విషాద యశోద
27 డిసెం 2011
by Dr.Acharya Phaneendra
in తెలుగు సాహిత్యం
విషాద యశోద
[ కంస వధానంతరం రేపల్లెకు తిరిగి రాని శ్రీ కృష్ణుని గూర్చి చింతిస్తూ, మాతృమూర్తి యశోద పడే ఆవేదన ]
రచన: ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

కం. కృష్ణా! ప్రియ సుత! నీకై
తృష్ణ నెదురు జూతును – బహు దినములు కణచెన్
వృష్ణి కులజ! నీవు వెడలి -
ఉష్ణోదక మటు యశోద యుల్లము మరిగెన్!
ఆ.వె. మామ పిలువ బంప – మధురా నగరి కేగి,
మరచినావొ నీదు మాత నిటుల?
కార్య మింక పూర్తి కాని యెడల, సమా
చార మందజేయ జాలవొక్కొ?
తే.గీ. ఈ విలంబమున కేమి హేతువొ? నవ
భూమి నున్నయట్టి నవీన భూరి దృశ్య
మాల గాంచి, విస్మయమంది, మరచినావొ
మాతృ భువి, పరివారమ్ము, మాత, పితల?
తే.గీ. నీకు తోడుగా బలరాముని ననిపితిమి -
జ్ఞప్తి నీకు లేకున్న, తా జ్ఞప్తి యొనర
జేయజాలడో? – తానును చిన్నవాడె!
బాల లెరుగరో తల్లుల బాధ? అకట!
ఆ.వె. ఏ అపాయమైన నేర్పడెనా ఏమి?
ఎవరి మోహమందొ ఏమరితివొ?
అతి బలు లెవరైన నడ్డగించిరొ మిమ్ము?
పరిపరి విధము లిటు ప్రశ్న లెగయు!
మధ్యాక్కర: పుట్టియు పుట్టని నాడె – పూతన పుట్టువు మాపి,
జట్టుల గట్టెడి నాడె – శకట నిశాచరు గూల్చి,
గట్టి విక్రమమొందు నాడె – కాళీయు గర్వమ్ము నడచి,
దిట్ట వీవు విజయ తిలకుడైతి, విపు డేమాయె?
ఉ. కంసుడు నీదు మాతులుడు – కర్కశుడంచు జనాళి పల్కురా!
“హింసకు బూనునో?“ యనుచు నేదొ మదిన్ జనియించు శంక! వి
ధ్వంసకులైన రాక్షసుల ధ్వంసము నీ వొనరింతు, వైన తా
హంసల బోలు బాలురకు హానిని గూర్చక బోవవచ్చులే!
శా. ఏ వైభోగము లెన్ని ఏర్పరిచెనో? ఏ సౌఖ్యముల్ మాతులుం
డీవున్, రాముడు నొందగా ఘనముగా నేర్పాటులే జేసెనో?
నీ విట్లే మరి కొన్ని నాళ్ళచటనే నిల్వంగ కాంక్షింతువో?
నా వంకన్ తలపోయజాల వకటా! నా భాగ్య మెట్లేడ్చెరా?
కం. అసలే తుంటరి వాడవు!
మసలు దెవరి తోడ నెట్లొ? మరి పోట్లాటన్ -
రుసరుస లాడెడి వారల
పస దింపగ వాదులాడి, పంపు నెవరటన్?
తే.గీ. నీ పను లొనర్చుకొను టెప్డు నీ వెరుగవు!
ప్రొద్దు ప్రొద్దున మారాము పోవు నిన్ను
నిమిరి తల, ప్రేమ నెవ్వారు నిదుర లేపు?
స్నాన పానాదు లవియన్ని జరుపు నెవరు?
సీ. కమనీయ ముఖముపై కస్తూరి తిలకమ్ము
దీటుగా నెవ్వారు దిద్దు నీకు?
వక్షస్థలమ్ముపై పలు కంఠహారాలు
వ్రేలాడ నెవ్వారు వేయు నీకు?
నాసికాగ్రమ్ముపై నవ మౌక్తికము నంద
గించ నెవ్వ రలంకరించు నీకు?
కర తలంబున నుంచి మురళిని యెవ్వారు
“వదలబో కెట!“ యంచు పలుకు నీకు?
తే.గీ. కరములం దెవ్వరు తొడుగు కంకణములు?
పూయు నెవరు చందనముల పూత నీకు?
దివ్య సౌందర్యమూర్తిగా తీర్చి నిన్ను -
దిద్దు నెవరు దిన దినమ్ము దిష్టి చుక్క?
కం. వేళకు నీ కడుపు నెరిగి,
చాలను నటు పెరుగు గలిపి చలిదన్నములో
లీలగ ముద్దలు గట్టుచు
బాలక! తినిపించు నెవరు ప్రతిదిన మచటన్?
… ( సశేషం )
Like this:
Be the first to like this post.
Previous బతుకమ్మ పాట Next విశాద యశోద – 2
డిసెం 27, 2011 @ 06:06:14
యశోద మాతృహృదయ వేదనను ఆవిష్కరిస్తున్న పద్యాలు మనోహరంగా ఉన్నాయి. ఉదయాన్నే చక్కని పద్యాలు చదివింప జేసిన మీకు ధన్యవాదాలు.
డిసెం 28, 2011 @ 17:32:08
యశోద మాతృహృదయం కళ్ళకు కట్టినట్టు చెప్పారండి. అంతగా ప్రేమించిన అమ్మ వద్దకు కరుణామూర్తి అయిన కృష్ణుడు మళ్ళీ ఎలా రాకుండా ఉండగలిగాడో? ఈ ప్రశ్న వేసుకున్న ప్రతీసారీ ఆ తల్లి అంటే చాలా జాలి కలుగుతుంది. మళ్ళీ ఆవిడ అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరు, జగనాథుడి బాలక్రీడలు దర్శించిన పుణ్యమూర్తి ఆవిడే. పద్యాలు చాలా సరళంగా, మా వంటి వారికి కూడా సులువుగా అర్ధమయ్యేటట్టు ఉన్నాయండి.
డిసెం 28, 2011 @ 21:27:04
కంది శంకరయ్య గారికి,
విశాలి గారికి -
అనేక ధన్యవాదాలు!
రెండో భాగం పద్యాలను కూడా ఆస్వాదించండి