విశాద యశోద – 2
29 డిసెం 2011 అభిప్రాయములు
విశాద యశోద – 2
[ కంస వధానంతరం రేపల్లెకు తిరిగి రాని శ్రీ కృష్ణుని గూర్చి చింతిస్తూ, మాతృమూర్తి యశోద పడే ఆవేదన - రెండవ భాగం ]
రచన: ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర
కం. నిన్నయొ మొన్నయొ గాదయె!
ఎన్నాళ్ళయె నిన్ను వీడి? ఇల్లంతట పల్
గిన్నెలలో వెన్నను గన -
కన్నులలో నీరు గారి కాల్వలు గట్టున్!
కం. అన్నము రుచియింపదు -
కన్నులకే నిద్ర రాదు – కాంచుచు నీకై
కన్నులు కాయలు గాచెను -
నిన్నే దలచుచు నిరతము నీరగుచుంటిన్!
ఆ.వె. చల్ల చిలుకబోవ చల్ల ముంతను నీదు
చారడేసి కనుల సౌరు దోచు -
వెన్న నెత్తు వేళ గిన్నెలందున, నాటి
మన్ను దిన్న నోటి మహిమ దోచు -
కం. ఎన్నటికి వత్తువో యని
కన్నుల నీరొలికి పైకి గాంచ నిరాశన్ -
మిన్నున నల్లని మబ్బులు
నిన్నే బోలుచు కనబడి నిట్టూరుచెదన్!
ఉ. ఏ గది కేగినంత నటనే గలవేమొ యటన్న భ్రాంతి! నే
నేగగ చెంతకున్, కనుల నీడలు గ్రమ్మి నిరాశ గల్గు! నే
వేగుచు నుంటిరా విరహ వేదనమందున నిన్ని నాళ్ళుగా -
వేగమె రమ్ము తండ్రి! ఇక వేదన నేను భరింపజాలరా!
ఉ. తల్లిని నాదు సంగతిని దాపున నుంచుము – నిన్ను గాన కీ
పల్లె కళా విహీనమయి బావురుమన్నటులున్నదయ్య! రే
పల్లె ప్రజల్ మనమ్ముల నపార వ్యధాగ్నుల మ్రింగుచుండ్రి! తా
తల్లడమల్లడంబగు గదా మరి నందవిభుండు నయ్యహో!
కం. మందారమ్ములు పూయవు -
సిందూరమ్ములు విరియవు – చినబోయిన దీ
బృందావన మెల్లయు – గో
విందా! నీ వేణుగీతి వినిపింప దటన్!
చం. అట గనుచుంద్రు – లేవనుచు నా పయి నింకొక ప్రక్క గంద్రు – నీ
వట నగుపించకున్న నిటు నాశగ జూతురు – కాన కిచ్చటన్
“ ఎట గలడో? “ యటన్ వెదకి యెల్లెడ కానక నిన్ను కన్నయా!
వెట వెట వెక్కి వెక్కి విలపించుచునుండిరి గోప కాంతలున్!
కం. సుందర గోపిక లింతకు
ముం దనునిత్యమును వచ్చి మూగుచు నీపై
నిందలు వేసిరి – ఇపుడీ
సందులలో వేచి నిన్ను శ్లాఘింతురయో!
కం. గొల్లల పిల్లలు నీకై
ఇళ్ళకు మళ్ళక, మనిల్లు నెల్ల వెదుకగా -
“ వెళ్ళి తిరిగి రాలే “ దన -
కల్లరి ననుకొంద్రు నన్ను కడు హీనముగాన్!
చం. నిను గనకున్న గోవు లిట నిక్కిన క్రోధము తోడ మా యుర
మ్మున తమ కొమ్ములన్ విసురు – ముత్తెమునంతయు పాల నీవు – పె
ట్టిన తినబోవు మేతను – పటిష్ఠముగా బలపడ్డ వాని యా
తనువులు బక్క జిక్కె – ఎటు తండ్రి! సహింతుము మూగ వేదనన్?
చం. వల వల యేడ్చుచున్నవి దివా నిశలందున, కాన రాని నిన్
తలపుల యందు నిల్పుకొని – తాండవమాడవు – ప్రీతి ధాన్యపుం
బలుకులనైన ముట్టవు – ప్రభాసిత కేశ విభూష గాగ నీ
తలను ధరించు పింఛముల తామిడునట్టి మయూర జాలముల్!
కం. వెళ్ళిన పని ఇక చాలయ!
ఎల్ల జనులు నీ వియోగ మిక నే మాత్రం
బొల్లరు – అదెల్ల సరె! నీ
తల్లి మనస్తాపమైన తలచిక రారా!
[ ప్రస్తుతానికి సంపూర్ణం ... కాని దీనిని ఇంకా విస్తరించి ఒక ఖండకావ్యంగా ముద్రించాలని నా తపన ... ఆ పైన దైవేచ్ఛ! ]
**** ఽఽఽ ****
విషాద యశోద
27 డిసెం 2011 అభిప్రాయములు






