వెదికింది ఒకటి .. దొరికింది ఒకటి …
25 జన 2012 అభిప్రాయములు
మొన్న ఆదివారం పాత పుస్తకాలు, పేపర్లను వెదుకుతుంటే -
ఎప్పుడో ఇరవయ్యేళ్ళ క్రితం నేను వ్రాసుకొన్న కొన్ని ‘బాల గేయాలు‘ కనిపించాయి.
నేను వెదికింది ఒకటి .. దొరికింది ఒకటి …
అయితేనేం? ఆ గేయాలను చూస్తే ఇప్పుడు ముచ్చటేసింది – బహుశః ఇంగ్లిష్ లో పిల్లలకు నేర్పుతున్న అర్థం పర్థం లేని వ్యర్థపు ‘రైము‘ల్లా కాకుండా – తెలుగులో చిన్న పిల్లలు సరదాగా పాడుకొనేలా ఉండి, వాళ్ళకు కాస్త విజ్జానాన్ని కూడా పంచేలా ఉండాలన్న సదుద్దేశ్యంతో వ్రాసినట్టున్నాను. ఒక యాభై దాక గేయాలు వ్రాసి పుస్తకంలా వేయాలన్న తలంపు అప్పట్లో ఉండి ఉంటుంది. అందుకే ‘బాలోల్లాసం‘ అన్న ‘బుక్ టైటిల్‘ కూడా వ్రాసి పెట్టుకొన్నాను. ఒక పదిదాక వ్రాసాను. తరువాత ఆ విషయమే మరచిపోయా నెందుకో మరి!
సరే – ప్రస్తుతానికి ఉన్నవాటిలో కొన్నిటిని అంతర్జాలానికి ఎక్కిద్దామనిపించింది — ఆస్వాదించండి.
చినుకు
చినుకూ చినుకు -
ఎక్కడి చినుకు?
ఆకాశంలో
పుట్టిన చినుకు -
ఆపై నేలకు
దూకే చినుకు -
వాకిట్లోనే
పారే చినుకు -
వాగూ, వంక
కలిసే చినుకు -
పొలాలలోకి
చేరే చినుకు -
పుట్టించేను
మనకొక మెతుకు! *
విద్యుత్తు
వెలుగులు చిందే విద్యుత్తు!
’ఎడిసన్’ చూపిన విద్వత్తు!!
గాలిమర నుండి పుట్టిస్తే -
అది ’వాయు విద్యుత్తు’!
నేలబొగ్గుతో పుట్టిస్తే -
అది ’ఉష్ణ విద్యుత్తు’!
సూర్యుని నుండి పుట్టిస్తే -
అది ’సోలార్ విద్యుత్తు’!
నీటిలో నుండి పుట్టిస్తే -
అది ’జల విద్యుత్తు’!
’న్యూక్లియస్’ నుండి పుట్టిస్తే -
అది ’అణు విద్యుత్తు’!
పంచ భూతాల విద్యుత్తు!
ప్రపంచమంతా విద్యుత్తు!! *
గులాబి పూలు
అందమైన గులాబి పూలు
మొక్కపై ఉంటేనే మేలు!
ముట్టుకొంటే రెక్కలు రాలు!
పట్టుకొంటే గుచ్చును ముల్లు!
’ఢాంఢాంఢాం’
కాకర పువ్వులు కాలిస్తే -
మిలమిల మెరుపులు మెరిపిస్తే -
కన్నుల వెలుగులు ’ఛాంఛాంఛాం’
పిల్లల మనసులు ’ఝాంఝాంఝాం’
ఆటం బాంబులు పేలిస్తే -
భయంభయంగా చూస్తుంటే -
చెవిలో శబ్దాల్ ’ఢాంఢాంఢాం’
పిల్లల గుండెలు ’ఠాంఠాంఠాం’ *
పుష్ప గుచ్ఛం
ఎర్రని పూలు -
తెల్లని పూలు -
పచ్చని పూలు -
విచ్చిన పూలు -
రంగులొలుకు పూలు!
రమ్యమైన పూలు!!
మల్లె పూలు -
బంతి పూలు -
రోజా పూలు -
చామంతి పూలు -
అందమైన పూలు!
ఆకర్షించే పూలు!!
పూవులన్నీ స్వచ్ఛం -
ఒకటిగ కడితే గుచ్ఛం -
పూలలాంటిదే జనం!
గుచ్ఛం వంటిది దేశం!! *
చిటపట చినుకులు
చిటపట చినుకులు పడుతుంటే -
టపటప చప్పుడు చేస్తుంటే -
ఇటు అటు గెంతే పిల్లలు
ఇళ్ళల్లోనికి ఉరికారు
కిటికీ ముందు కూర్చున్నారు
కిటకిట తలుపులు విప్పార్చారు
జల్లులు మొగమున చిల్లుతు ఉంటే -
ఉల్లము ఝల్లన పులకించారు! “*
విద్యుచ్ఛక్తి
విద్యుచ్ఛక్తి – విద్యుచ్ఛక్తి -
వెలుగుల నిచ్చే విద్యుచ్ఛక్తి -
గాలిని విసిరే విద్యుచ్ఛక్తి -
నీళ్ళను తోడే విద్యుచ్ఛక్తి -
పాటలు పాడే విద్యుచ్ఛక్తి -
వంటలు వండే విద్యుచ్ఛక్తి -
బట్టలు ఉతికే విద్యుచ్ఛక్తి -
బొమ్మలు చూపే విద్యుచ్ఛక్తి -
చల్లనుబరచే విద్యుచ్ఛక్తి -
షాకులు కొట్టే విద్యుచ్ఛక్తి -
’ఫుల్లు’ వాడితే విద్యుచ్ఛక్తి -
చిల్లు జేబుకు విద్యుచ్ఛక్తి – *
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
—***—





