19 జన 2012
by Dr.Acharya Phaneendra
in తెలుగు సాహిత్యం
ప్రపంచీకరణ భూతం
రచన : ‘పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

పచ్చని పంటభూములను పశ్చిమ దేశపు కంపెనీలకై
ఇచ్చి, బొటాబొటిన్ ధనము నేదొ ముఖంబున గొట్టి రైతుకున్ -
హెచ్చు ’కమీషనుల్’ గొనెద రిప్డు దళారి ప్రభుత్వ నాయకుల్!
బిచ్చమునెత్తె జాతికిని వెన్నెముకైనటువంటి రైతయో!!
”దున్నెడి వానిదే పొలము – దోపిడి నొప్ప” మటంచు జెప్పి, రై
తన్నల కోసమై నిలిచి దండిగ పోరిరి నాటి నాయకుల్!
కన్నుల గానగా స్థలము – ’కబ్జ’ యొనర్చుచు ’సెజ్జు’ పేర, రై
తన్నల వెన్నునే విరుచు త్రాష్టులు.. దుష్టులు.. నేటి నాయకుల్!!
నేటి ’హైటెక్కు’ కాలాన నిజము! చూడ -
’క్యాప్టలిస్టుల’ కే సర్వ కార్య సిద్ధి!
మధ్య, క్రింది తరగతుల మానవులకు
బ్రతుకు ’లోటెక్కు’ నై పూర్తి భ్రష్టమయ్యె!
కరవు తినగ ముద్ద – కల వెన్నొ ’సెల్ ఫోన్లు’!
కరవు త్రాగునీరు – కలదు ’కోకొ’!
డబ్బటన్న నిపుడు ’డాలరే’ అయిపోయె!
చేతి వృత్తులన్ని చితికిపోయె!
ఎక్కడొ విదేశముల మరి
ఎక్కువయిన ’పెట్రొలు’ వెల – ఇక్కడ నకటా!
ఎక్కువనై అన్ని ధరలు -
దిక్కును కనరాక కూలు దీనుల బ్రతుకుల్!
భూమిని నమ్మి రెక్కలను ముక్కలొనర్చెడి యన్నదాతలున్;
వేమరు కష్టముల్ సలిపి వృత్తి కళన్ వికసించువార లిం
కేమియు చేయలేక, బ్రతికింక ప్రయోజనమేమి లేదటన్ -
భామను, పిల్లలన్ విడచి ప్రాణములన్ బలిపెట్టి రక్కటా!
ఈ ’ప్రపంచీకరణ’ మందు నెదుగుచుంద్రు
మిద్దెపై ధనవంతులు మిద్దె గట్టి!
నిలువ దేశాన కాసింత నీడ లేక
రాలిపోవులే పేదల బ్రతుకు లింక!
—***—