవి ‘ప్రౌఢ పద్య కళానిధి’ ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారి కవితా సంకలనం “ఆత్మీయ కవితా కదంబం” ముద్రించబడింది. రెండు నెలల క్రితమే ప్రతులన్నీ అయిపోయాయి. కవిగారు మళ్ళీ పునర్ముద్రణకు ఉద్యుక్తులవుతున్నారు.
తొలి ముద్రణకు నేనందించిన సంపాదకీయం/ పీఠిక ఇది.
- డా. ఆచార్య ఫణీంద్ర
మా వంశ వృక్షం…
25 మే 2012 అభిప్రాయములు
ఇది మా ’గోవర్ధనం’ వారి వంశ వృక్షం. మా వంశం మొత్తంలో దాదాపు ఎనిమిది తరాల వివరాలను అందించగలిగే చిట్ట చివరి వ్యక్తి మా నాన్న గారే!
దైవానుగ్రహమే అనుకోవాలి… మా నాన్న గారు 2004లో పరమపదించే కన్న ముందు ఆ వివరాలను రికార్డ్ చేయాలన్న తలంపు నాకు కలిగింది. అలా సేకరించిన ఆ వివరాలను ఇలా రూపు దిద్ది, నా ’ముకుంద శతకం’ కృతి రెండవ ముద్రణలో ప్రచురించాను. మా వంశీయులంతా ఇది చూసి ఎంతో ఆనందించారు. ఇది నేను చేసిన కొన్ని గొప్ప పనులలో ఒకటిగా భావిస్తాను.
- డా. ఆచార్య ఫణీంద్ర
’విశిష్ట కవి సమ్మేళనం’లో నేను
24 మే 2012 అభిప్రాయములు
మూడు రోజులుగా హైదరాబాదులో ’రవీంద్ర భారతి’ మెయిన్ ఆడిటోరియంలో ’కిన్నెర ఆర్ట్ థియేటర్స్’ నిర్వహిస్తున్న ’తెలుగు వెన్నెల’ (కిన్నెర కవితా మహోత్సవాలు) ఎంతో వైభవంగా జరిగి, ఈనాటితో సంపూర్ణమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా, నిన్న (22-05-2012) జరిగిన ’విశిష్ట కవి సమ్మేళనం’లో పాల్గొని, కవితా గానం చేయవలసిందిగా నన్ను ఆహ్వానించారు. నేను ’చిరు విరామము’ అన్న పద్య కవితను వినిపించాను. అంతకు ముందు ప్రముఖ కవి శ్రీ కె. శివారెడ్డి గారు ’ఆధునిక కవిత్వం – దశ.. దిశ..’ అన్న అంశంపై కీలక ప్రసంగం చేసారు. ఈ వివరాలన్నీ తెలియజేస్తూ అన్ని దిన పత్రికలలో చక్కని కవరేజ్ చేయబడింది. అన్ని పత్రికలలో ఫోటోలను కూడ ప్రచురించారు.
కొన్ని పత్రికలలోని ఆ భాగాలను అందజేస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర
సాక్షి ( పై చిత్రంలో ఎడమ నుండి రెండవ స్థానంలో కూర్చున్నది నేనే) :
ఆంధ్ర భూమి (చిత్రంలో ఎడమ నుండి రెండవ స్థానంలో నేనున్నాను) :
ఆంధ్ర ప్రభ ( చిత్రంలో ఎడమ నుండి రెండవ స్థానంలో ఉన్నది నేనే) :
నమస్తే తెలంగాణ ( పై చిత్రంలో ఎడమ నుండి మొదటి స్థానంలో ఉన్నాను నేను) :
నా శిష్యుని నూతన గ్రంథం …
22 మే 2012 అభిప్రాయములు
నా శిష్యుడు ’శంకు’(శంభుని కుమార్) ఈ రోజే తన నూతన ముద్రిత గ్రంథం తొలి ప్రతిని తెచ్చి నాకు అందించాడు. ఆ గ్రంథానికి నేను వ్రాసి ఇచ్చిన పీఠికను చదివి, నా శిష్యుని ఆశీర్వదించండి.
