విశాద యశోద – 2

విశాద యశోద – 2

[ కంస వధానంతరం రేపల్లెకు తిరిగి రాని శ్రీ కృష్ణుని గూర్చి చింతిస్తూ, మాతృమూర్తి యశోద పడే ఆవేదన - రెండవ భాగం ]

రచన: ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

కం.           నిన్నయొ మొన్నయొ గాదయె!
                ఎన్నాళ్ళయె నిన్ను వీడి? ఇల్లంతట పల్
                గిన్నెలలో వెన్నను గన -
                కన్నులలో నీరు గారి కాల్వలు గట్టున్!

కం.          అన్నము రుచియింపదు -
               కన్నులకే నిద్ర రాదు – కాంచుచు నీకై
               కన్నులు కాయలు గాచెను -
               నిన్నే దలచుచు నిరతము నీరగుచుంటిన్!

ఆ.వె.      చల్ల చిలుకబోవ చల్ల ముంతను నీదు
               చారడేసి కనుల సౌరు దోచు -
               వెన్న నెత్తు వేళ గిన్నెలందున, నాటి
               మన్ను దిన్న నోటి మహిమ దోచు -

కం.         ఎన్నటికి వత్తువో యని
              కన్నుల నీరొలికి పైకి గాంచ నిరాశన్ -
              మిన్నున నల్లని మబ్బులు
              నిన్నే బోలుచు కనబడి నిట్టూరుచెదన్!

ఉ.          ఏ గది కేగినంత నటనే గలవేమొ యటన్న భ్రాంతి! నే
              నేగగ చెంతకున్, కనుల నీడలు గ్రమ్మి నిరాశ గల్గు! నే
              వేగుచు నుంటిరా విరహ వేదనమందున నిన్ని నాళ్ళుగా -
              వేగమె రమ్ము తండ్రి! ఇక వేదన నేను భరింపజాలరా!

ఉ.          తల్లిని నాదు సంగతిని దాపున నుంచుము – నిన్ను గాన కీ
              పల్లె కళా విహీనమయి బావురుమన్నటులున్నదయ్య! రే
              పల్లె ప్రజల్ మనమ్ముల నపార వ్యధాగ్నుల మ్రింగుచుండ్రి! తా
              తల్లడమల్లడంబగు గదా మరి నందవిభుండు నయ్యహో!

కం.        మందారమ్ములు పూయవు -
              సిందూరమ్ములు విరియవు – చినబోయిన దీ
              బృందావన మెల్లయు – గో
              విందా! నీ వేణుగీతి వినిపింప దటన్!

చం.        అట గనుచుంద్రు – లేవనుచు నా పయి నింకొక ప్రక్క గంద్రు – నీ
              వట నగుపించకున్న నిటు నాశగ జూతురు – కాన కిచ్చటన్

             “ ఎట గలడో? “ యటన్ వెదకి యెల్లెడ కానక నిన్ను కన్నయా!
              వెట వెట వెక్కి వెక్కి విలపించుచునుండిరి గోప కాంతలున్!

కం.         సుందర గోపిక లింతకు
              ముం దనునిత్యమును వచ్చి మూగుచు నీపై
              నిందలు వేసిరి – ఇపుడీ
              సందులలో వేచి నిన్ను శ్లాఘింతురయో!

కం.         గొల్లల పిల్లలు నీకై
               ఇళ్ళకు మళ్ళక, మనిల్లు నెల్ల వెదుకగా -
              “ వెళ్ళి తిరిగి రాలే “ దన -
               కల్లరి ననుకొంద్రు నన్ను కడు హీనముగాన్!

చం.        నిను గనకున్న గోవు లిట నిక్కిన క్రోధము తోడ మా యుర
              మ్మున తమ కొమ్ములన్ విసురు – ముత్తెమునంతయు పాల నీవు – పె
              ట్టిన తినబోవు మేతను – పటిష్ఠముగా బలపడ్డ వాని యా
              తనువులు బక్క జిక్కె – ఎటు తండ్రి! సహింతుము మూగ వేదనన్?

చం.        వల వల యేడ్చుచున్నవి దివా నిశలందున, కాన రాని నిన్
               తలపుల యందు నిల్పుకొని – తాండవమాడవు – ప్రీతి ధాన్యపుం
               బలుకులనైన ముట్టవు – ప్రభాసిత కేశ విభూష గాగ నీ
               తలను ధరించు పింఛముల తామిడునట్టి మయూర జాలముల్!

కం.          వెళ్ళిన పని ఇక చాలయ!
               ఎల్ల జనులు నీ వియోగ మిక నే మాత్రం
               బొల్లరు – అదెల్ల సరె! నీ
               తల్లి మనస్తాపమైన తలచిక రారా!

[ ప్రస్తుతానికి సంపూర్ణం ... కాని దీనిని ఇంకా విస్తరించి ఒక ఖండకావ్యంగా ముద్రించాలని నా తపన ... ఆ పైన దైవేచ్ఛ! ]

 **** ఽఽఽ ****

Follow

Get every new post delivered to your Inbox.