పాడవే చెలి!
29 జన 2012 అభిప్రాయములు
పాడవే చెలి! [గీతం]
రచన: డా. ఆచార్య ఫణీంద్ర
[2003లో అనుకొంటాను - ’సిలికానాంధ్ర’ (యు.ఎస్.ఏ.) వారు అంతర్జాతీయ స్థాయిలో ’తెలుగు గేయ కవితల పోటీ’ నిర్వహించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ’న్యాయ నిర్ణేత’గా వ్యవహరించిన ఆ పోటీలో నా ఈ లలిత గీతం పురస్కారాన్ని పొందింది. నేను రచించిన వాటిలో, నాకు బాగా నచ్చిన గీతాలలో ఇది ఒకటి. ఆస్వాదించండి.]
పాడవే చెలి! తీయ తీయగ -
పరవశము నందీయగ!
పరవశము నందీయగ!!
వివిధ భాషల వెలయ జేసిన
మధుర కవితల మధువులన్నీ -
ఒక్కచో కలబోసి గ్రోలుచు
మక్కువను మది తీర్చుకొనునటు -
పాడవే చెలి! …
తీపి గొంతుక తీగ సాగుచు
హృదయ సీమల నెల్ల తాకుచు -
తాకు తాకున తన్మయత్వపు
పూల పుప్పొడి రాల జేయగ -
పాడవే చెలి! …
వేడి వేసవి వీధి సాగుచు
నీడ పట్టున నిలిచినంత -
మలయ పవనం మేను తాకిన
మధురమౌ అనుభూతి కలుగగ -
పాడవే చెలి! …
–-***—