- డా. ఆచార్య ఫణీంద్ర
కులీ కుతుబు కావ్య మధువు
20 మే 2012 అభిప్రాయములు
కులీ కుతుబు కావ్య మధువు
[గోల్కొండ ప్రభువు, 'హైదరాబాదు' నగర నిర్మాత - 'మహమ్మద్ కులీ కుతుబ్ షా' రచించిన 'దక్కనీ ఉరుదూ' కవితలకు ఆంధ్రానువాదం]
రచన : ‘పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర
1
మదిలో ఒక్కటె కోర్కి నాకిక ఖుదా! మన్నించి ఆలింపుమా!
నదిలో చేపల నింపినట్లు – దయతో, నా చేత నిర్మాణమై
హృదులన్ రంజిల జేయునట్టి నగరంబీ ’భాగ్ పురం’బందునన్
చదలున్నంతటి దాక, నీవు ప్రజలన్ సమృద్ధిగా నింపుమా!
2
హిందు సంస్కృతి యన ఎంతొ ఆదర మొప్పు -
ఇచ్చినాడ మద్ద తేను సతము!
మందిరమ్ము గూడ మస్జీదు వంటిదే!
పక్షపాత బుద్ధి పడదు నాకు!
3
కానగ నభమను నల్లని
ఏనుగు కొక చిన్ని దంత మేర్పడె నేడే!
దానిని జూచిన వెంటనె
పూనిరి ’ఈదు’ను జరుపగ పురమున జనులే!
’ఈదు’ పండుగే సఖి! నేడు ఈదనిమ్ము
సరస శృంగార వైభోగ సాగరమ్ము!
ఎంత త్రావినన్ చషకమ్ము నింక నింపు!
ఎంత సేపైన ఈ శయ్య నింక దిగకు!
4
రండు! కలసి రోదింపగా రండు! రండు!
కార్చ ఈ శోక దినము రక్తాశ్రువులను!
త్యాగ ధనులౌ ’ఇమాములన్’ తలచి, తలచి -
గుండె పగులుటే ’మొహరమ్ము’ గుర్తు మనకు!
5
సప్త సాగరముల సమము సంస్కృత భాష!
తరచి చూడ – తెలియు దానిలోని
సరస శబ్ద భావ సంయోగ సంజాత
రాగ రచిత మధు తరంగ ఘోష!
6
చెంతకు రాత్రి మొత్తమును చేరగనీయవు నిద్ర – సుందరీ!
సంతసమందె నీ ప్రియుడు – సంతసమందెను మన్మథుండు – తా
సంతసమొందె శయ్య – మరి సంతసమొందెను నాల్గు కన్నులున్ -
సంతసమందె గాదె ఇటు సంగమమొందుచు కంటి కాటుకల్!
7
మధువునం దేమి కలదోయి మత్తటంచు
చెంపపై మీటి మృదువైన చేయి తోడ,
ప్రణయమున పంచ ప్రాణాలు రంగరించి
చషకమును నింపి త్రావించె జాణ నాకు!
చెలి సమాగమమ్మె జీవనంబీ ధాత్రి ;
మరి వియోగమన్న మరణమగును!
ఆమె కరము తోడ అందించు చషకమే
’విశ్వ పాలనమ్ము’ విలువ సుమ్ము!
8
ఆమె అందము గని అదిరిపోయిన దేమొ!
కొంత కొంత కరిగె క్రొవ్వు వత్తి!
సూర్య కిరణము లవి సోకగా ఒక్కింత
కరిగిపోయెడి వడగల్లు వోలె!
9
తప్ప త్రాగి తూలు త్రాగుబోతుల వంటి
మగువ మత్తు కనులు మరల మరల
వాలిపోయి, లేచి, వాలిపోవగ – నాకు
కలిగె సందియమ్ము పిలిచినట్లు!
10
మధువు గ్రోలి నేను మత్తుగా నిద్రింప -
నిద్ర పట్టనట్టి నీరజాక్షి
కరములందు స్వర్ణ కంకణమ్ముల నూపు!
చరణ నూపురములు సతము కదుపు!
11
అక్షరముల నేర్పు శిక్షకుం డెవడైన!
పదము, లర్థములను పండితుండు!
’పద్య విద్య’ నేర్పు పండితుం డెవడురా?
’అల్ల’ కరుణ వలన అబ్బు నద్ది!
***
నండూరి వారి శిష్యునిగా …
13 మే 2012 వ్యాఖ్యానించండి
రాజమహేంద్రి వాస్తవ్యులైన డా. వింజమూరి లక్ష్మి గారు ఆంధ్ర విశ్వ విద్యాలయానికి సమర్పించి, పి.హెచ్.డి పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం – “నండూరి రామకృష్ణమాచార్యుల సాహిత్యానుశీలనము – వ్యక్తిత్వము”. అందులో నండూరి వారి శిష్యుల పరిచయంలో భాగంగా నా పరిచయాన్ని పొందుపరిచారు ఆ పరిశోధకురాలు. ఆ పరిచయం ఇది.
- డా. ఆచార్య ఫణీంద్ర
చలివేంద్రము
05 మే 2012 అభిప్రాయములు
చలివేంద్రము
రచన: ‘పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర
ఎక్కడికోయి ఓ పథిక! ఎండలు మండుచునుండ, దేహమే
ఉక్కిరి బిక్కిరైన సరె! ఊరక సాగుచునుందు వేల? నీ
నిక్కిన నీరసం బుడిగి, నీవు నొకింతగ నూరడిల్లగా
గ్రుక్కెడు మంచి నీళ్లివిగొ! గొంతును తడ్పుము చల్ల చల్లగాన్!
కాలిన కంద గడ్డయె ముఖంబయొ పాపము! బాటసారి! నీ
కాళులు, సేతులున్, ముఖము కడ్గుము శీత జలంబు తోడ – నీ
కాల మొకింత గడ్పుమిట! కమ్మగ త్రావుము మంచి తీర్థమున్!
చాల శ్రమించి తెండ పడి సాగుచు – ఇంచుక సేద తీరుమా!
ఎండ కాలమందు మండు మధ్యాహ్నాన
దారి బోవు వాని దైన్య మెరిగి,
దాత యొకడు నిలుప ధర్మాత్ముడై నన్ను-
పుడమి, సేవ కొరకు పుట్టు దాన!
చలివేంద్రము నా నామము!
ఇల వేడిమి తాళ లేని ఎందరికో నే
జలమందించుచు నుందును -
జల దానము కన్న మిన్న జన్నము గలదే?
బాణము గ్రుచ్చినట్లు ప్రతి భాను మయూఖము మేను తాకగా
ప్రాణము తల్లడిల్లు జన వాహిని దాహము తీర్చినంతటన్ -
ప్రాణము లేచి వచ్చి, సుధ పానము చేసిన స్ఫూర్తి గల్గదే!
ఏను పరోపకారమున కీ భువి నిట్లు ప్రతీక గానొకో!
తనివి దీర, నేనందింప త్రావి నీరు
తరలి పొమ్మింక హాయి నీ దారిలోన -
మదిని గుర్తుంచు కొనెదేని, మరతువేని,
తీర్చితిని దాహమని నాకు తృప్తి చాలు!
ఏ వేసవినం దైనను
నీవీ దారిని తరలిన, నీరము కొరకై
రావోయి నాదు చెంతకు -
సేవింపగ సతము నేను సిద్ధము సుమ్మీ!
— $$$ —
శ్రమ శక్తికి పట్టం కట్టిన యోధుడు
01 మే 2012 వ్యాఖ్యానించండి
ఈ రోజు కార్మిక దినోత్సవం.
ఈ సందర్భంగా, గతంలో నేను ’మాస్కో’ వెళ్ళినపుడు ’క్రెమ్లిన్’ కోటలో మహా యోధుడు ’లెనిన్’ మృత దేహాన్ని దర్శించుకొన్న సంఘటన నా స్మృతి పథంలో మెదులుతోంది. అప్పుడు నేను వ్రాసుకొన్న ’శవ పేటిక’ అన్న పద్య కవితను ఇక్కడ ప్రచురిస్తూ, కార్మిక శక్తిని ప్రపంచానికి ప్రప్రథమంగా చాటిన ఆ మహా నాయకునికి నివాళులర్పిస్తున్నాను.
ప్రపంచ కార్మికులందరికీ ’కార్మిక దినోత్సవ’ శుభాకాంక్షలతో
- ’పద్య కళా ప్రవీణ’
డా. ఆచార్య ఫణీంద్ర
టైటానిక్ లాంటి ప్రమాదాన్ని 24 ఏళ్ళ ముందే ఊహించిన తెలుగు కవి!
16 ఏప్రి 2012 అభిప్రాయములు

“ తెలుగు బ్లాగు – సీ’రియల్’ ముచ్చట్లు “ అన్న బ్లాగులో …
“టైటానిక్ ప్రమాదం 14 ఏళ్ళ కి ముందే ఉహించినదా!!!” అన్న పోస్టులో …
ఆ బ్లాగు రచయిత ఇలా వివరాల నందించారు -
“ టైటానిక్ ప్రమాదం జరగడానికి 14 ఏళ్ళ ముందు, అమెరికన్ రచయిత మోర్గాన్ రోబెరస్టన్ ఒక నవల రచించారు. ఆ నవల పేరు Futility – The wreck of the Titan (1898).
ఈ నవలలోని సంఘటనలకి టైటానిక్ ప్రమాదానికి ఎన్నోపోలికలున్నాయి.
ఈ నవలలోని టైటాన్ అనే బ్రిటిష్ నౌక “నార్త్ అట్లాంటా” లో ని మంచు పర్వతాన్ని ఢీ కొని మునిగిపోతుంది. టైటానిక్ కూడా 1912 ఏప్రిల్ 14 అర్ధరాత్రి మంచు పర్వతాన్ని ఢీ కొంది. “
కానీ, 14 ఏళ్ళు కాదు …
ఆ ప్రమాదం జరగడానికి 24 ఏళ్ళ పూర్వమే అలాంటి సంఘటనను ఊహించి ఒక పద్య కావ్యాన్ని ఒక ప్రసిద్ధ తెలుగు కవి రచించాడంటే నమ్మగలరా? అవును! ఇది సత్యం!!
ఆ కావ్యం పేరు – “బాటసారి“. అది రచించబడింది – 1888 లో.
‘టైటానిక్‘ దుర్ఘటన జరిగింది – 1912 లో.
ఆ ప్రసిద్ధ కవి ఎవరో కాదు – ‘హరి కథా పితామహుడు‘ గా ప్రఖ్యాతి గాంచిన ‘ఆదిభట్ట నారాయణదాసు‘.
ఈ వివరాలన్నీ నా పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం (“19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత” – రచించిన కాలం: 2006) లో సోదాహరణంగా వివరించాను. అవలోకించండి -
————————————————————-
“ విచిత్ర కల్పనలతో కావ్య వస్తువులు :
క్రీ.శ. 1912 లో అమెరికా దేశానికి ప్రయాణిస్తున్న‘టైటానిక్‘ అనే పేరు గల ఓడ రాత్రి వేళ ‘ఐస్ బర్గ్‘ అనే కొండను ఢీకొని ఘోర ప్రమాదానికి గురి అయింది. చాలా మంది సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ రక్షణకై చేసిన ప్రయత్నంలో ఒకే కుటుంబంలోని సభ్యులు ఒకరికి ఒకరు కాకుండా వేరయిపోయారు. ఇది యదార్థ ఘటన. ఈ వాస్తవ సంఘటన జరగడానికి 24 సంవత్సరాల ముందే అనగా క్రీ.శ. 1888 లో ఒక తెలుగు కవి ఇలాంటి సంఘటనను ఊహించి, ఒక కావ్య నిర్మాణం చేసాడంటే ఎవరికైనా నమ్మశక్యం కాని విషయం. కాని ఇది సత్యం. ప్రఖ్యాత హరికథా పితామహుడు ‘ఆదిభట్ట నారాయణదాసు‘ కవి రచించిన ‘బాటసారి‘ అన్న కావ్యం ఇలాంటి ఘటనతోనే ప్రారంభమవుతుంది -
ఉ||
ఒక్క మహానుభావుడు మహోదధి యానము చేసి ముప్పునం
దక్కి తొలంగిపోవు నిజ దార సుతార్థమునై సరోనదీ
పక్కణ సీమలన్ వెదకి, వారలు సుస్థితినుంట గాంచి పెం
పెక్కును బాటసారియయి – ఇక్కథ పేర యశో విహారియై!
ఉ||
ఎచ్చట నుంటి – నే నిచటి కెట్టుల వచ్చితి – గన్నులెంతయున్
విచ్చిన గానరా దిదియు నిక్కమ – యేమది పెద్ద మ్రోత? నా
కచ్చెరువై వినంబడు – గటా! తెలిసెన్ – మది దిట్ట జేతు – బై
వచ్చిన నీటి తాకువడి – బ్రాకుచు నెట్టన నొడ్డు చేరితిన్!
ఆ||వె||
చిన్ని కొడుకు తోడ చెలియ యేమయ్యెనో -
కొండ తగిలి యోడ కొట్టబడిన
తెన్ను తోచకుండె – తెరపి నీ దిటు మబ్బు
గ్రమ్మ రేయి మిగులు గాన రాదు!
పై పద్యాలలో కవి వర్ణించిన ‘ముప్పు‘ను, టైటానిక్ దుర్ఘటనతో పోల్చి చూడవచ్చు.
‘టైటానిక్‘ ప్రయాణం మహా సముద్రంలో జరిగింది. కవి కూడ ‘మహోదధి యానము‘ అనే అన్నారు. ‘టైటానిక్‘ పెద్ద ఓడ. కవి కూడ దానిని ఓడ అన్నారే గాని, నావ లేక పడవ అనలేదు. టైటానిక్ ఓడ మంచు కొండను ఢీకొన్నది. కవి కూడా, “కొండ తగిలి యోడ కొట్టబడిన“ దన్నారు. టైటానిక్ ప్రమాదం జరిగింది రాత్రి వేళలో. కవి కూడ ‘రేయి‘ అని పేర్కొన్నారు.
సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ కల్పన – తరువాతి కాలంలో విశ్వ గోళానికి మరో వైపు జరుగబోయే ఒక వాస్తవ ఘటనను ఇంత అచ్చంగా పోలి ఉండడం కవి దార్శనికతకు పరాకాష్ఠగా భావించవచ్చు. “ఈ బాటసారి కథ స్వకల్పితము గాని, ఇంకొక భాషా కావ్యమున కనువాద మెంత మాత్రమున్ గాదు.“ అని; “ ఈ బాటసారిన్ జేసి యాడుచు, బాడుచున్ దెలుగు వారలకు నే వినిపింప మొదలిడినపుడు నా యీ డిరువది నాలుగేండ్లు“ అని నారాయణ దాసు కవి ఈ గ్రంథ పీఠికలో చెప్పుకొన్నారు. ఆదిభట్ట వారు కేవలం ప్రమాద వర్ణనతో వదలివేయకుండా, అదనంగా దీనిని ఒక తాత్త్విక కావ్యంగా తీర్చిదిద్ది, భారతీయ భావజాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారు. మహోదధి – సంసారమయితే, పాపమనే కొండకు తగిలి పగిలిన ఓడ – మాయా గర్భం లాంటిది. ఆ మాయాగర్భం నుండి బయటపడిన మానవుడు – జన్మాంతరాల బాటసారి. ఆ బాటసారి తిరిగి అన్వేషించి విద్యా వివేకాలనే దార సుతులను పొందడమే ఈ కావ్యం చూపే పరమార్థం. అదే విషయాన్ని కవి తన ఆంగ్ల పీఠికలో వివరిస్తూ – “The story embodied in this book is an allegory of human life, which begins in sheer ignorance and ends in perfect knowledge.” అని తెలియజేసారు. టైటానిక్ ఓడ ప్రమాదం వంటి దుర్ఘటనను ముందే ఊహించి కల్పించడమే గొప్పతన మనుకొంటే .. దానికి ఇంతటి తాత్త్వికతను జోడించడం – అసామాన్య ప్రతిభగా, ఘనతగా చెప్పక తప్పదు. ”
————————————————————
ప్రాపంచిక సంబంధాలు పూర్తిగా నెలకొనని కాలంలో.. విద్యా, సమాచార రంగాలు అంతగా అభివృద్ధి చెందని పరిస్థితులలో … యూరపుకు ఎంతో దూరంలో, ఆసియాలో బానిస దేశంగా ఉన్న మన భారతదేశంలో, ఒక మారుమూల ఉన్న విజయనగరం గ్రామ నివాసి అయిన ఒక తెలుగు కవి – శ్రీ ఆదిభట్ట నారాయణదాసు ఇలాంటి ఊహాకల్పన చేయగలగడం … తెలుగు వారిగా మనందరికి గర్వ కారణం!!!
- డా. ఆచార్య ఫణీంద్ర
తీక్ష్ణ వీక్షణాలు
15 ఏప్రి 2012 వ్యాఖ్యానించండి

































